శర్మ కాలక్షేపంకబుర్లు-కల్తీ పై,కార్బైడ్ పై దాడులు

కార్బైడ్ పై దాడులు-ఆహార పదార్ధాలు/పండ్లు/నిలవ చేయడం.

నిన్నను ఒకటపా రాస్తూ కల్తీ గురించి చెప్పడం జరిగింది. యాదృఛ్ఛికంగా ఒక పేపర్ వార్తకి హైకోర్ట్ సుమోటో గా స్పందించి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దాడులు జరిగేయి, ప్రక్రియ మొదలయింది. శుభం. హైకోర్ట్ వారికి వందనాలు, శుభాభినందనలు. ఇది ఒక రోజు పోరాటం కాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రజలమీదనే ఉంది. దీనిలో రాజకీయనాయకులు కలగచేసుకున్నా ప్రజలు తిరగబడవలసిఉంది. ఆపైన మీ ఇష్టం…..

అహార పదార్ధాలు నిలవ చేయడానికి కొన్ని పురాతన పద్ధతులు నేటికీ ఆచరించదగినవే, కాని పాత పద్ధతులని ఈసడించే వారేక్కువ కనపడుతున్నారు. నష్టపోతున్నాం.

ధాన్యం నిలవచేయడానికి గాదె, పురి,పాతర అని పద్ధతులున్నాయి. గాదె అన్నది నేలకి మూడు అడుగుల ఎత్తులో నిర్మించేవారు, తడకలతో. దానిని వాన నుంచి రక్షించడానికి పైన షెడ్ వేసేవారు. వీటిని గదులుగా విడదీసేవారు. అవసరాన్ని బట్టి సైజ్ ఉండేది. తడకలని మట్టితో మేగేవారు. పేడతో అలికేవారు. చాలా బాగుండేది. ఎలకలనుంచి రక్షణ, చెమ్మనుంచి కూడా రక్షణ ఉండేది. రసాయనాలేం వాడేవారు కాదు. ధాన్యం దిగబోసేవారు, దీనినే సొరపోత అంటారు.

పురి, దీనిని ఆరుబయట ఉంచేవారు, కొద్దిపాటి నిలవకి ఉపయోగించేవారు. గుండ్రంగా వెదురుతో తయారు చేసి, స్థూపం లాగా, దాని చుట్టూ గడ్డిని తాడుగాపేని గట్టిగా చుట్టి ధాన్యం పోసేవారు. పైన వాన నుంచి రక్షణకి గడ్డి వేసి పైన తాటాకు కప్పేవారు.

పాతర, ఇది చాలా పురాతనమైన పద్ధతి. నీరు పడని ప్రదేశంలో లోతుగా పదిహేనడుగులదాకాలోతులో శంకువులాగా గొయ్యి తీసేవారు. దానిలో వేపాకు పరచేవారు పైనుంచి కిందదాకా, ఆ పైన గడ్డి వేసి మరల వేపాకు వేసి ధాన్యం సొరపోతపోసి, పైన గడ్డి వేసి కప్పి మట్టి పైన వేసేవారు. దీనిలోకి నీరు చేరేది కాదు కప్పు ఎత్తుగా ఉండటంతో, చుట్టూ ఎలక వగైరాచేరడానికి లేకుండా పేడతో కళ్ళాపు వేసేవారు. మరి నేడీ సంప్రదాయ పద్ధతులు పోయాయి. గోనె సంచితో నిలవ చేస్తున్నారు, గొదాములలో సైనైడ్ బిళ్ళలు పెడుతున్నారు. ఈ వాయువు కాలం లో ధాన్యాన్ని పాడు చేస్తాయో లేదో మాత్రం తెలియదు. గొదాములలో నిలవ చేసిన ధాన్యం పాడవుతున్న దాఖలాలే ఎక్కువ కనపడుతున్నాయి.

ఇక పళ్ళు తయారు చేసుకోడానికి, అరటి అయితే పక్వానికొచ్చిన గెలలు నరికి వాటికి సొరప (ఎండిన అరటి ఆకును) చుట్టి మిద్దెలో ఉంచేవారు. పచ్చికాయల చివర సున్నం రాసేవారు. గదిలో గడ్డి వెంటి గాని, అగరువత్తులు గాని వెలిగించి ఉంచితే వారానికి పండేవి. నిలవా ఉండేవి. కార్బైడ్ చల్లితే పదిగంటలలో పండుతున్నాయి. ఇక మామిడి కాయలు కోసి గడ్డిలో ఉంచి పొగపెట్టడం అలవాటు. ఇలా చేసిన కాయలు వారం పదిరోజుల్లో పండుతాయి. కాయ పక్వానికొచ్చేకానే కోయాలి. ఇదెప్పుడో రైతుకు బాగానే తెలుసు.

ఇలా సంప్రదాయ పద్ధతులలో నిలవ చేసిన,పండించిన ఆహారధాన్యాలు, పళ్ళు రుచిగా ఉండడమే కాక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ కార్బైడ్ వాడద్దనే అంటున్నారు, ప్రభుత్వం కూడా. ఇక ప్రజలే ఉద్యమించాలి, హైకోర్ట్ అండతో….

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కల్తీ పై,కార్బైడ్ పై దాడులు

 1. శర్మ గారూ ! మీ విషయ పరిజ్ఞానం అపారం !
  ఆసక్తికరం గా ఉన్నాయి, మునుపటి నిల్వ పద్ధతులు !
  నవీన పద్ధతులను కాదనలేము కానీ , అత్యాశ కు పోయి , విష పూరితాలైన రసాయనాలను , అపరిమితం గా వాడుతూ ,
  ఇతర మానవులను , బలి పశువులు గా చేస్తున్నారు , దగాకోరు వ్యాపారులు !
  వాళ్ళు మోసగాళ్ళే కాదు , దేశ ద్రోహులు కూడా !
  డబ్బు పోసి , అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు , ఆమాయక ప్రజలు !

  • సుధాకర్జీ,
   వెనుకబడి ఉన్నదనుకున్న ఆఫ్రికా లో కూడా కొన్ని మంచి పురాతన పద్ధతులున్నాయి, ఆహారం నిలవ చేసుకోడానికి. కొన్ని రైతుకు సరిపోతాయి, మరి పెద్ద పెద్దవి ప్రభుత్వం నిర్వహించాలి, వ్యాపారులు నిర్వహించాలి. వీటి గురించిన అవగాహన ప్రజలూ ఏర్పరుచుకోవాలి. చివరిగా నష్టపోయేది వారేకదా! ఎఅవరో వస్తారనుకుంటే ఎలా? ఎవరొస్తారు? ముందు మన దగ్గర నుంచి అరుపేదీ? ఇది కనీసం గా కావలసింది కదా!

   వ్యాపారికి సొమ్ము చేసుకోవడమే ముఖ్యం. మా అరటి పళ్ళ కొట్టువాడికి చెప్పాను, ఉపయోగం లేకపోయింది, తండ్రి కేన్సర్ తో మరణిస్తే వాడిలో కొంత మార్పొచ్చింది, అందరూ చేస్తున్నారు, నేనిక్కడినే మానగలనా అని. మార్పు రాకపోతుందా?
   ధన్యవాదాలు.

 2. నిజంగా సైనైడ్ బిళ్ళలు పెడుతున్నారా?సైనైడ్ అతిప్రమాదకరమైన విషం.అటువంటి
  వాళ్ళకి ఏశిక్ష వేసినా తప్పు లేదు.

  • రమణా రావు ముద్దు గారు,
   సైనైడ్ బిళ్ళలు వాడకం గురించి చెప్పాను కదా, వివరంగా. ఎంత వరకు హాని కరం అన్నది తెలియదు.
   ధన్యవాదాలు.

 3. పూర్వం ప్రతి రైతు ఇంట్లో గాదెలు ఉండేవి.కొంతమంది పాతర్లు కూడా వేసేవారు.ఇప్పుదు గోడౌన్లు చాలవని గోల.పండ్లు మగ్గే దాకా ఆగలేరు.వెంటనే డబ్బు చేసుకోవాలి.కెమికల్స్ తో.దీనిపై కోర్టు కలగజేసుకొనే దాకా అధికార్లు,ప్రభుత్వం మిన్నకుంటున్నది.సైన్సుది తప్పనలేము కాని దానిని దుర్వినియోగం చేస్తున్నారు.

  • M.V.Ramanarao గారు,
   ప్రభుత్వాలేం చెయ్యవు సార్! ఇది పచ్చి నిజం. చట్టాలు ఎన్నాళ్ళనుంచి ఉన్నాయి? అమలు చేసిన నాథుడేడీ? ప్రజలు అడిగారా? అడగరు, అదంతే. ప్రజలు తిరగబడితే కాని యంత్రాంగం కదలదు. నిన్న కోర్ట్ చెప్పేదాకా ఎందుకు కదల లేదు? అడిగినవారెవరు? మనలో ఎందరు స్పందించారు? ఏం?

   పాత పద్ధతులు మంచివే! అవసరాన్ని బట్టి కొత్తవీ అమలు చేసుకోవాలి, అలాగని పాతవి వదులుకుంటే ఎలా?
   ధన్యవాదాలు.

 4. < "గొదాములలో సైనైడ్ బిళ్ళలు పెడుతున్నారు. "
  నిజంగా😟? ఈ సంగతి ఫుడ్ ఇనస్పెక్టర్లకి తెలుసా? ప్రమాదమేమీ ఉండదా ?

  అరటిపళ్ళ కోసం ముగ్గ బెట్టే పధ్ధతి గురించి వివరణ ఇవ్వవలసిన శ్రమ కలిగించానన్నమాట. వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు శర్మ గారు. సాంప్రదాయ పధ్ధతులు లక్షణంగా ఉన్నాయి. ఈ కాలంలో అడ్డదారులు తొక్కడానికి సైన్సుని వాడుకుంటున్నట్లున్నారు.

  • మిత్రులు విన్నకోట నరసింహారావుగారు,
   సైనైడ్ బిళ్ళలు ఒక ప్లాస్టిక్ బరిణలో పెడతారు. ఆధునిక గొడాములు ఎత్తుగా ఉంటాయి, పరిశీలించండి, చెమ్మ బాధ ఉండదు, అలాగే ఎలక బాధా ఉండదు, ఇక ఈ సైనైడ్ బిళ్ళలు ధాన్యం బస్తాలకి దూరంగా పెడతారు, ఇవి కూడా చాలా తక్కువ సైనైడ్ కలిగి ఉంటాయి, వాటినుంచి విడుదలైన వాయువులు న్చిన్న కీటకాలను చంపేస్తాయి, ఏ పురుగు చేరదు, చీమతో సహా. దీని వల్ల నష్టం ఉందా లేదా అన్నది చెప్పలేను.

   సామాన్య జనం లో బంగారం పని చేసేవారు కూడా సోడియం సైనైడ్ వాడతారు, బంగారం శుద్ధికి.

   నిప్పును ఉపయోగించుకుని వంట చేసుకోవచ్చు, ఇళ్ళూ తగలబెట్టచ్చు, ఉపయోగించుకునేవాని తెలివిని బట్టి అది ఉపయోగపడుతుంది కదా! 🙂 మరి సైన్సూ అంతే.

   ఈ వీషయం లో శ్రమ అనేదే లేదు, అవసరమైతే రోజుకి రెండు టపాలైనా రాస్తా 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s