శర్మ కాలక్షేపంకబుర్లు-ఆశావాదం.

ఆశావాదం.

ఆదివారం కదూ ఉదయమే సంత కెళ్ళాం.కూరలూ పళ్ళూ కొన్నాం. చిత్రంగా ఒక్కకొట్టులోనూ ప్రతివారం కనపడినట్టుగా పాలిష్ చేసిన ఆపిల్ కనపడలేదు 🙂 ‘ఏం? ఏమయిందన్నా!’ తెలియనట్టు. ఎవరూ మాటాడలేదు. ఒక్క అరటి పళ్ళ కొట్టులో కూడా కార్బైడ్ జల్లిన పళ్ళు దొరకలేదు! ఏం ఏందుకొచ్చిందీ మార్పు? మా పళ్ళకొట్టువాడినడిగా! ‘ఏరా ఏంటి సంగతి, ఇవి మందు కొట్టినవేనా?’ అని ఇచ్చిన అరటి పళ్ళు చూపుతూ. ‘లేదండి ఇవి ఊదరకొట్టినవే’ అన్నాడు. ఊదరకొట్టడం, కావెయ్యడం, పండబెట్టడానికి సమానార్థకాలు. ‘సార్! ఏమయింది ఏం జరిగింది, ఎంతమంది మీద కేస్ లు పెట్టేరు’ అని అడిగాడు, ఈ సరికి పక్క కొట్టువాళ్ళూ చేరారు. చెప్పాను, ‘ఇలా కార్బైడ్ కాని ఇతరాలు తొందరగా పండబెట్టడానికి వాడితే కేస్ పెడ్తారు, ఇక ముందు నేనే కంప్లయింటు ఇస్తాను, మీరిలా చేస్తే, మూడేళ్ళు జైలు పడుతుంది, అదీగాక నాయనా! మీ నాన్న ఇలాగే కదరా కేన్సర్ తో పోయాడు’ అని గుర్తూ చేశా. ‘లేదండి ఇక ఇలా కార్బైడ్ జల్లి అమ్మము’, అన్నారందరూ. ఏమో ఎంతవరకు జరుగుతుందో తెలియదుగాని, కొంత కదలికొచ్చినది మాత్రం ఖాయం. భారతీయ జీవనంలో నే ఆశావాదం ఉందండీ! ప్రతిదానికి భారతీయ జీవనం అంటారు చాల్లెద్దురూ అన్నారొకరు.

నిజమే చెబుతున్నా!ఇది ఆశావాదానికి పరాకష్ఠ. చనిపోయినట్టు తీర్మానించిన తరవాత ఏం చేస్తారో తెలుసా! పడుకోబెట్టి చల్లని నీళ్ళు పోస్తారు, ఒకోచోట వేడి నీళ్ళూ పోస్తారు. ఆ తరవాత తీసుకుపోతూ మూడు చోట్ల దించుతారు, కొడుకు తొడగొట్టుకుంటాడు, ఆ తరవాత పాడెనుంచి దించి కట్టెలపై పడుకోబెట్టి గుండె దగ్గర నిప్పు పెట్టిస్తారు మొదటగా! ఇవన్నీ ఎందుకో తెలుసా! చనిపోయాడనుకున్న వ్యక్తి మరల లేచేందుకు సావాకాశం ఉందేమో ఈ చర్యలతో, అన్నందుకే ఈ చర్యలు, కాని ఆచారంగా మారిపోయాయంతే. ఇది ఆశావాదం కాదంటారా!

సి.ఎమ్ గారినుంచి బంట్రోతు దాకా, జడ్జీగారినుంచి చివరివారిదాకా, అందరూ ఈ కల్తీ సరుకులు కల్తీ పళ్ళే తీంటున్నారు. సామాన్యులూ తింటున్నారు. పెద్దవారు, నిజానికి వారు ఈ కొనుక్కొచ్చినవి కూడా ఎప్పుడూ చూడలేరు, కాదు చూడరు, నాలాటి వాడెవడో మార్కెట్ కి పోయి కొనుక్కొస్తాడు. ఒక్కసారి ఈ పెద్దవారు కూడా తెచ్చిన సరుకులు కళ్ళతో చూసి కల్తీ ఉన్నవి తిరగ్గొడితే మార్పురాదా! చివరగా ఆ కల్తీ చేసేవాడూ, వాడి పెళ్ళాం పిల్లలూ ఆ కల్తీవే తింటున్నారు, ఇదో పెద్ద చిత్రం లో విచిత్రం. ఆ! ఏం జరిగుతుంది అనే అలసత్వం, ఇటువంటివి తినడం మూలంగా జరిగేది,ప్రతి చర్య వెంటనే కనపడకపోవడం, అలసత్వానికి కారణాలు. సామాన్యుడు ఎలాగా గొడవ పడతాడు. పెద్దవారు కూడా కలగజేసుకుంటే మార్పొస్తుందే! ఒక్క సారి హైకోర్ట్ కత్తి ఝుళిపిసుందన్నందుకే ఇంత మార్పొచ్చిందే! ప్రజలు కూడా మారాలి, తప్పదు.

నేనానందపడిపోతుంటే, కూడా వచ్చిన ఇల్లాలు ఒక మాటంది, వచ్చేస్తుంటే, ఇదంతా నిజమంటారా! ఇది ఈ ఒక్కరోజు భాగోతం కాదూ! ఎన్ని చూడలేదు ఇటువంటి ఉడత ఊపులు అని. హా! హతవిధీ ఇదింతేనా! మార్పురాదా అనుకుంటూ, మార్పొస్తుందోయ్ అన్నా! రావాలనేకదా నా గోల కూడా అంది. మార్పు వస్తుంది…

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆశావాదం.

 1. కష్టే ఫలే , అబ్దుల్ కలాం లాంటి ఆశా వాదుల వల్లే భారతం ఇంకా బతికి ఉన్నది .

  ఆశా వాదం జిందాబాద్ .

  జిలేబి

  • Zilebi గారు,

   …ఇలా ఆశావాదమే అలవాటయిపోయింది, కష్టాలొస్తున్నా, ఎదుర్కుంటూ, మా గురించే భారతదేశం బతికుందనుకోమండి, మహానుభావులు/మహానుభావిణులు చాలా మంది ఉన్నారు, నిజానికి భారతదేశం వారివల్లే నిలుస్తోందండి.
   ధన్యవాదాలు.

  • Chadalavada Venkata Rama Mohan గారు,
   మీరు మా మోహన్జీ అనుకుంటున్నా.
   వర్తకులు లాభాలకోసమే చూస్తారు. ప్రజల ఆరోగ్యం గురించి వారికి పట్టింపులేదు. ప్రభుత్వాలూ పెద్దగా పట్టించుకోవు. నాలుగేళ్ళయి బేన్ చేసిన కార్బైడ్ వాడకం గురించి ఎక్కువ మంది ప్రజలకే తెలియదు. ఇప్పటికి ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలో తెలీదు. ప్రభుత్వం కదలాలి. ప్రజలు అసలు బాధితులు, వారూ నోరు విప్పాలి. హైకోర్ట్ చర్య మొదలు పెట్టినందుకు సంతసించాలి. హైకోర్ట్ ఇచ్చిన ఊతాన్ని ఉపయోగించుకోవాలి.
   ధన్యవాదాలు.

 2. ఆశావాదం బాగానే ఉంది కాని, అమ్మగారు చెప్పినట్టు ఇదో తాత్కాలిక హడావిడి మాత్రమే అనిపిస్తోంది.
  ఇలాంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం శాస్త్రవేత్తలు కనుక్కోవాలి.

  • బోనగిరిగారు,
   ఈ సమస్యని హైకోర్ట్ తీసుకుందంటే ఆషామాషీగా వదలదు. ప్రభుత్వాలు సాచివేయడానికే ప్రయ్త్నిస్తాయి, అది వాటి లక్షణం.కోర్టిచ్చిన ఊతాన్ని ప్రజలు అందుకోవాలి. ప్రభుత్వం కూడా సాచివేస్తే అపనింద పాలవుతుంది. ఒక వెబ్ ప్రారంభించి, దానికి ఫిర్యాదులిస్తే చర్యలు తీసుకోవాలి. నిజానికి ప్రజలికి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు.ప్రతి పక్షాలు నోరిప్పలేదు, అవీ ఆ తాను గుడ్డలేగా!
   ప్రజలే ఉద్యమించాలి. నిరాశపడితే ఎప్పటికి ఇంతే.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s