శర్మ కాలక్షేపంకబుర్లు-పీత్వా పీత్వా పునః పీత్వా..

పీత్వా పీత్వా పునః పీత్వా..

పీత్వా పీత్వా పునః పీత్వా..తాగు, తాగు, మళ్ళీ తాగు..తాగటం అనేమాట నీచార్ధంలో వాడేదీ, దీనిని కల్లు సారా లాటివాటిని తాగేటప్పుడు మాత్రమే వాడాలి, మంచి తీర్ధం, అయ్యో! మంచినీళ్ళు అనకూడదటండి అది గౌరవవాచకం కాదన్నారు, వీటితో సహా మిగతా అన్ని పానీయాలు తీసుకోడాన్నీ ’పుచ్చుకోడం’ అనాలన్నారు శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారు కాఫీని ఎందులో చేర్చేరో చెప్పలేదు.

గౌరవవఝుల సోదరులు మాత్రం కాఫీని పీత్వాలోకే (పీత అంటే తాగబడినది) చేర్చేశారు, వారు చెప్పిన మాటన్నారు జ్యోతిగారు వారిబ్లాగ్ లో ఇలా,

త్రికాల మేకకాలం వా జపేద్విఛ్ఛాన్ సునిశ్చలః
పీత్వాపీత్వా పునఃపీత్వా స్వర్గలోక మవాప్నుయాత్
కాఫీతీర్థ సమంతీర్థం ప్రసాదముపమా సమం
అయ్యర్ సదృశ దేవేశో నభూతో నభవిష్యతి!

ఏ చెప్పేరు! ఏం చెప్పేరు!! ”మూడు కాలాల్లో అంటే త్రిసంధ్యలలో ఒక్కసారైనా నిశ్చలంగా జపిస్తూ,మళ్ళీ మళ్ళీ తాగితే స్వర్గమే సంప్రాప్తిస్తుంది. ఉపమా లాటి ప్రసాదం, కాఫీలాటి తీర్థం, అయ్యర్ తో సమానమైన దేవుడు ఇంతకుముందులేరు, ఇకముందు కూడా ఉండరు” అనేసేరు, గౌరావఝుల వారు ఎప్పుడో డెబ్బై ఏళ్ళకితమే.

ఇంతకీ నాకు కాఫీ ఎలా అలవాటయిందీ, సరిగా అరవై సంవత్సరాలకితం జబ్బు చేసి “చచ్చిబతికేను”, చద్దన్నం తినే అలవాటు, జబ్బుచేసి లేచిన తరవాత చద్దన్నం తింటే ప్రమాదమని అవసరానికి కాఫీ అలవాటు చేశారు, ఇలా అవసరానికి మొదలైన అలవాటు తరవాత కాలంలో ’ఇంతై వటుడింతై’ అన్నట్టుగా, ’ఏకులావచ్చి మేకులా తయారై’, పొద్దుటే నిద్రనుండి లేస్తూనే బెడ్ కాఫీ తాగిగాని అడుగు బూమిపై పెట్టనంతగా,అల్లుకుపోయింది . ఒకరోజు ఇలా బెడ్ కాఫీ ఇస్తూ ఇల్లాలు ”ఛీ! యాక్కులారీ! పళ్ళుతోముకోకుండా కాఫీ తాగుతున్నారోచ్” అని ఎగతాళీ చేసింది. కోపం పొడుచుకొచ్చేసి కాఫీ తాగడం మానేశా, రెండురోజులు, పళ్ళ బిగువున. మూడో రోజు అమ్మ కాఫీ తాగుతూ, ’ఏంటిరా! మీరిద్దరూ కాఫీ తాగడం మానేశారా?’ అనడిగింది. ’నేను తాగటం మానేశా! ఆవిడకేం చక్కహా తాగుతూనే వుండచ్చూ!’ అన్నా, ఉడుక్కుంటూ. ’ఏమో! అదీ తాగటం లేదూ!రెండు రోజుల్నుంచీ’ అంది. అంతే ఇల్లాలి మీద ప్రేమ, గోదారి వరదలా పొంగింది. ’ఏం కాఫీ మానేశావని’ అడిగా,లాలిస్తూ , ’మీరు తాగటం లేదుగా! నేనూ మానేశా’నంది కళ్ళు చక్రాలాతిప్పుతూ, అసలే చక్రాల్లా ఉన్న కళ్ళు మరికొంత తిప్పేటప్పటికి, నాకు కళ్ళు తిరిగి, ఇంకేముంది బి.పి వచ్చినంత పనయ్యి పడిపోతే,  అమ్మ రెండు గ్లాసుల్లో చిక్కటి, చక్కటి, కాఫీ పొగలుకక్కుతున్నది తెచ్చి ఇద్దరికీ ఇస్తూ, ’కాఫీ తాగి దెబ్బలాడుకోండి, తాగకుండా కాదని’ చెప్పి తనిక మా మధ్య ఉండటం బాగోదని వెళిపోయింది. ఆ తర్వాత సెన్సార్ కట్….పళ్ళుతోముకునే కాఫీ తాగాలని నిర్ణయం, ఆవిడ తీసుకున్నదే లెండి, అమలుచేశాను 🙂 ఇది మొన్నటి దాకా అమలయ్యింది. మళ్ళీ అరవై ఎళ్ళకి అలాగే జబ్బూ చేసింది కాఫీ వెలపరమొచ్చేసింది, ఒక రోజు జ్వరంలో, ఒక మాత్ర కాఫీతో వేసుకుంటే డోకెళ్ళిపోయింది, జ్వరమూ తగ్గిపోయింది, మళ్ళీ రెండు రోజులుకి, నేనున్నానూ అంటూ వచ్చేసింది. ఆ తరవాత కాఫీ నోట పెడితే డోకూ వచ్చేసింది. మానేశాను, మరేం చెయ్యడం, ఇల్లాలు ఉదయమే తనకి ,పిల్లలకి కాఫీ పెట్టుకుని, నాకోసం బార్లీ పెట్టడం మొదలెట్టింది. బార్లీ చప్పగా తాగాలి, ఉప్పు కుదరదు బి.పి, పంచదార కుదరదు సుగరు. ఇలా కొంత కాలం నడిచింది. నాకు బార్లీ ఇచ్చి తను ఎదురుగా కూచోడం మొదలెట్టింది, ’ఏం’ అనడిగా. ’ఏంటో!  చప్పటి బార్లీ అలా మీరు తాగుతోంటే నాకేం బాగోలేదూ’ అని నొచ్చుకుంది. తరవాత విశ్వసనీయ వర్గాల,గూఢచారుల ద్వారా తెలిసిన వార్త! తనూ బార్లీ తాగుతోందని, కాఫీ మానేసిందని. ఇల్లాలి మీద ప్రేమ,గౌరవం పొంగిపొరలిపోయాయి.’హా! హతవిధీ!! ఏమిది!! ఏమి చేయవలె!!!  నా సతీమణి నాకొరకై ఎంత త్యాగము చేయుచున్నది, నేను కాఫీ త్యజించుట న్యాయమా?, సతీ మణిని బాధించుట మంచిదా? అని చింతాక్రాంతుడనై ఆలోచించి, చించగా ఒక పురాతన సంఘటన గుర్తొచ్చింది అదెట్టులంటేని,

ఇది వంద సంవత్సరాల కితం మాట. అప్పటికి అలోపతి వైద్యం అంతగా పల్లెలకు చేరలేదు, ఇంకా ఆయుర్వేదమే నడుస్తున్న కాలం. ఒకరు చాలా పేరుమోసిన ఆయుర్వేద వైద్యులు, ‘డాక్టర్ గారి పెళ్ళామూ ముండా మోస్తుంద’న్నట్టు, ఆ వైద్యునికి రాచపుండు బయలుదేరింది. ఎవరికి వారు వైద్యం చేసుకోకూడదు, రోగి వైద్యుడైనా సరే! మరొకరు వైద్యం చేస్తున్నారు, రోగి ప్రఖ్యాత వైద్యుడు. వైద్యం చేసేవారు, వీరికంటే లొక్కే. మందిస్తూ ఆయన ఆహారం గురించి చెబుతూ ’పప్పు మానెయ్యండి కొద్దికాలం’ అన్నారు. ఈ ప్రఖ్యాతి వహించిన వైద్యరోగికి, రోజూ సోలడు కంది పప్పు పచ్చడి, అందునా రాత్రిపూట చేసి పెడితే గచ్చకాయంత కూడా మిగల్చక తినడం అలవాటూ. సంకట పరిస్థితే వచ్చింది. వైద్యుడురోగి భార్య ఈ అలవాటు చెప్పేసీంది. వైద్యుడు ఏమనాలో తోచక చూస్తున్నాడు. అప్పుడు వైద్యుడురోగిగారు ఒక మాట అడిగారు. ’అయ్యా! వైద్యులవారూ విషంలో పురుగు విషంలో చనిపోతుందా’ అని. వైద్యుడు, ‘విషంలో అసలు జీవి పుట్టదు, విషంలొ జీవి పుడితే, విషంలో చావదు, విషం నుంచి వేరు చేస్తే చస్తుందీ’ అని నాన్చేసేడు. ’మరి ఇది కూడా అంతే కదండీ! ఈ శరీరం కంది పప్పు పచ్చడి రోజూ తింటూ పెరిగింది, ఇప్పుడు కంది పప్పు పచ్చడి తిని చనిపోతుందా! తినకపోతే చనిపోతుందీ’ అని తీర్మానం చెప్పేసేరు. వైద్యుడు మాటాడలేదు. వైద్యరోగి భార్యకి సంకటం, కంది పప్పు పచ్చడి చెయ్యాలా వద్దా! చేస్తే ఆయన తింటే ప్రాణాపాయమా! ఏం చెయ్యాలో తోచకపోతే వైద్యరోగిగారు భార్యతో ’కందిపప్పు పచ్చడి తినకపోతే చస్తాను,’ చెయ్యమని చేయించుకు తిని, వైద్యం చేయించుకుని బతికి బయటపడ్డాడు… మరిప్పుడు నాకూ కర్తవ్యం బోధపడినట్టే వుంది.

మొన్న వుదయమే లేవగానే ’కాఫీ పెట్టవోయ్’ అన్నా పెద్ద త్యాగం చేస్తున్నట్టు, ఆవిడకూడా నా కోసం కాఫీ మానేసి బార్లీ తాగుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నానని వైనవైనాలుగా వర్ణించి చెఫ్ఫేసేను..,. 🙂  హా నాథా! మీరు నాకోసం త్యాగం చేసి, కాఫీ మళ్ళీ తాగుతారా? అని దుఃఖించినదై,  మూడు క్షణాల్లో కాఫీ పట్టుకొచ్చేసింది, మళ్ళీ ’చిలకాగోరింక, కులికే పకా పకా, నీవే చిలకైతే, నేనే గోరింకా రావా నావంకా’ కబుర్లాడుకుంటు కాఫీ తాగేశాం……కోడలు తలుపు పక్కనుంచి చూసి కిసుక్కున నవ్వేసింది.  డెబ్బై ఐదేళ్ళు వచ్చేకా ఇంక ఆరోగ్యం చెడేదేంటి, ‘చెడిన కాపరానికి ముప్పేంటి చంద్రకాంతలొండవే కోడలా’ అందట ఒక అత్త,  ఎంత ధైర్యం! ఎంత ధైర్యం!! మమ్మల్ని చూసి నవ్వుతావా! హన్నా! నీకిదె శిక్ష!! ‘వెంఠనే రెండు గ్లాసుల కాఫీ తెమ్మని’ కోడలికి ఆర్డరేశాం, ఇంకేం ఆనందంగా తెచ్చేసింది, ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, మళ్ళీ మొదలు పీత్వా పీత్వా పునః పీత్వా….

click the above URL and

 hear the beautiful old song ‘చిలకాగోరింక కులికే పకా పకా నీవే చిలకైతే నేనే గోరింకా రావా నావంకా’

ఆయ్! పాట విన్నారాండీ!! కూసింత కాపీ పుచ్చుకెల్లండీ

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పీత్వా పీత్వా పునః పీత్వా..

 1. మీరు కాఫీ టు బార్లీ నిజంగా కన్వర్ట్ ఐపోతారేమోనని భయపడ్డాను. మళ్ళీ కాఫీ తాగి – తప్పు తప్పు- పుచ్చుకుని ఘర్ వాపసీ కావడంతో ఊపిరి పీల్చుకున్నాను. 🙂 Superb write-up.

  • YVR’s అం’తరంగం’గారు,

   నిజంగానే బార్లీ కి మారిపోయానండి. ఇల్లాలి బాధ చూడలేక……మళ్ళీ కాఫీ పార్టీలో చేరిపోయానండి 🙂

 2. < "పీత్వా పీత్వా పునః పీత్వా …… దీనిని కల్లు సారా లాటివాటిని తాగేటప్పుడు మాత్రమే వాడాలి."

  కాబట్టి పూటుగా తాగినవాడిని "పీత" లాగా తాగేసాడు అనచ్చేమో 🙂

  మీ కాఫీ ప్రహసనం బాగుందండి. మా బంధువు ఒకాయన ఇలాగే మహా కాఫీప్రియుడు. ఓ పక్క భోజనం వడ్డిస్తున్నారన్నా కూడా వినక కాఫీ కలిపించుకుని తాగేవాడు. విసుగెత్తి ఆయన తండ్రి "కాఫీతోటే పళ్ళు తోముకోరా" అనేవారు 🙂

  • విన్నకోట నరసింహారావుగారు,

   ఒకప్పుడు నేనూ అంతే కదండీ, పళ్ళు కూడా తోముకోక కాఫీ సేవించిన ఘనత కదా! అందుకే అన్ని పళ్ళూ ఊడిపోయాయోచ్ !! 🙂
   నిజమే అనుకుంటానండి. పూటుగా తాగేవాళ్ళని పీతలా తాగుతున్నాడంటాం 🙂

 3. కాఫీ మహత్వాన్ని డెబ్బై ఐదు లో నాన్నా ఒప్పేసు కున్నారు !

  మా అయ్యరు గారి కాఫీ కిక్కు తెలుస్తోందాండీ జిలేబి వ్యాఖ్యల్లో ??

  కాఫీ తాగని వాడు దున్నబోతై బుట్టున్ అనలేదూ మరి గురజాడ వారూ ?

  మీరు మళ్ళీ టపా వ్రాసినందులకు కాఫీ తో చీర్స్ జిలేబి !

   • జిలేబీ గారు అయ్యరు గారికి కాఫీ పెట్టివ్వడం ఏమిటండీ మీ అమాయకత్వం గాకపోతే? ఆవిడే చెబుతున్నారుగా అయ్యరు గారిదే కాఫీ అని; తనేమో ఆ కాఫీకప్పు పట్టుకుని “ఛీర్స్” చెబుతూ ఆ కమ్మటి కాఫీ సేవిస్తుంటారు (ట) 🙂

   • తాడిగడప శ్యామలరావు గారు,
    జిలేబిగారు కాఫీ పెట్టే పరిస్థితి వస్తే అయ్యరుగారి పనంతే 🙂 పుగాకుకాడల పులుసే 🙂

   • విన్నకోట నరసింహారావుగారు,
    జిలేబిగారికి పనిగండం ఉందని చెప్పేరట, అందుకు అయ్యర్ గారే కాఫీ పెట్టి ఇస్తారని చెప్పేరు 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s