శర్మ కాలక్షేపంకబుర్లు-చాదస్తం (UIU)ర గణం?

చాదస్తం

”మీదంతా చాదస్తం పంతులుగారూ! చెప్పిన మాటెవరు వింటారీరోజుల్లో” అన్నాడు మా సత్తి బాబు.
”అవునా నా మాటలన్నీ చాదస్తమేనంటావా! ఏంటోనయ్యా!! ఒకప్పుడు నేనూ ఇలాగే అనుకున్నా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, అప్పుడు అర్ధం కాలేదనుకో!!! కాలంరావాలి దేనికైనా, అర్ధం చేసుకోడానికి కూడా సుమా” అని ముగించి ఉయ్యాలలో కూచున్నా. అన్నన్నా! ”ఎంత మాటన్నాడూ! నాది చాదస్తమా, అన్నట్టూ ఈ చాదస్తం” అన్న మాటెలాపుట్టిందబ్బా అనుకుంటే ఇలా అనిపించింది.

అక్షరం అంటే నాశనం లేనిదని అర్ధం. ఇటువంటి ఒక పొట్టి అక్షరాన్ని పలకడానికి పట్టే సమయాన్ని ఒక మాత్ర అన్నారు. ఒక పొడుగు అక్షరాన్ని పలికే సమయానికి ద్విమాత్ర అనగా రెండు మాత్రల సమయం అన్నారు. వీటినే లఘువు, గురువు అన్నారు. వీటికి సంకేతాలు కూడా ఉన్నాయి లఘువు I గురువు U గుర్తుతోనూ సూచిస్తారు. ఇటువంటి లఘువులు గురువులు మూడు కాని ఐదు కాని చేరిన పదాన్ని ఒక గణం అన్నారు. వీటికి పేర్లూ పెట్టేరు. అవే, న,జ,భ,జ,ర ఇలా. కొన్ని గణాల తో కలిసి చెప్పినదాన్ని పద్యపాదం అన్నారు. అటువంటి నాలుగుపాదాలున్నదానిని ఒక వృత్తం అన్నారు. ఈ పద్యాలకీ పేర్లున్నాయి. అవీ చిత్రంగానే ఉంటాయి. మత్తేభం అంటే ఏనుగు, శార్దూలం అంటే పెద్దపులి, ఆటవెలది అంటే భొగస్త్రీ ఇలా కొన్ని పద్యాల పేర్లు. వీటిమీద కొన్ని లోకోక్తులూ ఉన్నాయి. ‘కందం కట్టినవాడే కవి పందినిపొడిచినవాడే బంటూ’ అనీ, ‘సీసం కవికి కంచరికీ తేలికే’ అని ఇలా కొన్ని.

ఇలా ఒక పద్యం రాయాలంటే ఆవృత్తానికి నిర్దేశింపబడిన గణాలు సరిపోవాలట, యతి సరిపోవాలట, ప్రాస సరిపోవాలట, ఇదంతా ఒక పెద్ద శాస్త్రం. అమ్మో పద్యమా అని పారిపోతుంటారుగాని అసలు పద్యం లో ఉన్న సొగసు వచనం లో లేదనిపిస్తుంది. అదేం కాదుగాని దేనందం దానిదే!

ఈ సందర్భంగా ఒక చిన్న ముచ్చట. అవి నరసాపురంలో ఉద్యోగం చేస్తున్నరోజులు. ఆ ఊళ్ళో డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద ద్విశతావధాని గారుంటారు. వారికి టెలిపోన్ కనక్షన్ ఇచ్చే భాగ్యం నాకు కలిగింది. ఆ సందర్భంగా వారు నాకో పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అది ఒక పద్య కావ్యం పేరు “త్యాగసింధువు’ అది చదివాను, పుస్తకాన్ని దాచుకున్నా కూడా. ఆ పుస్తకం అట్ట మీద ఒక పద్యం ఉంది అది నన్ను విపరీతంగా ఆకర్షించింది. ఇదీ ఆ పద్యం.

పద్యమ్మునెవడురా! పాతిపెట్టెదనంచు
ఉన్మాదియై ప్రేలుచున్నవాడు
పద్యమ్మునెవడురా ! ప్రాతపడ్డదియంచు
వెఱ్ఱివాడై విఱ్ఱవీగువాడు
పద్యమ్ము ఫలమురా ! పాతిపెట్టిన పెద్ద
వృక్షమై పండ్ల వేవేల నొసగు
పద్యమ్మునెప్పుడో పాతి పెట్టితిమేము
లోకుల హృదయాల లోతులందు

ఇప్పుడద్దాని పెకలింప నెవరితరము
వెలికితీసి, పాతుట యెంతవెఱ్ఱితనము
నిన్నటికి మున్ను మొన్ననే కన్ను దెఱచు
బాల్య చాపల్యమునకెంత వదఱుతనము.

ఇలా పద్యాలు కట్టడానికి కావలసిన నియమం,విధి,నిషేదాలను చెప్పేదే ఛందసం లేదా ఛందస్సు. జీవితంలో నియమం,విధి,నిషేధం(Do’s & Don;s) చెప్పడాన్ని ఛాందసం అన్నారు, అది కాలక్రమంలో చాదస్తం అయిపోయింది.. ఇలా వెంటబడి నియమం,విధి నిషేధాలు చెప్పేవారిని ఛాందసులని మేధావులంటున్నారు. సామాన్యులు మాత్రం చాదస్తులు అంటున్నారు. ఇదీ చాదస్తం కత. చాదస్తంగా చెప్పేనా 🙂

 

19 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చాదస్తం (UIU)ర గణం?

 1. నమస్కారం . . . . . ఛందస్సు తెలిసిన వాడు ఛాందసుడు . . . . . అని ద్వానా శాస్త్రి గారి ఒకానొక పుస్తకం లో చదివిన గుర్తు . . . అలాగే అమంగళ వారాన్ని మంగళవారంగా మార్చామని . . . . . పొగపు కాస్తా పోపు గా మారిందని

  • ఛందము అంటే వేదం అని అర్థం అండీ. ఐతే ఈ‌అర్థం తెలుగు నిఘంతువులకు ఎక్కలేనట్లున్నది. శ్రుతి అన్నా వేదమే ఛాందసుడు అంటే యౌగికార్థం ఛందస్సులను అనుసరించే‌వాడు అని. అంటే వేదాధ్యాయి అన్నమాట. శ్రోత్రియుడు అన్నమాట. వేదపండితులకు లౌకికదృష్టి కొంచెం తక్కువగానూ పారలౌకిమైన దృష్టి హెచ్చుగాను ఉంటుందనే‌ భావన ఉన్నది. అందుచేత లౌకికవిషయాలలో ఉద్ద్దండవేదపండితులు కూడా అమాయకచక్రవర్తుల్లా కనిపించటం పరిపాటి. వారు సమస్తాన్ని వేదం ఏంచెప్పింది అన్న దృష్టితోనే అన్వయం చేసుకుని ప్రజలకు దూరంగా ఏవేవో ఆలోచనలు చేస్తారు కాని మనలా కాదని లోకభావన. ఏ ఛాందసుడు కానివ్వండి కాస్త తక్కువ లౌకికుడే అని లోకోద్దేశం. ఈ ఛాందసుడు అనే‌ మాటయే కాలక్రమేణా చాదస్తుదు అన్న మాటగా మారింది. ఇప్పదు చాదస్తం అన్న పదం యొక్క అర్థం ఛాందసం అన్న దాని అర్థానికి పూర్తి చ్యుతిగా ఉన్నది.

   పెద్దనగారి ప్రవరుడు అంటాడు కదా ‘బుధ్ధిజాడ్య జనితోన్మాదుల్ కదా శ్రోత్రియుల్’ అనీ. అంటే ఒక్క వేదం విషయంలో తప్ప శ్రోత్రియులకి వాళ్ళ బుఱ్ఱలు లౌకికవ్యవహారాలో తిన్నగా పనిచేయక పోవటం అనే జబ్బు ఉందీ‌ అని.

   ఇకపోతే కుజుడికి అమంగళుడు అన్న నామం ఏదీ కనీసం నా వినికిడిలో లేదు. వారాల పేర్లు ఎలా వచ్చాయన్నిది పక్కన బెడితే అవన్నీ‌ గ్రహనామాలే అన్నది జగద్విదితం మంగళవారం నాడు సూర్యోదయాది మొదటీ హోరా కాలానికి (అంటే మొదటి గంట కాలానికి) అధిపతి కుజుడు కాబట్టి అది మంగళవారం ఐనది. సోమవారం నాడు మొదటిహోరా సోముడిది (అంటే చంద్రుడిది). అమంగళం ఎక్కడా లేదు.

   విన్నపం. ఏదో నాకు తెలుసునని అనిపించింది ఇక్కడ చెప్పాను. నాకు లేని సర్వఙ్ఞత్వం ఆపాదించుకోవటానికి కాదు. ఎవరినీ నొప్పించటానికీ కాదు. వాదించటం కోసం అస్సలు కాదు.. అందుచేత నా మాటలు ఎవరికైనా నచ్చక ‘ఎగ్గులాడినన్ దోయిల్ యొగ్గుదున్’.

   • తాడిగదప శ్యామలరావు గారు,
    నా ఛాదస్తం మీచేత పెద్ద వ్యాఖనే రాయించి, మంచి సంగతి చెప్పించింది. 🙂
    ధన్యవాదాలు.

   • టపా వ్యాఖ్యలకే ఫుట్ నోట్ పెట్టడటం ఆనవాయితీ !

    ఇక మీదట కామింటులకి కూడా ఫుట్ నోట్ (గమనిక/విన్నపాలు!) పెట్టాలి కామోసు 🙂 ->

    ఎగ్గులాడినన్ దోయిల్ యోగ్గుదన్ -> నీ బాంచన్ కాల్ మొక్కెదన్ గట్రా 🙂

    జిలేబి

  • chandra sekhar nimmagadda గారు,
   ద్వారకానాథ శాస్త్రి గారు చెప్పినట్టు నాకు తెలియదు. మంచి విషయం చెప్పేరు.
   కుజ గ్రహాన్ని మంగళ గ్రహమనీ అంటారు. ఏరోజు మొదటి హోర కుజునిదయిందో ఆ రోజు మంగళవారమనే అంటాము. మరి ద్వానాశాస్త్రిగారే సందర్భంలో అమంగళ వారాన్ని మంగళవారంగా మార్చేమన్నారో తెలియదు. పొగచడాన్ని పోపు అని వాడుతున్నమాట నిజమేకాని ఇంకా పల్లెలలో పొగచు అనేమాట వాడుతున్నామండి. శనగలు, పెసలని ఇంకా పొగచడమనే అంటున్నాం, పోపని అనటం లేదు. సాధారణం గా అన్నిటికి పోపు అన్నమాట వాడేస్తున్నాము. మంచి సంగతి చెప్పినందుకు, వ్యాఖ్యకు
   ధన్యవాదాలు.

 2. >>> వారికి టెలిపోన్ కనక్షన్ ఇచ్చే భాగ్యం నాకు కలిగింది. ఆ సందర్భంగా వారు నాకో పుస్తకం బహుమతిగా ఇచ్చారు.

  మరీ చాదస్తం అనుకోకుంటే ఒకటడుగుతానండీ ! ‘ఈ బహుమతి’ ఏమన్నా ‘ఆమ్యామ్యా’ క్రింద వస్తుందా 🙂

  జిలేబి

  • జిలేబిగారు
   పాపం ఆ పుస్తకం ఆయన స్వంత రచన! వారలా అనుకోలేదు, ఆనందం కొద్దీ ఇచ్చారు, నేనూ అలా అనుకోలేదు. మరీ చాదస్తం కాకపోతే ఆమ్యామ్యా పుచ్చుకుంటే ఇలా చెప్పుకుంటారేంటండి.
   నెనర్లు

 3. Bharadwaj24 November 2015 at 18:32
  ఆది మధ్యాంతములయందు యరత లఘువు|
  ఆది మధ్యాంతములయందు భజస గురువు||
  న గణ మన్నిట లఘువులమరియుండు|
  మా గణ మన్నిట గురువులమరియుండు ||

  ReplyDelete
  Replies

  Bharadwaj24 November 2015 at 19:01
  నా చిన్నప్పుడు మా నాన్న “ఛందస్సు” నేర్పుతూ ఈ పద్యం చెప్పారు. ఇది అలా గుర్తుంది.

  Delete

  • భరద్వాజ గారు,
   చిన్నప్పుడు నాకు ఒంట బట్టనివి ఛందస్సు, డోకడాల వడ్డీ లెక్కలూ. ఛాదస్తం మాత్రం వయసుతో పెరిగిపోయింది.
   మంచి పద్యం గుర్తు చేశారు. ఈ ఛాదస్తం మీద రగడ జరుగుతోంది కదండి, అందుకు ర గణమేనా అన్నా 🙂
   ధన్యవాదాలు.

 4. dhanya vadalu. miru ayur arogyalato vundalai a bhagavati varini prathistunnanu.
  maku marinni manchi pathalu ,vishayalu nerputunnaru.
  NTR vunte miku avardu vachchundedi, telugu bhashaku, samskrutiki sambandhinchi edanna.

  • Kumar ji,
   చాదస్తం తగ్గటం లేదండి. ఇంక తగ్గేదేమి లెండి 🙂 కాటికి కళ్ళు చాపుకుకూచున్నవాడికి.
   పెద్దల్లో, మేధావుల్లో కలిపేసి అవార్డిప్పించేస్తారా? వద్దండి. అభిమానుల మనసులో ఉండిపోవడమే పెద్ద అవార్డు, అది చాలండి ఈ జన్మకి.
   అవార్డులు మేధావులకే ఇస్తారు,సావకాశం వచ్చినపుడు, యజమానికి అవసరం కలిగినపుడు, మళ్ళీ తిరిగిచ్చెయ్యడానికే 🙂
   ధన్యవాదాలు.

 5. చాదస్తానికి ఓ ఉదాహరణ రోజూ తెలుగు బ్లాగులోకంలో చూస్తున్నాంగా. చాదస్తం కాస్త తగ్గించుకోండి మహానుభావా అని చెప్పినా తన ధోరణి తనదే 🙂 (జిలేబీ గారిలా jk)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s