శర్మ కాలక్షేపంకబుర్లు-అన్నద్వేషం………

అన్నద్వేషం………

అన్నద్వేషం బ్రహ్మద్వేషం పుట్టకూడదంటారు, ఎప్పుడు పుడతాయిటా…..

నిజానికి చెప్పుకోవాలంటే అన్నద్వేషానికంటే బ్రహ్మద్వేషం పుట్టకూడదంటారు. ఈ అన్నద్వేషం, బ్రహ్మద్వేషం ఏంటో చూద్దామా?

తెల్లవారుతోంది, పొద్దుగూకుతోంది, మళ్ళీ తెల్లారుతోంది, మళ్ళీ మామూలే. చూసినమొహాలే చూస్తూ, నవ్విన వెకిలినవ్వులే నవ్వుతూ, ఏడ్చిన ఏడుపులే మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ, రాసిన రాతలే రాస్తూ, కోసిన కోతలే కోస్తూ,చేసిన మోసాలే మళ్ళీ చేస్తూ, వాగిన అవాచ్యాలే వాగుతూ, ఎక్కిన బస్సులు, రైళ్ళు, స్కూటర్లు ఎక్కుతూ, దిగుతూ, చూసిన పీడ మొహాలనే చూస్తూ, రోజూ పలకరిస్తున్నట్లే పలకరిస్తూ, తిట్టిన తిట్లే తిడుతూ, తిన్న తిట్లే మళ్ళీ మళ్ళీ తింటూ, చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ, చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెబుతూ,వెళ్ళి వచ్చిన అదేమార్గం లో రోజూ ఆఫీస్ కి/పనికి తిరుగుతూ, ఇంటి దగ్గర రోజూ చూస్తున్న పతిదేవుడో/పత్నీ దేవతో మొహం మళ్ళీ మళ్ళీ చూస్తూ, అసంకల్పితంగా చేసిన పనులే చేస్తూ, అదే పక్కమీద అదే భార్య/భర్తతో నిద్రిస్తూ చాలాచాలా అలసిపోయాం. బతుకు జటకాబండి సమతూకం కావటం లేదు, కంచం మంచం పొత్తు సరిపోటం లేదు, ఎక్కువో తక్కువో అయిపోతూనూ ఉంది,ఎదుటివారిదే తప్పూ అంటూనూ ఉన్నాం. అందుకే కొత్త మాట వినాలని కుతూహలం, కొత్తపని చేయ్యాలని ఆశ,కొత్త తిట్టు తిట్టాలని,కొత్త తిట్టు వినాలని, ఇలా చాలా చాలా తీరని కోరికలతో, విసిగి వేసారిపోతున్నాం. 🙂 అదీ గాక వయసా మీద పడిపోతుంటుంది. ఇలా అన్నిటికీ విసుగు, విరామం ఉంటున్నా తిన్న అన్నమే తింటూ, తిన్నకాయగూరలు మళ్ళీ మళ్ళీ తింటూ,ఉదయమే తింటే మధ్యాహ్నానికి పరగడుపు, మధ్యాహ్నం తింటే రాత్రికి పరగడుపు. కొంతమందైతే నోరు ఆడించినవారు అలా పిండి మిల్లులా ఆడిస్తూనే ఉంటారు. పాపం వీరంతా తినడం కోసమే పుట్టినట్టు ఉంటుంది. కాని దీనికి అనగా నోటికి మాత్రం విరామంగాని విసుగుకాని ఉండదు. కొంతమంది ఉపవాసాలపేరు చెప్పి…వద్దండి చాలామందికి కోపాలొస్తాయి….తిట్టుకుంటున్నారా? మన్నించేద్దురూ…,నిజం కదా! ఉపవాసం పేరు చెప్పి ఉప్పరి దున్నపోతుల్లా తినెయ్యడం…. ఇదిగో ఇంత బానిసలైపోయిన ఈ అన్నం పైన కూడా ద్వేషం ఏర్పడుతుంది, ఎప్పుడూ… ఒక్క ముద్ద తినండి…బతిమాలుతుంటుందా పిచ్చి ఇల్లాలు, ఇంకా బతికి ఏమి ఉద్ధరిస్తాడనో, ఎవరిని ఉద్ధరిస్తాడనో… ఒక్క ముద్ద తిను నాన్నా అంటాడు కొడుకు, ఎప్పుడూ తిన్నావా అని బాగుండగా అడగనివాడు…ఎందుకు లోకమేమైనా అనుకుంటుందేమో! ఇక మనవరాలు తాతా నాకోసం ఒక్క ముద్ద తినవా? పాపం నిజంగానే బాధపడుతూ అడుగుతుంది…. ఇక కూతుళ్ళకి మిగిలినవారికి కబుర్లెడతాయి, తప్పదు కదా…. కూతురొచ్చి ఒక్క ముద్ద తిను నాన్నా అని అదేపనిగా అంటూ ఉంటుంది, అప్పటిదాకా ఇక్కడున్నవాళ్ళెవరూ ఆయనకి ముద్దే పెట్టనట్టు….ఏం తింటాడు? తినవలసిన నూకలన్నీ తినేశాడు, ఇతరులవి కూడా నొల్లేసుకుని,…ఇంక నూకలు బాకీ లేవు అందుకు తినలేడు..ఎంతమంది అడిగినా….అప్పటిదాకా వాయిలకి వాయిలు లాగించేసినవాడు కాదా….. మరిప్పుడు అన్నద్వేషం పుట్టింది, ముద్ద నోట్లో పెడితే వెలపరంగా ఉంది…. ఇదీ అన్నద్వేషం పుట్టడమంటే…. ఈ అన్నమయ కోశం అన్నం లేకపోతే…..ఉండదు… ఉండే కాలం లేనప్పుడే అన్న ద్వేషం పుడుతుంది…..అదే పోయే కాలం. మరి బ్రహ్మద్వేషం….

బ్రహ్మ అంటే భగవంతుడు అని అర్ధం… ఈ ద్వేషం నిజంగా పుడుతుందా? నిజంగానే పుడుతుంది, ఒంట్లో అన్నసారం బాపతు బలం బాగా ఉన్నపుడు, అధికారం లో ఉన్నపుడు, యవ్వనం లో ఉన్నపుడు, సొమ్ము చేతినిండా ఉన్నపుడు,ఒంటిపైన అందం ఉన్నపుడు, ఒకరిపై అక్రమంగా అధికారం చెలాయించే రోజున్నపుడు మరేదీ కనపడదు… ఆ రోజున నారాయణా అంటే బూతుమాటలా వినపడుతుంది. ఎంతమందిని చూడలేదు ఇలా బ్రహ్మ ద్వేషం తో రవిలిపోయినవారిని. చివరికేమయ్యారు? ఇలా బ్రహ్మద్వేషం పుడుతుంది…. పాపం హిరణ్య కశిపుడు అహం బ్రహ్మస్మి నేనే దేవుడిని నన్నే పూజించండి అనికదా కొట్టుకులాడిపోయినది. నాకంటే దేవుడు వేరుగాలేదు అనికదా బాధపడిపోయాడు.నేను కాక దేవుడుంటే చూపమని కదా గోల చేశాడు. చివరికి చూశాడనుకోండి…..

ఎప్పటికీ ద్వేషం కలగనిదొకటుంది, అదే డబ్బు. ఒకాయన చివరికాలానికొచ్చేసేడు, బంధువులు మిత్రులు అందరూ వచ్చేసేరు, చావా చావడు మంచమూ ఇవ్వడన్నట్టు ఒక రోజు లోపల ఒక రోజు బయటా పెడుతున్నారు. చిత్రహింసపెడుతున్నాడు, పడుతున్నాడు. అప్పుడొకాయన తలకిందనుంచి రూపాయలు తీసి రోగి ఎదురుగా నీళ్ళ గ్లాసులో వేసి కడిగి ఆ నీళ్ళు పోశారు, అప్పుడు హాయిగా కన్ను మూశాడు.

ఎప్పుడు కలుగుతుందీ అన్నద్వేషం, బ్రహ్మద్వేషం…. …వందనాలు.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అన్నద్వేషం………

 1. అన్నద్వేషం కూడా బ్రహ్మద్వేషమేనా? అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నారు కదా మరి!

  భగవంతుడి నిర్ణయం ఏమిటో తెలియదు కదా. ఉండి చేయవలసినవి చేసేసాం – చూడవలసినవి చూసేసాం‌ కదా, ఇంకా ఎందుకిక్కడ అను కొందరిలోని జీవుడు ఆవేదన పడినా, ఆయా ఉపాధులకి భగవంతుడు ఏమేమి ప్రయోజనాలను కర్తవ్యాలను నిర్ణయించినదీ తెలియదు కదా. ఏ మాటకామాట చెప్పుకోవాలి, ఈ‌ఉపాధితో ఇక్కడ నేను అని చెప్పుకుంటున్న వాణ్ణి నాకు ఉద్దిష్టమైన పనులు నెరవేర్చాననే అనుకుంటున్నాను. కాని ఆయన ఇంకా ఎన్నాళ్ళుంచితే అన్నాళ్ళుండి భగవత్సంకల్పానుసారం వర్తించవలసిందే కదా.

  • తాడిగదప శ్యామలరావు గారు
   అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి. అన్న ద్వేషం పుడితే బ్రహ్మద్వేషం పుట్టినట్టే..
   ఈ ఉపాధి చేయవలసిన పనులు పూర్తయే సమయానికే ఈ అన్న ద్వేషం పుడుతుంది.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s