శర్మ కాలక్షేపంకబుర్లు-తాపత్రయం.

తాపత్రయం.

తాపం అంటే వేడి, త్రయం అంటే మూడు అనగా మూడు రకాల వేడి , మూడు రకాల కష్టాలనమాట. ఈ తాపాలు ఆధ్యాత్మికతాపం,అధిభౌతికతాపం, అధిదైవికతాపం అని మూడు రకాలాన్నారు పెద్దలు.సామాన్యులు మాత్రం తాపత్రయపడటం అంటే ఎత్తలేని బరువును మోయడం కోసం, పెట్టలేని పరుగుకు ప్రయత్నించడంగా చెబుతున్నారు.

ఆధ్యాత్మికతాపం చెప్పుకోవాలంటే, ముందుగా ఆత్మ గురించి చెప్పుకోవాలి. ఆత్మ నశించనిది,శరీరం నశించేది. ఈ శరీరం లో ఆత్మ నివశిస్తుంది, ఈ శరీరం చేసే, మనసు, దాని ఇతర స్థాయిలలో చేసే అన్ని చర్యలను సాక్షీభుతంగా అనుభవిస్తుంది. మనసు,బుద్ధి,చిత్తం, అహంకారం, మనసు యొక్క వివిధ స్థాయిలు. ఈ మనసనేది  చిత్రమైనది, సంకల్పవికల్పాలు చేస్తూనే ఉంటుంది. మనసు చేసే మరో చిత్రమే పురుషార్ధసాధన. ఇందులో మూడవ పురుషార్ధమే కామం. కామమంటే కోరిక,(స్త్రీ పురుష సంబంధమొక్కటే కామం కాదు) ఏదైనా కావచ్చు. ఇది ధర్మ బద్ధంగా ఉన్నంతకాలం తాపానికి చోటు లేదు. ధర్మ బద్ధమైన కోరిక కూడా జరగని సమయాలూ ఉంటాయి, అప్పుడూ ఈ తాపం తప్పదు. ధర్మం దాటినపుడు మాత్రమే మనసు చేసే చిత్రంతో, చిక్కులు కలుగుతాయి. వీటినే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలుగాను, అంతఃశతృవులుగానూ పెద్దలు చెబుతారు. ఈ అంతఃశతృవులు బయటికి కనపడరుగాని, చాలా తాపాన్ని అనగా కష్టాన్నే కలగచేస్తారు. వీరిబారిన పడనివారుండరు. వీరిబారిన పడనివారు మహామహులే. ఏదో ఒక కోరిక లేనివారు లేరు, కాదు ఉండరు. నాకేకోరికా లేదన్నవారినెవరినీ నమ్మద్దు. ఈ పురుషార్ధ సాధనలో కలిగే తాపమే ఆధ్యాత్మిక తాపం. ఈ తాపంలో పై చెప్పినవే కాక కలిగే శరీరానికి సంబంధించినా ఊర్ములు ఆరు, ఆకలి,దప్పిక, జర,రుజ,శోకం,మోహం…వీటినుంచి కలిగే కష్టాలు కూడా అధ్యాత్మిక తాపాలే. ఆకలికి, ముఖ్యంగా దప్పికకి అసలు ఓర్చుకోలేం. ఇది చాలా పెద్ద కష్టం. ‘గోచీ కంటే దరిద్రం ప్రాణహాని కంటే ఎక్కువ కష్టం’ లేదని నానుడి. జర ముసలితనం,రుజ అనగా వ్యాధిబారినపడటం ఇవి రెండూ తప్పించుకోలేనివి అనుభవించక తప్పనివీనూ. జర,రుజ రెండూ పెద్ద కష్టాలే. చివరివి శోకం,మోహం, తప్పించుకోవాలని తంటాలైతే పద్తాం కాని సాధ్యం కాదు, ఎవరికి వారు మాత్రమే అనుభవించవలసినవి, యీ ఊర్ములన్నీ. ఇవే అధ్యాత్మిక తాపాలు.

అధి భౌతిక తాపం.ఈసృష్టిలో ఎవరిమటుకు వారొకరే కాదు, చాలా ప్రాణులు, అప్రాణులూ ఉన్నాయి, ఇవీ కాలంతో పాటువే. ఈ సృష్టితో సహజీవనం తప్పదు. అప్పుడపుడు మనతో జీవించే ఇతర జంతువులవలన, మనుషులవలన కలిగే కష్టాలే అధిభౌతిక తాపాలు. ఉదాహరణకి నల్లులు,దోమలు కుట్టడం, తేలు, పాము లాటివి కాటేయడం, పేలు తలలో ఒంటిని పట్టడం, జంతువులలాటివి గాయపరచదం. వీటికంటే చాలా ముఖ్యం ‘మనిషికాటుకి మందులేదని’ సాటి మనిషినుంచి కలిగే కష్టం కూడా ఇందులో చేరేదే. జంతువులు ఇతరజీవులను హింసించడం,వధించడం అధిభౌతికతాపమే, తప్పించుకోగలదే కాని తప్పించుకోం. నిజానికి దీనినుంచి తప్పించుకోవడమే గొప్ప.

నా ఇల్లు, నాఇష్టం, నిప్పుపెట్టుకుంటాను, నువ్వెవరు కాదనడానికి?నీ ఇల్లు నీ ఇష్టమని తగలబెట్టుకోడానికి లేదన్నా,నా స్వాతంత్ర్యం అని మొండిగా మాటాడేవారినేం చేస్తాం?,పది మంది నమ్మినదానిని కాదనుకోడం, తప్పులేదు, మీరంతా తప్పు చేస్తున్నరని చెప్పడం? అంతదాకానూ బాగానే ఉంది, ఇది నిత్య కలహం చెయ్యడం? ఇద్దరు వ్యక్తుల మధ్య,రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, మతాల మధ్య కలహం, కలహం, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, మూడవారు ఇద్దరినీ బాగుందని ప్రొత్సహిస్తున్నారు. అందరూ హక్కుల గురించే తప్పించి బాధ్యతలగురించి ఆలోచించినవారే కనపడటం లేదు.వీరందరికి ఎవరు చెప్పగలరు? వీరని వారు, వారని వీరు వీధినపడి కాట్లాడుకుంటున్నారు, అందరిని అదే మట్టిలో కలిపేస్తారు చివరికి, ఇది గుర్తించటం లేదు. ఇదే అధిభౌతికతాపమే, దీనినుంచి తప్పించుకోలేకపోతున్నారు.

అధిదైవిక తాపాలు. భగవంతుడు కలగచేసే కష్టాలన్నారు. భగవంతుడు చేసేడనే కంటే మానవుడు తన నెత్తిన తనే దుమ్ముపోసుకుని అధిదైవిక తాపాలంటున్నాడంటే సరేమో! పంచభూతాలెప్పుడూ వాటివాటి హద్దులు దాటవు. కాని వాటి సమతుల్యత మానవుడు చెడగొట్టినపుడు విజృంభిస్తాయి. అప్పుడు మానవుడు బలహీనుడే. పృధివి,ఆపస్సు, తేజస్సు,వాయువు, ఆకాశం పంచ భూతాలు. ‘మిన్ను విరిగి మీద పడటం’ అంటాం. ఆకాశం అంటే శూన్యప్రదేశం, అక్కడేం లేదు. అనుకోనిది, మనం ఊహించలేనిది జరిగి మీదపడితే, భరించలేరు, ప్రాణాలు కోల్పోవడం తప్పించి. తప్పించుకోడానికి సమయం కూడా ఉండదు. ఆ తరవాతది వాయువు, కనపడదు గాని చాలా బలవత్తరమైనది. మానవుడు ఏమి లేకున్న బతకగలడుగాని వాయువులేకుంటే క్షణాలు బతకలేడు. హంసమంత్రం సర్వకాల సర్వావస్థలలో తిరుగుతుండవలసిందే. హంసమంత్రం ఏమనికదా? గాలి పీల్చేటపుడు కలిగే శబ్దం హం, గాలి వదిలేటపుడు కలిగే శబ్దం స, ఈ రెండూ కలిస్తే జీవితం, లేకుంటే మరణం. ఇదే హంస మంత్రం. ఇది సర్వజీవులకూ సమానం. ఇంత అవసరమైన వాయువు ప్రకోపిస్తే, రక్షణకు మరో భూతాన్ని ఆశ్రయించాల్సిందే, అదే భూమి. ఉదాహరణకి అమెరికాలో టైఫూన్లనుంచి రక్షణకు భూమిలోపల బంకర్ లలో తలదాచుకుంటారు, ఎంతసేపు? కొన్ని క్షణాలు, ఆ తరవాత పైకొచ్చి చూచుకుంటే కనపడేదేంటీ? అన్నీ కూలిపోయి ఎగిరిపోయి ఉంటాయి, పునర్నిర్మించుకునేదాకా మళ్ళీ బంకరే గతి. ఆ తరవాతది నిప్పు, దీనినుంచి తప్పించుకోడానికీ మళ్ళీ భూమేగతి. అదికూడా మళ్ళీ బంకరే, కలుగులో ఎలకలా తలదాచుకోవలసిందే. ఇక ఆ తరవాతది నీరు, ఇది విజృంభిస్తే మళ్ళీ భూమే గతి అదికూడా ఎత్తైన ప్రదేశం మాత్రమే. ఇంత రక్షణ కలిగించే భూమి కదిలితే! కాలికింద భూమి కదిలితే, కదలదని నమ్మకం, కాని ఆ నమ్మకం కూడా సడలిపోతుంది అప్పుడపుడు. అప్పుడు జరిగేది విలయమే. వీటినే అధిదైవిక తాపాలన్నారు. దైవం ఉన్నాడా/ఉందా? చొప్పదంటు ప్రశ్న…

మిత్రులు astrojoyd గారు తాపత్రయం గురించి రాయమని అడిగారు, లోపల ఉన్న టపా తెచ్చి పూర్తి చేశాను. ఆలస్యానికి వారు నన్ను మన్నిస్తారని తలుస్తాను, ఈ టపా చూస్తారనీ తలుస్తాను. _/\_

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తాపత్రయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s