శర్మ కాలక్షేపంకబుర్లు-అల్లుడితో భోజనం….

అల్లుడితో భోజనం….

‘అల్లునితో భోజనం కొడుకుతో చదువూ’ అన్నారు, ఇదో నానుడి, ఇప్పుడు చెప్పటం లేదనుకోండీ. ఏంటీ దీని విశేషమని చూస్తే అల్లునితో భోజనమంటే, అల్లుడంటేనే ఇంటికి విశిష్టవ్యక్తి, అందునా అత్తగారికి అల్లుడంటే అభిమానమెక్కువుంటుంది. ‘అల్లుడికి అత్తాశ బ్రాహ్మడికి పప్పాశ’ అని నానుడి. అటువంటి అల్లునికి పెట్టే భోజనం ఎలా ఉంటుంది?

పాతరోజుల్లో భోజనం అంటే ఎవరిమటుకువారు, నేటివారిలాగా డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని నాలుగు మెతుకులు కంచంలో పెట్టుకుని, మూడు మెతుకులు మూతికి రాసుకుని లేచిపోడం కాదు. అదొక పెద్ద కార్యక్రమం, అందునా ముఖ్యమైన కార్యక్రమం. ఇక అత్తింట అల్లుని భోజనమైతే చెప్పాలా. మామగారు రావాలి, ఆయనెన్ని పనులున్నా అల్లునితో కూచుని భోజనం చెయ్యాలి,అల్లుని సమాయానికి, దానికోసం పనులు వాయిదా వేసుకునైనా వచ్చి కూచునేవాడు. ఇక అత్తగారైతే ఇంట్లో ఉన్న అతి విలువైన, మంచి రుచికరమైన, అల్లునికి ఇష్టమైనవి వండి సిద్ధం చేయడమే రివాజు.

ఈ తరవాత మామగారు అత్తగారి అనుమతితో ‘అల్లుడుగారు, దేవతార్చనకి సమయమైంది, లేవండి’ అనడంతో పిలుపులు ప్రారంభమయ్యేవి. ‘దేవాతర్చన’ అంటే భోజనం చేయడమని అర్ధం. భోజనం చేయడం కూడా మనలో ఉన్న భగవంతుని అర్చించడమేనన్నది మనవారి అభిప్రాయం. ఆ తరవాత ‘అత్తగారు లే నాయనా! కళ్ళుకడుక్కో’ అనడంతో రెండో పిలుపు. భోజానికి ముందు కళ్ళు కడగడం అలవాటూ, ఇది ఆరోగ్యప్రదం కూడా. ఇప్పుడు బూట్లే విప్పటం లేదనుకోండీ. ఆ తరవాత అమ్మాయి! ‘లేవండీ నాన్న మీకోసం పీటమీద కూచుని కనిపెట్టుకున్నారు’తో మూడవ పిలుపు. ‘అల్లుడుగారికేం కావాలో చూడమ్మా! భోజనానికి లెమ్మని తీసుకురావే’ అనడం తో అమ్మాయి తోడ్కొనిరాగా అల్లుడుగారు, ప్రత్యేకంగా వేసిన పీట మీద పెద్ద ఆకుముందు కూచోడంతోనూ, పక్కనే మామగారు, బావమరదులూ భోజనానికి సిద్ధమవడంతోనూ ఒక అంకం పూర్తయి మరో అంకానికి తెర లేస్తుంది.

‘అదేంటే అమ్మాయి మీ ఆయన పాకంగారెలు ఇష్టంగా తింటాడన్నవుకదూ మరదేం ఒకటే తిన్నాడూ, అంటూ మరో రెండు గారెలు వెయ్యడం జరుగుతుంది.’ అని అత్తగారు కూతురుని ఆరా తీయడం, మరి అదేవరసలో కూచున్న మామగారికి బావమరదులకు కూడా కావలసినంత వడ్డించడం జరుగుతుంది కదా! ‘బంతిలో వలపక్షం’ అంటారు పొరపాటు అది, ‘పంక్తిలో బాలపక్షం కూడదు కదా!’ బంతి కాదు పంక్తి, బాలపక్షం అనాలికాని ‘వలపక్షం’ అంటున్నారు. పిల్లలికి పెద్దవాళ్ళకి పెట్టినంతా పెడితే తినలేరు కదా వృధా అవుతుంది, అందుకు వారికి తక్కువే పెట్టాలి, మరి పంక్తిలో పెద్దలికి పిల్లలికి పెట్టినట్టు,తక్కువ పెట్టడాన్నే బాలపక్షం అన్నారు. పిల్లికి ఎంత తినగలరో అంచనా ఉండదు, వారికి ’కడుపు నిండినా, కన్ను నిండదు’ ఇదో నానుడి.

ఇలా భోజనమువుతుంది మామగారికి కూడా, లేకపోతే ‘రెండు గారెలుతిన్నారు, అవేమో పాకం గారెలాయె, మీకా సుగరు, చాల్లెండి’ అనే ఆవిడ కూడా అల్లుడితో భోజనం తో అలా అనదు 🙂 మరి తుష్టుగా భోజనం జరుగుతుంది కదా! అందుకే అల్లుడితో భోజనమన్నారు.

ఇక కొడుకుతో చదువంటే, నాటిరోజుల్లో చదువంటే, అన్నీ చేతి వృత్తులే. తండ్రి ఇంటి దగ్గర పని చేసుకుంటుంటే కొడుకు కూడా ఉంటూ చూస్తూ ఉండేవాడు. ఆ అతరవాత కొద్దిగా వయసొచ్చేకా తండ్రితో పాటు పని చేసేవాడు. ఆ తరవాత తండ్రి పనిలో మెలకువలూ చెప్పేవాడు, ఇలా తండ్రే చదువులో కొడుకుకి గురువు, అన్ని విషయాలలోనూ. కొడుకు తండ్రిలాటి లేదా తండ్రిని మించినవాడై ఉండేవాడు. ఆ తరవాత మరొకరి దగ్గర వృత్తిలో మెరుగులకోసం వారిని గురువుగానూ స్వీకరించేవారు. ఇందుతో కొడుకు చదువు పూర్తి అయ్యేది, తండ్రే చదువు అనగా పని నేర్పడంతో ఏ రకమైన దాపరికమూ లేక చెప్పేవాడు, అందుకే తండ్రితో చదువన్నారు…

అదీ ”అల్లుడుతో భోజనం కొడుకుతో చదువు” నానుడి సంగతి

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అల్లుడితో భోజనం….

 1. మూడో నాలుగో పాకం గారెలే! వింటేనే బరువు పెరిగిపోతున్నట్టుంది.
  అఫ్‌కోర్స్, నా కామెంటు పాకంగారెల వరకే అనుకోండి. అవంటే అస్సలిష్టం లేదు. 🙂

 2. వామ్మో ! వామ్మో ! మరీ ఇంత డేమేజింగ్ స్టేట్మెంటా 🙂

  “పాతరోజుల్లో భోజనం అంటే ఎవరిమటుకువారు, నేటివారిలాగా డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని నాలుగు మెతుకులు కంచంలో పెట్టుకుని, మూడు మెతుకులు మూతికి రాసుకుని లేచిపోడం కాదు.”

  ఈ కాలం లోని బకరా ప్యాక్ బీబీ బాబాలకు అత్తారింటికి దారేది అని అడిగే సమయం కూడా లేదే !

  జిలేబి

  మీ బ్లాగు లో మళ్ళీ ఏమన్నా వైరసు వచ్చిందా ? నక్షత్రాలు పైనించి కిందకు ధభీల్ ధభీల్ మని దూకుతున్నాయ్ ?

  • Zilebiగారు,
   సంస్కృతి మారిపోతోంది కదండీ, నేటి విషయమింతే 🙂
   అసహన చర్యలో భాగంగా ఎవరైనా దానిని నా బ్లాగులో చొప్పించారేమో తెలియదండి. పోనిద్దురూ! బ్లాగుల్నించి తొలగిపోతున్నాకదా! సమస్యలేదు.
   ధన్యవాదాలు.

 3. “భోజనానికి మావగారితో కూర్చుని అత్తగారితో లేచాడట” అని మహా తాపీగా భోజనం చేసే అల్లుళ్ళు ఉంటారని పెద్దవాళ్ళు సరదాగా అంటుండేవారని ఓ చిన్నప్పటి జ్ఞాపకం 🙂 (సామెత సరిగ్గానే చెప్పానా 😦 )

  • విన్నకోట నరసింహారావుగారు,
   అల్లుడితో భోజనానికి కూచున్న మావగారు, అల్లుడి భోజనం అయేదాకా పంక్తిలోంచి లేవకూడదు, తన భోజనం అయినా సరే. అందుచేత, అల్లుడు అత్తగారితో లేచే సమస్య రాదు.
   దీనిని ఇలా అంటారు. ఆ ఇంటి మనవలు నెమ్మదిగా భోజనం చేసేవాళ్ళని, ’ఒరే నువ్వు భోజనానికి తాతతో కూచుంటే మామ్మతో లేస్తా’వని. ఎందుకంటే తాత ముందు భోజనానికి కూచుని చేస్తాడు. అందరికి చివరగా మామ్మ భోజనం చేసి లేస్తుంది. భోజనాల పర్వం తుదినుంచి మొదలుదాకా నెమ్మదిగా భోజనం దగ్గర కూచుంటాడని అర్ధం.
   ధన్యవాదాలు.

   • అనుకున్నంతా అయింది. నా వ్యాఖ్య వ్రాస్తున్నప్పుడే సందేహం కలిగింది సామెత తికమక పడుతున్నానేమో అని. అలాగే జరిగిందన్నమాట. సవరణకి ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s