శర్మ కాలక్షేపంకబుర్లు-ఏడుస్తూ వ్యవసాయం చేస్తే….

ఏడుస్తూ వ్యవసాయం చేస్తే….

“ఏడుస్తూ వ్యవసాయం చేస్తే కాడీ-మోకూ (కాడీ మేడీ అని కూడా అంటారు) దొంగలెత్తుకెళ్ళేరని” నానుడి.మనది ప్రాధమికంగా వ్యవసాయక దేశం, అందుకే సామెతలు, నానుడులు అన్నీ వ్యవసాయంతో సంబధం ఉన్నవి ఎక్కువగా ఉంటాయి.

వ్యవసాయానికి ముఖ్యంగా కావలసిన పనిముట్టు నాగలి. దీనినే ఆరక అని కూడా అంటాం. దీనికి ఎన్నో భాగాలూ ఉన్నాయి.ఎడ్లమెడ మీద ఉన్నదానిని కాడి అంటాం. కాడికి రెండు పక్కలా చివరినుంచి కొద్ది దూరంలో చిల్లులుంటాయి, కొద్ది ఎడంగా. వాటిలో ఒక సీల వేస్తారు. దాని పేరు ‘చిలక,లేదా చిడత’. ఎద్దు మెడలో కట్టే తాడు పేరు ‘పలుపు’. కాడి కింద ఎద్దును చేర్చినపుడు ముందుగా ఈ పలుపును కాడిలో దూర్చి ఎద్దు మెడ కిందనుంచి చిలకలో తగిలిస్తారు. కాడిని నాగలి ‘పోలుకఱ్ఱ’కి సంధించే తాడు పేరు ‘మోకు’. పొడుగ్గా ఉండే కఱ్ఱ పేరే పోలుకఱ్ఱ. పోలు కఱ్ఱ ఒక చివర కాడిని కడతారు,మరో చివర ‘నాగలి దుంప’ని తగిలిస్తారు. ఈ దుంపకి చివర ఇనుప ముక్క నాటబడి ఉంటుంది, దీనినే నాగలి ‘కఱ్ఱు అనిగాని కఱుకోలు’ అనిగాని అంటారు. ఈ నాగలి దుంపకి ‘మేడి’ అనుసంధానం చేయబడి ఉంటుంది. నాగలి దుంపని మేడిని, కాడిని కలిపి కట్టేదే మోకు.ఇది కొబ్బరినారతో తయారు చేసుకుంటాడు రైతు.  నాగలిని ఇలా తయారు చేసుకోడాన్నే ‘నాగలి పూన్చడం కాని పూనడం’ కాని అంటారు. నాగలిలో ఎన్ని భాగాలున్నాయి, వాటికి పేర్లు కూడా ఉన్నాయి కదా. కాడి పారెయ్యడమంటే ఎద్దుల్ని వదిలెయ్యడం, మేడి పారెయ్యడమంటే దున్నే బాగాన్ని వదిలేయడం. ఈ రెంటిలో ఏది చేసినా నాగలి నిరుపయోగం. ఇదంతా సరే కాడీ మోకూ దొంగలెత్తుకెళ్ళడమేంటని అనుమానం కదా. ఏ పనైనా శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధ అనేది లక్ష్మీ దేవి పేరు. శ్రద్ధగా చేయని పని ఏదీ బాగోదు, మంచి ఫలితాన్నీ ఇవ్వదు. వ్యవసాయము అంటే ప్రయత్నము అని కూడా అర్థం.  ఎందుకొచ్చిందని ఏడుస్తూ చెయ్యకూడదు, అలా చేస్తే ఫలితమూ ఉండదు. ఏ పని కైనా ఉత్సాహం ముందుగా కావలసింది, మానవ ప్రయత్నం, ఆ తరవాతదే దైవ నిర్ణయం. ఎద్దులని వదిలేసి అరకని అలావదిలేసి రైతు చేలోంచి వెళిపోయి తిరిగిరాకపోతే ఏం జరుగుతుంది, ముందుగా ఎడ్లు పక్క చేలో పడతాయి, ఆ రైతు వెళ్ళగొడతాడోసారి, మళ్ళీ మళ్ళీ ఆ చేలో పడితుంటే బందెల దొడ్డిలో పెడ్తాడా ఎడ్లని. అరక అలా వదిలెస్తే ఏవడో ఒక దొంగ జాగ్రత్తగా కాడిని, మోకును విప్పుకుపట్టుకుపోతాడు. వ్యవసాయానికి కావలసిన మొదటి పని ముట్టు పోయింది, ఇక వ్యవసాయమేం సాగుతుంది. అందుకు ఏ పనికైనా ముందు కావాల్సినది శ్రద్ధ, ఉత్సాహం. ఉత్సాహం ఉంటే సావకాశాలెలా వస్తాయో చూద్దాం ఎలకసెట్టి కథలో, మీకందరికి తెలిసినదే….

ఒక ఊళ్ళో ఒక పెద్దసెట్టిగారు, మంచి వ్యాపారస్థుడు, కొట్లో కూచుని ఉండగా ఒక ఐదేళ్ళ కుర్రాడొచ్చి తాను అనాథనని ఏదైనా పని చెబితే చేస్తానని అంటాడు. దానికి పెద్దసెట్టి ‘అబ్బాయి కోమటింట పుట్టి నౌకరీ చేయడం బాగోలేదురా. వ్యాపారం చేసుకో’ అని సలహా ఇచ్చాడు. దానికి కుర్రాడు ‘వ్యాపారం చెయ్యాలనే కోరిక ఉందిగానండి పెట్టుబడి అదే సంచి మొదలు నిండుకుంద’న్నాడు. ఇది విన్న పెద్దసెట్టిగారు నవ్వి, ‘సంచి మొదలు నేనిస్తా వ్యాపారం చేసుకో’ అని అక్కడే చచ్చి పడి ఉన్న ఎలకని చూపి ‘ఇది నా సంచి మొదలు’ అని ఊరుకున్నాడు. కుర్రవాడు పెద్దసెట్టి మాట మీద గురిఉంచి చచ్చిన ఎలకని పట్టుకుని బజారుకొచ్చాడు. ఒకడు ఒక డేగను పెంచుతున్నాడు, దానికి ఆహారం కోసం తిరుగుతుంటే చచ్చిన ఎలకని పట్టుకున్న కుర్రాడు కనపడ్డాడు. ఎలకని వాడు కొనుక్కుపోయాడు. ఆ డబ్బులతో ఈ కుర్రాడు ధాన్యం కొన్నాడు. ధాన్యాన్ని పేలాలుగా మార్చి కోత కూలీలకి అమ్మి ధాన్యం సంపాదించి, వాటిని మళ్ళీ పేలాలుగా మార్చి, కొంతకాలం గడిపాడు. ఇలా కాదని పేలాలకి బెల్లం చేర్చి పేలాపుండలు అమ్మేడు. కోతలైపోయాయి. సముద్రపు ఒడ్డుకుపోయి ఉప్పు కొన్నాడు. అడవి దగ్గరకిపోయి ఉసిరికాయ కొన్నాడు. రెండిటిని తెచ్చి ఊళ్ళో ఊరగాయ పెట్టి అమ్మేడు. అప్పటికి ఉప్పమ్మేవాళ్ళున్నారక్కడ, ఉసిరికాయి అమ్మేవాళ్ళూ ఉన్నారు, కాని ఊరగాయ అమ్మేవాడు లేకపోయాడు. ఆ తరవాత మరో వ్యాపారం చేశాడు. ఉత్సాహంగా చేసిన వ్యాపారం ప్రతీది కలిసొచ్చింది. వయసు ఇరవైకీ వచ్చింది, పేరు ఎలకసెట్టిగా మార్చుకున్నాడు. ఒక రోజు పెద్దసెట్టి దగ్గరకిపోయి నమస్కారం చేసి, ‘తమరు నా వ్యాపార భాగస్వామి,వ్యాపారంలో నేటికి మీ కాతాని ఉన్న సంచి మొదలు, లాభం అన్నీ కలిపి తమకు దఖలు పరచుకుంటు’న్నానని ఒక బంగారు ఎలుకను పెద్దసెట్టి చేతులలో పెట్టేడు. ఇది చూసిన పెద్దసెట్టికి నోట మాట రాలేదు, వివరమూ తెలియలేదు.పెద్దసెట్టి నోరు తెరిచి వివరమడిగితే పదిహేనేళ్ళ కితం జరిగిన సంగతి చెప్పి పెద్దసెట్టిని ఆశ్చర్యం లో ముంచాడు. పెద్ద సెట్టి కుర్రవాడిని ఆదరించి తన ఏకైక కుమార్తెనిచ్చి పెళ్ళి చేశాడు. ఇప్పుడు ఎలుకసెట్టి ఏనుగుసెట్టి అయ్యాడు. ఎందుకయ్యాడు?

విధా కర్మమా అని ఏడుస్తూ, నిరాశతోనూ,నిరుత్సాహంగా పనిచేయద్దు.ఇష్టపడి పని చెయ్యాలి కష్టపడి కాదు, . కష్టానికి ఎదురొడ్డాలి.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏడుస్తూ వ్యవసాయం చేస్తే….

 1. ఇలాంటి విషయాలు మీరు తప్ప ఎవరు వ్రాయగలరు … మాస్టారూ ! కొంచెం దిగులుగా ఉంది. అయినా కొత్త బ్లాగ్ ఉంటుందిగా అనే ధీమా కూడా ఉంది. ధన్యవాదాలు .

 2. కష్టే ఫలే వారు,

  సెహ భేషైన టపా !

  ఆ కంటెంట్ తో బాటు సరిజోదు ఒక ఫోటో కూడా పెట్టండి !

  ఈ కాలానికి ఈ పదాలు అర్థమవడానికి ఆ ఫోటో ఒక రిఫరెన్స్ గా ఉంటుంది (సూచికలు పెట్టి వాటి పేరులు చూపించ గలిగితే ఇంకా బాగుంటుంది ఎట్లా జేస్తారో తెలీదు -> ఏరో మార్క్ పెట్టి ఒక వివరణ లాంటిది ఫోటోలో )

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s