శర్మ కాలక్షేపంకబుర్లు-మొక్కు…..

మొక్కు…..

మొక్కు అంటే నమస్కారమని అర్ధం.

అక్కఱకురాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ.

అవసరానికి ఆదుకోని చుట్టాన్నీ,నమస్కారం పెట్టినా వరం ఇవ్వని దేవుణ్ణీ,యుద్ధంలో తను ఎక్కినప్పుడు పరుగు తీయని గుఱ్ఱాన్నీ వెంటనే వదిలేయాలి అన్నారు .

అక్కఱకురాని చుట్టము, అయ్యో! తాతగారూ!! చుట్టమే కదండి అక్కఱలో వెన్నుపోటుపొడిచేదీ! రేపు మనకి సొమ్మవసరమవుతుందని ఈవేళే, ”బావా! నీదగ్గరఏమైనా సొమ్ము సద్దుబాటవుతుందా” అని ముందర కాళ్ళకి బంధం వేసేయడూ 🙂 చుట్టమే అక్కఱకురానిది, ‘చెడి చెల్లెలింటికెళ్ళే కంటే స్నేహితుడింటి కెళ్ళమ’న్నారందుకే, ఇదో నానుడి.

మొక్కిన వరమీని వేల్పు వివరంగా చూద్దామూ. ఇప్పుడు గుఱ్ఱాల యుద్ధలు లెవు, మనుషుల్ని, నిరాయుధుల్ని, పౌరులు,స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ కూడా లేకుండా, చివరికి హాస్పిటళ్ళ మీద కూడా బాంబులేసి జనాన్ని చంపేస్తున్నవారంతా అధునికులే బాబూ! అభివృద్ది,అభివృద్ధి, అంతా మేథావులు, అమ్మో! భయమేస్తోంది. గుఱ్ఱాల యుద్ధాలేమో అనాగరికం, ఇలా చంపెయ్యడమే నాగరికం బాబూ! అణుబాంబులేసి, తరతరాలవాళ్ళని చంపడమే అభివృద్ధి, గుఱ్ఱాల యుద్ధం లో ఒకడే చస్తాడు, మరి ఈ కాలపుయుద్ధం లో తరతరాలవాళ్ళు చావాలి.

తాతగారు నమస్కారం పెడితే వరమివ్వని దేవుణ్ణి వదిలెయ్యమన్నాడు కదా! ఇది మరీ దారుణం, మనం చేయవలసినపని చేసిన తరవాత కదా ఫలితం ఇవ్వడం, నమస్కారం పెట్టేస్తే ఫలితమిచ్చెయ్యాలా! నచ్చలేదు. వేంకన్నబాబుకి మొక్కు కట్టేను, తల నీలాలిస్తానన్నాను పరీక్ష ఫెయిలయ్యాను, అని ఏడిచేవారికి, తాము చేయవలసిన పనిని చేయలేదన్న జ్ఞానం నశిస్తోంది.

‘ఆపద మొక్కులు సంపద మరుపులు’ అని నానుడి. నిజమే. ఆపద కలిగిన వెంటనే తలనీలాలిచ్చేస్తాను స్వామీ అని మొక్కేస్తారు. బాగా తేలిక, 🙂 తలనీలాలివ్వడం అంటే ఏంటో తెలుసా? నా అహాన్ని నీకు సమర్పిస్తున్నాను, నిన్ను మరచిపోను, ఇకనుంచైనా అని అర్ధం. పరీక్షలు పాసయితే, నీ కొండకి వచ్చేస్తాం స్వామీ సకుటుంబంగా, ఇదీ మొక్కు. అసలు మొక్కెందుకు మొక్కాలి ఇలా? షరతులతోమొక్కా? ఇది దేనికి సంకేతం? బలహీనతకి సంకేతం కదూ? దేవునికి ఇచ్చే లంచమా? దేవుడు లంచం అడుగుతాడా? దేవునికి కూడా లంచం పెట్టేస్తారా? లంచం పెట్టేస్తే దేవుడు మనం అడిగినది చేసేస్తాడా? అంటే దేవుడితో వ్యాపారమా? మరి మొక్కు కోవడం తప్పంటారా?  అని అడగచ్చు. మొక్కుకోవచ్చు, మొక్కు అంటే అహాన్ని వదిలిపెడతానని దేవుని వద్ద ప్రమాణం చేయడం కాని, ఇలా పరిక్ష పాస్ చేస్తేనూ, పెళ్ళి కుదిరితేనూ, రోగం నయమైతేనూ తలనీలాలివ్వడం లేదంటే హుండీలో డబ్బులెయ్యడం కాదు. పరీక్ష పాసైతే, పెళ్ళి కుదిరితే, పెళ్ళయితే ఇలా షరతులతో కూడిన మొక్కులుంటాయా? నిజానికి ఇప్పుడు మొక్కులు అలాగే ఉన్నాయి, దొంగతనానికి వెళుతున్నాను, కన్నం బాగా పారితే నీకు కిరీటం చేయిస్తాను, ఇది మొక్కా? లంచమా? వ్యాపారమా? మనమంతా దీనినుంచి బయట పడాలి. ఏమని మొక్కాలి, స్వామీ పరీక్ష రాస్తున్నాను, నాకు తగిన తోడ్పాటు చేసి, నా బుద్ధిని అక్కడ నిలిపి ప్రశ్నలకి సరైన జవాబులు ఇచ్చేలా తోపించు అని మొక్కుకోడం తప్పుకాదు. పరిక్ష తప్పని సరిగా పాస్ అవుతాం, ఆ తరవాత దేవుణ్ణి దర్శించు, నీకు కలిగినది సమర్పించు, తప్పుకాదు, తప్పూలేదు. ఇదెలా ఉంటుందంటే చిన్నపిల్లవాడు తండ్రి తెచ్చిన స్వీట్ ని మరలా తండ్రినోటిలో పెడితే తండ్రి సంతసించినంత ఆనందమే కలుగుతుంది.

పాత రోజుల్లో మొక్కు అంటే ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని మడిగా ఉండి, ఒక రాగికానీ తీసుకుని పసుపు కుంకుమబొట్టు దానిపైపెట్టి, కొద్ది అక్షింతలతో కలిపి దానిని ఒక పసుపుగుడ్డలో మన మనసులోని కోరికను చెబుతూ కట్టి భద్రపరచి ఉంచడమే ముడుపు కట్టడం. దీనిని సాధారణంగా బట్టల బీరువాలోనో, పూజామందిరంలోనో ఉంచేవారు. ఎందుకూ? రోజూ కనపడుతూ కొండకి వెళ్ళాలనే హెచ్చరిక చేస్తూ ఉండేది. ముడుపు కట్టిన రోజునుంచి ఆ పని ప్రయత్నంలో ఉండేవారు, నిత్య హెచ్చరికకోసమే ముడుపు కట్టేవారు. భగవంతుని మీద నమ్మకముంచి మానవ ప్రయత్నం చేసేవారు, ఫలితమూ ఉండేది, లేకున్నా మనకు ప్రాప్తి లేదని సరి పెట్టుకునేవారు, దేవుని దగ్గరకు వెళ్ళడం మానేవారూ కాదు.

నాటిరోజుల్లో ఇది ఒక సంకల్పం, ప్రయాణాలు కష్టం గా ఉండేవి,ప్రయాణ సాధనాలూ లేవు. రెండెడ్లబళ్ళు కట్టుకుని బయలుదేరేవారు. ఒకరూ వెళ్ళడానికీ భయమే, మధ్యలో దొంగలభయం. సాధారణం గా వ్యవసాయపనులైన తరవాత శీతకాలం యాత్ర మొదలు పెట్టేవారు. ఒక ఊరునుంచి పది బళ్ళు అయినా ఒక గుంపుగా బయలుదేరిపోయేవారు. మజిలీలు చేసుకుంటూ మధ్యలో వంటలు చేసుకుని భోజనాలు చేస్తూ, రోజుల తరబడి చేయాల్సి వచ్చేది,ప్రయాణం. వెళ్ళడం మరుస్తామేమోనని గుర్తుకోసం ఈ ముడుపు కట్టేవారు.

మొక్కుల్లోనూ చాలా రకాలు. తలనీలాలిస్తాను, నిలువుదోపిడీ ఇస్తాను, నడచి కొండ ఎక్కుతాను, మోకాళ్ళ మీద కొండ ఎక్కుతాను, పొర్లు దండాలు పెడతాను, ఎవరిష్టం వారిదే కాదనను, ఇదంతా మిమ్ములను మీరు సంతృప్తి పరచుకోడానికి చేసుకునేదేనని మరచిపోకండి. దేవుడు మీ మనసే అడుగుతాడు, మరేం కోరడు. ఏమయింది మీకివేళా? మీరు మీరేనా? అని కదా అనుమానం. నేను నేనే అనుమానం లేదు, నేను పూర్తిగా  ఆస్తికవాదిని ,సనాతన ధర్మ అవలంబకుడిని, అనుమానం లేదు, కాని ఇటువంటి షరతులతో కూడిన నమస్కారాలు మాత్రం చేయలేను. నిత్యం దేవునికి నమస్కారం పెడతా! అసలు మరచిన దెపుడూ…ఇదీ కావలసినది… మనసు దేవునిపైనుంచి మీపని చేసుకోండి, ప్రహ్లాదుడు ఏం చేసేడు? పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్,భాషించుచున్, హాస నిద్రాదులు……నీళ్ళు తాగుతూ, భోజనం చేస్తూ,మాటాడుతూ, నవ్వుతూ, నిద్రిస్తూ ఇలా సర్వకాల సర్వావస్థలో శ్రీ హరిని మరువలేదు, అదీ కావాలని కోరుదాం. మూఢనమ్మకాలకి దూరంగా ఉందాం.

DSCN0083

ఈ ఫోటో లో రాళ్ళగుట్ట చూశారా? ఇదేంటో తెలుసా? శూర్పనఖ గుట్టట, పెళ్ళయినవాళ్ళు మూడు రాళ్ళు విసరాలట,భార్యాభర్తా ఇద్దరూ కలసి. ఇదెక్కడో కాదు, మన భద్రాచలం దగ్గర పర్ణశాలలో జరుగుతున్నది, మూఢనమ్మకాలెలా ప్రారంభమవుతాయో చూడండి, ఏభయి ఏళ్ళకితం నేను చూసినపుడు పర్ణశాలలో ఈ గుట్టలేదు, ఈ ఆచారమూ లేదు…..

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మొక్కు…..

 1. (1). “వేమన” కాదు గదా శర్మ గారూ …… బద్దెన భూపాలుడు.
  (2). “శూర్పణఖ గుట్ట”. హా హా మళ్ళీ శూర్పణఖ. The Revival of Surpanakha 🙂

  • విన్నకోట నరసింహారావుగారు,
   ఈ మధ్య వేమనతాత పూనేడు నా మీద 🙂 అందుకలా పొరబడ్డా!. ఇది సంవత్సరం కితం రాసిన టపా, 2015 సంవత్సరం చివరికొచ్చేస్తున్నాంకదా అందుకు సంచి దులిపేస్తుంటే దొరికిందో టపా, ఇంకా ఉన్నాయి 🙂 వరసగా వేసేస్తున్నా, మరో మార్పు చేసేద్దామని, చెబుతా!

   ధన్యవాదాలు.

 2. … ఏభయి ఏళ్ళకితం నేను చూసినపుడు పర్ణశాలలో ఈ గుట్టా లేదు, ఈ ఆచారమూ లేదు…..

  అదేమండీ కష్టే ఫలే వారు !

  ఏభై ఏళ్ల లో ఎంత అభివృద్ధి సాధించాం 🙂

  ఇట్లా మీరు తీసి పారేస్తే ఎట్లా ?

  ‘వాత్సాపు’ దేవుళ్ళ కి మొక్కులు చెల్లించి గాని మేము ఇంటి నించి బయట కాలు బెట్టం !

  షరతు తో మొక్కా ? ‘షర్ట్’ తో( అహం) తో మొక్కా 🙂

  చీర్స్
  జిలేబి

  • జిలేబి గారు,
   నిజమేనండి. మనుషుల్లో చాలా మార్పులొచ్చేసి అభివృద్ధి జరిగిపోతోంది, నమ్మలేనంత.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s