శర్మ కాలక్షేపంకబుర్లు-ముష్టి

ముష్టి

ముష్టి అంటే పిడికిలి అని అర్ధం. పిడికెడు బియ్యాన్ని స్వీకరించడమే ముష్టి. రోజూ పిడికెడు బియ్యం మనం వండుకునేవాటినుంచి తీసి వేరుగా ఉంచి దానం చెయ్యడాన్ని అలవాటు చేసుకుంటే, లేనివారికి పెట్టచ్చు. ముష్టిలో ముష్టి వీర ముష్టి అని నానుడి.దీన్నే మరీ ముతగ్గా ఆకులునాకేవాడింటికి మూతులునాకేవాడొచ్చాడంటారు. వీర ముష్టికి తోడు మరోమాట గోరు ముష్టి. అసలే ముష్టి అంటే పిడికెడు గింజలు, దానిలో కొంతభాగమంటే తక్కువ, మరల అందులోభాగం గోరు ముష్టి. భారతంలో పాండవులు ముష్టి ఎత్తలేదు , యాచన చేశారు. యాచనకి ముష్టికి తేడా ఉంది, యాచన అంటే ఇచ్చినది పుచ్చుకోవడం.. జీవితం అనుభవాల పుట్ట, దానినుంచి తవ్వుకుంటే ఎన్నో ఎన్నెన్నో అనుభవాలూ జ్ఞాపకాలూ. ఇటువంటిదే ఒక అనుభవం.

అరవైఏళ్ళకితం మాట, అప్పటికి ఎనభై సంవత్సరాల వయసున్న ఒక వృద్ధురాలు, కర్ర సాయంతో, నడవలేక నడుస్తూ, వారానికి ఒక రోజు సాధారణం గా ఆదివారం ముష్టికొచ్చేవారు, ఉదయమే. అమ్మ మడికట్టుకుని ఉండేది కనక నన్ను ముష్టి వేయమనేది, వచ్చినామెతో మాట కలిపి కూచోమని. ఈ వచ్చిన వృద్ధురాలు లోపలికి వచ్చి కింద కూచునేది,కుర్చీ మీదకూచోమన్నా వినేది కాదు.  ఆమె రావడం నాకెంతో ఆనందంగా ఉండేది. ఆమె మొదటి సారి వచ్చినపుడు, అంటే నేనెరిగి, అమ్మ ఆమెను గౌరవించి కూర్చున్న తరవాత నన్ను ముష్టి వేయమని చెప్పి లోపలికి వెళ్ళింది. నాకు కొత్త కనక తెలియక దోసిలి నిండా బియ్యం తీసుకుని వచ్చాను, వారి దగ్గరున్న చెంబులో పోయబోయాను. ఆమె చెయ్యి అడ్డం పెట్టేరు. నేను చిన్నబోయాను, చేసిన తప్పేమో అర్ధం కాలేదు. తెచ్చినవి తక్కువనుకుని చెయ్యి కాని అడ్డం పెట్టేరేమోనని అనుకున్నా. అప్పుడామె ముష్టి అంటే తెలుసా అన్నారు. మిడిమిడి జ్ఞానంతో పిడికిలి అని చెప్పేను. పిడికిలిలో పట్టినన్ని మాత్రమే స్వీకరించడాన్ని ముష్టి అంటారు. నీవు తెచ్చినవి ముష్టికాదు, అందుకు స్వీకరించను అని చెప్పేరు. నిజంగానే ఆశ్చరం కలిగింది. లోపలికిపోయి కుడిచేతి పిడికిలిలో పట్టినన్ని బియ్యం తెచ్చి దానికి మరొక చేయి జోడించి చాలా భక్తిగా ఆమెచెంబులోపోశాను, గింజ కింద పడకుండా. అప్పుడావిడ వృద్ధిలోకొస్తావు, బుద్ధిమంతుడివే అని దీర్ఘాయుష్మాన్భవ, వంశాభివృద్ధిరస్తు, అని ఆశీర్వదించారు. అప్పటికి అమ్మ లోపలినుంచి వస్తే జరిగినది చెప్పేరు. మీ ఆశీర్వచనం పొల్లుపోదని, ఫలితమిస్తుందని నా విశ్వాసం, అయాచితంగా మీరిచ్చిన ఆశీర్వచనం వేలకోట్ల ఫలితమిస్తుందని అమ్మ వారిని మాటలతోనే సన్మానించారు.

నేనామెదగ్గర చేరి మరో ఇల్లు తిరిగే అవసరం ఉండదు కదా, నేను దోసిలితో తెచ్చినవన్నీ స్వీకరిస్తే అని నా అనుమానం వెలిబుచ్చా, ఆమెదగ్గర కింద కూచుని. దానికి ఆమె ఇది నియమం, పిడికెడు మాత్రమే స్వీకరించాలి, ఇస్తున్నారు కదా అని ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ లేవలేకపోతే, మరో ఇంటికి వెళితే పెట్టకపోతే, ఇలా చాలా ప్రశ్నలేశాను. అన్నిటికి ఆమె ఒక్కటే సమాధానం చెప్పేరు. రేపటి గురించిన నీభయమే అలా మాటాడిస్తోంది, భయమే ఒక పెద్ద భూతం, రేపటి గురించిన ఆలోచన నేడెందుకు? భగవంతుడు ఆ సమయానికి జరగవలసినది నిర్దేశిస్తాడు, నీపని నువ్వు చెయ్యడమే అని గీతా సారం ఒక మాటలో, జీవిత సారం లాగా ఆ చిన్న వయసులో చెవినేశారు. అది ఒంటపట్టేసింది.

అడుక్కోడం అంటున్నాం గాని దీన్ని చాలా గౌరవంగా చూసేవారు, ఇందులోనూ తేడాలున్నాయి.

ముష్టి: గుప్పెటిలో పట్టినన్ని బియ్యపు గింజల్ని ఒకసారి స్వీకరించడం.
యాచన: కావలసినది అడగడం, ఇచ్చినది పుచ్చుకోవడం.
ఉంఛ వృత్తి:
౧. పరిగి ఏరుకోవడం, అనగా రైతు పంట తీసుకున్న తరవాత చేలో రాలిన ధాన్యం కంకుల్ని ఏరుకోవడం.
౨. ధాన్యం దంచిన రోటి దగ్గర కిందపడిన బియ్యపు గింజల్ని ఏరుకోవడం
౩. నామ స్మరణ కీర్తనగా పాడుకుంటూ వీధివెంట జోలెతో వెళ్ళడం. ఎవరిని అడగకపోవడం. తోచినవారు తోచినది జోలెలో వేయడం.
౪. మాధవ కబళం: దీనిని రాత్రి పూట మాత్రమే ఆచరించడం. గృహస్తు భోజనాల తరవాత మిగిలిన ఆహారాన్ని వచ్చిన వారి జోలెలో వేయడం.

 

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ముష్టి

 1. 5. ఈనాటి online దోపిడీ కూడా ఓ రకంగా ముష్టి అడుక్కోవడమే. “ఘరానా ముష్టి” అందామా!

 2. కష్టే ఫలే వారు,

  ముష్టి టపా బాగుందండ-> కాలక్షేపం కబుర్ల ముష్టి 🙂

  ముష్టి గోరు వారి ముఖముగను నగవు
  మరియు వారి నెమ్మ మనము గాన
  మనకు నిచ్చు వాడు మరియును దైవము
  నారు పోసి నీరు నప్పు వాడె

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s