శర్మ కాలక్షేపంకబుర్లు-తలో మొలో…

తలో మొలో……

చాలా కాలం తరవాత ఉదయపు నడక మొదలెట్టేం, నేనూ మా సత్తిబాబూ. మా ముందో ఇద్దరు నడుస్తున్నారు, అందులో ఒకతను మరొకనితో ఇలా అన్నాడు ” తలో,మొలో తాకట్టు పెట్టయినా నీ బాకీ తీరుస్తాను, ఎగెయ్యను, నన్ను హామీ అడిగితే ఇవ్వడానికేం లేదు. నువ్వు సొమ్ము సద్దుబాటు చెయ్యక తప్పదు” అని బతిమాలుతున్నాడు. విన్నాను, నడకయిపోయి అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కూచుంటూ మా సత్తిబాబుతో ”తలో మొలో తాకట్టు పెట్టయినా బాకీ తీరుస్తా”నంటున్నాడు అదేంటీ అన్నా. ”తెలిసి అడుగుతున్నారా? తెలియక అడుగుతున్నారా” అని టొకాయించాడు. ”తెలియకేనయ్యాబాబూ” అని నవ్వేశాను. ఐతే వినండి అని ఇలా చెప్పేడు.

”అప్పిచ్చేవాడు పట్టుకెళ్ళేవాడిని అప్పుకు హామీ అడుగుతాడు, ఇది సహజమే. అప్పు తీర్చడానికి తాహతులేనివానికి అప్పు పుట్టదు. అప్పు తీర్చడానికి హామీ ఏంటయ్యా అంటే ”తల తాకట్టు పెట్టి ఐనా” లేదా ”తలో మొలో తాకట్టు పెట్టయినా నీ అప్పు తీరుస్తా”నంటుంటారు, హామీ ఇవ్వలేనివారు. నిజంగా ఈ మాట చాలా దారుణమైనదే…

తల తాకట్టు పెట్టడం అంటే స్వాతంత్ర్యాన్ని తాకట్టు పెడతాను అనే అర్థం. అంటే ఎవరికైనా బానిసగా ఉండి అయినా నీ అప్పు తీరుస్తాను అని హామీ ఇవ్వడం. ఇదే కాక మీసం హామీ ఇవ్వడం ఉందంటారు, అంటే పొరుషమే హామీ అనమాట. ఇక ”మొల్లో చెయ్యేసి బాకీ వసూలు చెయ్యడం” అంటారు, పాతరోజుల్లో రూపాయ కాసుల్ని మొలలో పంచెలో మడతబెట్టి పెట్టుకునేవారు, వాటినుంచి బలవంతంగా తీసుకోడమని, లేదా పంచ ఊడతీసి పరువుతీస్తానని బెదిరింపుగాని కావచ్చు.

ఇక మొలతాకట్టు అన్నది మాత్రం చాలా అన్యాయమైన మాటే. మగవాడు బానిసతనానికి పోయినా అప్పుతీరకపోతే, భార్యను తాకట్టు పెడతానన్నమాట. స్త్రీ మొల మీద చెయ్యి వేసే అధికారం, అర్హత, హక్కు భర్తకే ఉంటాయి, మరెవరికి ఇది సాధ్యం కాదు. మొల హామీ ఇవ్వడమంటే…. చెప్పడానికే నాకు బాగోలేదు. స్త్రీని తార్చడమే, అలా తార్చి అయినా అప్పు తీర్చుకుంటానూ అని చెప్పడమనమాట.

ఎట్టి పరిస్థితులలోనూ ఈ మాట మాత్రం వాడకూడదు.దీని అర్ధం తెలియకే ఇలా వాడేస్తున్నారు” అని ముగించి లేచాడు మా సత్తి బాబు.

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తలో మొలో…

  • Zilebi గారు,

   చలి పెరగడం మూలంగా గత పదిరోజులుగా జలుబు,వదలని దగ్గు, చిరుజ్వరం వదలక సతాయిస్తున్నాయి, రాసి ఉంచిన పాత టపాలు దుళ్ళగొట్టేస్తున్నా 🙂 చూదాం వీలుబట్టి 🙂
   ధన్యవాదాలు.

 1. బాబు గారి ఇంటర్ ప్రిటీషన్ మరీ ఘోరంగా ఉంది . తలో మొలో తాకట్టు పెట్టడం బ్రతికుండంగా సాధ్యమయ్యేది కాదు . దీనర్థం , బాకీ తీర్చకుండా చావనులే అని . ఇక, తలకు మొల ఊత పదం . తలా , మొలా రెండున్నూ అప్పు చేసిన వాడివే కావడం న్యాయం . పెళ్ళాన్ని పంపించి తీరుస్తాను అన్నట్లు భావించడం సరికాదు . ఇలాంటి అర్థం చెప్పడం జుగుప్సా కరంగా ఉంది .

  • వెంకట రాజారావు . లక్కాకుల గారు,
   అర్ధంతో వాడినా ఊతపదంగా వాడినా ఈ మాట ఎందుకో వాడటం నాకు నచ్చలేదండి 🙂
   ధన్యవాదాలు

 2. జిలేబీ గారి వ్యాఖ్య తరుణిని తాకట్టు పెట్టడానికి త్వరపడండని instigate చేస్తున్నట్లుంది కదా?
  అన్నట్లు జిలేబీ గారు తన వ్యాఖ్యలు గూడా ఇకనుంచీ పద్యరూపంలోనే వ్రాయాలని నిశ్చయించుకున్నారా – కొత్తగా నేర్చుకున్న విద్య మీద ఉత్సాహంతో, ఏదో సామెత లాగా :). పాఠకుల మీద కాస్త దయ చూపించండి madam 🙂

  • విన్నకోట నరసింహారావుగారు,
   అమ్మవారి వచనమే అర్ధంకాదు, ఇప్పుడు పద్యం పట్టుకున్నారేమో 🙂 ఇంక చెప్పేదా? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు పద్యాలు కట్టే కొత్తలో తమ అనుభవాలు రాశారు, అనుభవాలూ-జ్ఞాపకాలూను లో, బలే ఉంటుంది.
   ధన్యవాదాలు

   • కష్టే ఫలే వారు 🙂

    అంతే అంతే ! శ్రీ పాద వారు మా పూర్వ జన్మ గురువులుం గారు ! వారి ని కాపీ కొట్టక ఉంటామా ! ఎంతైనా గోదావరి వారాయేను మరీను !

    జేకే!

    చీర్స్
    జిలేబి

   • Zilebiగారు,
    శ్రీపాదవారు చెప్పిన మాట టూకీగా చెబుతాను. ఈ పద్యాల పిచ్చి ఎంతగా ముదిరిందిటంటే, వారికా రోజుల్లో, తల్లి దగ్గరకిపోయి, ”అమ్మా! అన్నము పెట్టుము” అని రాగవరసలో పద్యం చెప్పేవారట. ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటివి, ఓపిక లేక, మంచి టపా అవుతుంది అనుభవాలు-జ్ఞాపకాలూ నుంచి ఈ విషయం కనక ఎత్తి రాస్తే!
    ధన్యవాదాలు

 3. ఓ తెలుగు సినిమాలో సీను – తల తాకట్టు పెట్టుకుని అప్పివ్వవయ్యా అని చెప్పి అప్పు తెచ్చుకున్న వ్యక్తి చనిపోతాడు. తండ్రిచేసిన అప్పు తీర్చలేమని, తాకట్టు పెట్టుకున్న వస్తువు అమ్ముకోండి అని ఆయన కొడుకులు అంటారు; అప్పిచ్చినతను “అయితే తాకట్టు పెట్టిన మీ నాన్న తల తీసుకొచ్చి నాచేతిలో పెట్టండి” అంటాడు (అఫ్ కోర్స్, ఈ సంభాషణ అంతరార్ధం వేరే ఉందిలెండి, సినిమా కాబట్టి) 🙂

  మీ టపా తాకట్టు గురించి మాత్రమే. అయినా ముళ్ళపూడి వెంకటరమణ గారి ఓ జోక్ (“నవ్వితే నవ్వండి”) గుర్తొచ్చింది, ఆప్పుల ప్రస్తావన కాబట్టి ముళ్ళపూడి వారి గౌరవార్ధం చెప్పక తప్పదు. “ఊరెళ్ళాలి, ఓ వంద అప్పివ్వగలరా, ఊరెళ్ళి రాగానే తీర్చేస్తాను” అని చెప్పి “అప్పారావు” అప్పు తీసుకొంటాడు. ఎంతకాలమయినా డబ్బు తిరిగివ్వకపోతుంటే అప్పిచ్చిన ఆసామీ నిలదీస్తాడు. అప్పుడు “నేనేం చెప్పాను? ఊరెళ్ళి రాగానే తీర్చేస్తానన్నాను గదా. ఇంకా ఊరెళ్ళడం పడలేదు” అంటాడు “అప్పారావు” 🙂

  • విన్నకోట నరసింహారావు గారు,
   ముళ్ళపూడివారి మీద ప్రేమతో ఇంతవరకు ఒక్క ’అప్పు’ మీద మాత్రమే టపా రాయలేదండి. 🙂 అమ్మో అప్పు ఇదో పెద్ద చిక్కు
   ధన్యవాదాలు

 4. ఆ తలో మొలో తాకట్టు పెట్టి బాకీ తీరుస్తాననేవాడు ముందే ఆపనిచేసి డబ్బు తెచ్చుకోవచ్చు కదా.ఇంకొక మాటవుంది. నీ డబ్బు పువ్వుల్లో పెట్టి తిరిగి ఇస్తాననడం.అంటే ఎప్పటికీ ఇవ్వడన్నమాట.శర్మ గారూ,మీరిలాంటివాళ్ళకి అప్పులిచ్చిగాని మోసపోలేదు కదా?

  • M.V.Ramanarao గారు,
   ఇవన్నీ ఇచ్చకపు మాటలే! పువ్వుల్లో పెట్టిస్తానన్నవాడు అసలు తిరిగే ఇవ్వడు. జీవితంలో అన్ని అనుభవాలూ అయ్యాయండి. పదేళ్ళుగా వీటి జోలికే పోటం లేదు
   ధన్యవాదాలు

 5. మొల తాకట్టు అంటే మొలత్రాడు కట్టుకునే పురుషుడు అని అర్ధం వస్తుంది అనుకుంటా !

 6. తరుణము నిదియే నయ్యరొ
  తరుణిని తరముగ వలముగ తాకటు పెట్టన్
  సరళమని తెలియ వచ్చెన్
  సరిసరి తాకట్టుకి నేడె సమయము తెలిసెన్ 🙂

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s