శర్మ కాలక్షేపంకబుర్లు- కరతల భిక్షా……..

కరతల భిక్షా……..

”సెట్టిగారు కనపడ్డాడండోయ్” అన్నాడు మా సత్తి బాబు.
”నిజమా! ఎక్కడ కనపడ్డాడు,ఎలా వున్నాడు? ఎందుకెళిపోయాట్ట?” అని ప్రశ్నించా ఆతృతగా.
ఇక్కడ మా సెట్టిగారి గురించి చెప్పాలి. మా వూరివాడే ఒక చోట ఉద్యోగం చేశాడు, పెళ్ళాం పిల్లలు, ఇల్లు వాకిలి అంతా బాగుండేది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. కోపమనేదెలా వుంటుందో ఎప్పుడూ చూడలేదతని దగ్గర. ఒక కొడుకు కూతురు, ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేశాడు, వారికి పిల్లలు కలిగేరు. ఏమైందోగాని అతని భార్య కాలం చేసింది. ఆ తరవాత కొద్దికాలం కొడుకుతో ఉన్నాడు. హటాత్తుగా ఒక రోజు ఎవరికి చెప్పాపెట్టకుండా మాయమైపోయాడు, తనకోసం వెతకద్దని పోలీస్ కంప్లయిట్ వగైరాలసలివ్వద్దని రాసిపెట్టిపోయాడు. కొడుకు, కూతురు వెతికారు, దొరకలేదు.ఉద్యోగం చేసిన చోట యజమాని వెతికించాడు, దొరకలేదు. యజమానికి ఇతనంటే ప్రాణం, నమ్మకం, అందుకు అతనూ వెతికించాడు కాని దొరకలేదు. చివరికి నిరాశ చేసుకుని వదిలేశారు, ఏదో ఒక రోజుకి రాకపోతాడా అనే ఆశతో. ఇప్పటికి ఐదేళ్ళయింది అతను ఇల్లొదిలేసి. నేను పరధ్యానంగా ఉన్నాననుకుని మా సత్తిబాబు ’వింటున్నారా’ అంటూ ఇలా చెప్పేడు.

పదిరోజుల కితం నేను తిరపతి వెళ్ళేను. దర్శనం అయిపోయింది, సాయంత్రం వేళ ఖాళీగా తిరుగుతుండగా సెట్టిగారు కనపడ్డాడు, గుర్తు పట్టేలాలేడు. నన్ను చూసినట్టున్నాడు తప్పించుకుపోతున్నాడు. నాలుగడుగులు తొందరగా వేసి చెయ్యి పట్టుకుని ఆపేను, ఆగేడు, నిర్వికారంగా చూసేడు నాకేసి. ఎలా వున్నావు? ఏం చేస్తున్నావు? ఎందుకొచ్చేసేవు? ఇలా ప్రశ్నల వర్షం కురిపించా చెయ్యి వదలక, పారిపోతాడేమో ననిపించి. నేను చెయ్యి పట్టుకుని ఉండగా నాలుగడుగులేసి ఒక పక్కగా ఉన్న చెట్టు కింద కూలబడి ఇలా చెప్పడం మొదలెట్టేడు.

ఐదేళ్ళ కితం కట్టుబట్టలతో రావడం రావడం ఇక్కడికే వచ్చేసేను. జేబులో డబ్బులున్నాయి. వేంకన్నబాబుకి తలనీలాలిచ్చేసి తేలికపడ్డాను. దర్శనం చేసుకున్నాను, ఏం చెయ్యాలని ఆలోచించా! మరి తిరిగి ఇంటికి పోకూడదని నిర్ణయించుకున్నా! బయటకొచ్చేను, ఒక తువ్వాలు లుంగీ చొక్కా కొనుక్కున్నా. ఉదయమే స్నానం చేసి ఒకటి కట్టుకుంటే మరొకటి సబ్బు రుద్ది ఆరేసుకుంటా. అది ఆరిన తరవాత అక్కడనుంచి వెళిపోతాను. ఏక భుక్తం, మధ్యాహ్నం కి సత్రవులో భోజనం చేస్తాను. అ తరవాత కొండమీద కాళ్ళెటు లాక్కుపోతే అటుపోతాను, ఇలాగే తిరుగుతాను. రాత్రికి ఎక్కడో ఒక పంచన పడుకుంటాను. చెట్టుపుల్ల విరిచి దంతధావనం చేస్తాను, స్నానం చేసి, దర్శనానికి నిలబడతాను. మళ్ళీ మామూలే. రెండు రోజుల తరవాత అర్ధమయింది. ఒక రగ్గు, దుప్పటి కొనుక్కున్నా. ఒక సంచి ఇచ్చాడు కొట్టువాడు. అందులో పెట్టుకున్నా. ఇదిగో అదే ఇదని సంచి చూపించాడు. ఇలా ఉండటం ఇబ్బందనిపించలేదా అన్నా. మొదట ఇబ్బందిగా ఉన్నట్టుండేది, ఇంటికిపోదామనిపించేది. నిగ్రహించుకున్నా. ఇక్కడికొచ్చిన మనవాళ్ళు కనపడుతుంటారు, తప్పించుకుపోతాను, ఈ రోజు నీకు దొరికిపోయాను, నన్నెవరూ గుర్తు పట్టలేదు. ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉందనిపిస్తే నడిచి కిందకెళిపోతా, మళ్ళీ నడిచి వచ్చేస్తా. మరీ చికాకేస్తే పూరీ పాసెంజరు ఎక్కేస్తా, టిక్కట్టుకొనుక్కుని, కొద్దిగా డబ్బులున్నాయి కనక, నాకు ఖర్చులేదు, సంపాదనా లేదు, అవసరమూ లేదు. పూరీ వెళ్ళేప్పుడు మనవూరు తగులుతుంది, అప్పుడు బాధగా వుంటుంది అయినా నిగ్రహించుకుని ముందుకే వెళతా. పూరిలో రెండు మూడు నెలలుంటా. మళ్ళీ తిరిగొచ్చేస్తా, ఇంతే అన్నాడు. డెభైఐదేళ్ళ వయసులో ఎందుకీ బాధ? నిన్ను కొడుకు కోడలు ఇబ్బంది పెట్టేరా? కన్నూ కాలూ నొచ్చితే ఎవరు చూస్తారు? నేను సరి చేస్తా రమ్మన్నాను. కొడుకు కోడలు బాగానే చూసుకున్నారు, వాళ్ళ తప్పులేదు, నేనే ఇక వుండలేకపోయా, కట్టుకున్నావిడ వెళిపోయింది, పిల్లలు ప్రయోజకులయ్యారు, నాకెందుకో ఇక ఈ జీవితం అలా గడపాలనిపించలేదు. కన్నూ కాలూ నొచ్చితే పరమాత్మే ఉన్నాడు, తీసుకెళిపోతే బాధే లేదు, నా తరవాత ఈ శరీరం ఏమైపోయినా బాధలేదు. అంతకుమించి ఏమీ లేదన్నాడు. వచ్చెయ్యమని బలవంతం చేసాను. రానుగాక రానన్నాడు. ఐదొందలు సొమ్ము తీసి జేబులో పెట్టాను, అవసరపడతాయి, ఉంచుకోమని. వద్దుగాక వద్దన్నాడు. తీసుకోలేదు. నాదగ్గర వచ్చినపుడు తెచ్చుకున్న డబ్బు ఉంది, దానికే ఖర్చులేదు. ఇదేం చేసుకోనని రెండు వేల రూపాయలు తీసి చూపించాడు. నాకు కళ్ళ నీళ్ళు తిరిగాయి. నిస్సహాయం గా చూస్తూ అతన్ని వదిలేసి వచ్చా. ఇదేంటంటారు? ప్రశ్నించాడు”

నాకో క్షణం నోటమాట రాలేదు. సంబాళించుకుని సత్తిబాబూ! పూర్వకాలంలో వానప్రస్థం అని చేసేవారు . నేటి రోజులలో ఇదీ అరుదే! దీనినే కరతల భిక్షా, తరుమూల శయనం అంటే చేతికి దొరికినది తినడం చేత్తోనే వేరే పాత్ర వగైరా లేకుండా అలాగే తలకింద చెయ్యిపెట్టుకుని ఏ చెట్టుకిందో నిద్రించడం. ఇలా చేయడానికి కూడా ధైర్యం కావాలి .

భారతంలో వానప్రస్థ ప్రస్తావన ఉంది, ఆశ్రమవాస పర్వమని ఒక పర్వమే ఉంది. టూకీగా చెబుతా, యుద్ధం తరవాత ధర్మరాజు పట్టాభిషేకం చేసుకుంటాడు, పినతండ్రి, పినతల్లిని జాగ్రత్తగానే చూస్తున్నాడు. భీముడు మాత్రం అప్పుడప్పుడు ఉల్లికుట్టు మాటలు అంటూనే ఉన్నాడు. ఇలా ఏభై సంవత్సరాల కాలం గడచిపోయింది. ధృతరాష్రుని జీవితం మీద విసుగొచ్చి ఒకరోజు ఆశ్రమవాసం చెయ్యాలని ఉందని ధర్మరాజుకి చెబుతాడు, ధర్మరాజు వద్దంటాడు. వ్యాసులు వచ్చి అడ్డుచెప్పద్దంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు పౌర,జానపదుల అనుమతి వేడితే వారు అనుజ్ఞ ఇస్తారు. వీరితో పాటుగా సంజయుడు, విదిరుడు బయలుదేరుతారు. కుంతి తానూ వారితో వెళతానంటే అందరూ వద్దంటారు, కుంతి వినదు. ధృతరాష్ట్రుడు సంజయ,విదురల ద్వారా ఆశ్రమవాసానికి రావద్దు,బిడ్డలదగ్గర ఉండిపొమ్మని చెప్పిస్తాడు, ఐనా కుంతి వినక ఆశ్రమవాసానికే వెళుతుంది, ఆ తరవాత కొన్నాళ్ళకి వీరిని చూడడానికి ధర్మరాజు,తమ్ములు భార్యలతో కలసివస్తారు. ఆ సందర్భంగా విదురుడు ప్రాణత్యాగంచేసి ధర్మరాజులో కలుస్తాడు. ధృతరాష్ట్రుడు,గాంధారి, కుంతి ఉపవాసాలు చేస్తారు. ఒకరోజు స్నానానికి వెళ్ళివస్తుండగా దావాగ్నిలో చిక్కుకుంటారు, కూడా ఉన్న సంజయుని తప్పించుకోమంటారు, సంజయుడు తప్పించుకుని హిమాలయాలకు సాగుతారు. ధృతరాష్ట్రుడు,గాంధారి, కుంతి దావాగ్నిలో మరణిస్తారు.

నిత్యమూ ఈ గానుగెద్దు జీవితం గురించి తిట్టుకుంటూనే ఉండటం తప్పించి, రెండు రోజులు ఎక్కడికీ వెళ్ళి ఉండలేం. ఎక్కడికేనా వెళ్ళినా, వెళ్ళేదాకానే ఉబలాటం, మళ్ళీ తిరిగొచ్చి గూట్లో పడేదాకా ఆరాటం, ఇక్కడేమైపోతోందోనని ఆవేదన. ఉన్నచోట చుట్టూ ఉన్నవారితో సఖ్యంగా సుఖంగా బతకలేం, కొత్తచోటికీ పోలేం, లేనిదేదో కావాలి, ఉన్నది పనికిరాదు, ఇదే మానవ మనస్సు….

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- కరతల భిక్షా……..

  • ఫణీన్ద్ర పురాణపణ్డ గారు.
   ఉల్లికుట్టు అంటే ఎత్తిపొడుపు అని అర్ధమండి.
   ఈ మాట వాడకం బాగా తగ్గిపోయిందేమో! అసలు లేదో కూడా!!
   ధన్యవాదాలు.

 1. శర్మగారూ,అంతవైరాగ్యం కలగటానికి కారణం వారి భార్య మరణమా?లేకా ఇహపరములపై విరక్తని అంటారా?.అంతలా వుండటానికికూడా గుండె ఎంత గట్టిదైవుండాలి.నిత్యం ఆ పరమాత్మ సన్నిధిలో…ఇక లోటేమీలేదు కాబోలు.నిజంగా కళ్ళల్లో నీరూరుందంటే నమ్మండి.ధన్యవాదాలు.అడగటం మీ ఆరోగ్యం ఎలావుంది?.కొంచెం కుదురుకున్నారా?.అస్ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.

  • Mallampalli swarajya lakshmiగారు.
   ఒక్క సారిగా అతనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో చెప్పలేకపోయాను. కనీసం ఊహించలేను ఇప్పటికి.
   నా ఆరోగ్యం…బండి నడుస్తోందండి. అస్థానవిద్వామ్సులు తప్పరుకదా! వారికీ మధ్య తోడు వదలని రొంప,దగ్గు, తలనొప్పి, చిరుజ్వరం గత పదిరోజులు పైగా నిలయ విద్వాంసులైపోయాయి.
   ధన్యవాదాలు.

 2. టపా బాగుందండీ కష్టే ఫలే వారు !

  అది వారి కర తల భిక్ష ! ఇది మా కర, తల , பிச்சை (:)

  వెరసి శరణు శరణు ఈశ !

  కరతల భిక్షా, శయనము
  తరు మూలముగా, మనమున తపమును జేయన్
  తరుణమిది జిలేబి గనుము
  శరణాగతి మార్గము యది శరణు శరణనన్ !

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s