శర్మ కాలక్షేపంకబుర్లు-మౌనంగానే ఎదగమని

మౌనంగానే ఎదగమని

యధా కన్దుకపాతే నో త్పత త్యార్యః పతన్నపి
తధా త్వనార్యః పతతి మృత్పిణ్డపతనం యధా….భర్తృహరి

కందుకమువోలె సుజనుడు
గ్రిందంబడి మగుడ మీదికి న్నెగయుజుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందం బడి యడగి యుండు గృపణత్వమునన్…లక్ష్మణకవి

కింద పడిపోయినా మంచివాడు బంతిలా పైకి లేస్తాడు, అదే విధంగా మందుడు కిందబడితే మట్టిముద్దలా నేలకి కరుచుకుపోతాడు.

జీవితం ఒక పరుగు, పడిపోవడం సహజం, సహజమని తెలిసినవాడు లేవగలుగుతాడు, లేస్తాడు, లేచి కాలూ,చెయ్యీ సరిచేసుకుని, దెబ్బలు ఊదుకుని మళ్ళీ పరుగు మొదలెడతాడు, పడిపోయినందుకు సిగ్గు పడడు. పడిపోవడం ఎప్పుడు జరుగుతుంది,తడబడితే, ఎప్పుడు తడబడతాం, తప్పు జరిగినపుడు, అందుచేత తప్పు జరగకుండానే చూసుకోవాలి. తప్పు జరగదా? నేనెప్పుడు తప్పు చెయ్యలేదు అన్నవాళ్ళని నమ్మకండి. తప్పు జరగడం సహజం, దాన్ని దిద్దుకోవడమే దైవత్వం. తెలిసిచేసిన తప్పుకి నిష్కృతి ఉండదు, తెలియకచేసిన తప్పుకి పశ్చాత్తాపం సరి.

పడిపోయిన ప్రతిసారి లేవాలి నేలకి కొట్టిన బంతిలా, పడిలేచే కెరటంలా, దెబ్బలు తగిలేయని పరుగు మానుతామా? మళ్ళీ పరుగు పెట్టడమే తెలివైనవాని, కార్యసాధకుని లక్షణం, తెలివి తక్కువ వాడు పడిపోతే లేవలేడు, అధవా లేచినా మళ్ళీ పరుగుపెట్టలేడు, మట్టి ముద్దని నేలకేసి కొడితే పైకి లేవదు, నేలని బలంగా కరుచుకుపోతుంది. మట్టి, ముద్దెప్పుడవుతుంది? నీరు చేరినపుడే! జీవితంలో అరిషడ్వర్గాలనే నీరు మనసనే మట్టిని తడిపితే, కిందపడితే, నేలకే అంటుకుపోతాం, పైకి లేవలేం. లేవలేకపోతే సిగ్గుపడాలి, పడిపోయినందుకు కాదు. జీవితంలో ఒక ఉదాహరణ…

ఏభై ఏళ్ళ కితం మాట, చిన్న చదువుతో చిన్న ఉద్యోగం, చేతిలో డబ్బు స్వార్జితం. ఒంటిమీద వయసు,స్వతంత్రం, అదేమని అడిగేవారు లేరు, వ్యసనాలూ చేరాయి. కాలంగడిచింది, ఎంత? దశాబ్దం. సంసారం పెరిగింది, నిర్లక్ష్యమూ పెరిగింది. ఒక విషయంలో పడిపోయా, దెబ్బ తగిలింది, మనసుకి, ఉపకారానికి పోతే అపకారం ఎదురొచ్చి. మెరుపుకొట్టినట్టే అయింది, ఆలోచన చేశా, లేచి నిలబడ్డా, పరుగు ప్రారంభించా, పుస్తకాలు పట్టేను,ఒక స్నేహితుడినీ వెంట బెట్టుకున్నా, మొదటి ప్రయత్నంలోనే ఒక ప్రమోషన్ కొట్టేసేం. పరుగు లక్ష్యం తెలిసింది, కొనసాగించా. మూడు సంవత్సరాలు మూడు ప్రయత్నాలు మిగిలాయి, అన్నీపోగా. ఇది పోటీ పరిక్ష, నిజానికి జీవితం లో పరుగు పోటీ. మొదటి ప్రమోషన్తో కొద్దిగా నిర్లక్ష్యం,ఫలితం చేజారిపోయింది. రెండో ప్రయత్నం, ప్రయత్నలోపంలేదు సావాకాశాలే తక్కువ. అదృష్టం ఒక్క మార్క్ అనగా నాలుగు పేపర్లమీద పావు మార్క్ చొప్పున తగ్గి చేజారిపోయింది. చివరి ప్రయత్నం. పట్టు పట్టేశా, ఎలా? పానీయంబులు ద్రావుచున్, కుడుచుచున్,భాషించుచున్, హాస నిద్రాదులు…..ఇలా. మిత్రుడూ నాతో ఉన్నాడు కాని ”మనవల్ల కాదేమో” అనే మాట మొదలెట్టేడు, పిరికిమందు తాగించేలా అనిపించాడు, విన్నాను, భయం వేసింది, ఇందులో, నిరాశలో కూరుకుపోతామా అనిపించింది. కాదు ఈమాటలు వినకూడదనుకున్నా, మిత్రుడిని వదిలేయలేదుగాని ఈ సంభాషణ పై ఆసక్తి చూపేవాడిని కాదు. చదువు పిచ్చిగా మారిపోయిందేమో!

పరిక్షరోజొచ్చింది, మొదటి రోజు రెండు పేపర్లూ ఆడుతూ పాడుతూ రాసేశాను. రెండవరోజు పరిక్షహాల్ కెళ్ళేను, పేపరిచ్చారు, చూశాను, పేలపిండి అంత తేలికనిపించింది. మొదలెట్టా ఐదు నిమిషాల్లో చేసే లెక్క ముప్పావుగంటయింది, తేలలేదు, మెరుపుకొట్టింది, తప్పుచేస్తున్నావూ అని. ఆగా! అప్పటివరకు చేసినది అడ్డంగా కొట్టేశా, పెన్నూ పేపరూ పక్కన బెట్టేశా!, ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుకూచున్నా. చూస్తున్న వాచర్, మా డి.యి గారికి ఏం అర్ధంకాలా, ఒక సారి దగ్గరకొచ్చి చూసి వెన్నుతట్టి వెళ్ళేరు, నా గురించి బాగా తెలిసినవాడు. ఆ తరవాత పెన్ను పేపర్ తీసుకున్నా, ముప్పావుగంట కుస్తీ పట్టిన లెక్క ఐదు నిమిషాలలో పూర్తయ్యింది. డి.యి గారు అడిషనల్ షీట్లు ఇవ్వడానికి కష్టపడేటంత వేగంగా మిగిలిన సమయంలో పేపర్ పూర్తి చేసేశా. నాలుగో పేపరూ రాసేశా. అనుమానం, ఇబ్బంది పెట్టింది, ఇబ్బంది పడిన పేపర్ లో ఎన్ని మార్కులొస్తాయి? లెక్కేసుకున్నా తొంభైఐదు రావచ్చు అనిపించింది, మన పేరు లిస్ట్ లో ఉంటుందా? గుంజాటన పడ్డా నాలుగురోజులు, ఆ తరవాత ఆలోచించా! జీవితం నడిచిపోతోంది, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసాం, వస్తే పుష్పం కళ్ళకద్దుకుంటాం రాలేదూ… గాలికొవదిలేశా, మన ప్రయత్నం మనం చేశామనే సంతృప్తి కదా!. ఫలితమొచ్చింది, పేరు లేక ఎక్కడికిపోతుంది? మిత్రుడు ఆగిపోయాడు, తన అనుమానంతో..అంతే మరి లేవలేదు….

మొదటి ప్రయత్నం నిర్లక్ష్యం, పడిపోయా లేచా, రెండవసారి ప్రయత్నలోపంలేదు అదృష్టం వెక్కిరించింది, పడిపోయా మళ్ళీ లేచా మూడో సారి ఆత్మవిశ్వాసం, పరుగులో అతివిశ్వాసం, పడ్డా, లేచా అదృష్టం వెన్నుతట్టింది, రెండు గంటలలో రాసేపేపరు ఒక గంటలో రాశా, ఫలితం…..పడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేవడమే….పడిపోయినందుకు సిగ్గుపడకూడదు. పడిపోతే నవ్వుతారు, కొంతకాలం బాధ తప్పదు,దెబ్బా తప్పదు, ఆ తరవాత పరుగు మానకు…నవ్వినవాళ్ళ పళ్ళే బయట పడతాయి, వారి బతుకే నవ్వులపాలవుతుంది…చేతనైతే వెన్నుతట్టి ప్రోత్సహిద్దాం! చేతకాదూ నోరు మూసుకుందాం!! పడిపోయామని సిగ్గుపడితే ప్రగతి లేదు…

బంతిలా బతుకుదాం, బంతిలా బతకమని ప్రోత్సహిద్దాం…

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మౌనంగానే ఎదగమని

 1. కష్టే ఫలే !

  పడి పోయానని సిగ్గున
  పడితే ప్రగతి యను నదియు ప్రవహిం చదురా
  పడి పోవడము సహజముర !
  పడి పోయానని భయపడ పని సాగదురా

  శుభోదయం
  జిలేబి

 2. రేంకులకోసం తల్లిదండ్రులారాటం,దానికోసం పిల్లలు పడే కష్టాలు,వారుఎదుర్కునే వత్తిడి, ఇవే రోజూ లేచినదగ్గరనుంచీ వినేవి,చూసేవి.అటువంటి విద్యార్ధులకు,తల్లిదండ్రులకు మీ పోస్టు మంచి మార్గదర్శకంగా ఉపయోగపడగలదని అనిపించింది.అవే కాలగతిలో జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోవటానికికావల్సిన ఆత్మస్తైర్యాన్ని పెంపొందించుకోవటానికి తోడ్పడగలవ్.మంచి విలువైన పోస్టు అందించారు.ధన్యవాదాలు శర్మగారు.టాబ్లో టైప్ చేయటంవల్ల కొన్ని అక్షరదోషాలు దొర్లాయి.క్షమించగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s