శర్మ కాలక్షేపంకబుర్లు-నిత్యం చచ్చేవాడి కోసం…..

నిత్యం చచ్చేవాడి కోసం…..

”నిత్యం చచ్చేవాడికోసం ఏడ్చేవాడెవడు” అని అంటారు. నిజమే, ”నాచేతి మాత్ర వైకుంఠ యాత్ర” అనేవారు అప్పటి వైద్యులని చూసి ఎగతాళిగా, ఇప్పుడు పేరు మోసిన డాక్టర్లు కూడా శవాలకి వైద్యం చేసేస్తున్నారనుకోండి, ఆ తరవాతెప్పుడో, అనగా ఆ శవం దగ్గర వసూలు చేసుకోవలసినంతా వసూలు చేసుకున్న తరవాత చచ్చేడని చెప్పక తప్పదు కదా! ఇలా నిత్యమూ ఎవరో ఒకరుపోతూనే ఉంటారు. కొన్ని హాస్పిటళ్ళలో, కొంతమంది డాక్టర్ల చెయ్యి పడితే ఇంతే సంగతులు. కొన్ని బెడ్ లకి కూడా ఈ పేరుంటుంది. ఆ బెడ్ మీదకొచ్చినవాడు తిరిగి ఇంటికిపోడు, మరలాగని ఆ బెడ్ మరెవరికి ఆ హాస్పిటల్ ఇవ్వకుండా ఉండదుకదా! నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు?

పల్లెలలో శ్మశానానికి ఊరికి కొంత దూరమూ ఉంటుంది, కాని పట్నవాసాలలో ఊరికి మధ్యలోనే శ్మశానమూ ఉంటుంది. పల్లెలలో శవం ఊళ్ళో ఉండగా ఎవరూ భోజనం చేయరు. నిత్యమూ శ్మశానం లో ఉండే కాటికాపరి, ఆలు బిడ్డలతో అక్కడే కాపరం ఉంటాడు. అదీగాక ఇలా చనిపోయినవారి కర్మ కాండ చేయించేవారికి ఈ ఇబ్బందులుంటాయి. నాకెప్పుడూ ఈ అనుభవం కాలేదు కాని మా తోడల్లుడు పోయినపుడో అనుభవం అయి ఈ మాట అర్ధమయింది.

తోడల్లుడు కేన్సర్ తో కాలం చేసినట్టు అబ్బాయి కబురు, ఫోన్ లో చెబితే వెంటనే బయలుదేరా ఇల్లాలితో కలిసి, ఇది ఐదేళ్ళ కితం మాట. కాకినాడ చేరేం, నాకంటే పెద్దవారెవరూ లేకపోయారు, నాకు అక్కడ కార్యక్రమం నడిపించవలసిన బాధ్యత తప్పలేదు. ఏర్పాట్లన్నీ కుర్రాళ్ళే చేస్తున్నారు, చేయవలసినదల్లా పైనుండి చూస్తూ వారికి కొద్దిగా మాట సాయం చెయ్యడమే. పన్నెండయిపోయింది, నేనక్కడికి చేరుకునే నాలుగు గంటలు సమయం నడచిపోయింది. శవాన్ని ఎత్తేందుకు ముందుగా కొంత కర్మకాండ చెయ్యాలి, అది జరగాలంటే చేయించేవారు రావాలి, ఆయన ఎక్కడా? అని వాకబు చేస్తే, ఆయనకి ఈ కార్యక్రమం క్యూలో ఉందనీ, ప్రస్థుతం మరొక చోట కార్యక్రమం నడిపిస్తున్నారనీ,  వస్తారనీ తేలింది. అలాగే ఆయన రావడం కార్యక్రమం చేయించడం, ఆ తరవాత ‘మీరు శ్మశానానికి నడవండి, నేను మరో కార్యక్రమం చూసుకు వస్తాన’ని ఆయన వెళ్ళేరు, మేము శవాన్ని ఎత్తి ఏడుపులయ్యకా బయలుదేరేం, శ్మశానానికి చేరుకునేటప్పటికి, అక్కడ ఒక శవం దహనమవుతూ కనపడింది, పక్క షెడ్లోకి ఈ శవాన్ని చేర్చమని కాపరి చెప్పేడు అక్కడకి చేర్చేము, ఈ లోగా కార్యక్రమం ఇక్కడా నడిపించడానికి వారు విచ్చేశారు, కార్యక్రమం నడిపించి చితికి నిప్పు పెట్టేటప్పటికి మూడు దాటింది.

అవతల చితి మీద కాలుతున్న శవం అంటుకున్నట్టులేదు, సరిగా, ఒకడు ‘ఒరే పంచదారట్రారా’ అని కేకేసేడు. ఇదేంటో అర్ధం కాక చూస్తూ ఉండిపోయా. ఓ కుర్రాడు పంచదార ఒక పొట్లంలో తెచ్చాడు, దానిని ఆ తెమ్మన్న వ్యక్తి నిప్పుల మీద జల్లేడు కొద్ది ఎక్కువగానే, దానితో పుల్ల బాగా అంటుకుని మంటలు బాగా వ్యాపించాయి. చూస్తూ నిలబడ్డా,పొగకి ఆవలివైపుగా. అంటుకున్న శవానికి కాళ్ళూ చేతులూ ఊడేయి మొదటగా, వాటిని చితిమీదనుంచి కింద పడకుండా పైకి తోశాడు, కర్రతో, మరికొద్ది సేపటికి శవం లేచి కూచోడం ప్రారంభించింది, ఒకతను కర్రతో దానిని అణిచిపెడుతున్నాడు. ఇవన్నీ చూస్తే ఒక్క సారిగా జీవితం అంటే అదో రకమైన బాధ, విరక్తి కలిగేయి, అదే శ్మశానవైరాగ్యం…..చితి దగ్గర శవంతో పోట్లాడుతున్న వ్యక్తికేసి సాలోచనగా చూస్తే, జీవితం ఇంతే, నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు అన్నట్టుగా నవ్వేడు……

అప్పుడు కాపరి ఒక పుస్తకం తెచ్చి వివరాలు నమోదు చేయమన్నాడు, ఒకరెవరో వివరాలు చెప్పేరు, అతను రాస్తున్నాడు, తప్పు రాస్తున్నాడని అనుమానం వచ్చి చూస్తే నిజమే ఇంటిపేరు తప్పుగా రాశాడు, అప్పుడు నేను అదికొట్టేసి వివరాలు సరిగా రాసి ఇచ్చాను, మరొకరెవరో ‘ఎందుకండీ అంత ఛాదస్తం’ అన్నారు. ‘పోయినాయన పేరు తప్పురాసినంతలో నష్టం ఏంటీ’ అన్నారు. ‘పోయినాయనకి బాధ కాదండి, ఇక్కడ పేరు ఎలా రాస్తే అలాగే డెత్ సర్టిఫికటిస్తారు, దాని అవసరం చాలా చోట్ల కావాలి, బతికున్నావిడ చస్తుంది, పేరు సరిచేయించుకోలేక’.

నిత్యమూ ఎవరో ఒకరుపోతూనే ఉంటారు కనక అతనికి అంత బాధ ఉండదు, మనమే ‘జన్మకోశివరాత్రి’ అని ఇక్కడికి వస్తాం కదా! అందుకు మనకి బాధగా ఉంటుందంటే కాపరి నవ్వేడు. భోజనం చేసివస్తానన్నాడు. అప్పుడు పరిశీలించి చూస్తే అక్కడక్కడ కొన్ని మూటలు కనపడ్డాయి, అవేంటని అతనని అడిగితే రెండు మూడు రోజులకితం దహనమైనవారి అస్థికలని చెప్పేడు, ఒక్కసారిగా జీవితం మీద విరక్తి పుట్టింది. ఈలోగా మరొక శవం తీసుకురాబడింది, కార్యక్రమం చేయించేవారు ఆ శవం దగ్గర కార్యక్రమం చేయించి వస్తే ఆయనతో మాట కలిపితే , ఇలా ఒక్కొక్క రోజు మూడు నాలుగు శవాలు తగులుతాయని వృత్తి మొదలుపెట్టిన కొత్తలో భయమూ, బాధా ఉండేవనీ ఇప్పుడన్నీ పోయాయనీ అంటూ నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవారెవరండీ అన్నారు, నిజమేకదా!

ఇటువంటివి నిత్యం చూసేది పోలీస్ స్టేషన్లో, దొంగతనం జరిగింది మొర్రో అంటే, చూస్తాం అంటారు, వాళ్ళకి రోజూ ఇటువంటివి వినపడుతూనే ఉంటాయి మరి. మనవారెవరో తప్పిపోయారు హడావుడిగా పరిగెట్టి చెబుతాం పోలీస్ స్టేషన్ లో ఎప్పటిముంచి కనుపించటం లేదు? వెతికారా? ఇంకా నలభై ఎనిమిదిగంటలు కాలేదు, ఇలా చెప్పుకొస్తారు, నిజమే వారికిది నిత్య కృత్యం కనక. ఇది వరలో రైల్వేవారు బండెప్పుడొస్తుందని ఫోన్ చేస్తే మెయిల్ అనగానే గంటలేటు అని ఫోన్ బద్దలయ్యేలా ఫోన్ పెట్టేసేవారు, అసలంటూ ఆన్సర్ చేస్తే సుమా. ఇంక టెలిఫోన్ వాళ్ళం చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేవాళ్ళం, ఎందుకనీ, ఆ ట్రంకాల్ ఎప్పుడొస్తుందో మాకూ తెలీదు కనక :)ఆర్.టి.సి వారిని బస్సెప్పుడొస్తుందని అడిగితే ఆర్.టి.సి అనే చెబుతారు ఎందుకనీ? వారికీ బస్సు ఎప్పుడొస్తుందో తెలియక. ఇంతకి ఆర్.టి.సి అంటే ఏంటో తెలుసా? ఆర్ అంటే రాదు,టి అంటే తెలియదు, సి అంటే చెప్పలేం. నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు? 🙂

ఇలా నిత్యం అదే ఉద్యోగం చేసేవారి దగ్గర మానవ స్పందనలు తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తాయి, నేటి టి.వి వారిలా 🙂 రోడ్ ప్రమాదం లో చచ్చిపోతున్నవాడి మొహం మీద లైట్ ఫోకస్ చేసి మైక్ నోటి దగ్గరపెట్టి ”చచ్చిపోతుంటే మీ అనుభం ఏంటీ చెప్పండి మా ప్రేక్షకులకి” అని అడిగినట్టు..

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నిత్యం చచ్చేవాడి కోసం…..

 1. చావు అనేది,నిత్యకృత్యమైనా,వేదాంతం అందరికి తెలిసినదైనా,మనవాళ్ళుnear and dear చనిపోయినప్పుడుమాత్రం చాలా బాధ కలుగుతుంది కదండీ.జీవితమంటే ఇంతేకదా!

  • జంతికగారు,
   ఏమనుకోకండి, మీ పేరు బాగుందండి.
   జీవితంలో అన్ని అనుభవాలూ అవుతాయి కదండి, మిమ్మల్ని బాధించిందా? మన్నించండి
   ధన్యవాదాలు.

 2. కష్టే ఫలే వారు !

  నిత్య సత్యాన్ని కూడా ఇంత చిలిపిగా హాస్యం గా చెప్పడం మీకే చెల్లు ! సెహ భేషైన టపా !

  చావుని కూడను చిలిపిగ
  మా, ఉనికి టపాన చెప్పె మాచన శర్మన్
  జీవుడ నిత్యము ! ఒజ్జవు !
  గావుము భాస్కర ! సజీవ కాయము గా నన్

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s