శర్మ కాలక్షేపంకబుర్లు-అమృతలత

అమృతలత

నామృతం న విషం కించి దేకాం ముక్త్వా నితంబినీమ్
నైవామృతలతా యుక్తా వియుక్తా విషవల్లరీ…….భర్తృహరి

పడతినొక్కదాని విడిచి యమృ
తంబు లేదు భువీ విషంబులేదు
అమృతలత లతాంగి యనురాగవతి యైన
గాక మెలగెనేని గరళవల్లి………..లక్ష్మణ కవి

అందమైన స్త్రీ ఒక్కరుతప్ప వేఱొక్క విషముగాని అమృతముగాని లేదు.ప్రేమగల స్త్రీయే అమృతలత. ప్తేమలేని కాంత విషపు తీగ. అనురాగముగల స్త్రీ అమృతలతలా ప్రాణాలిస్తుంది, అనురాగములేని స్త్రీ విషపు తీగలా ప్రాణం తీస్తుంది.

కవి శృంగార శతకంలో చెప్పినది, నేను దాని అర్ధం చెప్పడంలో కొద్దిగా పక్కకి జరిగినమాట వాస్తవం మన్నించండి.

ఒకో సంసారంలో, భార్యా భర్తలు ఉద్దాలకుడు, చండి లలా ఉంటారు. ఆయన అవునంటే ఆవిడ కాదంటుంది, ప్రతి చిన్న విషయానికీ. విషయానికొస్తే కవి ప్రేమగల స్త్రీ అమృతపు తీగ లేకపోతే విషపుతీగ అని రెండు ముక్కల్లో జీవిత సారం చెప్పేసేరు. ”పెనగ పెనగ సతికి ప్రేమబుట్టు” అన్నారు వేమనతాత,భార్యా భర్తలు శారీరకంగా పెనవేసుకుని, మానసికంగా దగ్గరైనప్పుడు, కాలంతో అంటే కష్ట సుఖాల్లో కలసి ఉంటే ఒకరిపై ఒకరికి ప్రేమ కలుగుతుందిట, అది చిక్కబడుతుంది, వయసుతో. జీవిత తొలి దశలో ఇద్దరి మధ్యా ఉండేది శరీరాకర్షణ, దీనినెవరు తప్పించుకోలేరు, తప్పూ కాదు భార్యా భర్తల మధ్య. వెలి చవులకు ఆకర్షింపబడితేనే తప్పు తప్పించి, అదెవరు చేసినా తప్పే. కాని నాడు అహల్యను గౌతముడు మాత్రం తప్పు చేసిందని పొరబడ్డా, వదిలేయలేదు, తప్పు దిద్దుకోడానికి సమయమిచ్చాడు, తపస్సు చేయమన్నాడు, ఆయనపై తన దృష్టి నిలచేదాకా విరాగిలా బతకమన్నాడు. మరల ఆమె తనయందనురక్త అయినపుడు స్వీకరించాడు. అగ్ని సాక్షిగా చేసుకున్న వివాహాన్ని కాదనలేదు, కాలదన్నా లేదు. మరి ఇలా వెలిచవులకు పడిన మగవారిని స్త్రీ కూడా అలాగే శపించచ్చా! తప్పని సరిగా,అహల్య కూడా శపించి ఉండచ్చు, కాని ఆ పని చేయలేదు, చేతకాక అనుకోడం పొరబాటు. కాని స్త్రీ ఆ పని చేయలేదు,చేయటం లేదు, ఆమె మనసు అందుకు అంగీకరించదు, అదండి….అందుచేత జాగ్రతలో ఉండవలసినదెవరూ……..మీరు స్త్రీ పక్షపాతి అంటారా? నిజం తో పాటుగా ఉండాలి కదండీ. ప్రతి విషయానికి కొన్ని కొన్ని సడలింపులుంటాయి కదా!.అందుచేత స్త్రీ పురుషులకు ఒకరిపై మరొకరికి ప్రేమ, అభిమానం ఉన్నపుడే ఆ సంసారం ఉత్తేజకరంగా ఉంటుంది, లేకపొతే నిస్సారం. అలా ఉన్నపుడే ఒకరికొకరు అమృతపు తీగలవుతారు, లేకపోతే……..ఆ సంసారం వీధిలోనే ఉంటుంది. ఒక్కో సంసారంలో భార్యా భర్తా, ఉత్తి పుణ్యానికినికి దెబ్బలాడుకుంటుంటారు. ప్రతి విషయమూ అనుమానమే, ఆమెపై ఆయనకు, ఆయనపై ఆమెకు. నేడు భార్య, భర్త ఒకరికొకరు ముల్లుగఱ్ఱలైపోతున్నారు.ఇది రోజురోజుకు పెరిగిపోయి ఆఖరికి ఇద్దరూ విడిపోతే మేలేమో అనే మానసిక స్థితికొచ్చేసారు. చివరికి మిగిలేది విడాకులు, పిల్లలు అనాథలు. తస్మాత్ జాగ్రత!

భార్యాభర్తలు ప్రతివారి జీవితమూ శరీరాకర్షణతో ప్రారంభమవుతుంది, వయసులో ఉంటారు కనక, అది తప్పుకాదు, కాదు తప్పదు. అప్పుడు ప్రారంభమయిన ఆకర్షణ కాలం గడిచే కొద్దీ తగ్గుతూ వస్తుంది, ఇద్దరి మధ్య ఒక లోటు ఏర్పడుతూ ఉంటుంది ఆకర్షణలో. అదిగో అప్పుడు మేల్కోవాలి, ఇద్దరూ. ఈ ఆకర్షణ కోల్పోయే ముందు మరొకటి ఆ లోటు భర్తీ చెయ్యాలి, అదే మానసిక బంధం, ఇది, ఆసరికి బిగవాలి. దీన్ని సాధించుకోవడం చెప్పినంత తేలిక కాదు. ఒక సారి ఈ ఆకర్షణ బిగియడం ప్రారంభిస్తే ఆ దంపతుల జీవితం నందనవనం లేకుంటే రోజు రోజుకు ఈ లోటు పెరుగుతూ పోతుంది. కొంత కాలానికి పూడ్చలేని అగాధమే ఏర్పడుతుంది. అందుకే శరీరాకర్షణ జారిపోకముందే మానసిక బంధం బిగియాలి.

భిన్న భాషా,సంస్కృతి,ఆచార వ్యవహారాలున్న వారి మధ్య వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, ఈ మధ్య. దీనిలో తప్పు పట్టేదేంలేదు. కాని ఈ వివాహాలు సాధారణంగా వయసు ఆకర్షణతోనే ఎక్కువ జరుగుతున్నాయి, ఇది పల్చబడితే లోటు పూడేందుకు దారి కనపడటం లేదు. ఒక వేళ అదికూడా దాటినా పిల్ల దగ్గరకొచ్చేటప్పటికి భిన్నమైన ఆలోచనలొస్తున్నాయి. సామాన్యంగా తల్లిని అనుసరించి పిల్లలు పెరుగుతారు, అప్పుడు తల్లిభాషా సంస్కృతి, ఆచార వ్యవహారాలు ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉండే సావకాశం ఉంది. అప్పుడు మగవాడు తన సంస్కృతి సంప్రదాయం తప్పుతోందని మథనపడే సావకాశం, మనస్పర్ధలకీ తావిస్తోంది. ఇది రెండో వైపునుంచీ ఉండే సావకాశమూ ఉంది. ఇదిగో ఇన్ని ఇబ్బందులు దాటితే …..

అందుకు ఇద్దరిలోనూ కావలసినది మానసిక,భౌతిక సద్దుబాటు, ఇది ఎంత చెప్పినా అర్ధం చేయలేనిదే, భార్యా భర్తలు ఈ సద్దుబాటు సాధించుకోవాలి. అప్పుడే మథురం మథురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం.

నువ్వెంత అంటే నువ్వెంత అనుకోడం కాదు కావలసింది. నువ్వు నా అంత నేను నీ అంత అనుకుంటే,ఒకరినొకరు అర్ధం చేసుకుని సద్దుకుని బతికితేనే సంసారం

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అమృతలత

 1. నేను రాజారావుగారితో ఏకీభవిస్తున్నాను.ఈ సూత్రం స్త్రీ,పురుషుల కిద్దరికీ సమానం గా వర్తించాలి.మీ వివరణ కూడా బాగుంది.శారీరక ఆకర్షణేగాక దానిని మించిన బంధం ఉంటే తప్ప దాంపత్యం స్థిరంగా నిలబడదు.

  • M.V.Ramanarao గారు,
   మీ మాటే నాదీను. మొదటే కవిగారు చెప్పినదానినుంచి పక్కకి జరిగిపోతున్నానని చెప్పుకున్నానండి 🙂
   ధన్యవాదాలు.

 2. రతియై మన్మథకేళికా సుగతియై రాత్రింబవల్ సేవలన్
  పతి సౌఖ్యమ్మును గోరు మానిని కిదా భాగ్యమ్ము ? , ‘ స్త్రీ’ జీవనా
  మృతమా లేక విషమ్మ యంచు గణణమ్మా ? దీనిలో న్యాయ స
  మ్మతమే లేదు , మగాడు లేడ విషమై మాంగల్య బంధమ్మునన్ ?

  • వెంకట రాజారావు . లక్కాకులగారు,
   భర్తృహరి స్త్రీ గురించే చెప్పేరు. అది రెండు పక్కలా ఉన్నపుడే బాగుంటుందన్నాను, నిజానికి స్త్రీ ఎక్కువ సహనమే వహిస్తోంది, ఎక్కువ చోట్ల, ప్రతి విషయానికి కొన్ని మినహాయింపులుంటాయ్ కదండి!

   ధన్యవాదాలు.

  • నమస్తే శర్మ గారు నేను మీ బ్లొగ్ రెగులర్ గ చదువుతాను,మా పాపకి జుత్తు పేచెస్ గ రాలుతుంది. మందులు వాడినగాని ఫలితం లేదు. మీరు ఏమయిన సలహా ఇవ్వగలరా ప్లీస్ మన్నించాలి నాకు తెలుగులొ టైప్ చెయడం రాదు.

   దివ్యగారు,
   వైద్యుణ్ణి కానుగాని, అనుభవం రాస్తాను, మెయిలిస్తా చూడండి.
   ధన్యవాదాలు.

 3. కష్టే ఫలే వారు !

  మీ అమృత లత మత్త మయూరము లా ఉంది !

  చాలా బాగా రాసారు !

  రావే నా వయ్యారనె రాజే చిన నాటన్
  నీవే నా వేణీయన నీకోసమె నాడెన్
  ఈ వేళేమో నాయెను నీవే మరిచేవూ ?
  పోవే పోవే నీవు సపోటా వలె లే వే 🙂

  కాలం మారి పోయింది ! ఎన్నాటి కి జిలేబి సపోటా లా ఉండా లంటే ఎట్లా 🙂

  చీర్స్
  జిలేబి

  • జిలేబిగారు,
   ఎన్నటికి జిలేబి సపోటాల ఉండిపోదు. కాలంలో మార్పొచ్చినా, మనసుబంధం మరింత అందంగా పట్టుకుంటుంది కదండీ, వయసు మళ్ళీ రూపు మారినా. మనసుబంధం పెనవేసుకుంటే వారు ఒకరినొకరు చూడక ఉండలేరు,మాటాడక ఉండలేరు, సన్నిహితంగానూ ఉండక ఉండలేరు, అదొక తన్మయావస్థ! నిజం చెప్పాలంటే ప్రేమకి నిర్వచనం…ఎంత చెప్పి ఉపయోగం లేదండి…అది అనుభవించాల్సిందే.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s