శర్మ కాలక్షేపంకబుర్లు-తలతిక్కపని?

తలతిక్కపని?

సాధారణంగా కోపం రాదు, కాని అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడు మాత్రం అది బక్కకోపమో, తిక్కకోపమో చెప్పలేను అలా ఉంటుంది. దాని మూలంగా జరిగే పనులూ అలాగే ఉంటాయి…. కాకినాడలో ఉండగా జరిగిన ఒక సంఘటన….నలభై ఏళ్ళకితం మాట…

పంటచేనుండటం మూలంగా ధాన్యం అత్తవారింట్లో నిలవ ఉంచుకుని, వాళ్ళు ధాన్యం మిల్లు పట్టించి ఉంచితే, శలవురోజునపోయి బియ్యం ఏభయి కీజీలకి ఒక మూట చొప్పున కట్టించుకుని, బస్సు మీద కాకినాడ తెచ్చుకోవడం అలవాటు. అలా ఒకసారి రెండు మూటల బియ్యం టాపు మీద ఉండగా బస్సు కాకినాడ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఆగింది. అక్కడనుంచి ఇల్లు దగ్గరే, రెండు మూటలూ రిక్షా మీద వేసుకునిపోవడానికి, నేను కూడా ఎక్కి వెళ్ళడానికి, ఐదురూపాయలు తీసుకునేవారు రిక్షావారు, బియ్యం బస్ మీదనుంచి కిందికి దింపడానికి మూటకి రూపాయి ఇవ్వడం అలవాటు,ఎటూకాని చోటు కావడం మూలంగా లైసెన్స్ కూలీలు ఉండరు. ఆ రోజుల్లో రూపాయంటే విలువెక్కువే.

ఓ కూలీ బస్ మీదకి ఎక్కేడు, ”రెండు బియ్యం మూటలున్నాయి దింపవయ్యా! ఏమివ్వమన్నావు” అడిగాను. అతను పైనుంచి తాపీగా ”పదిరూపాయలవుతుంది” అన్నాడు. ఒక్క నిమిషం నిర్ఘాంతపోయాను. ”అదేంటయ్యా! మూట దింపడానికి రూపాయి ఇస్తారు, రెండు మూటలకీ రెండు రూపాయలవుతాయి, లేదనుకుంటే నాలుగడిగినా అదో మాటనుకోవచ్చు, పది రూపాయలు ఎక్కడా లేని మాట” అన్నా. ”పది రూపాయలిస్తేనే దింపుతా, లేకపోతే లేదు” అని మొండి కేసేడు. ”నువ్వు దింపకపోతే దిగిపో, మరొకరు దింపుతారులే, ఇంతకి నువ్వు అక్కడ నుంచి దింపడం అంటే పైనుంచి కిందికి అందిస్తే, కింద రిక్షా అతను కాసుకుని దింపుకుంటాడు, నువ్వు పైనుంచి మూట తొయ్యడానికే అలా అడుగుతున్నా”వన్నా. ”ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదు” అన్నాడతను బస్ పైనుంచి. ఇది వింటున్న బస్ కండక్టర్ ”తొందరగా దింపుకోండి ఆలస్యమైపోతోందని” గొడవ చేస్తూ హడావిడి పెడుతున్నాడొకపక్క. అప్పుడు నాకు కోపమే వచ్చి ”నువ్వు కిందకి దిగు మరొకరు దింపుతా”రంటే, అలా ”మరొకరు దింపడానికి లేదనీ” వాదానికొచ్చాడు.

నేను అసహాయుడినయ్యా! కండక్టర్ డ్రైవర్ మాటాడరని తెలిసిపోయింది, నన్ను కంగారు పెట్టడం మూలంగా, పక్కనున్నవారు, మిగిలిన కూలీలూ, రిక్షావారూ,వారికి వారికి లావాదేవీలుంటాయి. నావైపు న్యాయం ఉన్నా ఎవరూ మాటాడరని తేలిపోయింది. ఇక మిగిలినవారు బస్ లో ఉన్న తోటి ప్రయాణీకులు, వారికివేం పట్టవు, ఆలస్యమైపోతోందని గొడవ చెయ్యనందుకు ఆనందించానంతే. ఏం చేయాలని ఆలోచిస్తే,

”నేనే దింపుకుంటాన”ని నేను బస్ పైకి ఎక్కేసేను. ”ఒరే రిక్షా నువ్వు మూట అందుకోడానికి లేద”న్నాడు, మూట కాయడానికి సిద్ధమవుతున్న రిక్షాఅబ్బాయితో, ఆ కూలీ.. రిక్షా అతనూ ఆగిపోయాడు. ఇప్పుడు నాదగ్గరున్న అవకాశాలన్నీ అతను లేకుండా చెయ్యాలనే ప్రయత్నం లో ఉన్నాడు. ఏమైనా సరే దింపుకోవాలనే ప్రయత్నం నాది. పంతం పెరిగిపోయింది రెండు పక్కలా. నేనేం చేస్తానో చూస్తున్నాడా కూలీ. మరోదారిలేక అతను చెప్పినంతా ఇచ్చి దింపించుకుంటాననుకున్నాడు. నేను చాలా తాపీగా బియ్యం మూట పట్టుకుని, కిందనున్నవారిని తప్పుకోమని చెబుతూ మూట కిందకి తోసేస్తోంటే, ”మూట చిరిగిపోయి బియ్యంపోతాయ”ని భయపెట్టేడు. ఒక మూట తోసేసేను, రెండవ మూటా తోసేసేను. మొదటి మూట మీద పడిన రెండవ మూట పిగిలి కొన్ని బియ్యం మట్టిలో పడ్డాయి. రిక్షా అతను గబుక్కున బియ్యం కారుతున్నవి ఆపి, మూటని పొదుపు చేసి రిక్షాలో పెట్టేడు, నేను కిందకి దిగివచ్చేటప్పటికి, రెండవ మూటా రిక్షాలో చేర్చేడు. నేను కిందకి దిగగానే బస్సు వెళిపోయింది.

కింద పడిన బియ్యం, రిక్షా అతను తువ్వాలు లోకి ఎత్తుతుంటే, వద్దన్నాను, వినకుండా ఎత్తేడు, ఒక కేజి ఉండచ్చు. మా హడావిడిలో కూలీని గమనించలేదు. ఇదంతా చూస్తున్న ఒక కూలీ నెమ్మదిగా నోరు విప్పాడు, ”అత్యాశకుపోతే, నోటి దగ్గర కూడుపోతుందని తెలుసుకోలేకపోయాడు” అని ముక్తాయించాడు, ఏడి మా హీరో అని పరిశీలిస్తేచూస్తే, బస్ మీద వెళిపోయాడన్నారు, బహుశః అందుకే ఈ కూలీ నోరు విప్పి ఉంటాడనుకున్నా.. .వీటిన్నిటిని పట్టుకుని ఇంటికి చేరిన తరవాత మూటలు ఇంటి లోపల చేర్చి, తువ్వాలులో బియ్యం కింద పోశాడు. మట్టితో కలిసి ఎర్రగా ఉన్నాయి బియ్యం. ఈ లోగా ఇల్లాలొచ్చి ఏమయిందని అడిగితే రిక్షా అతను జరిగినది చెప్పేడు. అతనికివ్వవలసిన డబ్బులిచ్చేసేను. వెళిపోతూ ”బాబయ్యా! బియ్యం కడుక్కుంటే పనికొస్తాయి” అన్నాడు సాలోచనగా చూస్తూ. నాకు అతని అభిప్రాయం అర్ధమయింది. ఆ ”మట్టితో కలిసిన బియ్యం ఇచ్చేస్తే పట్టుకుపోతానన్నది” అతని ఆలోచన. నాకెందుకో అతని మీద అభిమానం పుట్టింది, ”మట్టితో ఉన్న బియ్యం మేమే ఏదో ఒకటి చేస్తాం గాని, నీకు ఇవ్వను, ఇలారా” అని అతని తువ్వాలు పరిపించి నాలుగుదోసిళ్ళ బియ్యం అందులో పోసి పట్టుకెళ్ళమన్నా. అతను చాలా అభిమానం గా చూస్తూ ”బాబయ్యా! ఒక్క అనుమానం, ఇంత మెత్తని మనసున్నవాడివి, ఎందుకుబాబూ నీకంత కోపం వచ్చిందీ” అని అడిగాడు. నిజమే ఈ రోజుకీ నాకు అర్ధం కాలేదు, ఎందుకు కోపం వచ్చిందీ? .

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తలతిక్కపని?

 1. పూర్వ జన్మ ప్రారబ్ధం అనుకోవాలి కామోసు 🙂

  ఎప్పుడైనా పూర్వ జన్మలో వాణ్ని మనం ఇట్లాంటి ఇరకాటం లో పెట్టి ఉంటా మేమో 🙂

  సమయం జూసి ‘సమన్వయ’ గీతం గా వాడు రావడి జేయడం మనం వాడికి మించి రావడి జేసి నువ్వేంటోయ్ నాకు నేర్పేది అనడం సరి కి సరి 🙂

  బాగుందండి మీ గతానుభవం 🙂

  తల తిక్క అని చెప్పలేము ;

  ఆ ఉడుకు దనం లో ఏది జేస్తే అదే సరి !

  ఇప్పుడైతే చెప్పొచ్చు వాడి మొగాన ఆ పది పడేసి తీసుకు వచ్చేసి ఉండొచ్చు గా అని 🙂

  అట్లా జరిగి ఉంటె ఆ రిక్షా అబ్బాయి కి అంత మంచి అనుభవం కలిగి ఉండేది గాదు ! (ఆ పై మాకీ టపా నూ ఉండేది గాదూ ; జిలేబి కందము రాయడమూ జరిగేది కాదు …. ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి 🙂 జేకే !)

  ఆ రిక్షా అబ్బీ కోసం మొత్తం కథ మిమ్మల్ని సూత్ర ధారి గా బెట్టి పరంధాముడు నడిపి ఉంటాడు !

  కోపము యనునది అస్సలు
  పాపము కాదుగ జిలేబి ! పాఱుఁని గని కూ
  లీపడె దురాశ కోరెను
  రా పది రూపా యలు నిది రావడి గానన్

  చీర్స్
  జిలేబి

 2. నాకూ ఇటువంటి అనుభవమే జరిగింది దాదాపు 30 ఏళ్ళ క్రిందట. బాంబే ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ నుండి హైదరాబాద్ రావటా నికి డొమెస్టిక్ కి టాక్సీ లో వచ్చినప్పుడు, డబ్బుల దగ్గిర టాక్సీ వాడితో గొడవ అయ్యింది. ఒక్క పోర్టర్ కూడా సామాను టెర్మినల్లో పెట్టటానికి ముందరికి రాలేదు. నేనే నాలుగు పెట్టెలూ నాలుగు సార్లు తీసుకు వెళ్ళాల్సి వచ్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s