శర్మ కాలక్షేపంకబుర్లు-తలంటు

తలంటు

తలంటు అంటే తలమీద ఉన్న జుట్టునూ ఒంటినీ శుభ్రం చేసుకుంటూ స్నానం చేయడం, దీనినే అభ్యంగన స్నానం అనీ అంటారు. నేటి కాలం లో దీని అర్ధమూ మారిపోయిందీ విధంగా ” చూడరా! మొహం వేలాడేసుకుని వస్తున్నాడు, బాస్ లోపల ’తలంటేసి’ ఉంటాడు” అంటే తీరుబడిగా సాధించాడని, లేదా తిట్టాడని చెబుతున్నారు. దీన్నే ఇంగ్లిపీసులో ”డ్రెస్సింగ్ డౌన్” అని అంటారంటారు. నేటి తలంటు అంటే బాత్ రూం లోకిపోయి షవర్ కింద తలతడిపి, ఇంత షాంపూ చేతిలో పోసుకుని, నెత్తిమీద బరబరా రుద్దేసి, మళ్ళీ షవర్ కింద నిలబడి, సబ్బుతో ఒళ్ళు రుద్దేసుకుని బయటికొచ్చెయ్యడమే కదా అనుకోకండి. తలంటు అంటే అది పక్కా మూడు గంటల పనీ, ఆ తరవాత మరో ఇద్దరు పూనుకుంటే కాని కానటువంటిదీనూ. కావ్యాలలో చూస్తే పాండురంగ మహాత్మ్యంలో నిగమ శర్మ అక్క, నిగమ శర్మ పాడయ్యడని తెలుసుకుని, పతిదేవునితో విచ్చేసి తమ్ముడుకి బుద్ధులు చెప్పడానికి ఎంచుకున్న మొదటి కార్యక్రమం తలంటే. అసలు దీని పేరిటే తలంటు అంటే తీరుబడిగా సాధించడం అనే మాట పుట్టిందేమో కూడా.

తలంటుకి ముందుగా కావలసిన వాటిని సమకూర్చుకోవాలి, అవి, కుంకుళ్ళు కాని షీకాయి కాని, కొట్టుకుని వేడినీటిలో తడిపి ఉంచాలి, అందులో కొద్దిగా మందారాకులూ వేసుకోవాలి. వేడి నీళ్ళు కాచుకోవాలి, చన్నీళ్ళతో తలంటుకోకూడదు. సున్నిపిండి, ఇదివరలో చెప్పుకున్నాం కదా సౌందర్య సాధనంగా దానిని తీసుకుని సగం పిండి తడుపుకుని సగంపిండి పొడిగానూ ఒక పళ్ళెంలో ఉంచుకోవాలి. నువ్వుల నూనె వంద నుంచి నూట ఏభయి గ్రాములనూనె ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు అసలు కార్యక్రమం మొదలవుతుంది. మగవాడైనా ఆడవారైనా తలంటేందుకు మరో ఇద్దరు, కనీసం మరొకరైనా సాయంకావలసిందే. మగవాడికైతే గోచీ పెట్టుకుని చిన్న తువ్వాలు కట్టుకుని కూచుంటే, తలంటు మొదలవుతుంది. తల్లి, లేదా అత్తగారు నెత్తి మీద నువ్వులనూనె పోస్తూ ”అమ్మకడుపుచల్లగా అత్త కడుపుచల్లగా నీ ఇల్లు వెయ్యిళ్ళ మొదలవ్వాలని” ఆశీర్వదిస్తూ. ఈ నూనెను చెవులు, ముక్కులలో కూడా వేస్తారు. ఆ తరవాత ఒళ్ళంతా దూమెరుగ్గా రాస్తారు. దూమెరుగ్గా రాసిన తరవాత మర్దనా చేస్తారు, మొత్తం నూనె ఒంటిలోకి ఇనుకుతుంది. ఈ నువ్వుల నూనె ఎముకలలోపలికి కూడా ఇనుకుతుంది, ఎముకలకు కావలసిన ధాతువుల్నీ ఇస్తుందిట. ఆ తరవాత తడి సున్నిపిండి తీసుకుని ఒంటినిండా రాస్తారు, ఇప్పుడు ఫేస్ పేక్ లు వేసుకుంటున్నారూ, అలాగనమాట. ఇది కొద్దిగా ఎండుతుంది శరీర ఉష్ణోగ్రతకి. ఇక దీనిని నలచడం పారంభిస్తారు. ఇలా నూనెరాసి ఆ పైన సున్నిపిండి తో నలచడం మూలంగా ఒంటిని పట్టి పేరుకుని ఉన్న సన్నటి మట్టి వీటినే ’మాగిళ్ళు’ అంటారు, అవి పోతాయి. ఒంటిని రాసిన పిండి తడిగా ఉండిపోతే పొడి పిండి చేత్తో తీసుకుని నలుస్తారు. ఆడవారైతే ఈ నలుగు పిండిలో పసుపు కూడా కలుపుకుంటారు.నెత్తి మీద నూనె పెట్టి తల్లి తప్పుకుంటే భార్య తలంటితే అదేనండి, ఒళ్ళు నలిస్తే……సరస సంభాషణ కొనసాగితే…అది ఆ జంటకి ఆనందం. ఇలా నలుగులైన తరవాత, అసలు తలంటు ప్రారంభవవుతుంది.

కొంచం వేడిగానే నీళ్ళు తొలుపుకుని ఉంచి, నెత్తిమీద కుంకుడు కాయ పులుసు ఒకరు పోస్తే మరొకరు రుద్దుతారు. ఒక్కరే ఉంటే వారు పులుసుపోస్తే తంటుకునేవారే రుద్దుకోవాలి 🙂 పులుసు పోస్తే రుద్దితే నురుగొస్తుంది, మురికిపోతుంది, అప్పుడు వేడి నీళ్ళుపోస్తారు. ఆగండి అప్పుడే అయిపోలేదు, ఇలా మూడు సార్లు రుద్దుతారు, చివరగా సున్నిపిండితో రుద్దుతారు, అప్పటికి తల అంటడం అవుతుంది, ఇంకా ఒళ్ళు శుభ్రం చేయడం ఉండేపోయింది 🙂 ఇప్పుడు కుంకుడు కాయ పులుసుపోసి ఒళ్ళు రుద్దుతారు, నీళ్ళుపోస్తారు,ఆ తరవాత సున్నిపిండితో రుద్దుతారు ఒళ్ళంతా, ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోస్తారు.ఇప్పటితో ఇక్కడి కార్యక్రమం అయింది.

ఆ తరవాత పొడి బట్టతో తల తుడుస్తారు, అదే స్త్రీలకైతే జుట్టు కి పిడప వేస్తారు, నీరు జుట్టునుంచి గుడ్డని ఇనికేందుకు. జుట్టును మాత్రం కొసలనుంచి నీరు కారుతుండగా వదలేయరు, అలా అశుభ సమయంలో నే చేస్తారు. ఆ తరవాత కణకణ లాడే నిప్పులు తెచ్చి ఆడవారైనా, మగవారకైనా సాంబ్రాణి పోగవేయడం, ముఖాన చుక్క పెట్టడంతోనూ, అజాగర్త మూలంగా కళ్ళలో కుంకుడు కాయ పులుసు పడటం మూలంగా కన్ను నీరుకారి, ఎరుపెక్కితే, ఇరుకున పడితే ఒక ఉప్పరాయి నోట్లో పడెయ్యడంతో, జాగ్రత గా కళ్ళు మూసుకోడం కూడా రాదూ అని ఇల్లాలు ఎకసెక్కెం చేయడం తో ఈ తలంటు కార్యక్రమం జయప్రదంగా మూడు గంటల వ్యవధిలో పూర్తవుతుంది.

పుట్టినప్పటినుంచి వరస నీళ్ళని రోజువిడిచి రోజు చిన్నపిల్లలకి సున్నిపిండితో తలంటేవారు, నూనిరాసి. ఉడుకుడుకు నీళ్ళు పోస్తే బిడ్డ నీళ్ళు పోసుకున్నందుకే, అలసిపోయి హాయిగా, కమ్మగా నిద్రపోయేది. ఏదీ! ఇప్పుడు? ఒక సారి నాలుగు డొక్కుల నీళ్ళు మీద దిమ్మరించి, కుక్క సబ్బులాటి సబ్బుతో ఒకసారి బరబరా తోమేస్తే అయిపాయె! మనకే తలంటుకునే సౌభాగ్యం లేకపాయె! ఇక పిల్లలకెక్కెడా?

మరిప్పుడు అంత ఖాళీ ఉందా, తలంటు పోసేవారికిగాని పోయించుకునేవారికిగాని, అసలు బాత్ రూంలో మరో మనిషికి చోటు సరిపోతుందా 🙂

ప్రకటనలు

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తలంటు

 1. ఈ నువ్వుల నూనె ఎముకలలోపలికి కూడా ఇనుకుతుంది, ఎముకలకు కావలసిన ధాతువుల్నీ ఇస్తుందిట.- అబ్బ చా

  ఏమైనా తలంటి స్నానం పూసగుచ్చినట్టు వర్ణించారు సార్.

  భార్య తలంటితే అదేనండి, ఒళ్ళు నలిస్తే……సరస సంభాషణ కొనసాగితే…అది ఆ జంటకి ఆనందం- చీ పాడు..

 2. మేష్షారూ!
  మీరు పేరాగ్రాఫ్ సెంటర్ అలైన్మెంట్ మీ బ్రాండు ఎంటిటీగా ఏమైనా పెట్టుకున్నారా?అలా కానట్లయితే కాస్త అలైన్మెంటు మార్చి లెఫ్టుకి జరపగలరా!
  హరికాలం

 3. అభ్యంగన స్నానమునకు
  లభ్యంబగు విను జిలేబి లక్షల కాసుల్
  తుభ్యం, సత్యము వినుమా !
  అభ్యంతర మగు సమయము అకటా గలదే? 🙂

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s