శర్మ కాలక్షేపంకబుర్లు-…. గుడ్డిదాని పోరు…..

… గుడ్డిదాని పోరు…..

”అత్తపోరులేదు, మావపోరులేదు, గుడిసెలో గుడ్డిదాని పోరని…” ఒక నానుడి చెబుతారు.సాధారణంగా కుటుంబంలో కోడలికి అత్త,మావ, ఆడబడుచుల పోరుంటుంది, అలా కాకుండా సంబంధం లేనివారు వేధించడమే, సతాయించడమే, నిత్యవ్యవహారం లో సంబంధం లేని వారు సాధించడం,సతాయించడాన్ని ఈ మాటతో చెబుతారు,ఈ నానుడిగా చెబుతారు 🙂 . దాని వెనక ఒక మంచి కత ఉంది వినండి…

అనగనగా ఒక పల్లెటూరు, ఆ పల్లెలో ‘లక్ష్మి’, ఒక కలవారి కోడలు,అత్తా మామల్ని తల్లితండ్రుల్లా చూసుకునేది.. అత్తమామలకీ కోడలంటే ప్రేమ. ఈమె ఇంటెదురుగా ఒక గుడ్డి ముసలమ్మ, గుడిసెలో ఉండేది. ఈ ముసిలిది ఒకప్పుడు బాగా బతికేననేది, తోడెవరూ లేరు, ఒకత్తే ఉండేది. ఉదయం లేచినది మొదలు అన్నం వండుకోడానికి, ప్రతి పనికి అవస్థ పడటం చూసేది, లక్ష్మి. లక్ష్మికి జాలెక్కువ, ముసిల్ది వండుకోడానికి పడుతున్న బాధలు చూసి, రోజూ రెండు పూటలా అన్నం పెట్టడం మొదలెట్టింది. లక్ష్మి పెడుతోందని చుట్టు పక్కలవారందరూ పెట్టడం మొదలెట్టేరు. ముసిల్దాని పని బాగానే నడిచిపోతోంది.

చేయడానికి మరొక పనీ కనపడటం లేదు. ముసిలిదాని గుడిసె పెరట్లో ఒక కరివేప చెట్టుంది, ఆ ఊళ్ళో ’తంపి’ అనే ఆవిడ ఉంది. ఈవిడ ముసిలిదాన్ని మంచి చేసుకుని కరివేపాకు పట్టుకుపోయి, కారప్పొడి చేసుకుని అమ్ముకునేది. అలా ఊరంతా ఇంటింటికీ తిరిగి కారప్పొడి అమ్ముకుంటూ, ఆ ఇంటి కబుర్లు ఈ ఇంటిదగ్గర, ఈ ఇంటి కబుర్లు ఆ ఇంటి దగ్గర చెప్పడం మొదలెట్టి, ఊరి కబుర్లన్నీ మోసుకొచ్చి ముసిలిదానికి చెప్పి కరివేపాకు పట్టుకుపోడం చేస్తూ వచ్చేది…

ఇలా ఉండగా ముసిల్ది ఊరికబుర్లు తెలియడం తోనూ, మరో పని లేకపోవడంతోనూ, తిండి పెట్టేవాళ్ళుండడంతోనూ, ఊరివాళ్ళని సతాయించడం మొదలెట్టింది. ’’ఎవరా వెళ్ళేది, సుబ్బారావూ! మీ ఆవిడ నీళ్ళొసుకుందిట కదూ!’’ అనీ ‘’ఒరే సత్తిపండూ! మెరకపొలం అమ్మేసేవుట, డబ్బులు రత్తాలికిచ్చావా? ఏం ఆ రత్తాలుని వదల్లేకుండా ఉన్నావేంట్రా?’ ’’ఎవరవెళ్ళేదీ ధనమే కదూ! ఒసే నీకూతుర్ని పట్నంలో చదివిస్తున్నావుట, ఆడముండకి చదువెందుకే! ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలాలా? అదెవణ్ణో ప్రేమిచిందిటా? కడుపోకాలో తెచ్చుకునేదాకా తెచ్చుకోనివ్వకూ’’ అంటే ’’ఓసి గుడ్డి ముండా ఎవరేం చేస్తే నీకెందుకే’’ అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసింది, ధనం. ”ఏమే సత్తెమ్మా! నీ అల్లుడు నీకూతుర్ని ఏలుకోనంటున్నాట్ట” ‘’లక్ష్మీ! పట్టీలు తీసేసి గజ్జెలు పెట్టుకున్నావే చిన్నపిల్లవా?’’ ‘’ఎమే సుబ్బీ! నీ మొగుడు మెరకవీధి రాజహంస దగ్గరికి తిరుగుతున్నాట్ట,’’ ”ఏమే తాయారూ నీ మొగుణ్ణి బుట్టలో వేసి సత్తిగాణ్ణి తగులుకున్నావుట, మీ అత్త నిన్ను ఉతికిందిట’’. ఇలా అందరి విషయాలూ, ఉన్నవీ లేనివీ పదిమందిలో పడేసి పరువు తీసేది. అలవాటయిన శబ్దాన్ని బట్టి వచ్చిన వారెవరో చెప్పేసేది.

ఇలా సతాయించడం ఊరివారికి ఇబ్బందే కలిగిస్తూ వచ్చినా మాటాడక ”ముసిలిది పోనిద్దూ” అని వదిలేసేరు. ఇది ముదిరి ముసిల్ది ఊరివాళ్ళని తిట్టడం మొదలెట్టింది ‘’ఏమే నిన్నటి కూరలో ఉప్పు సరిగా వెయ్యలేదు, పక్కింటి సుబ్బారావుతో కబుర్లాడుతున్నావా? కూరొండినపుడు’’ అనీ, ”నిన్న రాత్రి నాకు అన్నం పెట్టడానికి అంత ఆలస్యం చేసేవేమే” అనీ. ఇలా సాధిస్తుంటే ఊళ్ళో కొంతమంది ముసిలిదానికి కూడు పెట్టడం మానేశారు. లక్ష్మి మాత్రం ఎదురింటిది, ముసిలిది,గుడ్డిదని దయదలిచి కూడు పడేస్తూవచ్చింది. అలా ఐనా గుడ్డిదానికి కృతజ్ఞతలేక లక్ష్మిని కూడా తిడుతూ ఉండేది. ఊళ్ళో వాళ్ళకి బాధ సహించలేనంతగా పెరిగిపోయి, ఊళ్ళోవాళ్ళంతా కలసి మీటింగ్ వేసేరు. అందులో కొందరు ‘’లక్ష్మీ నువ్వు దానికి కూడు పడేస్తున్నావు, అది కొవ్వెక్కి కొట్టుకుంటోద’’న్నారు. మరి కొందరు ”గుడ్డిదానికి కూడెట్టక చంపేసేరని పక్కూరివాళ్ళనుకుంటారు, కూడు పెట్టాల్సిందే” అన్నవారు కొందరు. ”అలాకాదు, దానితో ఎవరూ మాటాడకండి” అన్నవారు కొందరు. ”ఎవరు మాటాడుతున్నారు దాన్తో, అదే పిచ్చెక్కి దారేపోయేవాళ్ళందరిని తిడుతుంటే” అని కొందరన్నారు. ఏం చేద్దాం అంటే ఎంచేద్దామనుకుని. ”అసలు ఊరి కబుర్లన్నీ ముసిలిదానికి చేరేస్తున్న తంపిని వెళ్ళగొట్టండి” అన్నారు కొందరు. ”దాన్నివెళ్ళగొట్టి ఉపయోగం లేదు మరో ’దింపి’ తయారవుతుంద”న్నవారు కొందరు. ”ముసిలిదాన్నే వెళ్ళగొట్టేద్దా”మన్నారు మరికొందరు. ఇలా నలుగురూ నాలుగు మాటలన్నారే కాని ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. పదిమందిలో పడ్డ పాము చావదని నానుడి.

ఈ కబుర్లన్నీ నెమ్మదిగా తెలుసుకున్న తంపి ముసిలిదానికి చేరేసింది. ముసిలిదానికి భయమే వేసింది ఊరివాళ్ళేం చేస్తారో అని. పక్కూరికి పోతేనో అని ఆలోచించింది, తంపితో. ”లాభం లేదు, పక్కూరి వాళ్ళు సరయినవాళ్ళు కాదు, నీకు కూడు పెట్టరు, నువ్వుగనక ఇలా నోరు చేసుకుంటే తన్ని తగిలేస్తారు, అందుచేత ఇక్కడే ఉండి నోరు సంబాళించుకో” అని సలహా ఇచ్చింది. ముసిలిదానికి ఏంచెయ్యాలో తోచలేదు. చూదాం ఏం చేస్తారో అని ఊరుకుంది.

లక్ష్మి మీద ఊరివారి ఒత్తిడి పెరిగింది, దానితో మొగుడు దగ్గర ’ఏమండీ! అత్తపోరులేదు, మావపోరులేదు, నాకు గుడిసెలో గుడ్డిదానిపోరు ఎక్కువైపోయిందండీ” అని చెప్పుకుంది. అతను తల్లి తండ్రులతో ఆలోచించి, పక్క ఊరుకు మకాం మార్చేశాడు, అక్కడా వారికి పొలమూ ఇల్లూ ఉండడంతో. ఇప్పుడు ముసిలిదానికి కూడు పెట్టేవారు కరవైపోయారు. తంపి ముసిలిదాని దగ్గరికి రావడం మానేసింది. ముసిలిదాని దగ్గరకెళితే కొడతారేమోనని భయపడింది, తన దగ్గర కారప్పొడి కొనరేమో అని భయపడింది. వెలివేయబడినట్టయిపోయిన ముసిలిది మళ్ళీ కళ్ళు కనపడక అవస్థ పడుతూ అన్నం వండుకోవడం మొదలెట్టింది, తంపి సాయం కూడా చెయ్యలేదు. ముసలిది తను తినే కూటిలో తనే దుమ్ముపోసుకున్నట్టయింది. అలా ఈ నానుడి అత్తపోరు….., చిరస్థాయిగా ఉండిపోయింది.

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-…. గుడ్డిదాని పోరు…..

 1. జిలేబీ గారూ, మీరిచ్చిన అదనపు వివరణ (Feb 25 at 02.15) బాగుంది గానీ “స్వామి వారు” ఎవరు?
  (పద్యంలో చెప్పకండి, వచనంలో అనుగ్రహించండి 🙂

 2. టపా బాగుంది. ఇది పునర్ముద్రణా శర్మ గారూ? గతంలో ఓ సారి మీ బ్లాగులో చదివినట్లు గుర్తు.

  • విన్నకోట నరసింహారావు గారు,

   బ్లాగులో ఇది మొదటి ప్రచురణే, మీరు ఇదివరలో, కొంత కాలం కితం, ప్రత్యేకంగా చదివి ఉంటారు
   ధన్యవాదాలు.

   • స్వామి వారు,

    ఈ కథ ను నింతకు మునుపు ఒక సారి చూచాయి గా చెప్పారు గాని ఇంత విపులంగా చెప్పలే ;

    కాబట్టి విన్న కోట వారు సరి !

    ఆ పై “ప్రత్యేకం” గా ఇప్పుడు మళ్ళీ మనందరి కోసం శర్మ గారు పెట్టిన టపా యిది మేలు గలిపిన రుచుల పోరు హోరుల్ తో 🙂

    కాబట్టి కష్టే ఫలే వారూ సరి 🙂

    చీర్స్
    జిలేబి

 3. భలే భలే హోరు పోరు 🙂

  అత్త పోరు మావ పోరు
  మెత్త గుడ్డి మీరి పోరు
  వింత పోరు నింటి పోరు
  ఇంత గంటి ఈడ పోరు

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s