శర్మ కాలక్షేపంకబుర్లు-సహనం

సహనం

ఎంతటి గొప్ప వారైకైనా సహనం అవసరం. అసహనానికి లోనైతే పరిణామాలు విపరీతంగా ఉంటాయి, అందునా దైవ పరీక్షలు ఎలా ఉంటాయో తెలియదు, భగవంతుని పరీక్ష, శిక్ష కఠినంగానే ఉంటాయి, ఈ సందర్భంగా కాశీ ఖండం నుంచి ఒక కథ, అవధరించండి…

ఒకప్పుడు వ్యాసులు తన పదివేల మంది శిష్యగణం తో నైమిశారణ్యానికి వెళ్ళేరు, అక్కడ ముని పుంగవుల మధ్య కుడి భుజం పైకెత్తి చూపుడు వేలు పైకి చూపుతూ ప్రతిజ్ఞాపూర్వకంగా హరియే దైవం, వేరు దైవం లేడని నొక్కి వక్కాణిస్తే అక్కడున్నవారు ఆశ్చర్యపోయి ”మహర్షీ! మీరీ మాట కాశీలో నొక్కి వక్కాణిస్తే ఇక్కడున్నవారమంతా నమ్మగలం” అన్నారు. అంతట వ్యాసులు కాశీ చేరుకుని బిందు మాధవుని కొలిచి విశ్వేశ్వరాలయం ప్రవేశించి కుడి భుజం పైకెత్తి చూపుడు వేలు పైకెత్తి ప్రతిజ్ఞా పూర్వకంగా హరియే దైవమనే శ్లోకాలు చదవడం మొదలు పెట్టేటప్పటికి నంది భుజం స్థంభింపచేశారు, గొంతు మూగబోయింది, వ్యాసునికి. అప్పుడు హరి ప్రఛ్ఛనంగా వ్యాసులతో ”మహర్షీ! అపరాధం చేస్తున్నావు, నాకూ శంకరుడే దైవం ఆయనే నేను, నేనే ఆయన, శంకరుని వేడుకో” అని కంఠం నిమిరి వెళ్ళిపోయారు. అప్పుడు వ్యాసులు చేతన తెచ్చుకుని హరుని ప్రార్ధించి వెళ్ళేరు. కాశీవాసం చేస్తున్నారు.

DSCN0106

కాలం గడచింది. ఒకసారి శంకరులు వ్యాసుల్ని పరిక్షించాలనుకున్నారు. భార్య అన్నపూర్ణతో వ్యాసులకి మూడు రోజులు భిక్ష దొరకకుండా చేయమన్నారు. ”ఆ కీట బ్రహ్మజనని” అమ్మ పతి ఆజ్ఞ అమలుచేసింది. మొదటిరోజు భిక్ష దొరకలేదు, వ్యాసునికి. రెండవరోజు వ్యాసులు శిష్యులను పిలిచి కాశీ వాసులు ఎందుకు భిక్ష ఇవ్వటం లేదో తెలుసుకుని రమ్మన్నారు. శిష్యులు నగరమంతా తిరి వచ్చి ”గురువరా! కాశీ వాసులకు లోటేమీ లేదు, మరి ఎందుకు భిక్ష ఇవ్వటం లేదో తెలియదని” విన్నవించారు. మూడవరోజు అపరాహ్నం తిరిగింది ఎవరూ భిక్షకి ఆహ్వానించలేదు. వ్యాసులు ఆకలితో నకనకలాడుతూ కోపంతో వణికిపోతూ

విద్యానాశ్రయంకాశీ కాశీ లక్ష్యాః పరాలయః
ముక్తిక్షేత్రమిదం కాశీ కాశీ సర్వత్రయీమయాః

కాశీ వాసులకు మూడు తరాలకు విద్య లేకుండునుగాక, మూడు తరాలు ముక్తి లేకుండును గాక, మూడు తరాలు ధనం లభించకుండును గాక అని శపించి, భిక్షకి ముందుకు అడుగేశారు. ఆకలితో ఆయనలో వివేకం నశించింది.

కొద్ది దూరంలోనే ఒక గృహిణి తన ఇంటి ముందు నిలచి ”ఓ మహర్షీ! నా భర్త అతిధి కోసం ఎదురు చూస్తున్నారు, ఉదయం నుంచీ, వచ్చి భోజనం చేయ”మని ఆహ్వానించింది. ఆమెను చూచిన వ్యాసులు పరమానందం పొంది ”తల్లీ! నిన్ను ఇదివరలో కాశీలో చూడలేదే! ఎవరునువ్వు” అని ప్రశ్నించారు. దానికాతల్లి, నీవు భిక్ష చేయడం నేనెరుగుదును కాని నాన్ను నీవెరుగవు, నేనిక్కడిదాననే” అని బదులిచ్చింది. వ్యాసులు ”నాకో నియమముంది తల్లీ!” అన్నారు. ”ఏమది?” అడిగింది అమ్మ. ”నా శిష్యులు పదివేల మందితో కలసి భోజనం చేయడం” అన్నారు వ్యాసులు. ”ఓస్! అంతేనా!! నా భర్త అనుగ్రహంతో ఎంతమందికైనా అన్నం పెట్టగలను, నీ పదివేల మంది శిష్యులతో వచ్చి విందారగించ”మని ఆహ్వానించింది. వ్యాసులు ఆశ్రమానికిపోయి తన పదివేలమంది శిష్యులతో భోజనానికి దయచేశారు. భోజనమూ చేశారు. గృహస్థును ఆశీర్వదించేసమయం లో దంపతులు వ్యాసుల వద్దకు వచ్చారు. అప్పుడు ఆ గృహిణి వ్యాసుని ఇలా అడిగింది, ”తీర్ధవాసుల ముఖ్య ధర్మం ఏమిటి?” అని. వ్యాసులు ”అన్నదానం చేయడం, స్త్రీగా నీవు భర్తను సంతోష పెట్టడం, ఈ రెండు నీవు చేశా”వన్నారు. అందుకా గృహిణి నేను అలా ఆచరించానని నాకు తెలుసు, సామాన్యుల ధర్మం చెప్పమంది. వ్యాసులు “ఇతరులకు కష్టం కలగకుండా మాటాడాలి,ఇతరుల ఔన్నత్యానికి అసూయ పడకూడదు,ఎల్ల వేళలా బాగా ఆలోచించే ఏపనైయినా చేయా”లన్నారు. అంతట ఆ గృహస్థు ”ఓ విద్వాంసుడా! నీవు చెప్పిన ఈ ధర్మాలలో ఒకటైనా నీ దగ్గర ఉన్నాదా?” అని అడిగారు. వ్యాసులు కొయ్యబారిపోయారా మాటకి. అప్పుడు గృహస్థు ”ఓ మహర్షీ! నీవు చెప్పిన ఈ ధర్మాలను కాశీ వాసులను శపించేటపుడెలా మరచావు? అన్నీ తెలిసినవాడవే, నీ స్వార్ధ ప్రయోజనం నెరవేరలేదని కాశీవాసులను శపించావే, క్రోధంతో, ఇప్పుడీ శాప ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు?” చెప్పమన్నారు. దానికి వ్యాసులు “దురదృష్టం చేత కార్య సిద్ధి పొందనివాడు, క్రోధంతో శాపమిచ్చినవాడే ఆ ఫలితాన్ని అనుభవిస్తాడు” అన్నారు. దానికా గృహస్థు ”మహర్షీ! భిక్షకై తిరుగుతున్న నీకు, భిక్ష లభించకపోతే కాశివాసులేం తప్పు చేశారు?నా రాజధాని నగరమైన కాశీలో నీవు క్రోధనుడవై ఉండ తగవు, అనర్హుడవు. నీకు కాశీలో ఉండే యోగ్యతలేదు” అని ఆనతిచ్చారు. ఇప్పటికి తెలివి తెచ్చుకున్న వ్యాసులు వారిని పార్వతి, పరమేశ్వరులుగా గుర్తించి, తన తప్పు తెలుసుకుని, అమ్మను శరణు వేడారు.

”అమ్మా! తప్పుచేశాను, క్రోధనుడనై కాశీని శపించాను,శరణాగతి వేడుతున్నాను, మన్నించు తల్లీ” అని వేడు కున్నారు. అమ్మ పలకలేదు. అప్పుడు వ్యాసులు తల్లీ ”అమ్మ కరుణించకపోవడం అరుదు, నేను చేసిన తప్పుకుగాను శిక్ష అనుభవించవలసినదే కాని అయ్యవారిని చూడక, నీ దర్శనం చేసుకోక ఉండలేను, దయ తలిచి ఇరు పక్షాలలోనూ అష్టమి, చతుర్దశి రోజులలో కాశీ ప్రవేశానికి అనుమతి కోరుతున్నాను, అయ్య నీమాట కాదనరు, కరుణించు తల్లీ” అని వేడు కున్నారు. అందుకు తల్లి, అయ్యవారి కనుసన్న అనుజ్ఞతో తధాస్తు అని చెప్పి తిరోహితులయ్యారు. వ్యాసులు తన అసహనానికి,అవివేకానికి సిగ్గుపడి, తనను తానే నిందించుకుంటూ కాశీ వదలి గంగ అవతలి గట్టున తూర్పు తీరంలో కాశీనాథుని చూస్తూ లోలార్కునికి ఆగ్నేయంగా ఉండిపోయారు.

ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసినదేమి? స్వార్ధ ప్రయోజనం కోసం సంస్థలను పాడు చేయకూడదని కదా!

ప్రకటనలు

One thought on “శర్మ కాలక్షేపంకబుర్లు-సహనం

 1. కథల్ బాగా జెప్పు ఒజ్జ ! 🙂

  కథ జెప్పిరి యాఖరు ట్వి
  స్టు ధమాక! గురువర ఒజ్జ ! స్తుత్యమగు కథా
  సుధలన, ధారగ పరిపరి
  విధములగు కథలను జెప్పు విదురులు వీరున్ !

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s