శర్మ కాలక్షేపంకబుర్లు-స్త్రీశక్తి

స్త్రీశక్తి

మాతృదేవో భవ.
తల్లియే పరదేవత.

స్త్రీ అంటే తల్లి,చెల్లి,చెలి ఇలా అనేక రూపాలలో పురుషునితో కలసి ఉండేది. పదారు మంది తల్లులు, వీరే

స్తనదాత్రీ గర్భదాత్రీ భక్ష్య దాత్రీ గురుప్రియా
అభీష్టదేవ పత్నీచ పితుః పత్నీచ కన్యకాః
సగర్భజాయా భగినీ పుత్ర పత్నీ ప్రియ ప్రసూః
మాతుర్మాతా సోదరస్య ప్రియతథా
మాతుః పితుశ్చభగినీ మాతులనీ తదైవచ
జనానాం వేదవిహితా మాతరః షోడశస్మృతా…… బ్ర.వై.పు

పాలిచ్చి పెంచినతల్లి, కనిపెంచినతల్లి, భోజనం పెట్టినతల్లి, గురుపత్ని, ఇష్టదేవుని భార్య, సవతి తల్లి, సవతితల్లికూతురు, చెల్లెలు, పుత్రునిభార్య, భార్యతల్లి, తల్లితండ్రుల తల్లులు, అన్నభార్య, తల్లిచెల్లెలు, తండ్రిచెల్లెలు, మేనమామ భార్య. ఈ పదారుమంది తల్లులు.

సర్వేషా మపి శాపానాం ప్రతిఘాతోపి విద్యతే
నతుమాత్రాపి శప్తానాం క్వచిఛ్ఛాప నివర్తనం

ఏ శాపానికైనా తిరుగున్నదేమోకాని, మాతృశాపానికి తిరుగులేదు.

స్త్రీణాం ద్విగుణమాహారః ప్రజ్ఞాచైవ చతుర్గుణా
షడ్గుణో వ్యవసాయశ్చ కామశ్చాష్టగుణం స్మృతం.

పురుషులకంటె స్త్రీలకు రెండురెట్లధికాహారము, ప్రజ్ఞ అనగా తెలివి నాలుగురెట్లు,ప్రయత్నం ఆరురెట్లు, కామం ఎనిమిదిరెట్లు అధికం.

స్త్రీ శక్తిస్వరూపిణి, ”ఆకీటబ్రహ్మ జనని” అంటే కీటకం నుంచి బ్రహ్మవరకు అందరికి తల్లి ఐనది స్త్రీ, ఈ స్త్రీ శక్తి ఎంతటిది?

ఉన్మత్తప్రేమసంరమ్భా దారభన్తే, యదజ్గనాః
తత్ర ప్రత్యూహ మాధాతుం బ్రహ్మాఽపి ఖలు కాతరః…భర్తృహరి

ప్రేమావేశభరంబున
భామాజను లాచరించుపని మరలింపం
దామరవిరిలోబొడమిన
యామేటికి నైన నలవి యగునెతలంపన్….. లక్ష్మణకవి.

స్త్రీలు మిక్కుటమగు ప్రేమతో ఎట్టిపనిని జేయబూనినను, వారినట్లు జేయకుండ జేయుటకు బ్రహ్మకు కూడ సాధ్యముకాదు. అంటే ఒక సారి గనక స్త్రీ మనస్ఫూర్తిగా ఏ పని చేయాలనుకున్నా, దానిని ఆపతరమెవరికి కాదన్నదే సత్యమని కవి భావం.

కవిగారి మాట నూటికి నూరుపాళ్ళు నిజమన్న సంగతి అందరికి తెలిసిన సంగతే, కాని ఒప్పుకోరు! మగమహరాజులది అహంకారం, అంతే తేడా 🙂 దీనికి నిదర్శనాలు కావాలా!

”ఇదే చెప్పడం! ప్లేన్ దిగిన తరవాత మెలికపెట్టి, తిరకాసుపెడితే ఊరుకోను! ముందు మా అమ్మవాళ్ళని చూసిన తరవాతే ఎక్కడికేనా! దిక్కులు చూడకండి! వినపడిందా?” ఇలా ముందుగానే హెచ్చరిక జారీ చేయబడితే ఈ మానవుడు చేసేదేముంది? వినక ఛస్తాడా? ”అలాగే మహారాణీవారూ!” అంటాడు ఏడుపు మొహం మీద నవ్వు తగిలించుకుంటూ, ’తప్పుతుందా’ ఈ చివరిమాట లోపల మింగేస్తాడు, పళ్ళు పిండుకుంటూనయినా, ఏడుపుమొహం మీద నవ్వు మొలిపించుకుని నవ్వుతాడు 🙂 ప్లేన్ దిగేకా తేడా చేసేడా అయిపోయాడే 🙂

ఒక స్వానుభవం ముఫైయేళ్ళ కితం మాట, ఒక రోజురాత్రి ఇల్లాలు ”స్థలం కొనుక్కున్నాం కదా ఊళ్ళోనే! అందులో గుడిసె వేసుకునైనా వెళిపోదాం! ఈ అద్దె కొంపలో, ఈ త్రాష్టుడు గోల భరించలేకపోతున్నా! వేగలేకపోతున్నా!! ఇక్కడ కడగలేదు, అక్కడ తుడవలేదని కాల్చుకు తినేస్తున్నాడ”ని మొదలెట్టింది. ”సరే” అని గడిపేశానప్పటికి. 🙂 ఊరుకున్నా! మరుసటి రోజునుంచి ”ఏం చేశార”ని గొలకటం మొదలెట్టింది. ఇక తప్పదని ”డబ్బులు లేవు, సరిపోవేమో” అన్నా. ”ఉన్నంతవరకే, పాకేనా వేసుకుని గృహప్రవేశం చేసేద్దాం. పాక వేసుకోడానికి డబ్బులు సరిపోతాయిగా! మనమేం మహా మేడల్లో ఉన్నవాళ్ళమేం కాదు, తాటాకు కొంపలు ఎరగనివీ కావు. తాటాకు కొంపలో ఉంటే పరువు పోతుందా! నాకేం బాధలేదని” తీర్మానం చెప్పేసింది, తీర్మానం చేసేసింది. ఏం చేస్తాను, తప్పక, డబ్బు వెతుకులాట మొదలెట్టి, ఇన్సూరెన్స్ చేసి, అప్పు చేసి ఉన్న సొమ్ముతో శంకుస్థాపన చేసి ఇల్లు మొదలెట్టి ఆరునెలల్లో ఇల్లు కట్టేసేను, డబ్బులు చిత్రంగా సమకూడాయి. అదే గనక ఆవిడ గొడవ చెయ్యకపోతే ఇల్లు కట్టేవాడిని కాదు, ఇదే నిజం కూడా!

ఇదేం కాదుగాని భారతం నుంచి కొన్ని సంఘటనలు చెప్పేస్తా అవధరించండి.

పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయం, విరటుని కొలువులో. సుధేష్ణ విరటుని భార్య, ఆమెదగ్గర సైరంధ్రిగా, మాలిని పేరుతో ద్రౌపది చేరింది. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు సుధేష్ణ తమ్ముడు, కీచకుడు అనేవాడు అప్పను చూడవచ్చి, ద్రౌపదిని చూసి మోహాలాపం చేశాడు. ద్రౌపది తన భర్తలు ఐదుగురు, గంధర్వులు బలవంతులని చెప్పింది, భయపడి ఐనా వదిలేస్తాడేమోనని. అబ్బే! అలా వినేలా కనపడలేదు, కీచకుడు. ఆ తరవాత ఒక రోజు సుధేష్ణ ద్రౌపదిని కీచకుని మందిరానికిపోయి మదిర తెమ్మంది. ద్రౌపది ”ఇటువంటి పనులు చేయనని ముందే చెప్పేను కదా”, అని అడ్డం తిరిగితే, ”ఈ ఒక్కసారికి వెళ్ళి వచ్చేద్దూ”, అని బతిమాలింది. తప్పక, ద్రౌపది కీచకుని మందిరానికెళితే, కీచకుడు మోహాలాపం చేసి చేయి పట్టుకోబోతే పరిగెడితే, కీచకుడు వెనకపడ్డాడు. ద్రౌపది విరటుని సభకు చేరింది, జరిగినదీ చెప్పింది. విరటుడు, ద్రౌపదిని తరుముకు వచ్చిన కీచకుని మందలించలేక అనునయించి పంపించేశాడు. ద్రౌపది నిలబడితే కంకుభట్టు రూపం లో ఉన్న ధర్మరాజు అనునయించి పంపేడు. సుధేష్ణ దగ్గరకు చేరిన ద్రౌపదితో ”అలా ఉన్నా వేమని” అడిగింది,సుధేష్ణ. ”ఏమీ తెలియనట్టు మాటాడకు, నీ తమ్ముడు చేసిన పని ’ఇదని’ చెప్పింది, వివరంగా. ”అయ్యో! అలాగా, కీచకుణ్ణి మందలిస్తా”నని ప్రగల్భాలు పలికింది సుధేష్ణ.

ఆ రాత్రికి ద్రౌపది భీముడున్న చోటుకు చేరింది, ఒంటిమీద చెయ్యి వేసి లేపుతూ ”ఎలా పడుకుని నిద్రపోతున్నావు? భార్యను పరపురుషుడు అవమానిస్తే కూడా?” అంటూ రెచ్చగొట్టింది. అనేక రకాలుగా మాటాడింది. చివరికి భీముడు ”మన ఇద్దరి మూలంగా మన గుట్టు బయట పడుతుందేమోననే భయం తప్పించి, వీణ్ణి అంతం చెయ్యడం ఎంతపని?” అంటూ, తన భుజాలకే కాదు బుద్ధికీ పదునుందని నిరూపిస్తూ, “రేపు రాత్రికి కీచకుణ్ణి నర్తనశాలకు రమ్మను, మిగిలిన పని అక్కడ చేసేస్తా”నన్నాడు. తెల్లారింది, కీచకుడు వచ్చేశాడు, ద్రౌపది “ఇలా వెంటపడితే చులకన కాదా! రాత్రికి గుట్టు చప్పుడుకాక, ఒకడివే నర్తనశాలకి రా!” అని చెప్పింది, నెమ్మదిగా. కీచకుడు అప్పుడే గాలిలో తేలిపోయాడు, గాలిలో కలిసిపోడానికి సిద్ధమవుతూ. రాత్రయింది, కీచకుడు నర్తనశాలకి చేరాడు, అక్కడ మాటేసిన భీమునితో ఘోరయుద్ధం జరిగింది. భీముడు కీచకుని చంపి తల, కాళ్ళూ, చేతులూ పొట్టలో కూరేసి, కాగడా పుచ్చుకుని ద్రౌపదిని తీసుకొచ్చి చూపించాడు. అప్పుడు ద్రౌపది “అహా! మగతనమున్న మొగుడివని” అభినందించింది. ఎవరిదారిన వారు స్వస్థలాలకు చేరారు. తెల్లవారింది, కీచకుడు పెద్దల్లో కలిసిపోయిన వార్త తెలిసింది, ఉపకీచకులు, కీచకుని తమ్ములు నూరుమంది, ద్రౌపదిని పట్టుకుని అన్న శవంతో పాటు కట్టేసి శ్మశానానికి తీసుకుపోతుంటే, తగలేయడానికి, రక్షించమని గోల చేసినా విన్నవారు లేకపోయారు. భీముడు ఒక్క గంతులో కోటగోడ దూకి, ఎదురుగా కనపడిన చెట్టు పీకి, దొరికిన ఉపకీచకులను దొరికినట్టు మోది చంపేశాడు. ద్రౌపదిని విడిపించి, తనదారిని తానుపోయాడు. కీచకుణ్ణి చంపినదెవరో తెలియలేదు, ఉపకీచకులను చంపినదెవరో కూడా తెలియలేదు, ఇదంతా ద్రౌపది భీముని చేత చేయించిన కార్యం, ”గుట్టు చప్పుడు కాకుండా.” ఈ గుట్టు చప్పుడు కాకుండా అనేమాట కూడా ఈ సంఘటన నుంచి వాడుకలోకొచ్చినదే! ఇదీ ద్రౌపది శక్తి.

మరో సంఘటనలో, అదీ ఇలా ప్రఛ్ఛన్నంగా ఉన్న సమయమే, ఏకచక్రపురంలో, బ్రాహ్మణుని ఇంట. ఆ ఇంటివారి కొచ్చిన వంతుకుగాను బకునికి ఆహారంగా భీముని పంపడానికి కుంతి నిర్ణయం తీసుకుంది. ధర్మరాజు అడ్డుపడతాడు. అప్పుడు చెబుతుంది కుంతి, “నేనేం పిచ్చిదాననా! భీముడిలాటి కొడుకుని వదులుకోడానికి. వీడెళ్ళి వాడిని కడతేర్చి వస్తాడని నాకు తెలుసు, నువ్వు భయపడకు” అని చెబుతుంది. అలాగే భీముడు వెళతాడు, బకుణ్ణి చంపి తిరిగొస్తాడు. ఈ కథ ఒక సారి వివరంగా చెప్పాను కదా! అందుకు సంక్షిప్తం చేశా. ఇదీ స్త్రీ శక్తే. స్త్రీ ఆది శక్తి, శంకరునిలో సగం అమ్మ, పురుషునిలో సగం స్త్రీ.

మరి నేటికాలంలో స్త్రీలు ఇలా ఉన్నారేమనికదా! వారు వారి శక్తిని మరచారు, అదీగాక నేటి కాలంలో స్త్రీకి ప్రథమ శత్రువు స్త్రీయే సుమా!

అందరు అమ్మలకీ తనకొడుకు ప్రధాని కావాలని కోరికుంటుంది, ఆ ప్రయత్నమూ ఉంటుంది, తప్పూ కాదు, మరి ప్రధాని కావాలనుకునే పుత్రునికి బుర్రలో గుంజు లేకపోతే తల్లి ఏం చేయగలదన్నదే…..

అనుకోకుండా టపా పెద్దదయిపోయింది మొదటిరోజుల్లో లాగానూ.. 🙂

మహిళాదినోత్సవం సందర్భంగా..

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-స్త్రీశక్తి

 1. అవుమ ఉమఅ తిరిగి అమరగ తెలిసెను
  శివుడు శక్తి యొకరె చిత్ర మిదియె
  చక్క నమ్మ మదిన చక్కగ నయ్యరు
  జాడ తెలియ యిలన నడుచు కొనుమ !

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s