శర్మ కాలక్షేపంకబుర్లు-రామఠ కరండ న్యాయం.

రామఠ కరండ న్యాయం.

రామఠం అంటే ఇంగువ, కరండం అంటే పెట్టి అని అర్ధం. దీనినే తెనుగులో ”ఇంగువ కట్టిన గుడ్డ” అంటారు. ఇంగువను సంస్కృతం లో రామఠం అంటారు, శాస్త్రీయనామం, అసిఫొటిడా . సంస్కృతంలో రామఠం అని ఎందుకంటారంటే, ప్రస్థుత పాకిస్తాన్ కి వాయువ్యంగాను ఆఫ్గనిస్థాన్ కి మధ్యలో ఉన్న కొంత ప్రదేశాన్ని రామఠం అనేవారు గనకనున్నూ, అక్కడ ఈ ఇంగువ తయారు చేసేందుకు కావలసిన మొక్క బాగా పెరుగుతుంది కనక. ఈ మొక్క పాల నుంచి ఇంగువ తయారు చేస్తారు. ఈ మొక్కల పాలను గడ్డకట్టించడంగాని, మైదాలో పొలపడం మూలంగా గాని చేసి ఇంగువ తయారు చేస్తారు. ఇది రెండు రకాలు, తెల్ల ఇంగువ,పాల ఇంగువనీ అంటారు, రెండవది నల్ల ఇంగువ. ఇది ఒక ఔషధం, దీనిని ఆయుర్వేదం లో వాడుతారు. ప్రసూతి సమయంలో బాలెంత చేత ఇంగువ మింగించేవారు. జీర్ణప్రక్రియలో ఉపయోగపడుతుంది, పుప్పిపళ్ళకి మందు ఇలా ఎన్నో ఉపయోగాలు. ఇప్పటికి ఇంగువ వాడుకలో ఉంది.  ఇంగువను కొంతమంది చాలా ప్రీతిగా వాడుతారు, కూరలు, పచ్చళ్ళు, చివరికి పులుసు,చారులలో కూడా వాడుతారు. కొన్ని కూరలలో దీనిది ప్రత్యేక స్థానం కూడా, ఇలా కూరలో చారు,పులుసులో వేసిన ఇంగువ చిన్న ముద్దగా వేసినది ఎవరు తినేటపుడొస్తే వారు అదృష్టవంతులని, అలా ఇంగువ ముక్క వచ్చిందని చెప్ప కూడదని అనేవారు.. కొంతమంది దాని వాసనకు బెదిరిపోతారు, ఎందుకంటే దీని వాసన కొంచం ఇబ్బంది పెడుతుంది, నచ్చనివారిని. ఒక ప్రముఖ కంపెనీ ’ఎల్.జి’ పూర్తి పేరు లాల్జీ గోధూ, ఈ కంపెనీ ఒకప్పుడు ఇంగువ వ్యాపారం చేసేది, బారత దేశంలో, ఇప్పుడూ ఈ వ్యాపారం చేస్తోంది, ఇంగువను ఎగుమతీ చేస్తోంది.. ఈ ఇంగువని నిలవచేయడానికి తమలపాకులో చుట్టి గుడ్డని కట్టి ఉంచడం తెనుగునాట అలవాటు. ఇలా ఇంగువ కట్టినపుడు ఆ గుడ్డకి కలిగిన ఇంగువ వాసన, ఎన్నిసార్లు ఉతికినాపోదు. ఇలా ఇంగువ వాసన ఎంత,ఎన్నిసార్లు ఉతికినా పోనట్టే, దాత ఎంత బీదవాడైనా ఆ దాతృత్వం పోదు. అందుకే ఇటువంటి దాతలని ఇంగువు కట్టిన గుడ్డతో పోలుస్తారు. ఈ సందర్భంగా చిన్ననాటి ఒక సంఘటన గుర్తుకొచ్చింది.

మాది , పగోజిలో అఖండ గోదావరీ తీరాన ఒక చిన్న పల్లెటూరు. అవి స్వతంత్రం వచ్చిన కొత్త రోజులు, నా చిన్నప్పటిరోజులు. మా వూరిలో హైస్కూల్ లేదు, దానికోసం ప్రయత్నం చేస్తుంటే జిల్లా బోర్డువారు, నాలుగెకరాల స్థలం చూపిస్తే స్కూల్ మొదలుపెడతామన్నారు. మా ఊరివారంతా, అయ్యగారు, అని ముద్దుగా పిలుచుకునే శ్రీమాన్ మాడభూషి వేంకటరంగ అణహరాచార్యుల వారి దగ్గరకెళ్ళి భూమి కావాలని, స్కూల్ కి దానం ఇమ్మని అడిగాం. మా అయ్యవారు బహుయోగ్యులు, దాత అడిగినవానికి లేదన్న సంఘటనే లేనిది. వదాన్యులు,బహుకుటుంబీకులు కూడా. ఆయన మారు మాటాడక ఊరికి పడమరగా, పుంతకి చేరువగా ఉన్న నాలుగెకరముల పొలమూ రిజిస్టర్ చేయించారు, స్కూల్ గురించి. ఆ తరవాత తెలిసింది ఊరివారికి, మా అయ్యగారి ఆస్థి సమస్థం ఇలా దాన ధర్మాలకింద ఖర్చయిపోయిందనీ, ఏమీ మిగలలేదనీ, చివరికి మిగిలిన నాలుగెకరాలూ ఇలా మా వూరి స్కూల్ కి దానమిచ్చారనీ. మా వూరివారా తరవాత నాలుక కరచుకున్నా ఫలితం లేకపోయింది. వారుగాని వారి కుటుంబీకులుగాని ఏనాడూ ఇలా చివరి నాలుగెకరాలూ అయ్యగారు దానమిచ్చినందుకు బాధపడలేదు, పన్నెత్తి మాటా అనలేదు. ఇంకా చిత్రం స్కూల్ కి కనీసం తనపేరు పెట్టమని కూడా వారడగలేదంటే, వారి వదాన్యతను ఏమని పొగడాలో తెలియలేదు. భగవంతుడు చల్లగా చూసి వారిపిల్లలంతా మంచి, మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు, ఆడపిల్లంతా వివాహాలయి చల్లగా ఉన్నారు. వారి సంతతి ఎవరూ ఇప్పుడా వూరిలో లేరు, కాని వారి దాతృత్వంతో ఇచ్చిన స్కూల్ బిల్డింగ్ స్థలం అలాగే ఉండిపోయింది, వారి పేరు చిరకాలం స్థిరంగా ఉంటుంది, మా వూరివారి జ్ఞాపకాలలో. మా అయ్యగారు చిరంజీవి, మా ఊళ్ళో స్కూలున్నంతాకాలమూ వారి పేరుంటుంది.

మా ఊళ్ళో మరి ధనవంతులూ లేరా? లేకేం! ఒక జమిందారిణి, మరి నలుగురైదుగురు, నాటికే కోటికి పడగ ఎత్తినవారూ ఉన్నారు, కాని మా అయ్యగారిలాగా ఈవి ప్రదర్శించలేకపోయారంతే! దాత ఐనవారు కడులేమిలో కూడా దాతృత్వం వదలుకోలేరు, ఇంగువ కట్టిన గుడ్డ తన వాసనను ఎన్నిసార్లు ఉతికినా వదలనట్టు.

కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై
బేరైనన్ గలదే శిబిప్రముఖులుం బ్రీతిని యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!

ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై సంసోత్తరీయంబుపై
బాదాబ్జంబులపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే ల్గాదే
రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే 

మా అయ్యగారిలా అనుకుని ఉంటారు, నాలాటి వాళ్ళం ఎంతమందో ఆ స్కూల్ లో చదువుకున్నాం, నేటికి చదువుకుంటూనే ఉన్నారు.

 

25 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రామఠ కరండ న్యాయం.

 1. మత్త గజం తికజం శివ
  మెత్తగ జాంజాం గిరిగిరి మేనియు జుట్టెన్
  కొత్తగ జిలేబి కందము
  మత్తగు వాసన, గుభాళి , మా దరి వీచెన్

 2. అంతగా ముచ్చట పడితే జాంగిరి, జిలేబి ,యింగువ , వాసన, గుభాళి వలదనడమా
  కష్టే ఫలే వారు ! గోదావరి సత్తా చూపించాలె 🙂

  బీజాం గిరిరాజ తనయ
  పూజనువాసన జిలేబి పూరణ అయ్యెన్
  మా ఝరియిం గువ గువలా
  డే జాము గుభాళి శంభుడే గొని తెచ్చెన్ !

  చీర్స్
  జిలేబి
  (బీపూ మాడే 🙂 -< వీపూ మాడే 🙂

 3. Sir, మీ అయ్యవారి గొప్పదనం గురించి చదివి ఎంతో ఆనందించాము. ఇలాంటి మహానుభావుల వలననే దేశం ఇంకా బతికి ఉంది. ఆ బడిలో చదువుకున్న మీరూ గొప్పవారే సర్, ఎన్నో తెలియని విషయాల గురించి వివరంగా, ఎంతో ఓపికతో, ఇంత పెద్ద వయసులో కూడా, శ్రమకు వెరవకుండా, అమూల్యమైన టపాలు రాసి మా అందరికి జ్ఞాన దానం చేస్తునారు. మీరు కూడా ఆ విధంగా గొప్ప దాతలే. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. మీరు చిరకాలం ఇలాగే ఎన్నో మంచి టపాలు రాసి మాకందరికీ జ్ఞానాన్ని పంచాలి.

  • నాగేశ్వరరావుగారు,
   మా అయ్యగారిలాటివారు ఉన్నారు, నేటికీ. సమాజహితం కోరేవారు ఎప్పుడూ చిరంజీవులే. నిన్న పేపర్ లో చూశా ఒక తల్లి కోటి రూపాయల విలువైన స్థలం, మరో పది లక్షల సొమ్ము, వేద పాఠశాలకి దానంగా ఇచ్చారు, అమలాపురంలో. ఇటువంటివారి పేరు చిరంజీవిగా ఉండిపోతుంది కదా!
   మా అయ్యగారిని ఎరిగి ఉండటమే నా అదృష్టంగా భావిస్తాను.
   ఇక నేనేదో చేస్తున్నానన్న మీ మాట నా పట్ల మీ అభిమానమే!
   నా ఈ పనికి విఘ్నాలూ కలగజేయాలని చూస్తున్నవారూ ఉన్నారు, అమ్మ దయ ఉన్నవరకు కొనసాగుతా.
   మీ అభిమానానికి మరొక్కమారు.
   ధన్యవాదాలు.

  • జాంగిరిగారు,
   ఇంగువని పెట్టిలోదాచగలం,
   పనసపండుని ఇంట్లో దాచగలం,
   మల్లెపువ్వునీ దాచగలం,
   కాని వీటి సహజ సుగంధాలను దాచలేం. మనుషులు తెలియక ఉండేందుకు పేర్లు మార్చుకోవచ్చు, జిలేబి,జంతిక,జాంగిరి కొన్నే కావచ్చు,పేర్లు, కాని సహజ లక్షణాలను వదులుకోలేరు కదా! అదే మీ పట్ల జరిగింది.
   సమస్యాపూరణం నా వల్లకాని పని. నాది మాట కచేరీయే కాని పాట కచేరీకాదు గదా! ఆ పని సమ ఉజ్జీలైన వాళ్ళు చేయాలని చూస్తున్నా!
   ధన్యవాదాలు.

   • అంతగా ముచ్చట పడితే జాంగిరి, జిలేబి వాసన, గుభాళి వలదనడమా
    కష్టే ఫలే వారు ! గోదావరి సత్తా చూపించాలె 🙂

    బీజాం గిరిరాజ తనయ
    పూజనువాసన జిలేబి పూరణ అయ్యెన్
    మా ఝరియిం గువ గువలా
    డే జాము గుభాళి శంభుడే గొని తెచ్చెన్ !

    చీర్స్
    జిలేబి

 4. ఎంత బాగా రాసారు తాత గారూ…. రెండిటిని భలే కలిపారు. ఇన్ని విషయాలు ఇంత చక్కగా చెప్తున్న మీకు కృతజ్ఞతలు

  • చిరంజీవి స్వాతి,
   ఇందులో నాదేం లేదమ్మా! అది ఇంగువ గొప్పదనం. ఇక మా అయ్యగారి గొప్పదనం లేమిలో కూడా, నాకు చెప్పడానికి మాటలే రావటం లేదు. జీవితం లో ఒక్కటైనా అటువంటి పని చేసిపోతే……….
   ధన్యవాదాలు

  • raamudu గారు,
   మీ అభిమానానికి ధన్యవాదాలు. పెద్దలు, చేసిన పని, పేరుండిపోయేది చెయ్యమన్నారు, పది మందికీ ఉపయోగపడేది.
   ధన్యవాదాలు

 5. నమస్తే సర్. చాలా రోజుల తర్వాత బ్లాగులోకంలో అడుగుపెడుతూనే ఇంగువ మిస్టరీ, ఎల్జీ హిస్టరీ – రెండు కొత్త విషయాలు(నా మటుకు) తెలిసాయి.
  ఇక అయ్యగారు. ఆయనకి శతకోటి _/\_లు.

  • YVR’s అం’తరంగం’ గారు,
   ఇంగువ మిస్టరీ పాతదేనండి 🙂 ఇక ఎల్.జి హిస్టరీ లో నేనూ పొరబడ్డాను
   ధన్యవాదాలు

 6. శ్రీ శర్మగారికి,
  మళ్లీ చిగురించిన ఉత్సాహంతో మీరు ​వ్రాస్తున్న టపాలు ఎప్పటిలాగానే అత్యంత ప్రజోపకరంగా ఉన్నాయి.
  మరీ రంధ్రాన్వేషణ అనుకోకపోతే 🙂 చిన్న సవరణ….ఇంగువ అమ్మే లాల్జీ గోధూ (ఎల్ జి)…
  టివి లు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు అమ్మే లక్కీ గోల్డ్ స్టార్ (ఎల్ జి) ఒకటి కాదని,
  బహుశా మీరు చూసుకొని ఉండరని భావిస్తున్నాను.

  తప్పులుంటే మన్నించండి

  సుందరం

  http://www.asafoetidamanufacturers.com/

  https://en.wikipedia.org/wiki/LG_Electronics

  • సుందరం గారు
   మీ అభిమానానికి కృతజ్ఞతలు.
   లాల్జీ కంపెనీ వంద సంవత్సరాల పైబడిన భారత కంపెనీ, వీరే కొత్త వ్యాపారం లోకి వచ్చారనుకున్నా. సరి చేశాను.
   ధన్యవాదాలు

  • సత్తిబాబు గారు
   ఇంగువ వ్యాపారం చేసే కంపెనీయే ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం లోకి వచ్చిందనుకున్నానండి. సరి చేశాను
   ధన్యవాదాలు

 7. మంచి టపా పెట్టిరి మాచన ఒజ్జ !

  రామఠ కరండ న్యాయము
  మామది నింపెను మరువను మంచిది గంటిన్
  ఆ మాడభూషి వోలెన
  సామాన్యులు కూడ దాన సద్భుద్ది గొనన్

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s