శర్మ కాలక్షేపంకబుర్లు-గవళ్ళ గంగమ్మ గారి హస్తోదకం…

గవళ్ళ గంగమ్మగారి హస్తోదకమ్…

ముందుమాట:
మొన్న అమావాస్య ముందో రోజు ఓ ముఫ్ఫై ఏళ్ళ అమ్మాయి నాదగ్గరకి, తన ఏడేళ్ళ కొడుకుని మొగుణ్ణి కూడా తీసుకొచ్చి.. ”తాతగారు! కల్లు పొరొచ్చేసింది, మంచిరోజు చెప్పరా” అంది. ”అమ్మాయి! కష్టపడే వాళ్ళకి అన్నిరోజులూ మంచివే, ఐనా అడిగావు కనక చెబుతున్నా” అని చెప్పేను. చెప్పిన రోజు సాయంత్రం మా వీధి చివర కల్లు పాకేసింది, అక్కడ అలికింది, ముగ్గులెట్టింది, పూజ చేసింది, సాయంత్రం కల్లు అమ్మకం మొదలెట్టింది. నాలుగురోజుల తరవాత ఒకరోజు సాయంత్రం అలా వెళ్ళేను, కల్లు అమ్మకం జోరుగా సాగుతోంది, పక్కనే ఏడేళ్ళ కొడుక్కి చదువు చెబుతోంది, కల్లు, చీకులూ అమ్ముతూ ( చీకులేంటని అనుమానం కదూ తమరికి, మాసం చీకులు, కల్లు తాగుతూ నంజుడికి)………. నాకందుకే ఆ అమ్మాయంటే అంత అభిమానం, తను పదోక్లాస్ దాకా చదువుకుంది, పదిహేనేళ్ళుగా ఎరుగుదును, కష్టపడటానికి ఇష్టపడుతుంది. కల్లమ్ముతోంది,కుల వృత్తి, చదువు మీద అభిమానం పోలేదు, కొడుక్కి చదువు చెబుతోంది. అప్పుడు, ఎప్పటిదో మాట గవళ్ళ గంగమ్మగారి హస్తోదకం అన్నది గుర్తొచ్చి, జిలేబిగారి కామెంట్ కి సమాధానం లో వాడేను, ఇంకేముంది, జిలేబికి ఇటువంటివి పట్టుకోడం స్పెషల్ కదా 🙂 జిలేబి కోరికపై ఈ టపా…

కొన్ని విషయాలను తిప్పి చెప్పడం మనవారికి అలవాటు. వినతాసుత వాహనుడు, వినత కుమారుడు, గరుడుడు వాహనంగా కలిగినవాడు, విష్ణువు, జనకరాజసుతాపతి అన్నారు, జనకునుని కూతురు సీత, ఆమె భర్త రాముడు. ఇలా చెప్పడం కవిత్వంలోనే కాక నిత్య వ్యవహారంలోనూ ఉంది. బుర్ర రామకీర్తన పాడిస్తా అంటే కొడతానని కదా! అటువంటిదే ఈ ”గవళ్ళ గంగమ్మగారి హస్తోదకం” కూడా. అదేదో చూసేముందు మరో చిన్న కత చెప్పుకుందాం బలే పసందుగా ఉంటుంది. ఇది చాలామందికి తెలిసినదే గుర్తుచేస్తున్నానంతే….

ఒకల్లుడు అత్తవారింటికెళ్ళేడు. భోజనమైన తరవాత తాంబూలం సరుకులు ఉయ్యాలబల్ల మీద పెట్టి వెళ్ళింది, భార్య. ఈయన భోజనం చేసొచ్చి అక్కడే ఉన్న సిసింద్రీ,సీమ టపాకాయ మరదలుతో కబుర్లాడుతూ తాంబూల చర్వణం చేస్తున్నాడు. సున్నం నిండుకుంది, అయిపోయిందన కూడదు, నిండుకుందనాలి. భార్యని పిలిస్తే పలికే సావకాశం కనపడలేదు, ఎదురుగా ఉన్న మరదలితో ఇలా అన్నాడు, పద్య రూపంలో, మరదలితో సరసమాడుతున్నానుకుంటూ ….

”పర్వతశ్రేష్ఠ పుత్రికా పతి విరోధి
అన్న యిల్లాలి అత్తను కన్నతండ్రి
ప్రేమ నిండారు ముద్దుల పెద్ద పుత్రి
సున్నమిప్పుడు తేగదే సుందరాంగి.”

పద్యం విన్న సిసింద్రీ మరదలు పిల్ల మెలికలు తిరిగిపోలేదు,బావాగారేదో పొగిడేస్తున్నాడనుకుని, వెంటనే లోపలికిపోయి సున్నం పట్టుకొచ్చి ఇస్తూ ఈ పద్యం చెప్పింది.

శతమఖుసతి యగు శచికిని
సుతుడగు వాని పినతండ్రి సూనుని మామన్
సతతము తలదాల్చెడి దొర
సుతవాహన వైరి వైరి సున్నంబిదిగో.

పద్యం విన్న బావాగారి మొహం మాడిపోయిన పెసరట్టులా నల్లబడిపోయింది, మాడిపోయింది. అసలాయనేమన్నాడు, దానికా సీమటపాకాయ పిల్ల చెప్పిన సమాధానమేంటని కదా అనుమానం, అవధరించండి.

(పర్వత శ్రేష్ఠుడు హిమవంతుడు, హిమవంతుని పుత్రిక పార్వతి, పార్వతి పతి శివుడు, శివుని విరోధి మన్మథుడు, మన్మథుని అన్న బ్రహ్మ, బ్రహ్మ యిల్లాలు సరస్వతి, సరస్వతి అత్త లక్ష్మీదేవి, లక్ష్మీదేవి కన్నతండ్రి సముద్రుడు, సముద్రుని ప్రేమ నిండారు ముద్దుల పెద్దపుత్రి జ్యేష్ఠాదేవి, సున్నమిప్పుడు తేవే సుందరాంగి – అన్నాడు)

పద్యంలో పెద్ద గంభీరంగా ధ్వనించినా నిజానికి ‘ఓ జ్యేష్ఠా (అంటే దరిద్రపు పెద్దమ్మ అన్నమాట)! సున్నం తెచ్చిపెట్టవే!’ అని అన్నాడన్నమాట.ఓసి! జ్యేష్టాదేవీ అని తిట్టేడనమాట

దానికా సిసింద్రీ మరదలిచ్చిన జవాబు పద్యానికి అర్ధం

(నూరు యజ్ఞాలు చేసినవాడు ఇంద్రుడు, ఇంద్రుని భార్య శచీదేవి, శచీదేవి కుమారుడు జయంతుడు, జయంతుని పినతండ్రి ఉపేంద్రుడు, ఉపేంద్రుని కుమారుడు మన్మథుడు, మన్మథుని మామ చంద్రుడు, చంద్రుని సతతము తలమీద ధరించే దొర శివుడు, శివుని కుమారుడు వినాయకుడు, వినాయకుని వాహనము ఎలుక, ఎలుకకు శత్రువు పిల్లి, పిల్లికి శత్రువు కుక్క, సున్నమిదిగో – అని అర్థం) (.పద్యాలు గుర్తులేక గూగుల్ లో వెతికితే దొరికాయి అర్ధాలతో’లక్ష్మి దామరాజు’ గారి వద్ద, వారికి కృతజ్ఞత.)

 ”ఓసి! జ్యేష్టాదేవీ సున్నం తేవే” అంటే ”ఒరే! కుక్కా ఇదిగో సున్నం” అని తెచ్చిఇచ్చిందనమాట.అందుచేత  అతి తెలివి ప్రదర్శిస్తే మూతిపళ్ళు రాలతాయి. మరదలుపిల్ల మెత్తటి చెప్పుతో చెంప ఛెళ్ళు మనిపించింది, బాగుంది కదూ.

ఇదేంటీ గవళ్ళగంగమ్మగారి…చెబుతానన్నారు కదా అంటారా! వస్తున్నా.

తెనుగునాట ’గౌడ’లు కల్లు గీసి అమ్ముతారు. వీరిని పల్లెలలో ’గవడలు’ అనడం వాడుకలో ’గవళ్ళు’ అనడమూ ఉంది. వీరిలో మగవారు కల్లుగీస్తారు, కల్లుదించి తెచ్చి ఒక చిట్టిమట్టాకు కుండలో వేసి భార్యకి అప్పజెపుతారు కల్లు, అమ్మకానికి. ఆమె ఏడుగజాల చీరగట్టి, నుదుట రూపాయిబిళ్ళంత బొట్టుపెట్టి, తలను కొప్పుపెట్టి, కాళ్ళకు అందెలు, కడియాలూ; చేతులకు మురుగులూ తోడాలతో, లక్ష్మీ దేవి అవతారంలా కల్లుకుండ వెనక ’లొట్టి’తో కల్లు కుండలోంచి తీసి మరొక లొట్టిలో పోసేదామె, పాతకాలంలో.  కల్లు పోసే ముంతనీ ’లొట్టి’ అంటారు, తాగే ముంతనీ లొట్టి అనే అంటారు. ఇప్పుడు కల్లు ముంతలులేవు, ప్లాస్టిక్ గ్లాసులే. గంగమ్మ అని ఎందుకన్నారు?, గంగ సర్వాన్నీ పవిత్రం చేస్తుంది కనక గవళ్ళ గంగమ్మ గారన్నారు.

ఇక హస్తోదకం?. ’హస్తోదకం దత్వా’ చాలా చెప్పాలిగాని భోజనానికి ముందు చెయ్యి కడగడమే హస్తోదకమంటే. భోజనం ముందూ తరవాతా చెయ్యికడగాలని చెప్పడం. దీనినుంచే.  ‘మా ఇంట చెయ్యి కడగండి’ అంటే ‘మా ఇంట భోజనం చెయ్యండి’ అని అర్ధం, ఈ మాటా అలా పుట్టేయి. ఇప్పుడు రోజుల్లో ”మీ ఇంట భోంచేసి మా ఇంట చెయ్యి కడగండంటు”న్నారు, నేటి మేధావులు. గవళ్ళ గంగమ్మగారి హస్తోదకం తీసుకుంటే ఏముంటాయక్కడా? చీకులు, కల్లు కదా! ”ఏరా! చీకులు నమిలి, కల్లు తాగొచ్చావా?” అని అడిగితే మోటుగా ఉంటుందని, తిక్క తిక్కగా వాగేవాళ్ళని ”గవళ్ళ గంగమ్మగారి హస్తోదకం పుచ్చుకున్నావా?” అని సున్నితంగా అడగడం అలవాటు చేసుకున్నారు.

అదండి గవళ్ళగంగమ్మగారి హస్తోదకం కత

 

25 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గవళ్ళ గంగమ్మ గారి హస్తోదకం…

 1. ఎప్పుడొ చిన్నప్పుడు పెద్దబాలశిక్ష లో చదివాను ఈ చమత్కార పద్యాలు. ఇక్కడ మీవల్ల మళ్ళీ చూస్తున్నాను. సంతోషంగా వుంది.

  మా నాన్నమ్మ చెప్పేవారు – ఏక వాక్య సుందరకాండ – గుర్తున్నంతవరకూ ఇక్కడ రాస్తున్నాను. దీనికి ముందూ వెనకా ఇంకేమయినా వున్నాయెమో తెలీదు. పెద్దవారు మీకేమయినా తెలిస్తే చెప్తారని.

  అంచిత చతుర్ధ జాతుడు పంచమ మార్గమున పోయి ద్వితీయంబు దాటి తృతీయంబప్పురినుంచి ప్రథమ తనూజను గాంచెన్

  పూజ్యుడయిన హనుమంతుడు (పంచభూతాలలో నాల్గవదయిన వాయుపుత్రుడు) ఆకాశ (పంచమ) మార్గమున వెళ్ళి సముద్రము (రెండవదయిన నీరు) దాటి, లంకా నగరానికి నిప్పు (మూడవది అయిన అగ్ని) సీతా దేవిని (మొదటి పంచభూతమయిన భూమి పుత్రిక) చూసెను.

  • లలితా జి,
   నమస్సులు. నాది శ్రుత పాండిత్యం. 🙂 కాలక్షేపం చేసేస్తున్నా! మంచి మాట చెప్పేరు.
   ధన్యవాదాలు.

   • డింగరి బొంగరి జాంగిరి
    బింకము జూడన జిలేబి బీటుగ నుండెన్
    వంకన యిద్దరు నిట్టుల
    బొంకుల బేర్చిరి పదముల బోండా నిటులన్ 🙂

 2. కొంతలు కొంతలుగ కల్లు
  ముంతల పలు వంతుల
  పంతమున తడప గొంతుల
  చెంతగ నిలిపి ఇంతుల
  పంతులు* గారిట సంతసమందెనహో!

  *టీచర్

  లోల …

   • మీరన్న దానిలో సత్యం లేకపోలేదు. కానీ ఇక్కడో రహస్యాన్ని విప్పక తప్పదు.
    చూట్టానికి నేను ఆ పార్టీలో ఉన్నట్లు కనపడినా నిజానికి మీ తరపున అక్కడున్న
    కొవర్ట్ క్రిందే లెక్క. కనుక నన్ను దయచేసి అపార్ధం చేసుకోవద్దని ప్రార్ధన. టైం వచ్చినప్పుడు
    ఈ విషయాన్ని ఋజువు పరచుకొన గలవాడను (అవకాశమున్నచో నా ఈ కామెంట్ మాతాశ్రీ కంట పడకుండా ఉండేట్లుగా పబ్లిష్ చేయగలరు)
    🙂

  • nmraobandi గారు,
   మీరు చెప్పినట్టే చేసేనండి. ఇది అమ్మవారి కంట పడకుండా కాపాడు దేవుడా అని ప్రార్ధిస్తున్నానండి.
   ధన్యవాదాలు.

   • చూచితి చూడక చూచితి
    కాచితి ఈ మారు మిమ్ము కావ్యపు బండీ:)
    మీ చిరునగవుల స్మైలీ
    మీ చక్కని కవిత జూచి మిమ్ము విడిచితీ 🙂

   • చూడగ చివరికి బండిన
    నేడే చూడండి! అయి పోయెను సుమండీ:)
    మీ చిరు పదముల గ్రోలీ,
    మీ చిక్కని మమత జూచి, హమ్మా గడిచితీ:)

 3. టపాద్భుతః!!
  సర్, ఇప్పటి వరకూ నేను చదివిన మీ పోస్టుల్లో ఇది, ఉండి మునసబుగారింట్లో భోజనం గురించి రాసినది – రెండూ నా ఫేవరెట్లు.
  వసంతాచమన పదప్రయోగంతో నా మిడిమిడి తెలుగుజ్ఞానానికి ఒక పదం ముందుకు పడింది. పనిలో పని దానిపైనా ఒక పోస్ట్ వ్రాయండి. _/\_

  • చి.YVR’
   అభిమానానికి ధన్యవాదాలు.
   ’వసంతాచమనం’ పద ప్రయోగం లేదు. జిలేబి గారీ రెండు పదాలని వాడారు ఒకచోట విడి విడిగా. నేను వాటిని సంధి చేసి వసంతాచమనం చేశానంతే. వసంతాచమనం అంటే గవళ్ళ గంగమ్మగారి హస్తోదకం పుచ్చుకోవడమే. వెయ్యండి జిలేబిగారికి వీరతాళ్ళు 🙂

   ధన్యవాదాలు

   • మాచన జేయగన వసం
    తాచనమును జూసెను సరి తాళము వేసెన్
    ఆచార్య ! అంత మాత్రమె !
    మీ చిర కాలపు పరిచయ మే యిది నేర్పెన్ 🙂

   • YVR గారూ, శర్మ గారిని భోజనానికి ఆహ్వానించింది రాయవరం మునసబు గారని చదివినట్లు గుర్తు. కరక్టేనా శర్మ గారూ?

 4. కొన్ని రకాల సరుకులకి డోర్‌డెలివరీ సౌకర్యం ఉంటే బాగుంటుంది కదా, అది కూడా పెరటి గుమ్మం వైపు 🙂

  • విన్నకోట నరసింహారావుగారు,
   మీరెక్కడో చాలా పాత కాలం లో ఉన్నారు సారు! కొత్త కాలం లోకి రండి 🙂 ఇప్పుడన్నీ డోర్ డెలివరీయే! ఏ ఇంటికి పెరటి గుమ్మాలు లేవు. అన్నీ రహదారి రాజద్వారం గుండానే జరుగుతున్నాయండి. 🙂
   ధన్యవాదాలు

 5. “గవళ్ళ గంగమ్మ గారి హస్తోదకం” మీ వీధిలోనే మీ ఇళ్ళ పక్కనే అమ్మనిస్తున్నారా మీ వీధిలోని వారందరూ? పైపెచ్చు మీచేతే ముహూర్తం కూడా పెట్టించుకుని మరీ!
  అంతేలెండి ఎవరినీ ఏఁవీ అనగలిగే రోజులు కాదుగా. మన వీధిలోనో, స్కూల్ పక్కనో, గుడి పక్కనో బ్రాందీ షాపు, బారు పెడితే ఏం చెయ్యగలుగుతున్నాం!

  • విన్నకోట నరసింహారావుగారు,

   ఉన్నమాటన్నారు. నిజం బార్లూ వగైరాలు పెడితే ఏంజేస్తున్నాం 🙂

   ఈ అమ్మాయి నిక్కచ్చి కల్లే అమ్ముతుంది, కల్తీ చెయ్యదు. (కల్లులో డైజీపాం కలుప్తారు, ఎక్కువ మత్తుకోసం) చెట్టునుంచి దింపినవెంటనే సీసాల్లో పట్టుకుపోతారు క్యూ లో నిలబడి. సాయంత్రం ఆరుకు కాని కొట్టు తీయదు, ఎట్టి పరిస్థితులలోనూ. తొమ్మిది దాటితే కొట్టు ఉంచదు. తాగడానికొచ్చినవాడు తాగిపోవాలి, నోరు లేచిందో అమ్మాయి ఎడం చెయ్యి లేచినట్టే. కుక్కినపేనులా తాగిపోతారు, మాటాడరు. తాగిన గ్లాసొక్కటీ బయట కనపడదు. అంతా శుభ్రంగా ఉంటుంది. చాలా బార్ ల కంటే చాలా మేలు 🙂
   ధన్యవాదాలు.

   • Zilebi గారు,

    వసంతాచమనం మితంగా చేస్తే ఈ వేసవిలో ఆరోగ్యానికి మంచిది, ముంజలు తినటం లేదూ? అవేంటీ? 🙂
    పెద్దరికం ఒకటేడిసింది కదూ:)
    ధన్యవాదాలు.

 6. లొట్టిన గవళ్ళ గంగను
  బెట్టెను బెట్టుగ జిలేబి బేగిర ఆడన్
  పట్టెగ పలకా బలపము
  నిట్టగ అబ్బాయి చదువు నిష్టగ సాగన్

  జిలేబి

  • జిలేబిగారు,
   ఈ మధ్య మీ పద్యాలెలాగూ అర్ధంకావనుకోండి. మరీ ములగచెట్టెక్కిచ్చేస్తున్నారు 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s