శర్మ కాలక్షేపంకబుర్లు-హమ్ తుమ్ ఏక్ కమరేమె బంద్ హో(పెద్దలకు మాత్రమే)

హమ్ తుమ్ ఏక్ కమరేమె బంద్ హో(పెద్దలకు మాత్రమే)

న్యాయాధిపతి భాస్కరుడు గారు, నాకు, నా ఇల్లాలికి గృహ నిర్బంధం శిక్ష ఏ.సి రూం లో వేసేరు కదూ! నిజంగా అది శిక్షా? 🙂 వరమా?

ఉదయం నాలుక్కి లేచి కాలకృత్యాలు, కంప్యూటర్ సేవలు, స్నానాదికాలూ,మొక్కలకి నీళ్ళు, తోటపని పూర్తిచేసుకునే సరికి ఎనిమిదిదాటుతుంది.. గత రెండు నెలలు పైగా వంటింటి ఇంఛార్జి కోడలేగా! టిఫిన్ రెడీ అంటోందా సరికి.

ఇద్దరమూ అప్పటికి తయారైపోయి, ఏ.సి వేసుకుని కూచుని, టిఫిన్ చేయడంతో శిక్షా కాలంలో రోజు మొదలవుతోంది 🙂 ఆవిడకిష్టమైన సీరియళ్ళు చూసేసి ఆవిడతో పాటునవ్వడం, (ఏం వినపడదుగా ఆవిడనవ్వితే నవ్వెయ్యడమే)మధ్య మధ్య పానీయాలు కోడలు తెచ్చివ్వడం, వాటిని సేవించడం. మధ్యలో అబ్బాయి, మనవరాలు వచ్చి బయటికెళుతున్నామనో, వచ్చేమనో చెప్పడం, ఏదో తెచ్చేమని చూపించడం, నాకు నచ్చిన పేపరు విశేషాలు ఇల్లాలితో పంచుకోవడం…ఆవిడకిష్టమైనవి తను చదివి వినిపించడం, తను చెబుతోంటే వినపడకపోతే ”చెముడా అంటే మొగుడా అని” తియ్యగా విసుక్కోవడం…ఇలా కాలం గడచి పన్నెండున్నారా అవుతోంది. కోడలు భోజనాలు అక్కడే పెట్టేసి తినెయ్యమంటూంటే, బయటికొచ్చే పనే లేదు. కరంటు పోవడం లేదు. పోయినా బాధాలేదు, సోలార్ మూలంగా ఫేను, టి.వి నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటాయి. డెస్క్ టాప్ అక్కడ పెట్టుకునే వీలు లేకపోయింది… ఉంటేనా 🙂

భోజనం తరవాత భుక్తాయాసం తీర్చుకోడానికి కొద్దిగా కునకడం, సీరియళ్ళకోసం లేవడం 🙂 మళ్ళీ సీరియళ్ళు చూసి ఖాళీ సమయంలో చిన్నప్పుడు, అనగా ఇల్లాలి పదో ఏట, నా పద్నాలుగో ఏట ప్రారంభమైన మాప్రేమ కధ, జగడాలు, పెళ్ళి,మా పెళ్ళి ఒక పెద్ద కథ, ఏభై ఐదేళ్ళ కితం, ఆరోజులకి అదే ఒక సంచలనం. ఆ తరవాత జీవితం లో అనుభవించిన సుఖాలు, దుఃఖాలు, పిల్లలు,చదువులు,పెద్దలు కాలం చేయడం, పిల్లలు పెళ్ళిళ్ళు,, మనవలు, ఆర్ధిక చిక్కులు, ఒకటా రెండా, జీవిత కధని మరో సారి నెమ్మదిగా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ….మధ్యలో కోడలిచ్చిన టీ సేవిస్తూ, కొనసాగుతూ..మా జీవిత కథ సీరియల్ అలా మొదలయింది.. 🙂

ఇలా సాయంత్రమైతే, బయటకోసారి వచ్చి కాల కృత్యాలు తీర్చుకుని మళ్ళీ లోపలికెళిపోతే, బతుకు సీరియలో, టి.వి సీరియలో చూస్తూ, భోజనం కానిచ్చి నెమ్మదిగా తొమ్మిదికి పక్క ఎక్కేస్తే…. తెల్లారుగట్ల నాలుగు… అమ్మయ్య రోజు గడిచిపోయింది హాయిగా….

ఇలా శిక్షాకాలం గడుస్తోంటే మొదటి వారమూ మరెవరినీ తలుచుకోకపోవడంతో అందరి కి
భయమేసింది, ఏమయ్యమో అని. అదీ సంగతి.

ఈ శిక్షలేకపోతే గడచిన అరవై ఏళ్ళ జీవితాన్ని, జీవిత అనుభవాలను మళ్ళీ ఇల్లాలితో తీరుబడిగా కూచుని జ్ఞాపకం చేసుకోడం జరుగుతుందా?చిన్న తనం లో అచ్చట్లు, వయసులో ముచ్చట్లు, ఎలా జ్ఞాపకానికొస్తాయి? ప్రేమలు,అభిమానాలు….. జీవితంలో పొందిన పురస్కారాలు, సంఘాన్ని ఎదిరించినందుకు జరిగిన తిరస్కారాలు, పడిపోయిన ప్రతిసారి ఒకరినొకరు ఓదార్చుకున్న సంఘటనలు, పంటి బిగువున దాటిన కష్టాలు, కష్టాలలోనూ ఒకరిని ఒకరం ఉత్సాహపరచుకున్న సంఘటనలు,ఎంత కష్టమైనా బయటివారికి తెలియనివ్వకుండా బతికిన రోజులు, దెబ్బలాడుకున్న సంఘటనలు, రోజుల తరబడి అలకలు, బుజ్జగింపులు, కలయికలు,ఆనందాలు ,ఎన్నెన్నో ఒకటా రెండా, చెప్పుకుంటూ పోతే అదే ఒక చాటు భారతం….ఇన్నిటిని తలుచుకోడానికిచ్చిన శిక్షాకాలం తక్కువేమో! పొడిగించమందామనుకుంటున్నాం 🙂

నేటి కాలంలో ఉమ్మడి కుటుంబాలూ తక్కువే. ఉన్న కుటుంబాలలో కోడళ్ళు అత్తమామలని చూడటమూ తక్కువే. అలా విసుక్కోకుండా చూసిన కోడళ్ళని ఆదరించి,ప్రేమాభిమానాలు పంచిన అత్తమామలూ తక్కువే! మరి ఇన్నిటిని కలగజేసిన భాస్కరునిది శిక్ష కాదు వరమే 🙂

ఇలా గడిపేస్తూ ఎవరిని పలకరించకపోతే, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఒకరి తరవాత మరొకరు, ఫోన్లో పలకరిస్తూంటే…ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తుంటే…ఇంతకు మించి ఏమున్నది? ఏమికావాలి ఈ జీవితానికి?

మళ్ళున్నా మాన్యాలున్నా మంచె మీద మనిషుండాలి… పాడి ఉన్నా పంటలు ఉన్నా పంచుకునే మనిషుండాలి…ప్రేమ అభిమానం మనం వ్యక్తం చేయాలి, అది ఇతరులు మనపట్ల వ్యక్తం చేస్తే ఆనందించాలి. మనల్ని అభిమానించేవారిని నిరాదరం చేస్తాం, మనల్ని అభిమానించేవారి దగ్గరే మనం సంతోషంగా ఉండగలం సుమా !

డబ్బు ఉండడం లేకపోవడం కంటే ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం, అనుభవించడం చేతనై ఉండాలి 🙂

  జీవితం లో ప్రేమ,అభిమానం పంచడమే అలవాటయిపోయింది, చాలా మంది, హితులు,మిత్రులు,  బంధువులు, మనసిచ్చిన చిన్నారులు, ఎందరో,ఎందరో… తీరిబడిగా తలుచుకోవడానికిసావకాశం… ఈ శిక్ష వరమే>>>
శిక్ష పొడిగించమని మహజరు పెట్టుకోవాలనుకుంటున్నాం! 

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-హమ్ తుమ్ ఏక్ కమరేమె బంద్ హో(పెద్దలకు మాత్రమే)

  1. చాలా బాగుంది. అభినందనలు. మాకు కూడా ఇలాగే చాలా సౌఖ్యంగా రోజులు గడచి పోతున్నాయి. అంతా ఆ భగవత్కృప. ధన్యవాదాలు.

    • సుబ్రహ్మణ్యం నిష్ఠలగారు,
      పెడితేనే పుడుతుందంటారు కదండీ 🙂 ఏదైనా అంతే…పిల్లలు అలా చూస్తున్నందుకు వారిని అబినందించాల్సిందే! ఎప్పుడూ తాతతాగిన బోలి తలవాకిట్లోనే ఉంటుంది కదూ, మంచైనా, చెడ్డయినా 🙂
      ధన్యవాదాలు.

  2. గ్రహ స్థితులు బాగా లేనప్పుడు అమావాస్య పౌర్ణమి పరిధుల లో భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయని బ్లాగ్జ్యోతిష్ శర్మ గారి ఉవాచః !

    మీ ఈ గృహ నిర్బంధం “ఆ” గ్రహ స్థితుల వల్లే నేమో ! కాలము తెచ్చును సర్వదా మార్పులన్ వేచి ఉండవలె !

    గృహమున నిర్బంధము ఆ
    గ్రహముల మూలపు ప్రభావ గ్రహపా టుయటన్ ?
    అహరహము అమ్మ తలపు భ
    వహరము మాచన ! జిలేబి వచనము యిదియే !

    జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s