శర్మ కాలక్షేపంకబుర్లు-నా మాటా వినవయ్యా! కాస్తంత!!

నా మాటా వినవయ్యా! కాస్తంత!!

ఈ రోజు ఉదయం నుంచీ వేడి ఎక్కువగా ఉంది,ఎండలేకపోయినా. మనసూ వ్యాకులంగా ఉంది, ఉదయం నుంచీ, ఈ కింది పాట శ్రీ తాడిగడప శ్యామలరావుగారి బ్లాగులో చూశా, అప్పటినుంచి ఈ పాట నన్ను పట్టుకుంది, రాత్రి తొమ్మిదికి కూడా వేడీ తగ్గలేదు నేడు, నా మనసులోని వేడీ తగ్గలేదు, అదిగో అప్పుడు కూచుని నాకుతోచిన నాలుగు మాటలూ రాస్తేగాని మనసుకి ఊరట కలగలేదు. ఈ మొరపెట్టుకుంటున్న సామాన్యుడిని నేనే అనిపించింది….

నీ మాట విందునని నా మాట విందువా
నీ మాటనే సతము నెగ్గించుకొందువా

తోలుతిత్తులలోన త్రోయుట మానుమని
వేలమారులు నిన్ను వేడితే వింటివా
నేల మీద నేను నిలబడి యాడితే
చాలు వేడుక నీకు సంకటము నాకు                                నీ మాట

కామాదులకు చిక్కి కటకట బడనీక
ప్రేమతో బ్రోవుమని వేడితే విందువా
ఏమోమొ చెప్పేవు యేమార్చి పంపేవు
నీ మాయ నీశ్వరా నామీద జూపేవు                                  నీ మాట

ఇర్వుర మొక్కటా యిడుము లన్నియు నాకా
యుర్విపై నాయాట లున్నది నీ కొఱకా
సర్వేశ్వరా యింక చాలునంటే వినవు
పూర్వస్థితిని పొంద బుధ్ధాయె నాకు                                    నీ మాట

ఒక సామాన్య భక్తుడు భగవంతునితో పెట్టుకుంటున్న మొర. ఈ సామాన్యుడికి భగవంతుడు సాకారుడా? నిరాకారుడా? అన్న ప్రశ్నగాని అసలు దేవుడున్నాడా? లేడా? అన్న ప్రశ్న లేనివాడు. సర్వాత్మనా భగవంతుడున్నాడని నమ్మేవాడు. ఎలా ఉన్నాడని ”కలడంబోధి కలండు గాలి” అన్నట్టూ, ”ఇందుగలడందులేడను సందేహమువలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు”అని మాత్రమే తెలిసినవాడున్నూ. కనపడని గాలిలోనూ, కనిపించే రాతిలోనూ భగవంతుని దర్శించేవాడు. ఇతనికి శషభిషలు తెలియవు, గౌరవాలూ, మన్నింపులూ,మర్యాదలూ తెలియవు. భగవంతుడు కూడా తనలాటివాడే అనుకునే సారూప్య భక్తి మార్గాన్ని ఎంచుకున్నవాడు. ఇతనికి ద్వైతం,అద్వైతం మరోటి, మరోటి ఏమీ తెలియవు. మంత్రాలు తెలియవు, పూజలు చేతకావు, ముడుపులు కట్టలేడు. మరి ఏం తెలుసు ఆత్మ సమర్పణ తెలుసు, శరణాగతి తెలుసు ఎలా? ”నీవేదప్ప ఇతఃపరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!” అని శరణాగతి చేయడం తెలుసు. అది కూడా భగవంతునితో మొరపెట్టుకోవాలి అంతే తెలుసు. ఇటువంటి అజ్ఞాని ఏమని మొరపెట్టుకుంటాఉన్నాడయ్యా అంటే……

“పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయాపారే పాహి మురారే” మళ్ళీ పుడుతున్నా మళ్ళీ చస్తున్నా, మళ్ళీ మళ్ళీ జరిగే ఈ చక్రభ్రమణాన్ని ఆపమని వేడు కున్నానయ్యా! ఏదీ నువ్వు విన్నావా!! లేదే మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూనే ఉన్నావు, మళ్ళీ మళ్ళీ చస్తూనే ఉన్నాను.పుట్టిన ప్రతిసారి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాననుకుంటాను, ఈ శరీరంతో. పోనీ ”ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై…..కాయంబు నాపాయమే” ఈ బుద్ధేనా ఉంటుందా? ఉండదు ఈ సంసారచక్రం నుంచి తప్పించవయ్యా! అంటే చిద్విలాసంగా నవ్వుతావు, నా మాట వినవయ్యా! కాస్తంత!!

 నేను ఇలా పుట్టి, భూమి మీద లేచి నిలబడితే చాలు అదో ఆటలా ఉంటుంది,నీకు. నా తాపత్రయం చూసి నీకు వేడుకగా ఉంటుంది, ఆటగానూ ఉంటుంది. ఆ తరవాత నేను చేసే పనులేవో నాకే తెలియనంత మోహం నా మీద కప్పుకుపోతుంది. నీకు,. నా తాపత్రయం చూసి  వేడుకగా ఉంటుంది, ఆటగానూ ఉంటుంది. ఇదేమో నాకు ప్రాణ సంకటంలా ఉంటుంది, నీకేమో చెలగాటం.  ”పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం” అన్నట్టు ఉంటుంది, నీకేమో ఆటలా ఉంటుంది. నా మాట కాస్తంత చెవినేసుకోవయ్యా బాబూ!!!

కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అంతర్గత శత్రువులట, అవేంటో నాకు తెలియదు, నాకు ఆశ తెలుసు, మోహం తెలుసు, పాశమూ తెలుసు, ప్రేమ, అభిమానం తెలుసు, వీటిలో చిక్కుకుపోయి ఎన్నో చిక్కులు పడుతున్నాను. ఆ తరవాతవి నా ప్రమేయం లేకుండానే నన్ను చుట్టుకుంటున్నాయయ్యా! వీటి నుంచి కాచి కాపాడూ, మళ్ళీ మళ్ళీ పుట్టించకయ్యా విసిగిపోయాను, వేసారిపోయానూ అని మొర పెట్టుకుంటే ఏమన్నావు? అదేం కాదురా బిడ్డా! నువ్వు నాలో కలవడానికి ఇంకా సాధన సరిపోదురా! మరో జన్మ ఎత్తు అని అచ్చిక బుచ్చిక మాటలు చెబుతున్నావు, నీ మాయలో పడి నేను సరే నని బుర్ర ఊపుతున్నాను, విష్ణుమాయలో పడిపోతున్నాను. మళ్ళీ సంసార చక్రంలో పడిపోతున్నాను, వద్దయ్యా స్వామీ ఈ సంసారచక్రం నుంచి విడిపించూ, అంటే వినిపించుకోవే, నా మాటా కాస్త చెవినేసుకోవయ్యా!

ఇక్కడి కొచ్చేటప్పటికి ఈ సామాన్యుడికి కూడా కొంత ఆలోచనొచ్చింది. నువ్వూ నేనూ ఒకటే ”అహం బ్రహ్మస్మి” నేను దేవుడిని, ఏకమేవా “అద్వితీయం బ్రహ్మ” భగవంతుడొకడే రెండవవాడు లేడూ అంటున్నారు, మరటువంటపుడు ఇలా పుట్టడం చావడం కష్టాలు పడటం నావంతా! ఇదేమయ్యా!! అన్యాయం, నేను భూమి మీద పుట్టి కామంతో పనులు చేస్తుంటే, నీకేమో ఆటగా ఉందా? వద్దయ్యా! ఇంక ఈ ఆట భరించలేను, ఆడలేను, ఈ ఆట, చెరలాటనుంచి తప్పించు, మళ్ళీ ఒకప్పటి నా స్థానం నాకిప్పించు అని మొరపెట్టుకుంటున్నాడు.

అసలు పూర్వ స్థితి ఏదీ? ”ఒకపరి జగముల వెలినిడి ఒకపరి లోపలికి గొనుచు నుభయము తానై” ఒక సారి ఈ సర్వజగత్తునూ నీ నుంచి బహిర్గతం చేస్తావు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు లక్కబొమ్మల్ని బుట్టలోంచి బోర్లించినట్టు, మళ్ళీ నీ ఆడుకోడం పూర్తవగానే, చిన్న పిల్లలు బొమ్మల్ని బుట్టలో దాచినట్టు లోపల సద్దేసుకుంటావు. ఇలా కాక ఒకప్పుడు ఈ సద్దుకోడం లో బయట పొరబాటుగా మరచిపోయిన బొమ్మలా మిగిలిపోయానేమో నని భయమయ్యా బాబూ. ఈ బాధ భరించలేనూ అంటున్నాడు…..పరమేశ్వరా! చాలునీయాట, కాని, నీ మాటే నెగ్గుతోంది ప్రతిసారీ..

పొరబాట్లు మన్నించండి…

 

ప్రకటనలు

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నా మాటా వినవయ్యా! కాస్తంత!!

 1. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  చాలా చక్కగా వ్యాఖ్య వ్రాసారు. ఆ కవి హృదయాన్ని మీ మాటల్లో పలికించారు. పుట్టిన మనిషిలోని మనసు మాత్రమే పరిపరివిధాల పోకడలు పోతూవుంటుంది. ఆ పోకడలను సాక్షి రూపంగా గమనించేదే ఆ పరమాత్మ. నేను అనుకుంటున్న భావాన్ని తీసివేసి, అందులో నేను చైతన్యాన్ని అనుకుంటే అంతా ఆనందమే.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • మిత్రులు మాధవరావు గారు,
   పాట కదిలించింది. సామాన్యుడి వేదన అందులో ఉంది, మనసు పరిపరి విధాల ఆలోచించడమూ, ఆర్తీ ఉన్నాయి. నాకు తోచిన మాటల్లో వెలిబుచ్చాను.
   ధన్యవాదాలు.

  • మిత్రులు శ్యామలరావుగారు,
   మీ పాట నన్ను కదిలించింది,ఏదో రాయాలనిపించింది కాని, ప్రకృతి శరీరం సహకరించలేదు, చాలా సేపు… రాత్రి తొమ్మిదికి మొదలెట్టి పూర్తి చేస్తేగాని నిద్దర పట్టలేదు. సామాన్యుడి వేదన బాగా వెలిబుచ్చారు.
   మీ భావం సరిగా చెప్పలేకపోయానేమో అనుకున్నా!
   ధన్యవాదాలు.

 2. తత్పర పరాత్పరాత్పర
  మత్పర చిత్పరమువోలె మారుతి నాత్మన్
  సత్పుర రాముని సన్నిధి
  తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్ !

  శివోహం !
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s