శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితం-పరమపద సోపాన పటం.

Photo0003

జీవితం-పరమపద సోపాన పటం.

పరమపద సోపాన పటం కష్టే ఫలి బ్లాగులో పెడితే మిత్రులు శ్రీ తాడిగడప శ్యామలరావుగారు ఆశువుగా ఒక పాట రాశారు, దానిమీద నేనొక టపా రాశాను. దానికి శ్యామలరావుగారి కామెంట్ మూలంగా ఈ టపా రాయాల్సివచ్చింది. 🙂

పరమపదించేరు అంటే చనిపోయారు అని అర్ధం చెబుతున్నారు. అంతకుమించి భగవంతుని చేరుకున్నారన్నది చెప్పుకోవలసిన అర్ధం. పరమపద సోపాన పటం అన్నది ప్రతి ఇంటిలోనూ ఉండేది,ఏభయి ఏళ్ళకితం. ఆ తరవాతేమయిందోగాని కనుమరుగైపోయిందీ ఆట. ఈ ఆట ఆడటానికి పటంతో పాటు నాలుగు గవ్వలు, కావాలి, పావులుగా ఏవో ఒకటి వాడుకోవచ్చు. గవ్వలు ఇంట్లో ఉండకూడదు, గవ్వల శబ్దం వినపడకూడదు అనే పిచ్చి నమ్మకాలూ పెరిగాయి, ఆమధ్య. నేటి కాలంలో మళ్ళీ ఈ ఆట కనపడుతూ ఉంది, పిల్లల దగ్గర. ఇదివరలో పిన్నలు,పెద్దలూ కూడా ఆడేవారు.ఈ ఆటకి మరో పేరు వైకుంఠపాళీ. జీవితమే వైకుంఠ పాళీ

ఈ ఆట ఎంతమంది ఐనా ఆడుకోవచ్చు, ఆటకి ఉన్న నియమాలూ తక్కువే, అన్నీ పటంలోనే కనపడతాయి. నాలుగు గవ్వలూ గిలకరించి వేస్తే అన్నీ బోర్లా పడితే ఎనిమిది లెక్క. ఒక్కటి వెల్లకిలా పడి,మిగిలినవి బోర్లా పడితే అప్పుడు ఒకటి లెక్క. ఎన్ని వెల్లకిలా పడితే అన్ని పాయింట్లు లెక్కనమాట. పటం మీద పావును అన్ని గడులలోకి ముందుకు తీసుకుపోవచ్చు. ఎనిమిది పడితే మాత్రం, పావుని దానితో నప్పుకుని మరో పందెం వేసుకోవచ్చు. ఎనిమిది పడినప్పుడు గాని పామునోట్లో పడితే ఇంతే సంగతులు, కిందకొచ్చేస్తారు, మళ్ళీ పందెమూ ఉండదు. గెలుపుకే ఎప్పుడూ తోడుంటుంది, ఓటమికి తోడుండదు, ఇది లోకరీతి, గుర్తించాలి.

ఇక ఈ పటంలో బొమ్మలుంటాయి, గడుల్లో, పట్టి చూస్తే వాటిదో ప్రత్యేకత. ఆ గడుల్లోనే కొన్నిటిలో నిచ్చెనలుంటాయి పైకి పోవడానికి, కొన్నిటిలో పాములుంటాయి, వాటి నోట్లో పడితే అంటే ఆ గడిలోకొచ్చి ఆగితే కిందకొచ్చేస్తారు. ఇందులో బుల్లి నిచ్చెనలు,చిన్న నిచ్చెనలు,పెద్ద నిచ్చెన ఉంటాయి, అలాగే బుల్లిపాములు,చిన్నపాములు,పెద్దపాము ఉంటయనమాట. ఏది ఏమైనా చివరికి పావును పైపైకి అనగా పరమపదానికి చేర్చి భగవంతుని ఐక్యం చేయడమే ధ్యేయం, ఆట లక్ష్యంగా నడుస్తుంది, ఇలా భగవంతుని చేరడమే పంట అంటారు. నలుగురు ఆడితే ఒకరొకసారిగా పంటకి చేరతారు.

ఈ ఆటకీ జీవితానికి ఉన్న సంబంధం చూద్దాం. ఎవరూ తోడు లేకపోతే ఒంటరిగానైనా ఆడుకోవచ్చు, మానవ జీవితం ఎవరిది వారిదే! పదిమందితో కలిసీ బతకచ్చు,ఒంటరిగానూ జీవించచ్చు, ఈ ఆటలాగా. ఆట మొదలెడితే కొందరికి పందాలు కలిసొచ్చి, నిచ్చెనలెక్కేసి, తక్కువ సమయంలోనే పరమపదం చేరుకుంటారు, ఏ పామునోట్లోనూ పడరు. అంటే లక్ష్యం తొందరగా చేరిపోతారనమాట. మరికొంతమంది నెమ్మదిగా కదులుతుంటారు, నిచ్చెనలు దొరకవు, పాములూ వేధించవు, కాని కాలం తీసుకుంటుంది. మరికొంత మంది ఆట మొదలు, పాములనోట్లో పడుతూనే ఉంటారు, కింద కొచ్చేస్తుంటారు, మళ్ళీ మొదలు పెడుతుంటారు, అప్పుడపుడు నిచ్చెనలూ ఎక్కుతుంటారు. మొదటివారి జీవితం వడ్డించిన విస్తరి, రెండవవారిది గానుగెద్దు జీవితం, ఎప్పటికో చివరికి చేరతారు, ఇక చివరివారు కష్ట జీవులు, స్వయం కృషితో సాధించుకుంటారు, దేనికి భయపడరు… పడిపోయిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ లేచి జీవితం లో పరుగు పెడుతూనే ఉంటారు…

ఒక పని చేశాం. వ్యతిరేక ఫలితం వచ్చింది, అనుకోనిదీ జరిగింది. ఒక సారి ఏడవడం సహజం. ఆతర్వాత అలా ఎందుకు జరిగింది, తప్పెక్కడుంది, ఎలా జరిగింది, ఖచ్చితంగా అంచనా వేసుకోవడం, ఆతరవాత ప్రయత్నం లో ఆ తప్పు జరగకుండా చూసుకోవడం అలవడాలంటే, చిన్నప్పటినుంచీ, ఈ ఆట ఆడుకోవాల్సిందే! ఈ ఆట ఆడటం మూలంగా పెద్ద పామునోట్లో పడితే మొదటికే వచ్చేస్తాం, మరోసారి పందెం వేస్తాం, సాధిస్తాం, పరమపదం చేరుకుంటాం. అలాగే జీవితం లో కూడా పడిపోయిన ప్రతిసారి ఆత్మ విమర్శ చేసుకుని మళ్ళీ ప్రయత్నం చేయాలనే స్పృహ దీనివల్ల చిన్నప్పటినుంచీ కలుగుతుంది కదా!

మరో ముఖ్యమైన విషయం ఈ ఆటలో, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి, నిచ్చెనలు సుఖాలు, పాములు కష్టాలు అనుకోవచ్చు. ఏది ఏమైనా జీవితాన్ని ఒక లక్ష్యం తో నడుపుకోవాలనే దృక్పధం ఏర్పడుతుంది, చిన్నప్పటి నుంచీ, ఈ ఆట ఆడటం వలన. నేటి కాలపు ఆటలలో ఉన్నది పూర్తిగా పోటీ తత్త్వం, ఏమైనా గెలిచి తీరాలనేదే నేటి మాట. నేడు విజయంలోనూ సంతృప్తి లేదు. ఓటమీ ఉంటుందనేది మరచిన మాట.

పిల్లలకి ఈ ఆట నేర్పండి.గెలు ఓటమిలు సమానంగా తీసుకునేలా చేయండి. ఓటమికి నేడంతా కృంగిపోతున్నారు, కొందరు ఆత్మ హత్యలూ చేసుకుంటున్నారు. ఓటమి కూడా జీవిత భాగం, గెలుపుకు మెట్టన్నది నేర్పుదాం, ఎడిసన్ ని గుర్తు చేదాం.

పాతరోజులలో వ్యక్తులు జీవితంతోనే పరిపూర్ణత సాధించుకునేవారు, నేటి పాసిటివ్ తింకింగులు వగైరాలకి క్లాసులక్కరలేకుండా. ఈ ఆటను ప్రవేశపెట్టిన భారతీయ మేధావికి శతసహస్ర వందనాలు. జీవితంలో కష్ట సుఖాలను, ఒడిదుడుకులను అన్నిటిని సమానంగా తీసుకో, విజయానికి పొంగిపోకు, అపజయానికి కృంగిపోకని చెప్పిన ఆట ఇది, ప్రత్యేకంగా క్లాసులు పెట్టి చెప్పకుండా. ఎన్ని క్లాసులు పెట్టి చెప్పక్కరలేకుండా వినోదంతో విజ్ఞానం పంచడమే భారతీయ తత్త్వం.

ప్రకటనలు

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితం-పరమపద సోపాన పటం.

 1. చాలా రోజుల తరువాత మీ నీతిచంద్రిక దర్శనం అనుకోకుండా దొరికింది.
  నా తరపున మీ నీతిచంద్రిక ను చూడడానికి రోజూ సందర్శిస్తాను.
  మీ నీతి ప్రవచనాలు మాకు విరివిగా దొరుకుతాయని ఆశిస్తాను.

  • మోహన్జీ
   అలా అనుకోకుండా వరుసలో దొల్లిపోయిందీ టపా, శ్యామలీయంవారి చలవచేత
   వేసవి భీకరంగా ఉండటంతో ఈ బ్లాగ్ మొహమే చూడటంలేదీ మధ్య. ఎంతో కొంత వీలు చేసుకోక తప్పదేమో !
   ధన్యవాదాలు.

 2. ఒక్కోసారి గెలవడం కన్నా ఓడి గెలిపించడంలో చాలా ఆనందం వుంటుంది. దురదృష్టవశాత్తూ ఇప్పటి పిల్లలకి అది అర్థమయ్యే చదువులు లేవు. మీలా చెప్పే పెద్దవారు ప్రతీ ఇంట్లో వుంటే బావుండును.

  • చిరంజీవి లలిత,
   ఓడి గెలవడం/ఓడి గెలిపించడం అనేవి భార్య/భర్త ల మధ్య సాన్నిహిత్యాన్ని మరికొంత పెంచుతాయి. ఓడి పోవడం అనేదీ గెలుపే అనే ఆలోచనే ఆనందం. అసలిలా ఓడి గెలిపిస్తే గెలిచేది ఇద్దరూ కదా 🙂 అసలు భార్య భర్తలలో ఎప్పుడూ ఇద్దరికి గెలుపే గాని ఓటమి అనేదే లేదు.

   చదువులగురించి వ్యాఖ్యానించేంత తెలివి లేదమ్మా! ఇంక పెద్దాళ్ళని ఎవరూ భరించలఏరు తల్లీ,ఇదింతే 🙂
   ధన్యవాదాలు.

 3. చిన్నప్పుడు మేము కూడా పాము పటం అంటూ ఇష్టంగా ఆడేవాళ్ళమండీ .. గవ్వలు,చింతపిక్కలతో లెక్కలు తప్పుగా చెప్పి గబా గబా పైకి వెళ్ళినా మోసం చేస్తే ఖచ్చితంగా పాము కరిచేది .. 🙂

 4. శర్మగారూ! మీరు వ్రాసిన పరమపద సోపాన పదం టపా కాస్త ఆలస్యంగా చదివి స్పందిస్తున్నాను .ఇది కేవలం పాములు -నిచ్చెనల ఆటే కాదు జీవితానికి సమన్వయం చేసుకోవాలి అని మా ఇంట్లో ఈ తెలుగు అచ్చు పటాన్ని ఉంచి ,చెప్తూ ఉంటాను మీరు చెప్పిన కోణాలు ఎందఱో. తెలుసు కునేందుకు ఉపయోగం గా ఉన్నాయి ..
  పాముల వద్ద వ్రాసిన మాటలు “అహంకారం ” మింగితే కింద పడటమే కాదు” రాక్షసులము” అవుతామనీ “,చిత్తశుద్ధి “అనే నిచ్చెన వద్దకు వస్తే ‘మహాలోకం’ చేరుకో గలమనీ కూడా గమనించమని చెప్తూ ఆడమంటాను.కేవలం4 వరసలు ఎక్కటమో లేదా దిగటమో మాత్రమె కాదు ,మనం ఏ గుణం వలన ఎక్కడికి చేరుకోగలమో కూడా చెప్పటం ఈ ఆట లో దాగిన వ్యక్తిత్వ వికాస సూత్రం అని నా అభిప్రాయం .మంచి ఆలోచనలతో పనులతో సత్ఫలితాలను ప్రయత్నం చేస్తే పొంద వచ్చు నని చెప్పే అవకాశం కుదురుతుంది ప్రయత్నలోపం ఉండకూడదని ,అదృష్ట్టాన్ని మాత్రమె నమ్ముకుంటే జీవితం నడవదనీ ఆట -పాటలతో నేర్పించే విధానం ఇది———.డా .సుమన్ లత

  • డా.సుమన్ లత గారు,
   వైకుంఠపాళీ ఆట గురించి రాయడం మొదలు పెడితే మొదటగా రాసినది, ఆ ఆటలో ఉన్న గడులు,వాటిలో బొమ్మలగురించీ, వాటి స్థానం గురించీ, వాటి ప్రత్యేకత గురించీ. ఐతే అదే ఒక పెద్ద టపా అయేలా కనపడి ఒక చిన్న వాక్యం తో ఇదంతా ఎగరకొట్టేసేను, “ఇక ఈ పటంలో బొమ్మలుంటాయి, గడుల్లో, పట్టి చూస్తే వాటిదో ప్రత్యేకత.” కారణం ఎండ,వేడి.

   ఎవరూ అంతగా పట్టించుకోరనుకున్నా 🙂 మీరు దాన్ని ప్రస్తావించారు.

   బ్లాగు వైకుంఠ పాళీ(పరమపద సోపాన పటం) లో నా కాయ పండి నట్టుంది 🙂 అందుకే ఈ టపా చివరగా వచ్చినట్టుంది, సరిగా 🙂 మళ్ళీ రాయడం జరిగితే ఈ విషయం దృష్టిలో ఉంచుకుంటా.

   మీరన్నమాట నిజం. మీ వ్యాఖ్యకు
   ధన్యవాదాలు

 5. మీ బ్లాగు చాలా తరచుగా చదువుతుంటాను. తెలియని ఎన్నో విషయాలు చెప్తారు. “ఎన్ని క్లాసులు పెట్టి చెప్పక్కరలేకుండా వినోదంతో విజ్ఞానం పంచడమే భారతీయ తత్త్వం” ఏ అమెరికా వాడో చెప్తే కానీ అది మన వాళ్ళు గుర్తించరు.

  • sarachandrika గారు,
   ముందుగా మనసులో మాట,శరచ్చంద్రిక చాలా అందమైన పేరు..

   నా బ్లాగ్ చదువుతున్నందుకు ధన్యవాదాలు.

   మనదైనది, మనవాళ్ళు చెప్పినది మనకి పనికిరాదు, ఆ అమెరికా వాడెపుడో చెప్పాలి, అప్పుడి ఐసరబొజ్జ అనుకుంటూ, మా వాళ్ళు గొప్పవాళ్ళోయ్ అనుకుని మళ్ళీ పడుకుని నిద్రపోతాం, ఇదింతే లెండి. మనం మారం.

   మీ వ్యాఖ్యకి

   ధన్యవాదాలు.

 6. చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడేవాళ్ళం తాత గారు. ఎంత సరదాగా గడిచేదో సమయం. ఇప్పటికీ ఆడుతుంటాం ఇండియా వచ్చినప్పుడు. మంచి టపా. ఇంకా మన పాత ఆటలు గురించి వీలునప్పుడు రాయండి తాత గారూ.

 7. ????ఈ ఆటను ప్రవేశపెట్టిన భారతీయ మేధావికి శతసహస్ర వందనాలు.
  !!!!!గొప్ప నిజం మాస్టారూ,చదరంగం కూడా మనదే.అందుకే అంత గంభీరంగా ఉంటుంది.ఒక్కొక్కళ్ళుగా వీళ్ళందతికీ ఎన్నసి శతసహస్రవందనాలు చెయ్యాలో!హ్మ్?

  • హరిబాబుగారు,
   మీరన్నది నిజం. మరో కొత్త ఆట ఇలా జీవిత పరమార్ధాన్ని తెలియజేస్తూ సృష్టించలేను, కాని ఇది నాది, నా పూర్వీకులు కనిపెట్టినది, అని గర్వంగా చెప్పుకోగలను, వందనాలూ అర్పించగలను. అది కూడా చేయలేకపోతే……. అలా కూడా చెప్పుకోలేనివారిని చూసి సిగ్గుపడటం తప్పించి ఏమీ చేయలేము. జీవిత పరమార్ధం ఇంతగా ప్రతిఫలించిన ఆట మరొకటి లేదు. చదరంగమూ మనదే …..

   ధన్యవాదాలు.

 8. < "గవ్వలు ఇంట్లో ఉండకూడదు, గవ్వల శబ్దం వినపడకూడదు అనే పిచ్చి నమ్మకాలూ పెరిగాయి, ఆమధ్య. "
  —————–
  నిజమా శర్మ గారూ! ఇటువంటివి ఎవరు మొదలుపెడుతున్నారో / ప్రచారం చేస్తున్నారో గానీ జనాల్లో మూఢత్వాన్ని పెంచుతున్నారు. ఒకప్పుడు గవ్వల్ని సన్నటితాడుకో వైరుకో కూర్చి ద్వారబంధానికి అలంకారంగా వాడేవారు కూడా – ఇటువంటి పిచ్చినమ్మకాలు లేని కాలంలో 😦

  • విన్నకోట నరసింహారావు గారు,
   నిజం. గవ్వల శబ్దం అనారోగ్యం,వినడమని పారేసిన వారినెరుగుదును. ఈ మధ్య మళ్ళీ ఆడుతున్నారీ ఆట. మీరన్నట్టు దండలుగా గుచ్చి వేళాడదీసేవారు, ఇప్పటికి అలా చేస్తున్నవారూ ఉన్నారు. ఎవరో కొంతమందికి ఏదో బాధ మనసులో దానికోసమే ఇటువంటి ప్రచారాలు.
   ధన్యవాదాలు.

   • గవ్వలైనా కలన యంత్రాలైనా, అతి గా వాడితే తప్పే,
    అతి సర్వత్ర వర్జయేత్ అనేది కదా ఆర్యోక్తి
    మితమే ముద్దు, అతిగా వద్దు!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s