శర్మ కాలక్షేపంకబుర్లు-గతకాలము మేలు…….

గతకాలము మేలు…….

‘గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్’ అన్నారు, ఏమో ఎంత నిజమో తెలీదుగాని, మొన్న వైశాఖ పున్నమి రోజు ఉదయమే పూజ తరవాత టిఫిన్ చేద్దామనుకుంటుంటే, ‘ఎవరో వచ్చారు, మీ కోసం’ అన్నారు. ‘నాకోసం వచ్చేవారెవరూ? ఎవరూ మాటాడడానికే ఇష్ట పడకపోతున్న రోజుల్లో, ఎవరబ్బా వచ్చినదీ’, అనుకుంటూ చూస్తినికదా, ఒకరెవరో మామిడి పళ్ళు, తాంబూలం, విసిన కఱ్ఱ పుచ్చుకునొచ్చారు. ఒక నిమిషం కంగారు పడ్డా! ఎవరి కోసమో వచ్చి నేను వారనుకున్న సంఘటనలు గుర్తొచ్చి, ‘నేను మీరనుకున్న వాడిని కాదండీ’ అన్నా! వచ్చిన వారు ‘మీ గురించి ఫుర్తిగా తెలుసు, మిమ్మల్ని బాగా ఎరుగుదుము, మీరు మమ్మల్ని ఎరుగరు, మీకోసమే వచ్చా’నని, తెచ్చిన మామిడి పళ్ళు మా దంపతుల చేతిలో తాంబూలంతో పెట్టి, విసనికఱ్ఱ తో విసరి, ఆశీర్వచనం తీసుకు వెళ్ళేరు. ఇంకా పాతకాలపు మర్యాదలు నిలబెట్టేవాళ్ళున్నారా, పాటించేవారున్నారా? అనిపించిందో క్షణం, అలా అనుకుంటుండగా కరంట్ పోయింది. వేసవి మొదలు ఇలా కరంట్ పోవడం,రావడం, మళ్ళీ పోవడం ఒక ఆటయిపోయింది, అది ‘పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం’ అన్నట్టూ తయారయింది.

రాష్ట్రం ఏర్పడిన కొత్తైనా నిరుడు కరంట్ పోలేదు, వేసవిలో, మరి నేడో! ‘ఎప్పుడొస్తుంది కరంట్?’ ‘తెలీదు’, ‘ఎప్పుడు పోతుంది? తెలీదు, వస్తే ఎంత సేపుంటుంది? తెలీదు. ఏం తెలుసు? కరంట్ ఉండదనీ, ఉన్నా ఉపయోగం ఉండేలా ఉండదనీ తెలుసు’, అంతా లో వోల్టేజి యో అని ఒకటే గోల, ఇది వినవలసిన వారికి వినిపిస్తూందో లేదో! తెలీదు. మేము ప్రత్యేకం కదండీ ట్రాన్సు ఫార్మర్ కాలిపోడం తో మరో దానిమీదకి లోడ్ మారిస్తే ఇప్పుడు లో వోల్టేజి తో……ఫేన్ తిరగదు, ఏడుస్తూ తిరుగుతుంది, ఏ.సి పని చెయ్యదు, మీటర్ మాత్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది. ఈ యేటి కంటే నిరుడే మేలనిపిస్తూంది.మా ఏ.యి గారు కొత్త ట్రాన్స్ ఫార్మర్ తెప్పించాను, మారుద్దామంటే క్రేన్ దొరకలేదన్నారు, ”దరిద్రుడు తలగడిగితే వడగళ్ళ వాన ఎదురవడం” అంటే ఇదే కదూ! గతకాలము మేలనిపిస్తోంది….

కరంట్ పోడానికి రాత్రి పగలూ తేడా లేదు, వచ్చినా పది నిమిషాలకో సారి పోతూనూ ఉంటుంది, పగలెల్లాగా లోపలుండక తప్పదు, కరంట్ గోలతో రాత్రి పూటనైనా పోనీ బయట పడుకుందామంటే కుదరదు. చుట్టూ ఉన్న కాంక్రీట్ బిల్డింగులనుంచి వేడి విడుదలవుతూ ఉంటుంది కదా 🙂 ముఖ్యమంత్రిగారేమో కావలసినంత కరంట్ అంటున్నారు, ‘అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని’ అన్నట్టు కరంట్ మాత్రం సామాన్యుడికి చేరటం లేదు, అప్రకటిత కోత ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలూ, రాత్రి ఏమో! ఎంతసేపో తెలియనిది జరుగుతూనే ఉంది. వేడి మాత్రం సామెత చెప్పినట్టు, ‘మబ్బు విడిచిన ఎండ….లా’ తీక్షణంగానే ఉంది, మొన్న రెండు రోజుల తుఫాను తరవాత.

పూర్వం, అంటే అరవైఏళ్ళ కితం,నేనెరుగుండి ‘కరంట్ లేదు, రేడియో లేదు, టి.వీ లేదు, ఫోన్ లేదు, సెల్ఫోన్ లేదు, కంప్యూటర్ లేదు, పేపరూ లేదు, రెండు రోజుల తరవాతొచ్చేది నేటి పేపరు, బస్సులు లేవు, మోటర్ సైకిల్ సరే సరి’. ఆనాడు మనుషులు బతకలేదా? మరి తేడా ఎక్కడా?

నాడు తాటాకు పాకలో ఉండేవాళ్ళం, లేదా పెంకుటిల్లూ, ముందు పెరడో, వెనకపెరడో పెద్దదిగానూ ఉండేదిఇంటి పెరట్లో చెట్లు,మొక్కలు,పాదులు ఉండేవి, ముఖ్యంగా అరటి,కొబ్బరి.. తాటాకు పాక ఏ.సి తాతలా ఉండేది,చల్లగా, పెంకుటిల్లు కూడా, వేడి తెలిసేది కాదు. ఇక రాత్రి పూట వెన్నెల కాలమైతే పండగే! పెరటిలో పేడ నీళ్ళతో కళ్ళాపి ఒత్తుగా జల్లేవారు, భోజనాల సమయానికి ఆరిపోయేది. కొత్త కుండలో నీళ్ళుపోసుకుని ఉంచుకునేవారు, బలే చల్లగా ఉండేవి, తియ్యగా కూడా. ఇప్పుడు అంటున్న ‘మూన్ లైట్ డిన్నరు’ చేసేవాళ్ళం, కబుర్లు చెప్పుకుంటూ. బంతి చాపలని, చిన్న చాపలు వేసుకుని కింద కూచుని రెండు వరసలలో, ఎదురెదురుగా కూచుని అరటాకులలో భోజనం, వెన్నెలలో ఇంట్లోవారంతా ఒక సారి భోజనం చేయడం, ఆ తరవాత అక్కడ శుభ్రం చేసుకుని మడతమంచాలు, చిన్నపట్టిమంచాలు, నులకమంచాలు ఇలా రకరకాల మంచాలు, ఎవరిది వారు తెచ్చుకుని పెరట్లో వేసుకుని, వెన్నెలలో, తడిపిన తాటాకు విసినకఱ్ఱలతో విసురుకుంటూ, కొబ్బరి చెట్టు ఆకుల సందులలోంచి వెన్నెల వెండి తీగల్లా పడుతుంటే, చల్లగాలికి పడుకుంటే….. ఏ అర్ధ రాత్రో, ‘చినుకులు పడుతున్నయర్రా’ అని ఎవరో జనాంతికంగా అంటే, కొట్టి కురిసెయ్యదు లెద్దూ అని పడుకుంటే జల్లు కొద్దిగా పెరిగితే పొలో మని మంచాలెత్తుకుని ఎవరి మటుకువారు, ఇంట్లోకి పరుగెట్టడం, కాసేపటికి చినుకులు తగ్గితే మళ్ళీ మంచాలుచ్చుకుని పెరటిలోకొచ్చెయ్యడం, ఒక ఆటలా ఉండేది. ఇప్పుడు పెరడూ లేదు, మంచమూ లేదు, ఎక్కడ చూచినా వేడి,వేడి..ఏ ఇంటికీ పెరడు లేదు, చారెడు మట్టి నేలలేదు, చెట్టూ మొక్క పెంచినవాడు, పిచ్చివాడే. వర్షపు నీరు నేలలో ఇంకినదీ లేదు, మరి వేడిగాక చల్లదనమెక్కడబాబూ!.రాత్రి కూడా, ఏ.సి పని చెయ్యదూ, లోఓల్టేజి…నిద్రపట్టదు, ఇది ప్రగతికాదా చెప్పండి… గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్ అంటారా?

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గతకాలము మేలు…….

  • mohan జీ,
   అశక్త దుర్జనత్వం. ఏమీ చేయలేనితనం, చేసినా, చెప్పినా వినిపించుకునేవారు లేనట్టు ఉన్నపుడు, ఇదిగో ఇలా వెళ్ళబుచ్చుకోడమే, కొంతలో కొంత హాయిని కలగజేస్తుంది కదా
   ధన్యవాదాలు.

 1. < "ముఖ్యమంత్రిగారేమో కావలసినంత కరంట్ అంటున్నారు," <
  ————
  కావలసినంత కరెంట్ ఆయనకేమో ? 😀
  గరికపాటి నరసింహారావు గారు గుడ్డినమ్మకాల గురించి ప్రసంగిస్తూ బల్లి పడితే కలుగు ఫలములు అని పంచాంగంలో వ్రాసేస్తుంటారు, అవన్నీ కలిగేది బల్లికి గాని మనుష్యులకి కాదు అన్నారు చూసారూ, అది గుర్తొచ్చింది 😀
  "గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్" అని వ్యాసుడు అన్నది అక్షరాలా నిజం. .

  • విన్నకోట నరసింహారావుగారు,
   ఎవరు అధికారంలో కొచ్చినా, ఎవరు అధికారులైనా సామాన్యుల వెతలు తీరవండి. ఈ నెల రెండవ తేదీనుంచి కరంట్ వారు మాకు ప్రత్యేకం గా చూపిస్తున్నది, నరకం
   ధన్యవాదాలు.

 2. అందుకే సి.నా.రే గారు చలోక్తిగా మన కరెంట్ పైన వో మంచి వాక్యం రాశారు–అవసరానికని మీట నొక్కితే అందని వెలుగు ఎందుకనీ …అని..

  • challa.jayadev Vara గారు,
   వేడి రోజురోజుకి పెరుగుతోంది, బాధలు పెరుగుతున్నాయి. వినిపించుకునేనాథుడే కనపట్టం లేదండి.సి.నా.రే వారి మాట నిజంకదూ
   ధన్యవాదాలు.

 3. మీరు చెప్పిన పాత రోజుల్లో కబుర్లు చదువుతుంటే ఎండాకాలం సెలవల్లో మా అమ్మమ్మగారింటికి వెళ్ళినట్లే
  ఉంది. ఇప్పుడు ఏ ఊరి లో చూసినా అపార్ట్ మెంట్ సంస్కృతి వచ్చేసింది. పెరడు, చెట్లు అన్నమాట ఉండట్లేదు.

  • చంద్రిక గారు,
   ప్రస్థుతం లో బాధలు భరించలేనపుడు, గతం లోకి జారుకుని ఊరట పొందకతప్పదు కదండీ
   ధన్యవాదాలు.

 4. పాత కాలము నెల్లపుడు మధురమే ! రాబోవు కాలము తెలిసిన ఇప్పటి కాలమే బెటరు 🙂

  గత కాలము మేలనుచున్
  బతుకు దరువులను తెలిసిన బ్లాగ్పంతులనన్
  గతుకుల బండిన వెడలుచు
  కుతకుత లాడెను జిలేబి కురుచగ యగుచున్!

  జిలేబి

  • జిలేబిగారు,
   పాతకాలం బాగుందనుకుంటూ, రాబోయే కాలాన్ని అద్భుతంగా ఊహించుకుంటూ ప్రస్థుతంలో గడపడమే జీవితం కదండి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s