శర్మ కాలక్షేపంకబుర్లు-జాగరిత

జాగరిత

కృషితో నాస్తి దుర్భిక్షం
జపతో నాస్తి పాతకం
మౌనేన కలహో నాస్తి
నాస్తి జాగరతో భయం.

వ్యవసాయం చేస్తే కరువులేదు, తపస్సు చేస్తే పాపం లేదు, మౌనంగా ఉంటే కలహం లేదు, జాగ్రతతో ఉంటే భయంలేదు.

దేనినుంచి భయంలేదు? ప్రమాదం నుంచి. ప్రమాదమెప్పుడూ ప్రమోదంకాదుకదా! జాగ్రత,జాగరూకత అనేదాన్ని అపభ్రంశం చేసి జాగర్త అని వాడేస్తున్నాం జాగరిత లేక. జాగరిత అంటే ఎరుకకలిగి ఉండడం…..తెలిసి ఉండడం, హెచ్చరికగా ఉండడం……

అసలీటపా ఇప్పటిలో రాయగలిగేది కాదు,ఎండలు ఒళ్ళు మండించేస్తున్నాయి, నిజంగానే ఒళ్ళు మంట పెడుతోంది,  కాని ఈవేళ వార్త చూసిన తరవాత ఇది చాలా అత్యవసరమనిపించి……ఇలా…… జీవితంలో చిన్నప్పటినుంచి చాలా జాగ్రతలే తీసుకోవాలి, కాని అశ్రద్ధతో జాగరతలు తీసుకోడం మానేస్తాం, ఎవరేనా చెప్పినా పెడచెవిని పెడతాం…

ఒక చిన్న బిడ్డ పాకుతూపోయి కరంట్ సాకెట్ నుంచి వేలాడుతున్న సెల్ ఫోన్ ఛార్జర్ వైర్ కొరికితే షాక్ కొట్టి అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయినదీ వార్త, చాలా బాధ అనిపించింది. ఎందువల్ల జరిగిందిది?, ఎలా జరిగింది? సెల్ ఫోన్ ఛార్జర్ పెట్టిన పవర్ సాకెట్ స్విచ్ కట్టెయ్యకపోడం, చాలా తక్కువ ఓల్టేజ్ ఉంటుంది ఛార్జర్ నుంచి,స్విచ్ వేసున్నా, అది బిడ్డ ప్రాణం తీసేటంతది కాదు. రెండవ కారణం ఇంటి వైరింగ్ అంతా ఫేజ్ కంట్రోల్ లో ఉండాలి, అంటే స్విచ్ వేసినపుడు మాత్రమే కరంట్ పని చేసే వస్తువు దగ్గరకి చేరాలి, కాని న్యూట్రల్ కంట్రోల్ లో ఉంటే అనగా సర్క్యూట్ పూర్తి చేయడానికి నూట్రల్ వైర్ లో స్విచ్ ఉంటే కరంట్ వస్తువుదాకా వచ్చేసి ఉంటుంది, ప్రమాదం జరిగితే వస్తువు ముట్టుకుంటే షాక్ కొట్టి పాప ప్రాణం పోయినట్లు జరగచ్చు, ఇది జరిగి ఉండచ్చు. ఇది వైరింగ్ చూసే ఎలక్ట్రీషియిన్ తప్పక గమనించ వలసినది. ఇంటికిచ్చే కరంట్ వైర్ తెగినపుడు మళ్ళీ అతికేటపుడూ, కొత్తది వేసినపుడు ఈ ఫేజ్ కంట్రోల్ చూసుకోవాలి,మొత్తం ఇంటికి, చూడకపోతే ఇలాటి ప్రమాదాలే జరుగుతాయి. ఇలా చూసిగాని నేను వారిని వదలను అందుకు నన్ను ఛాదస్తుడని అంటారు, తిట్టుకుంటారు కూడా, చాదస్తం అవచ్చు గాని ఈ ఛాదస్తం మనిషి ప్రాణం కాపాడుతుంది.

సంవత్సరం నుంచి నాలుగేళ్ళ లోపు పిల్లలికి అన్నీ కొత్తగానే ఉంటాయి, అమ్మతో కలిసి అన్ని పనులూ చేసేయాలనుకుంటుంటారు. కొత్త కొత్తవన్నీ తెలుసుకోవాలనుకుంటారు. కనపడిన ప్రతి వస్తువూ నోట్లో పెట్టేస్తారు, కొరికేస్తారు, ఇలా ఏం చేస్తారో చెప్పడం కష్టం, వస్తువులు తీయబోయి మీద పడేసుకుంటారు, గాయ పడతారు, ప్రాణం మీదికే తెచ్చుకోవచ్చు. ఈ ఈడు పిల్లలకి కొన్ని వస్తువులు అందకుండా ఉండేలా చేసుకునే జాగ్రతలు తీసుకోవాలి, కత్తులు, చాకులులాటివి… ప్రమాదం ఎలా వస్తుందో గమనించడం కూడా కష్టమే, వీరితో. నేటి కాలంలో కరంట్ సాకెట్లు భూమికి రెండడుగులలోపు ఎత్తులో ఉంటున్నాయి, వీటిలో వాడనివాటికి కరంట్ తీసెయ్యడం, వాటికి టేపులేసెయ్యడం చెయ్యాలి. కరంట్ తీసేసేం కదా అనుకోవద్దు. ఆ సాకెట్ లలో ఈ బుజ్జిగాళ్ళు తమ బుల్లి బుల్లి వేళ్ళు పెట్టేస్తారు, కొన్నిటిలో కందిరీగలు జేరి ఉంటాయి కూడా. ఈ కందిరీగలు కూడా న్యూట్రల్ వైర్ ఉన్న వైపే ఉంటాయి. కందిరీగలు కుడితే అమ్మో ఊహిస్తేనే భయం. ఇక చేతికందే వస్తువులు,టి.వి, మిక్సీ, కత్తెరలు వగైరా అన్నిటినీ వీళ్ళు వాడేద్దామనుకుంటారు, తల్లి చూడకపోతే…….ఇక నోట్లో పెట్టుకున్నవస్తువులు ఎపిగ్లాటిస్ కి అడ్డు పడితే శ్వాస అందక…. పెద్దప్రమాదమే జరుగుతుంది…. మందుబిళ్ళలు, వీటిని వేసేసుకుంటారు, అందుబాటులో ఉంటే, అందుకు తల్లీ చాలా జాగ్రత తీసుకోక తప్పదు. కొన్ని వస్తువులు నోట్లోనూ ముక్కులోనూ పెట్టేసుకుంటుంటారు…ఇక నీళ్ళ తొట్టిలంటే వీళ్ళకి మహాప్రీతి,వాటితో పెద్ద ప్రమాదం తెచ్చుకుంటారు, చూసుకోకపోతే, ఆ తరవాతది నిప్పు, వీటినుంచి రక్షణ తీసుకోవాలి, జాగ్రతా చెప్పాలి… ఆయ్!, తప్పూ!! ఒకటి నుంచి నాలుగేళ్ళలోపు పిల్లలకి అమ్మ చెప్పే మొదటి మాట కదూ! పెద్దబ్బాయి మూడో ఏట జరిగిన ఒక సంఘటనతో ఇల్లాలు పడ్డ వేదన….

కాకినాడలో ఉద్యోగం చేస్తున్న రోజులు. ఒక రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇంటి కొచ్చా. ఇల్లు ’ప్రశాంతం గా ఉందిగాని గంభీరంగా ఉంది’. కొట్లాటలు జరుగుతున్నాయి, పట్టణం ప్రశాంతంగా ఉంది గాని పరిస్థితి గంభీరంగా ఉందని చెప్పేవారు, నాటి ఆకాశవాణి వారు, అది గుర్తొచ్చి, తుఫాను ముందు నిశ్చలతనుకుని ఏమైనా భరించక తప్పదని, ఇల్లాలి మొహం చూసి భయపడి, చివరికి అడిగేసేను “ఏమయింది అలా ఉన్నావని” నిశ్చలతని కదుపుతూ. ”ఏం ఎలా ఉన్నాను? బానే ఉన్నానుగా” అంది. ఎట్నా అగ్నిపర్వతం ఫెటేల్న పేలేందుకు సిద్ధంగా ఉన్న సూచన కనపడిందా విరుపులో. “ఏం లేదు, ఏదోలా కనపడితేనూ” అని నాన్చేశాను. ”నేను అన్నదాన్ని ఒకత్తిని ఉన్నాను అని, సంసారం, పిల్లలు ఉన్నారని, ఏమైనా గుర్తొస్తాయా ఆవిడ దగ్గరకెళితే, అసలు ఉన్నామని ఎప్పుడేనా, అనుకున్నారా? అనిపించిందా? పిల్లలతో ఎలా ఛస్తోందో ఆలోచించారా? తెల్లారిలేచి ’కల్లే జోగా’ అంటూ ఆవిడ దర్శనానికి వెళిపోయారు, మేమెలా ఛస్తే ఏం లెండి” అని మొదలెట్టింది. తగువు రసకందాయంలో పడుతోందనుకుంటూ “రెండు పూటలా నాలుగు మెతుకులు తింటున్నామంటే ఆవిడ చలవేగా” అన్నా నెమ్మదిగా. “ఇదోసాకూ, ఆవిడ మీద ఈగ వాలనివ్వరు పాపం”, అని విసుక్కుంది. “ఆవిడ ముందొచ్చిందోయ్! ఏమైనా ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములువాడిగదా! నిన్ను కాదన్నదెప్పుడులే” అంటుండగా ”సామెతలకేం లోటులేదు, చేసే పనులే అలా ఉండవు” అంటుండగా పెద్దబ్బాయి అప్పటికి వాడే చిన్నవాడు, అమ్మా అంటూ వచ్చి ఆవిడ కాళ్ళకి చుట్టేశాడు. “అమ్మట అమ్మ! బొమ్మ, వెధవా! బుద్ధులెక్కడికిపోతాయి? అంతా ఆ సామాచికమేగా! ఏడిపించుకు తినే బుద్ధులెక్కడికి పోతాయి” ,అంటూ సాగదీసింది. “అదేంటో? కారణం చెప్పి తిట్టచ్చుగా, కారణం లేకుండా తిడితే ఏం చెప్పనూ!, ఏం తెలుస్తుందీ, ఎందుకు తిడుతున్నదీ! నువ్వు తిట్టడంలో లోటుంటే, ఏమైనా మరచిపోతే దాన్ని కూడా పూర్తి చేస్తాను, గుర్తు చేస్తాను కదూ” “సమాధానం చెప్పుకోడానికి వీలు లేకుండా తిడితే ఎలా? పోలీసు దెబ్బల్లా కొడితే ఎక్కడ భరించగలనూ” అన్నా వాతావరణం తేలిక చేద్దామని, సంధికి తెల్లజండా ఊపేను. “ఏడ్చేవాళ్ళని నవ్వించడం, ఇది మాత్రం బాగా తెలుసు, ఇలా కబుర్లు చెప్పేకదూ, బుట్టలో వేసుకున్నదీ!, చిన్నప్పటినుంచీ ఇదేఅలవాటూ, ఎక్కడికిపోతుందీ ” అని సాధించింది. అమ్మయ్య కొద్దిగా దారిలో పడిందనుకుంటూ, ”ఎంతైనా నువ్వు తిడితేనే అందంగా ఉంటుందిగాని, ఏమయిందో చెప్పవోయ్!” అన్నా. ”ముచ్చట్లాడుతూ కూచుంటే కడుపు నిండదు, లేవండి, భోజనానికి” అని కొంత వెసులుబాటు ప్రదర్శించింది. ”అదేంటో చెప్పకపోతే నాకేం తోచదోయ్” అన్నా అతృత చూపిస్తూ.

“ఉదయమనగా తమరు దయచేశారు, ఆవిడ సేవకి, ఆడపిల్లలిద్దరూ బడికిపోయారు. ఇదిగో తమ పుత్ర రత్నం, అన్నీ తమ బుద్ధులే, రొంపట్టి, ముక్కు కారుతూ, నావెనకే తిరుగుతున్నాడు, నేను కూర తరుక్కుంటుంటే. కొంత సేపటికి ఆరున్నొక్కరాగం శ్రుతి పెంచాడు, చూస్తే ముక్కు వాచిపోయి ఉంది, ఏమయిందని చూస్తే చీమిడి తప్పించి ఏం కనపడలేదు,ముక్కులో. ముక్కు భయంకరంగా వాచిపోయింది, వీడు నలిపేయడంతో. భయమేసింది, ఏమయిందిరా అంటే చెప్పడు. ఈలోగా పక్కవాటా వదినగారొచ్చి, బేట్రీ లైట్ వేసి చూసి ’వీడు ముక్కులో ఏదో పెట్టుకున్నాడు వదినగారూ, నడవండి! డాక్టర్ దగ్గరకి తీసుకుపోదాం, మనమేదైనా చేస్తే ప్రమాదమంటే’, ఇద్దరమూ కొంపలు తాళాలేసుకుని రిక్షాలో పడి, నాలుగు వీధులవతలున్న డాక్టర్ కామేశ్వరమ్మ గారి హాస్పిటల్ కి చేరేం. ఆవిడా అప్పుడే బయటి కొచ్చేరు. వీణ్ణి చూపించి ముక్కులో ఏదో పెట్టుకున్నాడని చెబితే, టార్చ్ వేసి చూసి వీణ్ణి దగ్గరకి తీసుకుని ఉన్నట్టుండి, వీడి కాళ్ళు పట్టుకుని తలకిందులుగా వేలాడ తీసిందావిడ. ఏం జరుగుతోందో తెలియక నేనూ,వదినగారూ కంగారు పడ్డాం. అప్పటి దాకా కుసిస్తున్నవాడు కాస్తా, కాళ్ళు పట్టుకుని కోదండం తీయించేటప్పటికి, భయపడి, గింజుకుంటూ, ఒక్కసారి బేర్ మని ఏడ్చి ఒక్క తుమ్ము తుమ్మేడు, గాఠ్ఠిగా. దాంతో ఏదో ముక్కులోంచి తుపాకీ గుండులా బయటికి తోసుకొచ్చి పడింది. వీణ్ణి ఆవిడ కిందకి దింపింది, నర్స్ ఈలోగా అదేంటో చూసి ”బెండకాయ ముక్కమ్మా” అంది. ఈలోగా డాక్టర్ గారు లోపలికెళ్ళి వచ్చి వీడి చేతిలో నాలుగు చాక్లెట్లు పెట్టి, ’అమ్మని కంగారు పెడతావా? ఇలా ఏది కనపడితే అది ముక్కులో పెట్టుకోకూ’ అని చెప్పి నా దగ్గరికి పంపేరు. ఆ తరవాత నన్ను దగ్గరికి పిలిచి ’పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవద్దూ! పిల్ల మేళం, చూసుకోకపోతే ప్రమాదం తెచ్చి పెడతారని’, నా చేతిలో నాలుగు చాక్లెట్లు పెట్టి వీపు తట్టేరు”… అని ఆగింది.

ఈలోగా విషయం తెలిసిన, కూడా ఉన్న, విషయం వింటున్న పక్కింటి అక్కయ్యగారొచ్చి, ఏం లేదన్నయ్యగారూ, డాక్టరు గారు ’జాగ్రత్తగా ఉండద్దా’ అన్నారని వదినగారికి ఉడుకుమోత్తనంవచ్చి ఏడిచారు’, అదీ జరిగింది అని గుట్టు విప్పేసేరు.

“మంచి అనుభవమే జరిగింది, ఇటువంటివి ఒక్కొకప్పుడు ప్రమాదాలకి దారితీస్తాయని చెప్పడమే డాక్టరుగారి ఉద్దేశం, అని సద్ది చెప్పేసేను..

ఆ రోజుల్లో భోజనం తరవాత కబుర్లు చెప్పుకుంటూ తాంబూలం వేసుకోడం అలవాటు. తమలపాకులు చిలకలు చుట్టి తను వేలికి తగిలించుకుంటుంటే సేవిస్తున్నాం, ఒక్కోటి ఆవిడ నోట్లో పెడుతూ,ఒక్కోటి నేను సేవిస్తూ, అప్పుడడిగా ’ఏందుకు ఉడుకుమోత్తనం వచ్చిందీ’ అని, ఎందుకేడ్చావూ అని అడిగితే కొంపలంటుకోవూ, లౌక్యం తెలియాలండీ, లౌక్యం.

“పిల్లలిని జాగ్రతగా చూసుకోవద్దా అన్నందుకు బాధ కలగలేదు, ఆవిడ నన్ను దగ్గరకి తీసుకుని చాక్లెట్లు చేతిలో పెట్టేటప్పటికి….” అని ఆగింది.
నిన్ను అలా ఆవిడ దగ్గరికి తీసుకుని లాలించినందుకూ, నేను అవసర సమయంలో దగ్గర లేనందుకూ ఏడుపొచ్చింది కదూ! నేను ఊరికే ఊరు తిరగడానికి పోలేదని నీకు తెలుసుగా, ఉద్యోగానికి పోయాను… అని ఆగాను. నిజమే అది నాకు తెలీదేంటీ? అప్పుడెందుకో బాధనిపించిందీ అని నవ్వేసింది.

ఆవిడకి మీ అమ్మ వయసుంటుంది కదా! అందులోనూ నువ్వంటే చాలా ఇష్టం, కూతురికి సలాహా ఇచ్చేతల్లిలా నీకు చెప్పేరు తప్పించి తప్పు పట్టడం కాదు, అలాగే కూతురులాగే భావించి నీకూ చాక్లెట్లు పెట్టేరు గమనించావా! పెద్దావిడ చెప్పిన మాట మంచిదే! డాక్టరుగారు తల్లిలా వ్యవహరించినపుడు, నేను సరిగా చూసుకోలేకపోయనా? పిల్లవాడిని, అనే భావం నీలో మెదిలి ఏడుపొచ్చి ఉంటుంది అని సరి పెట్టేను.

ప్రమాదాలన్ని సార్లూ ప్రమోదాలు కాకపోవచ్చు…

ప్రకటనలు

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జాగరిత

 1. గురువు గారు, బంధాలు యెంత సున్నితమో, వాటిని మీరు అంత సుతిమెత్తగా ఎలా వివరిస్తారో నాకైతే ఎప్పటికి అర్థంకాదు. గురుపత్ని గారు కళ్ళనీళ్ళు పెట్టుకోన్నారంటే నాకా సంఘటన చూసినట్టే అనిపించి, గుండె బరువెక్కింది.

  • raamudu గారు,
   భార్య భర్తల అనుబంధం నిత్య నూతనంగా ఉంచుకోవాలి, దీనికి ఇద్దరూ బాధ్యులే. ఇలాగే ఉండాలీ అనుకోడం కష్టం, ఒకరికొకరు ..ఏమో ఎలాచెప్పాలో అర్ధం కాలేదు..జీవించడమే.. 🙂
   మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

   • అనుబంధము నిత్యము నూ
    తనముగ నుండ వలెనోయి తావియు పువ్వున్
    గొను రీతి! బాధ్యతలు మన
    దని భార్యాభర్తలుండ ధరణిని మేలౌ !

 2. అనుభవాలు,జాగరిత … మంచి పోస్ట్ మాస్టారూ ! మండే ఎండల్లో కూడా ..మనసు ఊరుకోదు వ్రాయకుండా. చదవకుండా 🙂 ఇది వ్రాసేకాలం,చదివేకాలం, ఎల్లప్పుడూ నేర్చుకునే కాలం. ధన్యవాదాలు.

  • వనజగారు,
   జీవితం నుంచే కథలు పుడతాయి. జీవితం అనుభవాల పుట్ట, తవ్వుకుంటే కావలసినన్ని 🙂
   వేసవి చాలా దారుణంగా నే ఉంది. గోదావరి జిల్లాలలో 47,48 డిగ్రీలంటే…స్వయంకృతాపరాధం.
   ఏంటో వ్రాయక ఉండలేని బలహీనతైపోయింది. 🙂
   ధన్యవాదాలు.

   • బలహీనతాయె యీ వ్రా
    తలు జూడ సరసిజభవుని తలరాత గనన్ !
    కలకల దినముల గడుపగ
    నలసత్వంబు వదిలెను వనజ వనమాలీ !

 3. కథ లొజ్జ గదా మాచన 🙂

  రసవత్తరమైన టపా !
  రుసరుస లాడెను జిలేబి రోదన మిగిలెన్ !
  అసలయ్యవారి దాపుల
  కొసరి నిడిన చిలకలనగ కోపము దీరెన్ !

  చీర్స్
  జిలేబి

  • జిలేబి గారు,
   కారణం లేకపోయినా రుసరుసలాడటం మీ జన్మహక్కు కదండీ, సద్దుకోవడమే కదా జీవితం 🙂
   ధన్యవాదాలు.

   • కారణ ములేక రుసరుస
    భోరున నేడ్తురు జిలేబి బొమ్మా అనఘా !
    జోరున జెప్పిరి మాచన
    మీ రణగొణలర్థమగున ? మిడి నాగమ్మా !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s