శర్మ కాలక్షేపంకబుర్లు-వరమా? శాపమా?

వరమా? శాపమా?

మొన్నటి టపాలో సమ్మె గురించి ముచ్చటించుకున్నాం కదూ! ఆ తదుపరి…

ఇలా అప్రకటిత ఎమర్జన్సీ నడుస్తుండగా, అధికారులకి, ఒకరోజు సమ్మె చేసినందుకు కలిగిన బాధతో అక్కసు తీర్చుకోవాలనుకున్నారు, ప్రభుత్వం చేస్తున్నవి, చేసినవి సరిపోలేదనుకున్నారు. ఒక రోజు మా జిల్లా నాయకుడిని రాజమహేంద్రవరం నుంచి ట్రాన్స్ఫర్ చేశారని వార్త తెలిసింది. అసలే ఉడికిపోతున్న ఉద్యోగులు పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే అయ్యారు, రగిలిపోయారు. అంతా ఆరోజు సాయంత్రానికి నాటి రాజమంద్రి చేరుకున్నాం. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారంటే, ఎక్కడికీ? అని గుంపుచింపులు పడుతుంటే తెలిసింది, అనాతవరం వేశారని. నాడు అనాతవరం అంటే ఒక పల్లెటూరు, కోనసీమలో మూల, అక్కడికి వెళ్ళడానికే ఒకరోజు ప్రయాణం చెయ్యాలి, నాటి రాజమండ్రి నుంచి లాంచీ ఎక్కి బొబ్బర్లంకలో దిగి, అక్కడినుంచి బస్సుమీద అమలాపురం వెళ్ళి అక్కడినుంచి జట్కా మీద అనాతవరం చేరాలి, గోదావరి మీద నాటికి ఉన్నది ఒకటే రైలు వంతెన.. కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేసేస్తే కార్యకలాపాలు ఆగిపోతాయనుకున్నారు, పాపం. అసలు అనాతవరం లో అతను పనిచేసే పోస్ట్ లేదు, ఐనా ట్రాన్స్ఫర్ ఇచ్చేశారు. తెలిసిందేమంటే, ఒక గూడుపుఠాణీ జరిగిందని.

యూనియన్ కార్యకలాపాలను అణిచేయాలనుకున్నారు అధికారులు. అందుకు మార్గం సెక్రెటరీకి ట్రాన్స్ఫర్ ఇవ్వడమే అని తీర్మానించుకున్నారు. , ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేయాలి? ఇప్పుడు కక్ష బయటి కొచ్చింది. మనం ఇచ్చే ట్రాన్స్ఫర్ మూలంగా అతనక్కడ తిండి లేక బాధ పడాలి, రైలు కూత, పొగ వినపడకూడదు,కనపడ కూడదు. రాజమంద్రి రావాలంటే ఒక రోజు ప్రయాణం చెయ్యాలి, మాటాడాలన్నా అసాధ్యం, అటువంటి చోటుకు బదిలీ ఇవ్వాలి.. రైల్ కూత వినపడకూడదనుకుంటే, అన్నిటికి అనువైన చోటు, కోన సీమ బాగుంటుందని తేల్చుకున్నారు. సరే కోన సీమలో ఎక్కడా? రాజోలు బాగా మూల, కుదరదు అక్కడ భోజనం దొరుకుతుంది. సఖినేటి పల్లి, అస్సలు కుదరదు, రేవుదాటితే నరసాపురం. మరి ఇలా వెతుక్కుంటే చివరికి మిగిలింది అనాతవరం,నాడు కోనసీమకి బయటి ప్రపంచంతో ఉన్న ఒకే ఒక సంబంధం పాలకొల్లు-అంబాజీపేటల మధ్య ఉన్న ఒకే ఒక లైను, నది దాటి. అనాతవరం నుంచి మాటాడటం అసాధ్యం. ఇదంతా ఆఫీసరు దొరతో ఒక నాయకుడు చేసిన చర్చ సారంశం. దాని ప్రకారంగానే అనాతవరం బదిలీ ఇచ్చేశారు. అందరూ మండిపోతున్న సమయం, వెంటనే సమ్మె చేసేద్దాం అని నిర్ణయం తీసేసుకున్నారు, ఉద్యోగులు. మా సెక్రటరీ మా అందరిని ఓదార్చాడు, సమ్మె చేయద్దు, బదిలీ గురించి, ఇప్పటికే మనం పీకలోతు కష్టాలలో ఉన్నామని సద్ది చెప్పి, తను అనాతవరం వెళిపోయాడు, పెళ్ళాం పిల్లల్ని రాజమంద్రిలో ఉంచి. నెల గడిచింది, మా నాయకుడు వారానికోసారి వస్తున్నాడు. ఇతని గురించిన వార్తలేం పూర్తిగా తెలియకపోవడంతో నాటి నల్లదొరగారు మందీ మార్బలంతో తనిఖీ పేరుతో అనాతవరం వెళ్ళేడు. నేటి రోజుల్లో లాగా నాడు వీరికి వాహన సౌకర్యం లేదు, బస్సు, బండి వగైరాలే గతీ. కావాలంటే రైలింజనే దొరికేది నల్ల దొరలకి, లైన్ తనిఖీ నిమిత్తం. ఇలా కిందా మీదా పడి నల్లదొర అనాతవరం చేరి తనికీ పూర్తి చేశాడు. అక్కడ తిండి తిప్పలు బయట దొరకవు, ఏమైనా ఏర్పాటు చేస్తే చేయవలసినవాడు, మావాడే అయ్యాడు. కడుపులు కాల్తుంటే బృందంలో ఒకరు అడిగేశారు,భోజనాల ఏర్పాటు గురించి.

భోజనాలేర్పాటు చేశాను రండని ఒకింటికి తీసుకెళ్ళాడు, మా సెక్రెటరీ. ఒక ముసలాయనెదురొచ్చి వీరందరిని కాళ్ళు కడుక్కుని భొజనానికి లేవమని ఆహ్వానించారు. ఒక ముసలావిడ వడ్డన చేసి అందరికి కడుపునిండా తినేలా వడ్డించి అన్నపూర్ణనే తలపించింది. భోజనం చేసిన దొర ఆమెను అభినందించక ఉండలేకపోయాడు. భోజనాలయ్యాయి, అప్పుడు మా వాడు ఆ వృద్ధ దంపతులను మా నాన్నగారు, మా అమ్మగారు అని పరిచయం చేయడంతో, అందరూ అవాక్కయ్యారు, అందరికీ ఏమో అర్ధం కాలేదు. దొర ముందుగా తేరుకుని ఇది మీ స్వగ్రామమా అని ప్రశ్నించాడు. అవును నా ఉద్యోగం వచ్చిన తరవాత తల్లి తండ్రులను సేవించుకోడానికి, ఊరివారికి సాయం చేయడానికి సమయమే దొరకలేదు. తమ దయవల్ల అవి రెండూ నెరవేరాయని చల్లగా చెప్పేడు. నల్లదొర ముఖం తెల్లబడిపోయింది, ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్క కనపడలేదు. వృద్ధుల దగ్గర శలవు తీసుకుని వెళ్ళిన అధికారి మరి మాటాడలేదు, దొంగకి కన్నంలో తేలు కుట్టినంత పనయింది మరి.

బదిలీ ఇచ్చిన అధికారి అపకారం చేద్దామనుకున్నాడు, ఘోష యాత్ర నెపంతో పాండవులను ఎగతాళీ చేద్దామని వచ్చిన దుర్యోధనుని తంతైపోయింది. కాని అది ఉపకారమే అయింది, మా వాడికి, ఇలా ఒకసారి నాకు బదిలీ ఇచ్చి, నేను బాధలు పడుతుంటే చూసి ఆనందించాలనుకుని, తన పరిధి కాకపోయినా వచ్చి, నన్ను అక్కడ ఆనందంగా ఉండడం చూసి సిగ్గుపడి తల దించుకుని వెళ్ళిన మరో అధికారి ముచ్చట మరో సారి.

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వరమా? శాపమా?

 1. శర్మ గారూ, NATA (నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారి NATA 2016 Convention సాహితీ వేదిక అమెరికాలోని డాలస్ నగరంలో క్రితం నెల మే 27,28,29 తేదీల్లో జరిగాయి. కవి, ఇస్మాయిల్ అవార్డ్ గ్రహీత, అమెరికా వాసి అయిన మా ఆఖరి తమ్ముడు చి.విన్నకోట రవిశంకర్ ప్రసంగించాడు; అక్కడ జరిగిన అష్టావధానంలో ఓ పృచ్ఛకుడిగా కూడా వ్యవహరించాడు. సంబంధిత వార్త ఈనాడు వారి ఈ-పేపర్ లో వచ్చింది. క్రిందిచ్చిన లింక్‌లో చూడచ్చు.

  http://www.eenadu.net/nri/nri.aspx?item=nri-newsno=73

  • అనాతవరం ఊరి పేరు చొడగానే మీ బ్లాగు లొ టపా గుర్తుకి వచ్చేసింది లలిత గారు!! అయితే ఆ ఊరు ఈ ఊరు ఒకటే అన్న మాట

  • శర్మ గారేమో అనాతవరం గురించి రాసేరు ; ఇంకా లలిత గారు రాలేదేమిటి చెప్మా అనుకున్నా 🙂
   వచ్చేసారన్న మాట !
   అనాతవరం గురించి రాసేక లలిత గారు రాక పోతే ఎట్లా 🙂

   శుభం !

   చీర్స్
   జిలేబి

   • శర్మ గారు, జిలేబి గారు, చంద్రిక గారు:

    నాకెంతో ప్రియమయిన మా అనాతవరాన్ని ఇంతగా తలుచుకున్న మీకు బో…..ల్డన్ని ధన్యవాదాలు 🙂

  • లలిత జీ,
   మీ బ్లాగులో మా అనాతవరం ఏమారలేదన్న మాట చూశాకా ఈ సంఘటన గుర్తుకొచ్చింది. 🙂
   ధన్యవాదాలు

 2. హ హ హ, మీరు నన్ను సతాయించాలని ట్రాన్స్‌ఫర్ చేసిన అనాతవరం మా స్వగ్రామమే అనే కొసమెరుపు బాగుంది. poetic justice 😀 😀
  మీ సెక్రెటరీ గారిని మెచ్చుకోవాలి. ఆకలితో మాడండి అని లోపల అనుకుంటూ, పైకి మాత్రం ఈ ఊళ్ళో హోటళ్ళేం లేవండీ అనకుండా తగిన ఏర్పాట్లు చేయడం ఆయన మంచితనం.

  • విన్నకోట నరసింహారావుగారు,
   అలా జరిగిపోయిందండి. మావాడిని బాధపెట్టాలనుకుని ట్రాన్స్ఫర్ ఇచ్చేమనుకున్నారు 🙂
   మా వాడు మెత్తగా చెప్పేడు,భోజనం పెట్టి మరీ 🙂
   ధన్యవాదాలు

 3. దైవానుగ్రహం ఉంటే కష్టే ఫలీ !

  నాటి కాలపు మా మీ కార్య దర్శి దార్శికుడు !

  నాధుడు అనాత వరమును
  బాదుడు దేశమని వేసె! బాగుగ కుదిరెన్
  గాద ! త లిదండ్రు లకు సే
  వాదులు జేయన్ జిలేబి వరముగ నయ్యెన్ !

  జిలేబి

  • జిలేబీగారి కొత్తతెలుగును తప్పుపట్టి ప్రయోజనం లేదు కాని, ‘దార్శికుడు’ అన్న మాట లేదు ఆవిడ అన్నమాటకు మాబోటి పాతకాలం తెలుగుతెలిసిన వాళ్ళ వాడుకలోని మాట ‘దార్శనికుడు’ అని.

   • భలే వారండీ తాడిగడప వారు !

    ఎవరూ పుట్టించక పదా లెలా పుడతాయి 🙂

    జిలేబి పుట్టించే ! వెయ్యండి వీర తాళ్ళు 🙂

    దర్శించిన వాడు దార్శికుడు ! 🙂

    అతడు తన సిద్ధాంతాలని పూర్తి గా నమ్మిన వాడు.

    ఆ కార్య దర్శి ఆ కాలం లో తన కామ్రేడ్స్ కి చేసిన మేలు మీకూ తెలిస్తే మీరూ ఒప్పేసు కుంటారు .

    వారి గురించి శర్మ గారు పూర్తి గా వ్రాయలేదు. వ్రాస్తారని ఆశిస్తా .

    చీర్స్
    జిలేబి
    (ఇదే మరో టపా కి నాందీ అవుతందని ఆశిస్తున్నా శర్మ గారి దగ్గిర నించి )

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s