శర్మ కాలక్షేపంకబుర్లు-వొట్టి గొడ్డుకి…..

వొట్టి గొడ్డుకి…..

”ఒట్టిగొడ్డుకి ఆరుపులెక్కువ” అనిగాని ”ఉట్టిగొడ్డుకి ఆర్పులెక్కువ” అనిగాని అంటుంటారు.

పాతకాలంలో రైతులు పశువులమందను మేపేవారు. అందులో ఎడ్లు,దున్నలు, ఆవులు,గేదెలు, పెయ్యలు,కోడెలు, లేగలు ఉండేవి. ఎడ్లు,దున్నలు బరువైనపనులు చేసేవి, అరక దున్నడం,బండిలాగడం, మోట తోలడం (నీరు నూతినుంచి తోడటాన్ని మోట తోలడం అంటారు)

ఇక ఆవులు, గేదెలు ఇవి పాలిచ్చేవి, రెండు పూటలా పాలిచ్చేవి, ఒకపూట పాలిచ్చేవి, ఒట్టిపోయినవి కూడా ఉండేవి. పాలివ్వనివాటిని ఒట్టిపోయినవి అంటారు.

ఇక కోడెలు పనికి మలపవలసినవి, పొగరుబోతువీ, చెప్పినమాట వినవు, వీటికి ముక్కు కుట్టిస్తారు, ముక్కు తాడూ వేస్తారు, అప్పుడు చెప్పిన మాట వింటాయి.

ఇక చివరివి లేగలు, చాలా చిన్నవి వీటిని సరదాగా తువ్వాయిలు అనీ అంటారు, లేడి పిల్లల్లా గెంతుతూ ఉంటాయి.

ఇన్ని రకాల, వయసుల పశువులన్నిటికీ ఒకే రకం ఆహారం ఇవ్వడు, రైతు. వేటికి తగిన ఆహారం, వాటికి ఇస్తుంటాడు.

బరువు పనులు చేసే ఎడ్లు, దున్నలకి ఎండు గడ్డి,ఉలవలు, కొద్దిగా పచ్చి గడ్డి, చిట్టు, తవుడు,తెలకపిండి, జనపకట్టె, కుడితి ఆహారంగా ఇస్తాడు. వీటిని తిని బలమైన పనులు చేస్తాయి.

పాలిచ్చే, ఒంటి పూటపాలిచ్చే వాటికి పచ్చగడ్డి, జనపకట్టె, తెలక పిండి, చిట్టు, తవుడు, కుడితి ఆహారంగా ఇస్తాడు, పాలు బాగా ఇస్తాయి.

ఒట్టి గొడ్లు, ఇవి ఒట్టిపోయి ఉంటాయి, మళ్ళీ చూలు కట్టే సావకాశమూ ఉండదు, అమ్మెయ్యలేడు, నడివయసులో ఉంటాయి, పనీ చెయ్యలేవు, కాని ఒకప్పుడు మహరాణీ భోగం అనుభవించినవి, పాలిచ్చిన కాలంలో. అప్పుడు ఆహారంగా పై చెప్పినవి తిని వున్నవీ. ఇప్పుడు పాలివ్వని కారణంగా, పాలిచ్చేవాటికి పెట్టే ఆహారం పెట్టరు. పాలిచ్చేవాటికి ఆహారం ఇచ్చేటపుడు అరుస్తూ ఉంటుందీ ఒట్టి గొడ్డు, తనకూ పెట్టలేదని. ఇవి మందలో పోట్లాడుతుంటాయి, అంతకు మించి ఏ పనీ చేయలేవు. వీటికి రైతు ఎండుగడ్డి మాత్రం సమృద్ధిగా వేస్తాడు. అందుకే ”ఒట్టిగొడ్డుకి ఆర్పులెక్కువ” అంటారు.

ఇక కోడెలు ఇవి ”తినడానికి తిమ్మరాజు, పనికి పోతురాజు” అన్న నానుడిలా దున్నబోతే దూడల్లోకి మెయ్యబోతే ఎడ్లలోకి జేరతాయి. ఇవి పని చేయలేవు తగిన వయసులేదు గనక, కాని రేపటి కాలంలో పని చేయవలసినవిగనక ఎడ్లతో సమానంగా తిండి పెట్టాలి, ”దున్నబోతే దూడలలోకి, మెయ్యబోతే ఏడ్లలోకి” అన్న సామెత ఇలా పుట్టిందే, దొంగ గొడ్లకి తిండి దండగ కాని తప్పదు.

ఎప్పుడూ ఏ పనీ చేయక,చెయ్యడం చేతకాక అరిచేవాళ్ళని ఒట్టిగొడ్లు అంటారు. నిజానికి వీళ్ళని ఒట్టిపోయిన వాటితో పోల్చడం అన్యాయమే, ఎందుకంటే ఈ ఒట్టిపోయిన పశువులు ఒకప్పుడు పాలిచ్చినవి కదూ! వీళ్ళైతే ఎప్పుడూ ఏపని చెయ్యనివాళ్ళు,చేతకాని వాళ్ళూనూ…..మరి వీళ్ళే ఇంటికప్పెగిరిపోయేలా అరుస్తారు…

 

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వొట్టి గొడ్డుకి…..

  1. విన్నకోట నరసింహారావు గారు,
    టపా మొదలుపెట్టి సగం రాసి వదిలేశా రెణ్ణెల్ల కితం. టపా సగం రాశానని మీకెలా తెలిసిందబ్బా! మీకు టెలిపతీ ఉందండోయ్! 🙂
    ధన్యవాదాలు.

  2. గొడ్లకి వేసే గడ్డీగాదంలో చొప్పకట్ట కూడా ఉంటుందనుకుంటాను. అదంటే గుర్తొచ్చింది – “చొప్పదంటు ప్రశ్నలు” గురించి మీరో టపా వ్రాయాలని మా కోరిక (కొన్ని చోట్ల ఇవి తరచూ కనిపిస్తున్నాయి) 😀 😀.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s