శర్మ కాలక్షేపంకబుర్లు-కుడితిలో పడ్డ ఎలక

కుడితిలో పడ్డ ఎలక

కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకోడం అంటారు, ఇదేంటీ? అన్నట్టు నేటివారికి, కుడితి తెలీదు, ఎలకా తెలీదుకదా! వివరంగా చెబుతా!!

పాతకాలంలో ప్రతి ఇంట పశువులు కూడా ఉండేవి, ఏవి ఉన్నా, లేకపోయినా ఆవు తప్పనిసరిగా ఉండేది. ఆవుకి పచ్చగడ్డి వేసేవారు, ఇంటి దగ్గరున్నంత సేపూ కూడా. దాహం తీర్చుకోడానికి ఒక తొట్టి పెట్టేవారు. ఆ తొట్టి కర్రతో చెయ్యబడి కింద సన్నగాను పైకి వెళ్ళేటప్పటికి మూడడుగుల కైవారంతో రెండడుగుల ఎత్తులో ఉండేది. దీనిలో నీరు, బియ్యం కడిగిన కడుగు, అన్నం వార్చిన గంజి, కూర తరుక్కున్న తరవాత వచ్చే రద్దు, మిగిలిపోయిన అన్నం, మినప, కంది, పెసర పొట్టు ఇలా ఇంట్లో వారు తినేవన్నిటిలోనూ బలమైనవి ఈ తొట్టిలో పోసేవారు. ఆవువాటిని తిని, తాగి బలమైన పాలిచ్చేది. ఆవుతో పాటుగా ఈ తొట్టిమీద ఆధారపడి మరికొన్ని జీవులుండేవి, అవి ఈగ,బల్లి, ఎలక,కాకి. ప్రస్థుతం ఎలకగురించే చెప్పుకుందాం. ఎలక తిన్నదానికంటే పాడుచేసేదే ఎక్కువ. ఈ ఎలకలు దండులా బారులు తీరి కదులుతాయి. ఎలక చాలా తెలివైనది. ఏది కనపడితే దాన్ని కలబడి తినెయ్యదు. దండులో ముసలి ఎలక ముందు తిన్న తరవాత మిగిలినవి తింటాయి, దండుగా కదిలినపుడు. ఇదెందుకో తెలుసా? జాగ్రత. ఆక్కడున్న ఆహారంలో తినకూడనిదుంటే ఆ ముసలి ఎలకకి ఏదో జరుగుతుంది, అది ఆత్మ త్యాగం చేసి, మిగిలినవాటిని రక్షిస్తుంది. దారి తప్పుతున్నాం కదూ!

ఎలక కుడితి తొట్టి దగ్గరకే చేరుతుంది, దానికి తెలుసు అక్కడ తనకి కావలసిన ఆహారం దొరుకుతుందనీ. నెమ్మదిగా కట్టుగొయ్యనున్న పలుపుతాడెక్కి నెమ్మదిగా కుడితి తొట్టి మీదకి చేరుతుంది. అన్నపు కరుడు సగం ములిగి సగం తేలుతూ కనపడుతూ ఉంటుంది. దాని దగ్గరకి చేరాలంటే కుడితితొట్టిలో ఉరక్క తప్పదు, ఉరుకుతుంది, అన్నం కరుడు మీదకి ఎక్కుతుంది నెమ్మదిగా, అన్నం కరుడు ములుగుతూ తేలుతూ ఉంటుంది, స్థిమిత పడ్డ తరవాత కావలసింది తినేస్తుంది, ఇప్పుడు బయటికిరావాలి,ఎలా? రాలేదు, కారణం తొట్టి అంచులు నున్నగా ఉంటాయి, పట్టు దొరకదు, ఎగరచ్చు, సావకాశం లేదు, ఎగరడానికి కాళ్ళకి పట్టు దొరకదు, నొక్కిపెడితే అన్నం కరుడు ములిగిపోతోంది. అన్నం కరుడు దిగి కుడితిలో పడి బయటికిపోయే సావకాశం దొరుకుతుందేమోనని ఈదుతూ ఉంటుంది. సావకాశం దొరకదు, ఆయాసం, నీరసం తప్పించి, ఇప్పుడు అసలు కుడితి తొట్టిలోకి ఎందుకు దిగానూ అని ఆలోచిస్తూ, మళ్ళీ అన్నం కరుడెక్కి కూచుందామనుకుంటే అది విడిపోతోంది. ఎలా బయటికిపోయే దారిలేదు, అక్కడ ఉండేందుకూ దారిలేదు, ఇదే కుడితి తొట్టిలో ఎలక అవస్థ. ఇదెందుకు జరిగిందీ, ప్రలోభం. ఈ ప్రలోభం మానవుల్ని ఎలా ఏడిపిస్తుందో చూద్దామా?

పెళ్ళికొడుకు బుద్ధిమంతుడు, చిన్న ఉద్యోగం,పెద్దగా అందగాడుకాడు, ధనవంతుడూ కాడు, కట్నకానుల ప్రసక్తీ లేదు. మరో పెళ్ళికొడుకు ధనవంతుడు, ఉద్యోగి, కాని కొద్దిగా బుద్ధికే మట్టులేదని వార్తలున్నాయి, కట్నకానుకలూ కావాలంటున్నాడు. ఇప్పుడు ఏ సంబంధానికి సరేనని చెప్పాలి? అమ్మాయి, తల్లి దండ్రులూ కూడా ఏమనుకుంటున్నారు, నేటి కాలంలో! ఏదో ఒక లోటు లేనివాడున్నాడేంటీ? కట్నకానుకలొద్దన్నవాడి దగ్గరేం లోపముందో, ఎవరికి తెలుసు? డబ్బున్నవాడు, అందగాడు, మరికొంత సంపాదించే వీలున్న ఉద్యోగం అని రెండో సంబంధమే చేసుకుంటున్నారు. పెళ్ళయిన వెంఠనే చుక్కలు చూపించాడే అందా పెళ్ళి కూతురు, స్నేహితురాలితో. దానికా స్నేహితురాలు అది అందరూ చేసేపనే 🙂 , నీ మొగుడొకడే తేడా కాదు, సద్దుకో అని 🙂 దీనికి కారణం ప్రలోభం…

మీ పాత బంగారం తెచ్చెయ్యండి, దాని బరువుకు సరిసమానమైన బరువు బంగారపు వస్తువులు పట్టుకెళ్ళండి, మజూరి, తరుగులేదు, ప్రకటన. ఆవిడకీ వడ్డాణం నూరు తులాలది బరువైపోయింది. ఎప్పటిదో తన అమ్మమ్మ అమ్మ చేయించుకున్నదిట, మోటుగానూ ఉంది. మార్చేసుకుంటే. ఇంకెందుకూ ఆలస్యం, కొట్టు దగ్గరకెళితే వాడు ఇటుతిప్పి, అటుతిప్పి, మీటర్లో పెట్టి, అరగదీసి, అబ్బే బంగారంలో కల్తీ ఉందండి, మీరు నూరు తులాలంటున్నారు, దీనిలో అరవైఐదు తులాలకంటే బంగారంలేదు, మీకిష్టమైతే అలా పట్టుకెళ్ళండి అన్నాడు. ఇదేదో తేడాగా ఉందనుకుని అక్కడనుంచి మరోకొట్టుకు, పాపం ఈ కొట్టువాడు అప్పటికే వార్త అవతలివాడికి చేరేసేడు. నేను అరవ ఐదు చెప్పేను, చూసుకో బేరం పోనివ్వకూ, మంచి సరుకు. కతమామూలే కొత్తవాడు డెభ్భై తులాలిస్తానండి, మా దగ్గరంతా నికార్సు, అని అదిపుచ్చుకుంటాడు. మొత్తానికి మోసపోడం ఖాయం. కోట్లవాళ్ళిద్దరూ కలిసి దోచుకున్నారని తెలియక….. ఇదెందుకూ ప్రలోభం, చేతకూలి,తరుగు కలిసొస్తుందని. వ్యాపారస్థుడు మళ్ళీ అదేనగ ఇది చాలా పాతకాలందండీ! ఇప్పుడు ఇంతబాగా చేసిన నగ దొరకడం లేదు, ఇందులో తొంభై తులాల బంగారం, మిగిలినది రాగి, అని చెప్పి లాభానికి అమ్ముకుంటున్నాడు.

నిజానికి నేడు జరుగుతున్న వ్యాపారం అంతా ప్రలోభం మీద జరుగుతున్నదే! ఒక చీరకొంటే ఒకటి ఫ్రీ! దానిఖరీదు నాలుగువేలు. చీరెంత బావుందో. రెండు చీరలు రెండు రంగులు ముచ్చటగా ఉన్నాయి, మోజు. అక్కడే బట్టలు కొనడానికొచ్చిన మరొకావిడ మీరు తీసుకోకపోతే చెప్పండి, నేను తీసుకుంటానంటుంది. మరో జత చూపమంటే అబ్బే ఈ జతఒక్కటే మిగిలిందండీ, మీకు కావాలంటే సరి, లేదంటే వారికిచ్చేస్తా. అమ్మో! ఇంతమంచి చీరలు మళ్ళీ దొరకవేమో, ప్రలోభం, నాకే ఇచ్చెయ్యండి, మాట. ఇంతకీ ఆ పోటీ కొచ్చినావిడ ఇటువంటి బేరానికి నియమింపబడినదే 🙂 ఏమయ్యా! ఒక చీర రెండు వేలకియ్యరాదా? అడగండి, అబ్బే అలా కుదరదండి!ఇది స్కీమండి అంటాడు తప్పించి నిజం చెప్పడు 🙂

జీవితంలో నిత్యమూ ప్రలోభం లో పడి మోసపోతూనే ఉన్నాం, చాలాచాలా విషయాలలో,ఇంకా మోసపోతాం కూడా, ఇదింతే 🙂 ఆ తరవాత కుడితిలో….. కొట్టుకుంటూ ఉంటాం, టాం,టాం

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కుడితిలో పడ్డ ఎలక

 1. అనుకునేదేముంది లలిత గారూ …… మమ (మతిమరుపు) (నాది) అని తప్ప 🙁 ఎందుకనో CSR గారని అనిపించింది, ఆ సినిమా చూసి “ఎన్నో యేండ్లు గతించి పోయినవి”; KVS శర్మ గారూ మంచి నటుడే. సవరణకి థాంక్స్.

 2. థాంక్స్ “అనామకం” గారూ (జూన్ 17, 2016; 09:16) గారూ మీ స్పందనకి.
  మీరన్న “మనశ్శాంతి” కోసమో, ఇంట్లో “ప్రశాంతత” కోసమో పూజలు చెయ్యడం అనేది – వెల్, వారి వారి నమ్మకం. కానీ ఆ బిల్డర్ గారు ఆ “బాబా” గారిచే (“బురిడీ బాబా” అని మీడియా పెట్టిన పేరు) పూజ చేయించినది “మనశ్శాంతి” కోసమని నేను చదివిన వార్తాపత్రికల్లో కనపడలేదు. ఆ ఆధారంగానే నా వ్యాఖ్య వ్రాశాను. ఒకవేళ మీరన్నదే అయినప్పటికీ మనశ్శాంతి పూజల కోసం కోటిరూపాయల డబ్బున్న బాగ్ తీసుకొచ్చి – కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టినట్లు – పూజలో పెట్టడం ఏవిటో నాకయితే విచిత్రంగా ఉంది. అలా చెయ్యాలని చెప్పిన “బాబా” మీద వెంటనే అనుమానం రావాలి కదా. మనశ్శాంతికై చేసే పూజలు, గ్రహదోషాలకి ఇచ్చే దానాలు వగైరా ఈ రకంగా ఉంటాయనుకోను. ఆ వాదనంతా మాకనవసరం, మా “గురువు గారు” చెప్పిందే వేదం, దూకు అంటే దూకడమే కానీ వేరే ఆలోచనే చెయ్యం – అనేవారికి చెప్పగలిగేదేమీ లేదు.
  “దొంగ బాబాలను చేరదియ్యకపోవడమే మంచిది” అని మీరన్నదానితో పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే కవరేజ్ తక్కువగా ఉండిన పాతరోజులతో పోలిస్తే మీడియా కవరేజ్ విస్తృతంగా పెరిగిన ఈ రోజుల్లో కూడా ప్రలోభాలకు గురై ఏమీ ఆలోచన / విచక్షణ లేక మోసపోయేవారిది – ధనికులైనా, పేదవారైనా – మీరన్న “మాయరోగం” కన్నా తెలివితక్కువదనం, దురాశ అంటాను. ప్రలోభ పెట్టేవారు దొంగ బాబాలు, బూటకపు స్వామీజీలు కావచ్చు, బంగారం షాపులు కావచ్చు, ఉద్యోగాలిప్పిస్తామనే వారు కావచ్చు, బాంకులు కూడా ఇవ్వలేనంత అధిక వడ్డీ ఇస్తామనేవారు కావచ్చు, కోట్ల రూపాయల లాటరీ గెలిచారని వచ్చే సెల్‌ఫోన్ మెస్సేజ్ కావచ్చు, ఫలానా దేశంలో ఓ ధనికుడు (ముక్కూమొహం తెలియనివాడు) మీ పేరే కలవరిస్తూ కన్నుమూశాడని వచ్చే ఈమెయిల్ కావచ్చు. ఎన్నో ఎన్నెన్నో ……

 3. విన్నకోట నరసింహారావు గారూ,
  డబ్బున్నవాళ్ళు మోసపోతే ఎవరూ జాలిపడరు.ఆయనకేమిటి మాయరోగం అనుకుంటారు కానీ ఆయన డబ్బుకోసం పూజలు చేయలేదు మనశ్సాంతి కోసం పూజలు చేసారు.ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బున్నా ఏమి లాభం ? కుటుంబ వివాదాలు పరిష్కరిస్తామని స్వామీజీలూ బాబాలూ ఎంత డబ్బు తింటున్నారో నాకు తెలుసు.చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళుకూడా ఈ బాబాల చేతిలో మోసపోతున్నారు.కేసీఆర్ పూజలు చేస్తే గొప్పగా చెప్పుకున్నారు,ఈయననేమో ఏం మాయరోగం అంటున్నారు.పూజలు చేయడం తప్పుకాకపోయినా దొంగబాబాబాలను చేరదీయకపోవడమే మంచిది. రాందేవ్,రవిశంకర్,జియ్యర్ స్వామి వీళ్ళకు అంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటంతటి డబ్బు ఎక్కడనుండి వస్తుందనుకుంటున్నారు ?

 4. ప్రలోభాల్లో పడేవారికి తక్కువేముంది శర్మ గారూ!
  నిన్న గాక మొన్న జరిగిన సంఘటన గురించి మీరు పేపర్లోనో / టీవీలోనో చూసే ఉంటారు. డబ్బుకట్టలకి పూజ చేస్తే డబ్బు రెట్టింపవుతుందని ప్రలోభపెట్టిన ఓ “బాబా” గారి మాటలు నమ్మి, ఇంటికి పిలుచుకొచ్చి, కోటి రూపాయలు ఓ బాగ్‌లో సర్ది తీసుకొచ్చి పూజలో పెట్టారట ఓ పెద్దమనిషి ఆయన కుటుంబ సభ్యులూనూ. “బాబా” గారు పూజ చేశాడట, హోమం చేశాడట, ప్రసాదం అని చెప్పి పరమాన్నం ఇచ్చాడట. అది తిని స్పృహ తప్పి పడిపోయారుట. డబ్బు సంచీ “గాయబ్” (“అరే పోయిందే”), “బాబా” గారూ మాయం, వీళ్ళు తర్వాత హాస్పిటల్ పాలు. ఆ పెద్దమనిషి హైదరాబాద్‌లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన బిల్డరట, బంజారా హిల్స్‌లో నివాసం ఉండగలిగిన ధనవంతుడట. అయినా కూడా ప్రలోభం. మరి ఇప్పుడు పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలుకేగా! ఓ పాత సినిమాలో “…….. నిను చేరి కొలుతునే మాతా దయగొను ధనలక్ష్మీ, ఇదే చోటున ఖడేరావుగా సదా నిలువుమా ధనలక్ష్మీ” అని CSR గారు నటించిన పాట ఉంది గుర్తుందిగా, అలాగయ్యుంటుంది బహుశః ? (సినిమా పేరు, పాట పల్లవి ఆరంభం గుర్తుకురావడంలేదు. “పాటతో నేను” బ్లాగర్ వేణూశ్రీకాంత్ గారికి తెలుసుంటుంది 🙂 ).

  ఎల్లప్పుడూ నాకు హాస్యాస్పదంగా తోచేది తాడూ బొంగరం లేని ఛిట్‌ఫండ్ కంపెనీలకు, కాలనీల్లో ఛిట్ నడుపుతాం అనే అపరిచితులకి జనాలు తమ కష్టార్జితాన్ని అప్పజెప్పడం. అలాగే మీకు గుర్తుండాలి – ఆ మధ్య కొంత కాలం ప్రైవేట్ అర్బన్ కో-ఆపరేటివ్ బాంకులు అంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చాలామటుకు తాడూ బొంగరం లేనివే. స్టేట్ బాంక్‌లో రిటైర్ అయిన ఓ పెద్దమనిషి రిటైర్‌మెంట్ డబ్బు తీసుకెళ్ళి అటువంటి ఓ అర్బన్ బాంకులో పెట్టాడు. అదేమిటి స్వామీ అనడిగితే అర్బన్ బాంకుల్లో వడ్డీ ఎక్కువ ఇస్తామన్నారు అన్నాడు 🙁 . తర్వాత కొంతకాలానికి ఆ అర్బన్ బాంక్ మూతపడింది. “అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే” అని పాడుకోవడమేగా మిగిలింది. 30, 35 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసి (అది కూడా ఓ ప్రభుత్వ బాంక్ ఉద్యోగిగా) కూడబెట్టుకున్న డబ్బు ఎవరికో పళ్ళెంలో పెట్టి సమర్పించుకున్నట్లేగా ! ప్రలోభానికి పరాకాష్ఠ.

  ఇటువంటి సంఘటనలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అయినా కూడా ఎవరన్నా కొత్తగా బోర్డ్ పెడితే వాళ్ళ ఆఫీసులోంచి రోడ్ మీద వరకూ క్యూలో నిలబడి మరీ తమ డబ్బు అందిస్తారు జనాలు ఏవిటో 🤔 ? ప్రలోభమే. చేతులు కాలాక టీవీ మీద భోరుమనడం.

  నిజం ఎలుకయితే ఆకలిబాధ అనుకోవచ్చు. కానీ పై రకపు తెలిసితెలిసీ కుడితిలో పడ్డ ఎలుకలంటే నాకు సానుభూతి లేదండి. 😡

  • “ఓ పాత సినిమాలో “…….. నిను చేరి కొలుతునే మాతా దయగొను ధనలక్ష్మీ, ఇదే చోటున ఖడేరావుగా సదా నిలువుమా ధనలక్ష్మీ” అని CSR గారు నటించిన పాట ఉంది గుర్తుందిగా, అలాగయ్యుంటుంది బహుశః ?”

   ఆ పాట అభిమానం సినిమాలో “మదిని నిన్ను నెర నమ్మి కొలిచితిని మాతా దయగొను ధనలక్ష్మీ” అండీ!

   • అదేనండీ అదే, ఆ సినిమానే ఆ పాటే 🙂. ఇప్పుడు మీరు చెప్పాక గుర్తొచ్చింది. థాంక్స్ లలిత గారూ.

   • ఇంకొక్క చిన్న విషయం – మీరేమనుకోనంటే – అభిమానం లో CSR గారు నటించలేదు. ఈ పాటలో వున్నవారు – K.V.S. శర్మ గారు , చలం గారు.

   • తాడిగడప శ్యామలరావుగారు,
    ఈ సామెతని ఇలా చెప్పేస్తున్నాం, అలవాటులో పొరపాటుగా. దురాశా, దుఃఖమూ, చేటు అని గాని దురాశ దుఃఖమునకు చోటు అనిగాని అనాలనుకుంటానండి.
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s