శర్మ కాలక్షేపంకబుర్లు-మరణాంతాని వైరాణి

మరణాంతాని వైరాణి

(శ్రీమద్రామాయణం,యుద్ధకాండ,114 సర్గ)

రామరావణ యుద్ధం ముగిసింది, రాముడు వేసిన బ్రహ్మాస్త్రానికి రావణుడు నేల కూలడంతో. చనిపోయిన అన్నగారిని చూచి విభీషణుడు విచలితుడై ఏడ్చాడు ’అన్నా! మహా వీరుడవు,పరాక్రమశాలివి,విద్యావంతుడవు,రాజనీతికోవిదుడవు కాని ఇలా అయిపోయావు, నీకారోజున నేను చెప్పిన మాటలు రుచించలేదు, కామ పరవశుడవై కన్నులు మూసుకుపోయాయి. నీ గర్వం మూలంగా మహాబలశాలులైన రాక్షసులంతా నశించిపోయారు. ఇంక రాక్షస లోకానికి మిగిలినదేంటి?’ అని పరిపరి విధాల వాపోతూ చివరగా ’విగత జీవుడైన నా అన్నకు ప్రేతకార్యం నీదయతో ఆచరించాలి’, అన్నాడు. దానికిరాముడు, ’విభీషణా!

మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్
క్రియతామ్ అస్య సంస్కారో మమాఽప్యేష యద్థాతవః

వ్యక్తులు జీవించి యున్నవరకే వైరములుండాలి. వ్యక్తులు మరణించిన తరవాత వైరం ఉండకూడదు. ఇతనికి అంత్య సంస్కారం చెయ్యి, ఇతను నీకులాగే నాకూ గౌరవార్హుడే’,

అనేలోగా రాణివాసం నుంచి రావణ పత్నులు చేరారు.

రాక్షస స్త్రీలు పిచ్చివాళ్ళలా ఏడ్చారు, రావణుడిని కౌగలించుకున్నవారు, కాళ్ళను,ౘేతులను కౌగలించుకుని ఏడ్చినవారు. ’ఇంద్రుడు,యముడుతో సహా ఎందరెందరో నీ ముందు నిలవడానికే భయపడినవారే చివరికి ఇలా అయ్యావా! నీ క్షేమం కోరేవారి మాట వినక ఇలా అయ్యావు గదయ్యా!’ అని ఏడిచారు. అప్పుడు రావణ పట్టమహిషి మందోదరి ’నాధా! నువ్వు కళ్ళెర్రజేస్తే నీ ముందు నిలబడేవాడే లేడయ్యా! మానవమాత్రుడు నిన్ను ఎలా గెలవగలిగాడు? లంకలోకి ఎవరూ కాలు పెట్టలేరు, నీ అనుమతిలేక, కాని ఒక కోతి అడుగుపెట్టింది, నీ రాక్షస బలాన్ని ఖరదూషణులను తెగటార్చినపుడే అనుకున్నా, రాముడు మానవుడు కాదని, ఇప్పటికీ నిన్ను రాముడు చంపేడంటే నమ్మలేకపోతున్నా. మహా సముద్రం మీద సేతు నిర్మాణం జరిగినప్పుడే అనుమానించాను, రాముడు యోగి,మహత్తులకు మహత్తైనవాడు, పరిణామ రహితుడు,లోక సంరక్షణకే మానవునిగా అవతరించాడు. శ్రీరామునితో విరోధం వద్దూ అని ఎంత చెప్పినా వినిపించుకున్నావుగాదు. కామంతో సీత కోసం పాకులాడేవు, సీత నాకంటే అందగత్తెనా? నాకంటే చదువుకున్నదా? ఎందుకామెను ఎత్తుకొచ్చావు? సీత రూపంలో మృత్యువును కోరి తెచ్చుకున్నావు, అందుమూలంగా నీవు నశించావు, రాక్షసలోకం నశించింది, లంక పాడుబడింది, విభీషణుడు రామునితో వైరం వద్దని నీ క్షేమం కోరి చెబితే దాయాది మాటగా పెడచెవిని పెట్టేవు, సీతను రామునికి అప్పజెప్పి ఉంటే ఒక మంచి మిత్రుడు దొరికేవాడు, రాక్షసలోకం బాగుండేది, విననందుకే ఈ దుస్థితి సంభవించింది’, అనుకుంటూ తలుచుకుతలుచుకు ఏడ్చింది, ఆమెను సపత్నులు సేద తీర్చారు. ఇదంతా విన్న రాముడు విభీషణునితో, ’ఈ స్త్రీలనిక పంపివైచి రావణునికి అంతిమ సంస్కారం చెయ్యమ’న్నాడు.

దానికి విభీషణుడు, ’రామా! రావణుడు ధర్మమార్గం వదిలేసినవాడు,కఠినాత్ముడు, అసత్యవాది, పరస్త్రీల ఎడ గౌరవం లేనివాడు,ఇట్టివానికి అంత్యక్రియలు జరపడం నాకిష్టం లేదు, ఇతను నాకంటే పెద్దవాడు, పూజ్యుడే కాని అకృత్యాలు చేసినవాడికి అంత్య సంస్కారాలు నేను చేయకపోయినా లోకం నన్ను తప్పు పట్టదు,తెలిసినవారెవరూ నన్ను నిందించరు’, అన్నాడు.

దానికి రాముడు ’విభీషణా! ఇతను అసత్యవాది,ధర్మ విరోధి, లోక కంటకుడు కావచ్చు కాని

మరణాంతాని వైరాణి నిర్వృత్తంనః ప్రయోజనమ్
క్రియతామ్ అస్య సంస్కారో మమాఽప్యేష యద్థాతవః
వ్యక్తులు జీవించి యున్నవరకే వైరములుండాలి. వ్యక్తులు మరణించిన తరవాత వైరం ఉండకూడదు. ఇతనికి అంత్య సంస్కారం చెయ్యి, ఇతను నీకులాగే నాకూ గౌరవార్హుడే,

త్వత్సకాశాద్దశగ్రీవః సంస్కారం విధిపూర్వకమ్
ప్రాప్తుమ్ అర్హతి ధర్మజ్ఞ! త్వం యశోభాగ్భవిష్యసి.
ఇక ఇతనికి అంత్య సంస్కారములు జరుపవలసినదే, నీకువలనే ఇతను నాకునూ గౌరవార్హుడే, నీవలన ఈ దశకంఠుడు అంత్య సంస్కారములు పొందుటకు అర్హుడు, దీనివలన నీ కీర్తి ఇనుమడించును’.
అని మళ్ళీ చెప్పి, నీవు రావణుని అంత్య సంస్కారం చేయడం మూలంగా నీ కీర్తి ఇనుమడిస్తుందని చెప్పడంతో, అంత్యక్రియలూ చేశాడు, విభీషణుడు..

లోకంలో ఒక మాటుంది, ’విభీషణుడు రావణునికి అంతిమ సంస్కారం చేయనంటే తానే చేస్తానన్నాడు రాముడు’అని, ఇది పొరపాటు. రావణుడు నీకులాగే నాకూ గౌరవార్హుడు కనకనైనా నీవు అంతిమ సంస్కారం చెయ్యాలని చెప్పేడు తప్పించి తాను చేస్తాననలేదు. రావణునికి జ్ఞాతులిక ఎవరూ మిగలలేదు, విభీషణుడు తప్పించి. విభీషణుడే అంతిమ సంస్కారం చేయవలసినవాడు, అది అతని విధి, ధర్మం కూడా. దీనినే రాముడు సున్నితంగా చెప్పేడు విభీషణునితో, అలా చెప్పడం మూలంగా రాముడు ధర్మాన్ని చెప్పేడు, ధర్మాన్ని అచరింపచేసేడు. ఆ తరవాత నీవు అంతిమ సంస్కారం చేయడం నీ మేలుకే అన్నాడు, రాముడు. ఇదేమీ? విభీషణుడు లంకాధిపతిగా పాలన చేయబోతున్నాడు, ప్రజలు ప్రతి విషయంలోనూ ఇతనిని రావణునితో పోలుస్తారికమీద, అప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా ’అన్నకే అంత్యక్రియలు జరపనివాడు, మనకేం ఉపకారం చేస్తాడూ’ అని నిందిస్తారు, ఇది రాజుగా విభీషణునికి తగనిది, స్నేహితునికి రాజధర్మం చెప్పేడు. చివరగా తను ఈ విషయాలు చెప్పి మిత్ర ధర్మం నెరవేర్చాడు. అదీ రాముడంటే… రామో విగ్రహావాన్ ధర్మ….

స్వస్తి

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మరణాంతాని వైరాణి

 1. అందుకే రామాయణం పూర్తిగా అర్ధం చేసుకుంటే మన ఆలోచనాధోరణి మారుతుంది అనేది మాత్రం నిజం. మిమ్మల్ని ఎప్పుడూ అడుగుదామని మర్చిపోతుంటాను. అనపర్తి లో ఒక అత్తా కోడళ్ల అనుబంధం గురించి చాగంటి వారు ఉదాహరణ గా చెప్పారు. అది మీ కుటుంబమేనా 🙂 ?

  • Chandrikaగారు,
   రామాయణాన్ని పారాయణ చేయడమంటే దానిలోని గూఢార్ధాన్ని ఆకళించుకోవడం. అర్ధమైతే ఆలోచనా ధోరణే మారిపోతుందన్నదీ సత్యమే.

   మీరడిగిన ప్రశ్నకు సమాధానం “నాకు తెలియదండీ 🙂 ”
   ధన్యవాదాలు.

 2. పదవి లో ఉన్నప్పుడు వాజ్పేయి గారు పాకిస్తాన్ సోల్జర్స్ భారత సైనికుల చేత చిక్కి కాల్పుల్లో మరణిస్తే పాకిస్తాన్ గవర్నమెంటు ఆ పార్థివ దేహాలను తాము తీసుకోనని చెప్పడం తో వాజ్పేయి గారు మరణాంతాని …. శ్లోకాన్ని కోట్ చేసి మన దేశ సైనికుల చేతనే వారికి దహన సంస్కారాలు గావించేరు

  జిలేబి

  • జిలేబిగారు,
   ఇది జిలేబి కామెంట్ లా అవుపించటం లేదు, అనిపించటం లేదు….

   నాకీ విషయం గుర్తుకు రాలేదండి
   ధన్యవాదాలు.

  • మిత్రులు శ్యామలరావు గారు,

   మరణాంతాని వైరాణి……..

   ఈ శ్లోకం పునరుక్తికాదు. రాముడీ మాటలు రెండు సార్లు చెబుతాడు. మొదట విభీషణ నిర్వేదంతో యుద్ధ కాండ 112 వ సర్గ చివర 26 వ శ్లోకంగా కనపడుతుంది. మరల 114 వ సర్గ లో 101 వ శ్లోకంగా కనపడుతుంది. ఈ సర్గలని క్లుప్తీకరించడంలో..ఇలా కనపడుతున్నాయి. పరిశీలించగలరు. పొరబాటుంటే తెలుప కోర్తాను. మీ నిశిత పరిశీలనకు
   ధన్యవాదాలు.

  • శ్యామలీయం గారు : మీ బ్లాగులో వ్యాఖ్య పెట్టడానికి రావటం లేదండీ . ఇదీ నేను పెడదామనుకున్న వ్యాఖ్య: నాగేంద్రుడి గురించి చెప్పినపుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. మీరు చెప్పినట్లు నమ్మితే నమ్మచ్చు పిట్టకథలు గా కొట్టి వేయవచ్చు. ఒక రోజు ‘శంకరాభరణం’ సినిమా మీద నేను చాగంటి వారి ప్రవచనం వినటం జరిగింది. వాసుకి కథ విన్నాను. విన్నాక ఏదో పని చేద్దామని గారేజ్ లోకి వెళ్ళగానే ఒక నల్ల పాము కనిపించింది. గారేజ్ తలుపులు తీయగానే వెళ్ళిపోయింది అనుకోండి.

 3. అది రాముడి సంస్కారం. తమ చేతిలో చనిపోయినవాడి దేహాన్ని ఇటునుంచి అటువైపుకు దాటి వెళ్ళడం ఇప్పటి సంస్కారం (అలా చూపించేది సినిమాల్లోనే అనుకోండి …ప్రస్తుతానికి. కానీ చెప్పలేం, మన తెలుగు ప్రజల మీద సినిమాల ప్రభావం విపరీతం కదా) 🙁

 4. “వ్యక్తులు జీవించి యున్నవరకే వైరములుండాలి. వ్యక్తులు మరణించిన తరవాత వైరం ఉండకూడదు.”

  మరణించిన వారి పట్ల – వారు ఎలాంటివారైనా పాటించాల్సిన కనీసపు మర్యాద. మంచి మాటలు గుర్తు చేశారు.

  ధన్యవాదాలు,
  ~ లలిత

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s