శర్మ కాలక్షేపంకబుర్లు-రావణ నిర్వేదం

రావణ నిర్వేదం
(శ్రీమద్రామాయణము, యుద్ధ కాండ, 68 వ సర్గ.)

రాముని చేతిలో కుంభకర్ణుడు పడిపోయాడు. ఈ వార్తను రావణునికి తెలియజేశారిలా          ” మహాప్రభూ! కుంభకర్ణులవారు, వానరులను దొరికినవారిని దొరికినట్లు నమిలేశారు, మహాపరాక్రమంతో పోరాడేరు, రాముడు వేసిన రెండు అస్త్రాలతో రెండు చేతులు తెగినా పోరాడేరు, ఆ తరవాత కాళ్ళు తెగనరికినా మొండెంతోనే పోరాడేరు, చివరగా కంఠం తెగనరికితే తల కోటగుమ్మం మీద పడింది, మొండెం సముద్రంలో పడిపోయి కుంభకర్ణులవారు నిహతులయారు” అని చెప్పారు.

ఈ మాట విన్న రావణుడు మూర్ఛపోయాడు. రావణుని కుమారులందరూ పినతండ్రి మరణానికి గొల్లున ఏడ్చారు. మూర్ఛనుండి తేరుకున్న రావణుడు ” అయ్యో! తమ్ముడా మహాబలశాలివి, మహా వీరుడవు, శత్రువుల ఎడ కాలుడవు, ఇంద్రుని వజ్రాయుధం కూడా నిన్నేం చెయ్యలేదే! దానినీ నీవెప్పుడూ లెక్క చేయలేదే!! అంతటి వీరుడవు రాముని చేతి బాణాలకి ఎలా పడిపోయావయ్యా!!! ప్రళయ కాలంలో రుద్రునిలాటివాడివి, దేవ దానవులను గెలిచినవాడవు, ఎలా రాముని చేతిలో పడిపోయావు? ఎలానేలకొరిగావు తమ్ముడా! ఈ దృశ్యాన్ని చూసిన దేవతలు,ఋషులు ఎంత ఆనందించి ఉంటారు? నీవు ఇలా నిహతుడవైతే వానరుల కోరిక సిద్ధించినట్లైనది. ఇక వాళ్ళు చెలరేగిపోతారు, కోట గోడలెక్కేస్తారు, ఇది తప్పనిదే.

తమ్ముడా! నువ్వు లేనినాడు నాకీ రాజ్యం ఎందుకయా! సీత ఎందుకు? అంతెందుకు నాకీ జీవితం మీదనే విరక్తి కలుగుతోంది. రాముణ్ణి యుద్ధరంగంలో చంపనినాడు నా జీవితం వ్యర్థం, కనుక నేను చనిపోవడమే శరణ్యం, నేనూ తమ్ముడున్న చోటికే వెళిపోతాను. నా అనుగు తమ్ముడైన కుంభకర్ణుని పోగొట్టుకుని క్షణకాలం కూడా బతుకలేను.
తమ్ముడా! పలుమార్లు పలు యుద్ధాలలో దేవతలకి కీడు చేశాను, ఇప్పుడు నువ్వు లేవు, దేవతలు నన్ను చూసినవ్వుతారయ్యా! బుద్ధిమంతుడైన విభీషణుడు చెప్పిన మంచిమాటలు నేను మూర్ఖత్వంతో పెడ చెవిని పెట్టేను, నేడు నీ మరణంతో సిగ్గుపడుతున్నాను. ఫలితం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. కుంభకర్ణ, ప్రహస్తుల మరణం తో నాడు విభీషణుని మాటలు విననందుకు సిగ్గు పడుతున్నాను. విభీషణుడు ధర్మాత్ముడు, నా మేలు కోరేవాడు, అతన్ని దూరం చేసుకున్నాను, ఆ పాప కర్మ మూలంగానే నాకీ శోకం సంభవించింది” ఇలా, కుంభకర్ణుని మరణం తరవాత, రావణుడు, నిర్వేదం చెందాడు.

రామాయణం మొత్తం మీదెక్కడా రావణుడు విచారించినట్లు, నిర్వేదపడినట్లు కనపడదు, ఈ ఒక్క ఘట్టంలో తప్పించి. ఈ ఘట్టం లో రావణుని స్వరూపం కనపడుతుంది. తాను చేస్తున్న పని తప్పనే సంగతీ తెలుస్తున్నట్లే ఉంటుంది. మళ్ళీ అంతలో రాముణ్ణి అంతం చెయ్యాలనే కోరికా కనపడుతూ ఉంది.అదేగాక పరాజయం తప్పదనే సంగతీ, రాముని చేతిలో మరణిస్తాననే మాట తెలుకున్నట్టుగా ఉంది, అధైర్యమూ కనపడుతుంది. ఇంత నిష్పక్షపాతంగా ఆత్మ విమర్శ చేసుకున్న రావణుడు, సంధికి ఆలోచించలేదు. నిజానికప్పటికి అతని బలం తక్కువే నాశనమయింది, ముఖ్యులు తక్కువమందే మరణించారు. కాని దీనికి విరుద్ధంగా అలా ఎందుకు జరిగింది, అది తరవాతి మాట…..

మనకూ మన జీవితంలో ఇలాటి నిర్వేద ఘట్టాలు తారసపడుతాయి, కాని విష్ణుమాయ అంతలోనే మనని కప్పేస్తుంది…నిజం మరుగున పడిపోతుంది…..ఇదీ జీవితం….

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s