శర్మ కాలక్షేపంకబుర్లు-రావణునికైనా అభయమిస్తా.

రావణునికైనా అభయమిస్తా.
(శ్రీమద్రామాయణం, యుద్ధ కాండ, సర్గ 17)

కపిసేన సముద్ర తీరాన విడిసి ఉన్న సమయంలో కొండలా ఉన్న, నల్లటివాడు ఆకాశ వీధిలో సేనల వద్దుకు సముద్రం మీదుగా వస్తుండగా సుగ్రీవాదులు చూచారు, వారి దగ్గరున్న వివిధాయుధాలూ చూచారు..రక్షణకు సిద్ధమయ్యారు, వీరెవరో శత్రువులనే భావనతో. అంతలో వచ్చిన వారిలో ఒకడు తాను రావణుని తమ్ముడనని, తన పేరు విభీషణుడని, లంకలో తన అన్నతో జరిగిన వాగ్వాదం సూచనగా చెబుతూ “శ్రీరాముని శరణు వేడడానికొచ్చాను” అని ఆకాశ వీధిలోనే నిలిచాడు,తోటివారితో.

ఈ మాటలు విన్న సుగ్రీవుడు పరుగుపరుగున శ్రీరాముని వద్దకుపోయి, విషయం చెప్పి, ” రామా! విభీషణుడు శత్రు పక్షంవాడు, మనం మనయోధుల భద్రత గురించి ఆలోచించాలి,వ్యూహరచన,యుద్ధనీతి,గూఢచార చర్యల గురించి అలోచించాలి. అలాగే శత్రు పక్షంవారి గురించిన ఈ విషయాలూ ఆలోచించాలి.

రాక్షసులు కామరూపులు, కపటోపాయాలలో సిద్ధ హస్తులు, వచ్చినవాడు గూఢచారియై ఉండవచ్చును, అదే నిజమైతే మన పక్షం లో చేరి మనలో మనకు భేదాలు సృష్టించవచ్చు, లేదా మనలో ఒకడుగా మసలుకుంటూ మనలోపాలు పసిగట్టి మనల్ని దెబ్బతీయవచ్చు, అందుచేత శత్రు పక్షవారిని చేరతీయరాదు, అందునా ఇతను రావణునికి తమ్ముడు, ఎలా నమ్ముతాం? అందుచే ఇతనిని, సపరివారంగా పట్టి బంధించడమే ఉచితం” అని తన అభిప్రాయం చెప్పేసేడు.

అప్పుడు రాముడు మిగిలిన వానర వీరులతో ఇలా అన్నాడు ” సుగ్రీవుని మాట కాదనలేనిదే, మీ మీ ఆలోచనలేమో కూడా తెలపండి” అని కోరేడు. దానికి అంగదుడు “విభీషణుని పరీక్షించాలి, శత్రు పక్షంవాడుగనక అనుమానించాల్సిందే, కపటోపాయంతో వచ్చేవారు తమ భావం అంత తొందరగా బయట పెట్టరు, వీరివల్ల ఆపదలొస్తాయి, గుణదోష విచారణ చేసి ఉత్తమ గుణాలుంటే జేరదీయడమే మంచిద”న్నాడు.

శరభుడనేవాడు విభీషణుని గురించి తెలుసుకోడానికి “గూఢచారిని పంపి వారి మాట ప్రకారం నిర్ణయం తీసుకోవాలి,” అన్నాడు. ఆ తరవాత జాంబవంతుడు, “రావణుడా పాపాత్ముడు, వానిదగ్గరనుంచి వచ్చినవాడు, అతని తమ్ముడూ, వీనికి ఇక్కడికి రావడానికిది సమయమూ కాదు. తప్పని సరిగా శంకించవలసినదే”, అన్నాడు. మాటకారైన మైందుడు “విభీషణునితోనే మాటాడి మంచివాడో, చెడ్డవాడో తేల్చుకోడం మంచిద”న్నాడు.

చివరిగా హనుమ “రామా! నేను వాక్చాతుర్యం చూపడానికిగాని, పోటీ కోసంగాని, స్వార్ధ బుద్ధితోకాని చెప్పడం లేదు. ఇంతవరకు చెప్పినవారి మాటలు, సూచనలు సరైనవిగా తోచటం లేదు. విభీషణుని పరీక్షించడానికి తగిన సమయము లేదు, ఏదో పని అప్పగించనిదే శక్తి సామర్ధ్యాలు నిర్ణయించడానికి లేదు. గూఢచారుల్ని పంపడం వలన ప్రయోజనమూ లేదు, నా అభిప్రాయం చెబుతున్నా, “తన అన్నగారి నీచ బుద్ధిని బాగా ఎరిగినవాడు, నీ పరాక్రమం విన్నవాడు కనక నీ పక్కన చేరడానికొచ్చేడు. తెలియనివారి ద్వారా వీని విషయాలు తెలుసుకోవాలనుకోడమూ కుదరనిదే! సరిగాని విధంగా ప్రశ్నించినపుడు, తెలివైనవాడు మాటాడేవారిపై అనుమానపడతాడు, వీళ్లు మనల్ని అనుమానిస్తున్నారనుకుని విషయం దాచేయచ్చు, అతని మనసూ కించపడచ్చు, దానితో సహాయపడటానికి వచ్చిన ఒక మంచి మిత్రునికోల్పోతాం. అదీగాక ఒకటి రెండు మాటలతో వారి ఆంతర్యం గ్రహించడం కుదరనిదే, ఇక నాకైతే అతని మాటలోగాని, ముఖంలో గాని దురూహ కనపట్టలేదు. దురూహ మనసులో ఉన్నవాడు, ఎంత దాచుకున్నా మొహంలో, దాచుకున్నది కనపడుతుంది. విభీషణుడు ఈ సమయం లో ఇక్కడికి రావడం, శరణుకోరడం అనువుగానే ఉన్నాయి. నాకు తోచిన మాట చెప్పేను, మీకు నచ్చినట్లు చేయండి” అన్నాడు.

ఇది విన్న జాంబవదాదులే వికారమూ లేక మిన్న కుండిపోయారు. అప్పుడు రాముడు, “మిత్ర భావంతో నా దగ్గరకొచ్చిన విభీషణుని ఏమైనా వదిలెయ్యను. మంచివానికి ఆశ్రయమివ్వడం తప్పుకాదు. అతనికి శరణు ఇస్తున్నాను” అని ప్రకటించాడు. అప్పుడు సుగ్రీవుడు “రామా! అవసర సమయంలో అన్ననే వదలి వచ్చినవాడు, ఎవరిని మాత్రం వదలడు?” అని చర్చ పొడిగించాడు. దానికి రాముడు లక్ష్మణునితో “అన్నను వదలి రావడం తప్పు అని సుగ్రీవినిమాట, మెచ్చదగినదే. ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది, రాజెప్పుడూ పొరుగు రాజులను,జ్ఞాతులను విరోధులుగానే భావిస్తాడు.సహజంగానే కష్ట పరిస్థితులలో జ్ఞాతులే దెబ్బ తీస్తారు. రావణుడు ఇతనిని శంకించడం మూలంగానే ఇతను మన పక్క చేరేడు. శత్రు పక్షం నుంచి వచ్చినవాడన్న మాటకి, మనం విభీషణుని జ్ఞాతులంకాదు, ఇతను రాజ్య కాంక్షతో మన దగ్గరకు రాలేదు, రావణుని భయంతోనే మన దగ్గర కొచ్చాడు. సుగ్రీవా ప్రపంచంలో భరతునిలాటి సోదరులు,తండ్రికి నాలాటి పుత్రులు, నీలాటి మిత్రులు ఉండరు” అని చెప్పినా, సుగ్రీవుడు తన మాట వదలిపెట్టలేదు. “విభీషణుడు రావణుని గూఢచారి, అతనిని పట్టి బంధించడమే ఉచితమని” మళ్ళీ చెప్పేడు.

ఇప్పుడు రాముడు, “విభీషణుడు మనకు అపకారం చేయగలడనికదా నీ భయం, నేను నీవాడనని శరణు వేడినవారిని రక్షించడం నావ్రతం. విభీషణునికి అభయమిస్తున్నాను, అతనిని తీసుకురండి, విభీషణునికేగాదు, రావణుడే వచ్చి శరణుకోరినా అభయమిస్తాను,” అన్నాడు.

ఈ సన్నివేశం నుంచి నేర్చుకునేదేంటీ?

తప్పుచేసినవారు శరణువేడితే అభయమివ్వడమనేది అంత తేలికైన పనికాదు. అలా క్షమించడానికీ శక్తికావాలి, శిక్షను రక్షను సమంగా చేయగలవారే అలా చెప్పగలరు, అది రామునికే సాధ్యం.

సాధారణంగా చాలా సమావేశాల్లో పాల్గొంటుంటాం, ఆఫీసులో, ఇంట్లో ఇలా. ఆ సమావేశాల్లో మన అభిప్రాయమూ చెప్పాల్సివస్తుంది. చాలా సమావేశాల్లో చూసేది, మొదటగా తమ అభిప్రాయం చెప్పెయ్యాలని తొందరపడేవాళ్ళుకొందరు, అభిప్రాయం చెప్పేసి కునుకు తీసేవాళ్ళే ఎక్కువ, సమావేశం చివరి దాకా. ఒకరు చెప్పిన అభిప్రాయాన్నే మళ్ళీ మళ్ళీ తిరగేసి, బోర్లావేసి చెప్పేవారు కొందరు, సాధ్యం కాని విషయాలు, చెప్పేవారు, ప్రస్తావించేవారు, కొందరు. కుట్రకోణాలని ఆవిష్కరించేవారు, మరెవరినో తప్పుపట్టేవారు, అసలు సమస్యను వదిలేసి మరేదో కొత్తదాన్ని చొప్పించి విషయాన్ని పక్క దోవ పట్టించేవారు, అనవసర చర్చ చేసేవారు ఇలా రకరకాల అభిప్రాయాలున్నవారిని చూస్తుంటాం. ఈ పై సమావేశం లో ఎవరి అభిప్రాయం వారు నిర్దుష్టంగానే చెప్పేరు, కాని కొందరు ఆచరణ సాధ్యంకానివీ చెప్పేరు. సుగ్రీవుడయితే తన అభిప్రాయాన్ని అమోదింపజేయడం కోసం చివరిదాకా పాకులాడేడు, నిజానికి అందులో తప్పు పట్టవలసినదీ లేదు, కారణం అతనికి ఉన్న ప్రథమ కర్తవ్యం, వానరుల రక్షణ. ఇక చివరగా మాటాడిన హనుమ అందరి అభిప్రాయాల్నీ ఓపికగా విన్నాడు, తన మాటలలో ఆవేశంలేదు, ఎదుటివారి ఉద్దేశాలను సహేతుకంగా ఖండించాడు, తన అభిప్రాయం నిర్ద్వందంగా చెప్పేడు. తనమాట చెప్పడానికి తొందరపడలేదు, తనమాటే చెల్లాలనీ పట్టుబట్టలేదు. ఇలా సమావేశం లో పాల్గొన్నపుడు, ఎదుటివారు చెప్పేదాన్ని ఓపికగా విని ఆకళింపు చేసుకుని, మన అభిప్రాయంలోని లోటుపాట్లు దిద్దుకుంటూ, ఎదుటివారు చెప్పిన వాటిలో లోపాల్ని చెబుతూ ముగించాలిగాని, ఎదుటివారిని వ్యక్తిగతంగా చిన్నబుచ్చుతూ మాట్లాడంగాని,తప్పు పట్టడంగాని, తానే గొప్పవాడినన్న భావం ప్రకటించడంగాని కూడదు.

చివరిగా రామునిలా అన్నిటికీ సమాధానం చెప్పి, సమావేశంలో, తానిక ముందు ఏం చేయబోతున్నదీ చెప్పి, దానిని అమలు పరచడమనేది, రాబోయే చిక్కులను ఎదుర్కోగలననే భరోసా మిగిలినవారికి ఇవ్వడమూ అవసరమే, కావలసినది.

5 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రావణునికైనా అభయమిస్తా.

 1. పుల్లెల శ్రీ రామ చంద్రులు గారి వాల్మికి రామాయనము(తాత్పర్యాలతో) ఉంటే మా తో పంచుకోగలరు

  ధన్యవాదములు

 2. వివరణకి ధన్యవాదాలు శర్మ గారూ.
  నా మొదటి కామెంట్లో నా భావం సరిగ్గా వ్యక్తపరచలేకపోయినట్లున్నాను. ఆ వాక్యంలో సుగ్రీవ భరతులతో బాటు అదే వరసలో “తండ్రికి నాలాటి పుత్రులు” అని …. కూడా …. అనడంలో రాముడి ఆంతర్యం ఏమయ్యుంటుందా అన్నదే నా సందేహం. తను గొప్ప పుత్రుడిననా, తగిన పుత్రుడు కాననా? సుగ్రీవుడు నిస్సందేహంగా మంచి మిత్రుడే, అయితే మీరన్నట్లు అక్కడ విభీషణుడి గురించిన చర్చలో సుగ్రీవుడు నొచ్చుకోకుండా ఉండేందుకు నువ్వు నా అంతటివాడవు అనే అర్ధంలో సుగ్రీవుడిని అనునయించడమే ఒకవేళ రాముడి ఉద్దేశ్యం అయ్యుంటే, నేను గొప్పవాడిని అని రాముడు చెప్పకనే చెప్పుకున్నట్లవుతుంది కదా, అది రాముడిలాంటి వ్యక్తికి uncharacteristic అవుతుంది కదా అని ఆ వాక్యంలో ఆ ముక్క (“తండ్రికి నాలాటి పుత్రులు”) గురించి నా మొదటి వ్యాఖ్య భావం. లేదా వాల్మీకి ఉద్దేశ్యం నేనే సరిగ్గా ఆకళింపు చేసుకోలేకుండా ఉన్నానేమో? 🤔

  • విన్నకోట నరసింహారావు గారు,
   రాముడు నీవు నా అంతవాడవని చెప్పినపుడు తాను గొప్పవాడినని ఒప్పుకున్నట్టే కాదనలేని సత్యమే కాని, ఇది స్వోత్కర్ష కాదు, It is not uncharacteristic సుగ్రీవుని కోసం చెప్పిన సత్యం, అదికూడా సూచనగానే సుమా … He had not told it straight,even.. .. I suppose so 🙂
   Thank you

 3. బాగుంది. చిన్న సందేహం – తన సమాధానంలో చివర రాముడు “….. ప్రపంచంలో ……. తండ్రికి నాలాటి పుత్రులు …… ఉండరు” అన్నాడు. రాముడి భావం ఏమయ్యుంటుంది? (తన గొప్ప చెప్పుకోవడం మాత్రం కాదుగా ? అలా అయితే అది రాముడిలాంటి వ్యక్తి స్వభావానికి విరుద్ధం – ఆంగ్లంలో చెప్పినట్లు uncharacteristic – అవుతుంది. మరి రాముడెందుకలా అన్నాడు?) (నాకు సంస్కృతం రాదు.)
  సమావేశాల్లో జరిగే తంతు గురించి మాబాగా చెప్పారు. కళ్ళకి కట్టినట్లుంది.😀😄

  • మిత్రులు నరసింహారావు గారు,
   సుగ్రీవుడు తను చెప్పిన మాటను పదే పదే ఉటంకించడం రాముడు గమనించాడు. ఇప్పుడు తను చేస్తున్నది అతను చెప్పేదానికి విరుద్ధంగానే ఉంది, అందుకుగాను సుగ్రీవుని మనసు నొచ్చుకోకుండా ఉండేందుకు నిజాన్నే చెప్పేడు. భరతునిలాటి తమ్ముడెక్కడున్నాడు లోకంలో? తల్లి అయాచితంగా సంపాదించిపెట్టిన సామ్రాజ్యాన్ని కాదని, అన్నని తీసుకోమని వేడినవాడు కదా! ఇక సుగ్రీవుడు అన్నమాట నిలబెట్టుకున్న మిత్రుడు. ఒకటా రెండా, పదా వందా వేల లక్షల సంఖ్యలో వానర సేనను కూర్చినవాడు, శక్తిమంతుడు, తనతో సమానం చేసి చెప్పేడు తప్పించి, ఇది స్వోత్కర్ష కాదు.

   ఇలాగే హనుమ కూడా తన గొప్ప ఎక్కడా చెప్పడు, కాని కిష్కింద కాండ చివరలో సముద్రాన్ని దాటి లంకలోకి ఎవరూ వెళ్ళలేని స్థితిలో ఉన్నపుడు జాంబవంతుని మాటపై లంకకు బయలుదేరుతానని తన శక్తి సామర్ధ్యాలేంటో వివరంగా చెప్పి విశ్వరూపం చూపించి లంకకి బయలుదేరతాడు, ఇదీ స్వోత్కర్షలా కనపడుతుందికాని అప్పటికి వానర సేన ఉన్న మానసిక స్థితినుంచి తప్పించడానికే ఆ పని చేశాడు. ఇవి స్వోత్కర్షలు కావు.

   సమావేశాల్లో జరిగే తంతు ఇంకా ఉంది 🙂 చెబితే శానా ఉంది, వింటే ఎంతో ఉంది… 🙂 ఎందుకులే అనీ, ఇప్పటికే టపా పెరిగిందనీ…
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s