శర్మ కాలక్షేపంకబుర్లు-కుక్కచావు.

కుక్కచావు.

చావుల్లో కూడా రకాలుంటాయా? అవును కొన్ని చావులు పెళ్ళిలాగా కొన్ని చావులు చావులాగా ఉంటాయట. కుక్కచావేంటీ? మనవాళ్ళకి కోపమొస్తే ’ఒరే! కుక్కచావు చస్తావురా’ అని దీవించేస్తారు. కుక్కచావంటే అంత గొప్పదా 🙂

కుక్క గ్రామ సింహం, రెండు కుక్కలుంటే ఐదు పార్టీలుంటాయి. కుక్కలన్నీ ఎప్పుడూ కలిసుండవు. అథవా కలిసున్నా అవి ఆ వీధికుక్కలయి ఉంటాయి, పక్క వీధి కుక్కొస్తే దాన్ని కరిచి తరిమి చంపుతాయి. మరి దీనికి, ఆ వీధికెళితే అంతకంటే మంచి సన్మానం జరగదు కదా! రెండు కుక్కలెప్పుడూ అదే వీధి కుక్కలయినా కలిసి తినవు. అంతెందుకూ ఉన్నూరు కుక్క ఉన్నూళ్ళో కాకుండా పొన్నూళ్ళో….. అని ముతక సామెత చెబుతారు. మన్నించాలి ముతక సామెతే చెప్పక తప్పలేదు. ఎందుకిది? అదంతే! కుక్క డి.ఎన్.ఎ అలాగే ఉంది కనక 🙂 కుక్కలు అలాగే ఉంటాయి. కుక్క చావని మొదలెట్టి ఇదేంటని కదా!

ఒకే వీధిన ఉండే కుక్కలయినా దెబ్బలాడుకోక ఉండలేవు, అలా దెబ్బలాడుకున్నపుడు ఒక దాన్ని ఒకటి ఒళ్ళు మరిచిపోయి కరిచేసుకుంటాయి. కుక్కకాటుకి మందులేదు కదూ! దానికి రోగం వస్తుంది కుంటుతుంది, తెగులొస్తుంది, కాళ్ళు చచ్చుబడి నడవలేక ఈడ్చుకుంటూ పోతుంది. అదే వీధిన ఉండే మరో కుక్క, చూసి కూడా ఏం చెయ్యదు. ఆ కుక్క అలాగే తీసుకుని తీసుకుని చస్తుంది లేదా ఏ లారీయో,బస్సో, బండో కిందపడి చస్తుంది. ఈడ్చి పారేసేవాళ్ళు ఉండరు. మునిసిపాలిటీ, పంచాయితీలవారికి చెత్త ఊడ్చడానికే మనుషులు లేనపుడు చచ్చిన కుక్కల్ని ఎత్తేవారెవరు? ఎవరికి ఇబ్బంది కలిగితే వాసనేస్తే వారు మాత్రం ఒకడు కాలికి తాడేసి పక్క ఇంటి గుమ్మందాకా లాగి వదిలేస్తాడు, పక్కింటివాడు చూడకుండా. బతికున్న సీమ కుక్కనైతే ముద్దులెట్టుకుంటారుగాని చచ్చిన కుక్కని ముట్టుకోరు, అందుకే కాలికి తాడూ… వాడూ ఆ తరవాత అంతే! వాడి పక్కింటి గుమ్మందాకా లాగి వదిలేస్తాడు. చివరికి ఎప్పటికో పురుగులు పడిన తరవాత, ఎవరో ఒకరు ఊరు చివర పారేస్తారు. కుక్కబతుకూ అంతే కుక్క చావూ అంతే, దిక్కులేని చావుని కుక్కచావనే అంటారు. ఇంత జరుగుతున్నా ఒక్క కుక్క కూడా సానుభూతి చూపదు.

అదేం కాదండి కుక్కలకి ఆస్థులు కూడా రాసిచ్చినవారున్నారంటారా! అవును బాబూ అవును. అవన్నీ సీమకుక్కలు. మనకి దేశవాళ్ళీ కుక్కలంటే పడదు కదా! సీమకుక్కలైతే అన్నిటికీ పనికొస్తాయి. కోపాలొద్దుగాని చాలామంది తల్లులు కుక్కని భుజం మీద ఎక్కించుకుని చిన్న పిల్లల్ని నడిపించిన అసందర్భాలూ ఉన్నాయి. కుక్క మూతి నాకినా సంతోషంచేనవారున్నారు. కుక్కని పక్కలో పడుకోబెట్టుకోనిదే నిద్ర పట్టనివారూ ఉన్నారు. లోకో భిన్నరుచిః కదా! ఇంత సన్మానం ఎవరికి? సీమ కుక్కలకే నాటు కుక్కలిది కుక్క చావే! మరి ఇటువంటి చావు దిక్కులేని చావు కుక్కచావు కాదా!

ఇక పెళ్ళిలాటి చావు. అరే చావు పెళ్ళిలా ఉండడమేంటని కదా! మీరెప్పుడేనా కాకుల్ని చూశారా! క్షమించండి మీకు అంత సమయం లేదు కదూ. కాకి ఎప్పుడూ ఒంటరిగా ఉండదు, కావ్ కావ్ అని అరిస్తే చాలు పదికాకులు కావ్ కావ్ అంటూ వాలిపోతాయి, ఒక్కమెతుకున్నా పంచుకుతింటాయి. సరే చావు గురించి కదా! కాకిలా కలకాలం బతికేకన్నా హంసలా ఆర్నెల్లు బతికితే చాలు అని నానుడి. కాకి దీర్ఘకాల జీవి. ఇది గ్రామ పక్షి. కాకి ఉన్నదంటే అక్కడ మనిషి ఉన్నాడని లెక్క. అడవిలో కాకి కనపడదు. కాకి కనపడిందా అక్కడ మనిషి ఉన్నట్టే, అనుమానం లేదు. దారి తప్పిపోయాను మన్నించండి. ఇంత దీర్ఘకాల జీవి కూడా చస్తుంది కదా! ఒక కాకి కనక చనిపోతే వేల కాకులు వాలిపోతాయి, కావ్ కావ్ అంటూ. చచ్చిన కాకి శరీరాన్ని కొద్ది కొద్దిగా ఈడ్చుకుపోతూ ఉంటాయి. ఎవరైనా అడ్డువెళితే కాకులన్నీ సమూహంగా వచ్చి పొడిచేస్తాయి. అటువంటపుడు ఒక గొయ్యి తీసి మనం కనక ఆ చచ్చిన కాకి శరీరాన్ని అందులోకి గెంటి పూడ్చేస్తే కాకులు చూస్తూ ఉంటాయి గాని గోల చెయ్యవు, ఆ తరవాత అక్కడినుంచి వెళిపోతాయి. మరి ఈ చావు పెళ్ళిలాటిదే కదూ! కాకికున్నబుద్ధి మనిషికి లేకపోయింది..

ఇక ఏనుగు సంఘజీవి. ఒక ఏనుగు చనిపోతే, దాని దగ్గర చాలా సేపు, దానికోసం మిగిలిన గుంపు నిలబడిపోతుంది. చివరికెపుడో ఇక ఆ పడిపోయిన ఏనుగు చనిపోయిందని నిర్ణయించుకుని కదులుతాయి. ఆ తరవాత మళ్ళీ వస్తాయి, ఏటి నుంచి నీళ్ళు తెచ్చి చనిపోయిన ఏనుగు శరీరం మీద పోస్తాయి, కొద్ది సేపు నిలబడి వెళ్తాయి. చివరికి ఎముకలు బయటపడినప్పుడు కూడా ఏనుగులు వచ్చి ఆ ఎముకల్ని ఎత్తి తొండంతో పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని కావలించుకుని నీళ్ళు తెచ్చి పోసి చాలా సేపు అక్కడుండి వెళ్తాయి. మరి ఈచావేంటీ?

మానవుడు సంఘ జీవి, అదేమోగాని కుక్కచావులే ఎక్కువైపోయాయి.

 

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కుక్కచావు.

 1. మీ “కష్టేఫలే” వర్డ్‌ప్రెస్ బ్లాగ్ “మాలిక” వారి టపాల లిస్ట్‌లో కనబడట్లేదే! గమనించారా?

  • విన్నకోట నరసింహారావు గారు,
   నా బ్లాగులు రెండిటినీ ఒకప్పుడు ఆపుచేసిన విషయం గుర్తు ఉండి ఉంటుంది. అప్పుడు నా బ్లాగుల్ని నేను కోరి జత చేసిన ఆగ్రిగేటర్లనుంచి తొలగించమని విన్నపం ఇచ్చుకున్నా. కొంతమంది తొలగించారు, కొంతమంది తొలగించలేదు. తొలగించినవారు కూడామరలా ఆగ్రిగేటర్ లో చేర్చుకున్నట్టు ఉంది. నేటి మాట, నేనుగా ఏ ఆగ్రిగేటర్ లోనూ నా బ్లాగుల్ని జత చేయలేదు. ఎవరు జతచేసుకున్నారో నాకు తెలియదు.అందుకే వర్డ్ ప్రెస్ లోనూ, బ్లాగర్లోనూ కూడా ప్రచురిస్తా నా బ్లాగులు ఎక్కడెక్కడ ఎవరెవరు జతచేసుకున్నదీ నాకే తెలియదు. మొన్న చిత్రంగా ఒక విదేశీ ఆగ్రిగేటర్ లో నా బ్లాగు కనపడింది.

   ఆ విషయాలు పట్టించుకోడం మానేశాను.
   ఇది గర్వంతో చెబుతున్నమాట కాదు, వ్యధతో చెబుతున్నమాటే
   నెనరుంచండి

 2. అంతే కాదు గొప్పవారి కుక్కను ‘కుక్కమ్మా ‘ అనాలని కూడా అంటారు కదా !ఇలాటివి మీరు రాస్తూ ,గుర్తు చేస్తూ ఉంటే కాస్త పునశ్చరణ అవుతుంది./తెలుస్తుంది . ఇంగ్లీష్ దొర తెలుగు లో మన్నించడం నేర్చుకుంటూ —-కుక్క గారు వచ్చేరు కర్రగారిని తెండి అని చెప్పినట్లు ———-కూడా గుర్తు చేసుకుందాము .
  పనిలో పనిగా, ఈ నాడు మనం కుక్కతోకని పట్టుకు గోదావరి ఈదాలని ప్రయత్నిస్తున్నామమేమో అని “నిట్టూరుస్తు ” బతికేయ్యటానికి అలవాటు పడ్డాము క్షమించగలరు .
  మీ స్పందన కనిపించటం లేదు గత కొన్ని టపాలుగా ! ???. సుమన్ లత

  • డా.సుమన్ లత రుద్రావఝల గారు,
   రాజుగారి కుక్క అనేవాళ్ళం గుర్తుందా? నాది అశక్త దుర్జనత్వం, ఏమీ చేయలేక ఇలా అనుకోడమే… మీరు చెప్పిన మాట నిజం.

   ఇల్లాలి అనారోగ్యంతో, బ్లాగులో రాయడం మానలేదుగాని చురుగ్గా ఉండలేకపోతున్నా.
   నెనరుంచండి

 3. కొంచెం క్లుప్తంగా వ్రాసినా చాలా ఘాటుగా వ్రాసారండీ. కుక్కలూ, కాకులూ, ఏనుగులూ చీమలూ‌ ఏవైనా తమతమ సహజజీవలక్షణాలకు అనుగుణంగానే జీవిస్తాయి. కాని నేటి మనిషి జీవితంలో‌ సహజత్వం ఉన్నదా అన్నది ఒక ప్రశ్న. కుక్కల కోసం వేలూ (లక్షలూ!) తగలేస్తూ వాటి ఆనందం కోసమూఆరోగ్యం కోసమూ తహతహలాడుతూ పనిమనిషిని కనీసం సాటి మనిషిగా కూడా చూడలేని ఘరానామనుష్యుల లోకం కదా మనది.

  • తాడిగడప శ్యామలరావుగారు,
   సహజత్వం ఎప్పుడో చచ్చిపోయిందండి, చెప్పేవాడూ లేడు, వినేవాడూ లేడు. పక్కవాడు మనిషి అనే స్పృహ చచ్చిపోయిందండి.
   నెనరుంచండి

 4. ఈ రోజున మీరు మీ టపాలో ఈ‌విషయం‌ గురించి వ్రాస్తారని ఎందుకో నిన్ననే అనిపించిందండీ. అలాగే మీ టపా రావటం చిత్రంగా ఉంది. ఇంకా మీ‌ టపా చదువలేదు. ఇప్పుడే తెఱచాను. చదివి అభిప్రాయం వ్రాస్తాను.

  • తాడిగడప శ్యామలరావు గారు,
   మిత్రులు నరసింహరావు గారిలాగా మీకూ టెలిపతీ ఉందండోయ్ 🙂
   నెనరుంచండి

 5. < "మానవుడు సంఘ జీవి, అదేమోగాని కుక్కచావులే ఎక్కువైపోయాయి."
  ——————–
  నిర్లక్ష్య వైఖరి పెరిగిపోయి, ఉరుకులూ పరుగులూ ఎక్కువయిపోయి, దూరాభారాలయిపోయి, కుటుంబ వ్యవస్ధ దెబ్బ తిని, విలువలు పడిపోయి, ………..

 6. ఓ జోక్ గుర్తొచ్చింది.
  ఊళ్ళో ఓ చాకలి గాడిద ఓ ఇంటిముందు చచ్చిపోయి పడుంది. ఆ ఇంటి యజమాని ఆ చాకలిని పిలిపించి తీసుకెళ్ళమని చెప్తే ఆ చాకలి తెలివిగా “నాకెందుకు చెబుతున్నారండీ, ఎవరింటి ముందు పడుంటే ఆళ్ళే ఈడ్పించేసుకోవాలండి” అంటాడు. దానికి ఆ గృహస్తు “సరేలే నేనే తీయించేస్తాలే. ఇటువంటి విషయాలు ముందు దగ్గర బంధువులకి తెలియజేయ్యాలి కదా అందుకని నీకు కబురెట్టానులే” అంటాడు.
  (ఎవరి జోకో సరిగ్గా గుర్తులేదు. మునిమాణిక్యం వారు చెప్పినదా??)

  • విన్నకోట నరసింహారావు గారు,
   ఎవరి బంధువులైతే వారికి కబురు చెప్పడం సర్వ సహజం కదండీ:)

   దూరాభారాలకంటే నిర్లక్ష్యం బాగా పెరిగిపోయిందండి. ‘మీ నాన్న చనిపోయాడురా’ అని అమెరికాలో ఉన్న కొడుక్కి చెబితే, ‘నేను వచ్చిమాత్రం చేసేది తగలబెట్టడమేగా, దారి ఖర్చులు దండగ, శలవు దొరకదు, రెండో వాడున్నాడుగా కానిచ్చెయ్యండి, డబ్బులు పంపుతా’ అన్నాడు, ఏం చెయ్యాలి? అలాగే చేశారు. ఇదింతే….
   నెనరుంచండి

 7. చాలా చక్కటి వ్యాఖ్యానమ్! చక్కగ సెలవిచ్చారు! శుభాకాంక్షలు!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s