శర్మ కాలక్షేపంకబుర్లు-తప్పు

తప్పు

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్లనుండు దప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ!

ఇది తప్పు అది తప్పు అని చెప్పేవాళ్ళు లోకంలో చాలామందే ఉన్నారు, కాని తప్పు, తప్పు అని చెప్పేవాళ్ళకీ ఏదో ఒక తప్పు ఉంటుందయ్యా! వాళ్ళకి అది తప్పని తెలియదన్నారు వేమన తాత!

నాకనిపించింది, తప్పు తప్పని చెప్పేవాళ్ళకీ తప్పుంటుంది, తప్పులేనివాడు లేడు, అందుచేత తప్పని చెప్పినంతలో కంగారు పడిపోకు, ఆలోచించు,విశ్లేషించు,ఆ చెప్పినది అసూయతోనే కావచ్చు సుమా! అన్నదే హెచ్చరిక.

దీనికి ఉదాహరణ గురివింద గింజ ఒక పొదకి కాస్తుంది, చూడ్డానికి ఎర్రగా ఉంటుంది, కాని దాని ముడ్డి కింద నలుపుంటుంది, ఆ నలుపు దానికి తెలియదు, నేనంతా ఎర్రగానే ఉన్నాననుకుంటుంది 🙂 అలాగే దీపం వెలిగించి పెడితే కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. దీపం అనుకుంటుందీ నేను అంతటా వెలుగు ప్రసాదిస్తున్నానూ అని కాని పాపం తన కాళ్ళ కింద చీకటి ఉందన్న సంగతి ఆ దీపానికి తెలియదు. ఐతే ఇటువంటివారికి తప్పని ఎవరు చెబుతారు? తప్పని చెప్పడమే తప్పూ అంటున్నారటువంటివారు. నేటి కాలంలో అలా తప్పు అని చెప్పేవారూ లేరు, వినేవారంతకు ముందే లేరు. మళ్ళీ నాటి మారీచుని మాటే గుర్తొస్తుంది, సులభా పురుషా రాజన్…… పెద్ద చెరువు నీళ్ళు కుక్క ముట్టుకున్నా తప్పులేదట, అంటే పెద్దవారు తప్పుచేసినా సమర్ధించుకుంటారు, కోప్పడతారు, అంచేత తమరు చేసింది తప్పుకాకుండా పోతుందట.. దేశద్రోహంగా మాట్టాడటం తప్పుకాదట, దేశాన్ని ముక్కలు చేస్తామనడం అసలు కాదట, అదేమంటే వాక్ స్వాతంత్ర్యం అంటున్నారు. అలా మాటాడ కూడదని రాజ్యాంగంలో రాసుందా? అంటున్నారు.

ఐతే ఎవరూ ఎవరికీ తప్పని చెప్పకూడదు, మందలించకూడదు అంటున్నారు, నేటి కాలంలో. అలా ఐతే అందరూ మేధావులుండరు, పిల్లలు, తెలియనివారు తమ తప్పు తాము తెలుసుకోలేనివారూ, తప్పుల్లో పడిపోవాల్సిందేనా?

తప్పూ అని ముక్కు మీద వేలు వేసుకుని అమ్మ చెప్పడంతో తప్పు అని చెప్పే పరంపర సాగుతుంది. తల్లి,తండ్రి,అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు,మిత్రులు,గురువు వీరంతా తప్పైతే చెప్పేవారూ, సరిదిద్దడానికి ప్రయత్నం చేసేవారూనూ! తప్పని చెబితే బాధపడిపోనక్కర లేదు, అది తప్పవునో కాదో మన బుద్ధి చెబుతుంది, నిష్పక్షపాతంగా ఆలోచిస్తే. మనమే అలా ఆలోచించలేకపోబట్టే మరొకరు చెప్పాల్సి వస్తుంది, అదీ తేడా, ఇప్పుడు గురివింద గింజ,దీపం పోలిక సరిపోయిందా?. తల్లి తిట్టిందని, తండ్రి కొట్టేడని ఏడిస్తే ఎందుకూ పనికిరాకపోతాం. లేదు, నాకెవరూ చెప్పక్కరలేదనుకునే వారికో నమస్కారం, వీరినే భర్తృహరి ‘తెలిసియు తెలియని నరు దెల్ప బ్రహ్మదేవుని వశమే’ అని తేల్చేశాడు. పెద్దవాళ్ళెప్పుడేనా తప్పు అంటే విసుక్కోకండి, వారు చెప్పినది వినండి, బుద్ధితో ఆలోచించండి, విశ్లేషించండి..మీకే తెలుస్తుంది, తప్పని చెప్పిన వారంతా శత్రువులు కారు, అలాగని మన శ్రేయోభిలాషులు కూడా కాకపోవచ్చు. చిన్నప్పటినుంచి తల్లి,తండ్రి,కుటుంబ సభ్యులు, సమాజం అంతా తప్పు చేయనీయక అడ్డుకుంటూనే ఉంటుంది, వీటన్నిటినీ అధిగమించేవారుంటారు. ఒక చిన్న సంఘటన చిన్నప్పటిది గుర్తొచ్చింది….

పదేళ్ళ వయసు, వేసవి కాలం, ఎండ మండుతోందని అమ్మ గోల పెడుతున్నా, ఇప్పుడే వస్తానని బయటికి పరిగెట్టుకుపోయా, ఉదయమే చద్దన్నం తిని, స్నేహితులతో ఆటలకి. ఎంతసేపు ఆడుకున్నామో, టైమెంతయిందో తెలియలేదు, కడుపులో కాలడం మొదలెడితే ఇల్లు గుర్తొచ్చింది, అందరికీ. మళ్ళీ మధ్యాహ్నం అనుకుని బయలుదేరాం, ఎండకి కాళ్ళు మాడుతున్నాయి. అప్పటికి గుర్తొచ్చింది, ఎండ మండుతోందని. కాని ఎండ బాధగా ఉంటుందని, అనారోగ్యం చేస్తుందని ఆటలలో పడినవారికి తెలియలేదు. ఇంటికి బయలుదేరా! వస్తున్నా!! ఈలోగా ఒక మండువా ఇంటి అరుగు మీద ఒక ముసలాయన, ఈయన్ని ‘ఇంగువారి తాత’ అనేవాళ్ళం, ఆ వయసులో ఆయనెవరో తెలియదు, బంధువేనని వయసొచ్చాకా తెలిసింది. ఆయన భోజనం చేసినట్టుంది, నవారు మంచం మీద కళ్ళు సగం మూసుకుని పడుకుని ఉన్నాడు, ఎండ తాపాన్ని తట్టుకోలేక తడి తువ్వాలు మీదేసుకుని, విసనకర్ర నెమ్మదిగా ఆడించుకుంటూ. అరుగు కింద పంచలో ఒక కుక్క, ఎండ వేడికి నాలిక బయటపెట్టి ఒగర్చుతూ ఉంది. అదీ ముసలాయనలాగే, కళ్ళు సగం మూసి, సగంతెరిచి ఉంది. కుక్కకి కొద్ది దూరంలో ఒక రాయి కనపడింది, దానిని కాలితో తన్నేను, కుక్క మీదకి. అదిపోయి కుక్కకి తగిలింది. కుక్క భౌ మంటూ లేచింది, మీదకి ఉరికి పిక్క పట్టుకోడానికి. ”ఛీ,ఛీ” అంటూ కుక్కనదిలించి ”ఏరా! బుద్ధిలేదూ! ఎండ భరించలేక నీడన పడుకున్న కుక్క నిన్నేం చేసిందని రాయితో కొట్టేవు? దానికున్నపాటి బుద్ధి నీకు లేకపోయిందే! ఏంపాసిపోయిందని ఎండలో తిరుగుతున్నావు” అన్నాడు. నాకు ఆయన తిట్టినట్టే అనిపించింది,కోపమొచ్చేసింది, తప్పు చేసినవాళ్ళకి ముందుగా వచ్చేది కోపమేగా! ”ముసలిముండాకొడకా! కళ్ళు మూసుకుని పడుకోక, నీకెందుకూ” అనిపించిందిగాని, మాట మాత్రం నోరుదాటి బయటికి రాలేదు.

ఒక్క పరుగున ఇంటికొచ్చి పడ్డా! అమ్మ చూసింది, ”ఏం ఇప్పటికి ఇల్లు గుర్తొచ్చిందా? ఎక్కడెక్కడ తిరిగొచ్చావు? అంత పరుగునొచ్చావేం? ఏం జరిగిందీ?” ఆరా తీసింది. ”ఇంగువారి తాత తిట్టాడు” అన్నా! ”అవును ఆయన నోరు కొవ్వెక్కి తిట్టాడు నిన్ను, నువ్వేం వెధవపని చేస్తే ఆయన తిట్టాడో చెప్పవేం, నువ్వు చెప్పకపోయినా నాకెలాగూ తెలుస్తుందనుకో! ”అని నిలతీసింది. పెద్దాళ్ళదంతా ఇదో కట్టు, ఇలాంటివేం జరిగినా చెప్పేసుకుంటారెందుకో! ఎలాగా తెలుస్తుందని చెప్పా, సగం నిజం సగం అబద్ధం కలగలిపి. ”సరేలే! నువ్వు పూర్తి నిజం చెప్పటం లేదు, ఏం జరిగిందీ చెబుతా”నని వీడియో చూసినట్టు చెప్పేసింది, అదేంటో ఈ పెద్దాళ్ళకి అన్నీ ఎలా తెలిసిపోతాయో ననుకుంటూ ఊరుకున్నా! ”తాత ఊరుకునుంటే కుక్క లేచొచ్చి నీ పిక్క పట్టుకునేదేగా! ఆయన నిన్ను తిట్టేడనుకుని తిట్టుకున్నవుగా” అంటుంటే మరి నోరెత్తే సమస్యే లేకపోయింది. ”చేసిన నిరవాకం చాలుగాని కాళ్ళు చేతులూ శుభ్రంగా కడుక్కురా మింగుదూ గాని” అని మంగళహారతిచ్చేసింది. అమ్మ తిట్టిందా? తప్పని చెప్పిందా? లేదు మాటతోనే కాల్చివాత పెట్టింది, ఎక్కడా మనసుమీద, మరి మరచిపోకుండా! తప్పుచేయకుండా.

కన్యాశుల్కము

గురజాడ అప్పారావు గారి పుస్తకం click and down load

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తప్పు

 1. చాలా బాగా చెప్పారండీ. ఈ రోజే అనుకున్నాను ఎవరు ఏ మంచి చెప్తే అర్ధం పర్ధం లేని వాదనలు తప్పించి, వారి ego ని మాత్రం పక్కన పెట్టరు. దాని మీద టపా పెడదామా అనుకున్నాను. ఇంతలో మీరే చెప్పేసారు 🙂

  • Chandrika గారు,

   మనకి తోచదు, మరొకరు చెబితే వినం!
   ఒక సామెతుంది, చెబుతాను కోప్పడకండి!
   చేతకాని మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు 🙂

   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s