శర్మ కాలక్షేపంకబుర్లు-దబాయింపు..

Photo0001

దబాయింపు..

దబాయింపునే డబాయింపు అని కూడా అంటారు. సరదాగా డబాయింపు సెక్షనే ఉందంటారు, దాన్ని అమలు చేసేవారు. అసలు డబాయింపంటే… 🙂 తెలియనిదానిని తెలిసినట్టు, తెలిసినదాన్ని తెలియనట్టూ, గోరంతని కొండంత, కొండంతని గోరంతాచేసి చెప్పడం, అగావులేసెయ్యడం వగైరాలన్నీ దీనికిందకే వస్తాయనుకుంటా. ఈ డబాయింపు ఉపయోగించేవారు మాటకారులై ఉంటారు, ఎదుటివారిని మాట తొణగనివ్వరు, ఆలోచనకీ సావకాశం ఇవ్వరు. ఈ దబాయింపు కూడా అప్పుడప్పుడు మంచి ఫలితాలే ఇస్తుంది, దీన్ని అస్తమానం ఉపయోగిస్తే …… 🙂 ఒక సారి ఈ దబాయింపు ఉపయోగించాల్సి వచ్చింది.. ఆక్రమమెట్లంటే…

అవి ఉద్యోగానికి పాలకొలను వెళ్ళిన కొత్తరోజులు. నాసెక్షనేదో చూసుకుని కాలం గడిపేస్తున్న రోజులు. ఒక రోజు ఆఫీసర్ గారు ఫోన్ చేసి ’ఒక సారి ఆఫీసుకి రండి’ అన్నారు. పక్కనే ఆఫీసు, ఖాళీ గా ఉన్నానేమో వెంటనే వెళ్ళేను. అక్కడ నా తోటి ఉద్యోగి కూచుని ఉన్నాడు. ’ఈయన ఒక వారం శలవు కావాలంటున్నారు, మీరు ఈయన సెక్షన్ అదనపు బాధ్యత చూస్తానంటే ఆయనకి శలవిస్తా’నన్నారు. ఇదేమి లింకో అర్ధం కాలేదు. ’శలవిచ్చెయ్యండి’ అనేశా. వెంటనే రాత కోతలూ అయ్యాయి, సాధారణంగా ఒకటి రెండు రోజులకి, వారానికి ఇలా రాతకోతలుండవు, మరి అలా ఎందుకుచేశారో అర్ధమూ కాలేదు. మర్నాడు నా సెక్షన్ చూసుకుని అదనపు బాధ్యత సెక్షన్ కి వెళ్ళేను, అక్కడ ఆఫీస్ గుమాస్తా, ఫీల్డ్ స్టాఫ్ గుంపు చింపులు పడుతున్నారు. ఆఫీసుల్లో జరిగేదే కనక పెద్దగా పట్టించుకోలేదు, గుమాస్తా ఉత్తరాలేవో చూపించి, సమాధానాల ఉత్తరాల మీద సంతకాలెట్టించుకున్నాడు, మరి పనేం లేకపోయింది, భోజనం సమయమూ అయింది, వచ్చేశాను. మర్నాడు మామూలుగానే వెళ్ళేను, గుమాస్తా వచ్చిన ఉత్తరాలు చూపిస్తూ, నెమ్మదిగా ’మన ఆఫీసు స్టోర్ నుంచి ఇరవై అడుగుల పొడుగున్న మూడు కళాయి పైపులు పోయాయండీ’ అన్నాడు. సాధారణంగా ఆడవారు భర్త భోజనం చేసేటపుడు మొదలెడతారు, కొలుపులు, అలా గుమాస్తాలు కూడా ఇలా ఉత్తరాల మీద సంతకాలు తీసుకునేటపుడు, ఇలా కొలుపులు మొదలెడతారు, ఇదీ అలవాటే.

పుణ్యానికిపోతే పులెత్తుకుపోయిందని, మిత్రుడికి శలవివ్వడానికిగాను సెక్షన్ చూడాల్సి వస్తే, రాగానే గొడవ స్వాగతం పలికిందే అనుకుంటూ లేచి గుమాస్తాతో ఆఫీసు పరిసరాలు పరిశీలించి, ఎలా పోయి ఉంటాయో అతను చెబుతుంటే విన్నాను. చివరగా ’మనవాళ్ళ హస్తం లేక ఈ పైపులు పోవనేదే మీ అభిప్రాయమా’ అనడిగా అతనిని, అవునన్నట్టు తలూపాడు. ’పోలీసులకి ఫిర్యాదు రాయండ’న్నా! ఒక నిర్ణయానికొచ్చి, దానికతను ’ఒకసారి మీరు మన సిబ్బందితో మాటాడి తరవాత ఫిర్యాదిస్తే బాగుంటుందేమో’ననే సలహా ఇచ్చాడు. ఆలోచించి, ’రేపు మన సిబ్బందిని ఉదయమే రమ్మనండి, ఒక సారి మాటాడదా’మన్నా.

మర్నాడు ఉదయమే అందరూ వచ్చేశారు, టీలు తెప్పించి అందరూ తాగుతుండగా ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాను. ” నేను ఈ సెక్షన్ అదనపు బాధ్యత చూడ్డానికి వచ్చాను, నాకు ఈ సమస్యతో స్వాగతం పలికినట్టుంది. ఇది మనవారి హస్తం లేకుండా జరిగే పని కాదు, చేసినవారు పొరబడి ఉంటారు, ఎల్లుండి ఉదయానికి పైపులు కనక మన ఆఫీసులో యధాప్రకారంగా ఉంటే, అంతా సుఖాంతమే, లేకపోతే పోలీస్ ఫిర్యాదిస్తాను, వాళ్ళు ఎవరు ఈ పని చేసినది, చేయించినది తప్పక పట్టుకుంటారు, అంతెందుకు ఇదెవరు చేయించారో కూడా నాకు తెలుసు, పొరబడ్డారని అనుకుంటున్నా! పొరబాటు దిద్దుకోడానికి సమయమిస్తున్నా, నేను పోలీస్ కి ఫిర్యాదిచ్చి వెళిపోతా! ఆ తరవాత బాధలు పడేది మీరే! ” అని చెప్పేసి అందరిని పంపించేశా…ఇంకక్కడి నుంచి గుంపుచింపులు పెరిగిపోయాయి, ఒకరు “మంచోడేగాని తిక్కముండాకొడుకని పేరు,ఏం జేస్తాడో చెప్పలేం, తెలుసునంటున్నాడు కూడా, ఎలా పట్టేసుంటాడు?” “గాడిద గుడ్డు ఎన్ని చూడలేదు, ఇటువంటివి, ఇదో లెక్కా” అన్నవారు, “అన్నీ ఉడత ఊపులేరా! కానీ మనపని చూడు” అన్నవారు, “ఇదో పెంట పోలిస్ కి ఫిర్యాదిస్తే వాళ్ళు అందరినీ దొంగలే అంటారు, చావొచ్చింది, ఒరే పట్టుకుపోయినవాడు పట్టుకొస్తాడంటావా? ఈయన పిచ్చిగాని,” ఇలా రకరకాలుగా అనుకుంటున్నారని గుమాస్తా చెప్పేడు. చీకట్లో వేసిన బాణం పని చేస్తున్నట్టుందే అనిపించింది. ఆఫీసర్ గారికి విషయం చెబితే, ఏం చేశారన్నట్టు చూశారు, కళ్ళజోడులోంచి. సిబ్బందిని పిలిచి చెప్పిన సంగతి చెప్పా! ఆయనో నవ్వు నవ్వేశారు, మీ పిచ్చిగాని పోయినవి మళ్ళీ దొరుకుతాయా? వాళ్ళు పట్టుకొచ్చి పెట్టేస్తారా? అన్నట్టు.. ఏమో నాకిలా అనిపించింది, అలా చేశాను, పైపులు తిరిగిరాకపోతే పోలీస్ కి ఫిర్యాదిచ్చేస్తానని చెప్పి వచ్చేశా.

గుంపుచింపులు మర్నాడూ పడుతూనే వచ్చారు, ఆ సెక్షన్ ఆఫీస్ నుంచి ఇలా సిబ్బందికి చెప్పిన రెండవరోజు వచ్చేస్తుంటే ఒకతను, “సార్! ఒక మాటని, ఇటూ అటూ చూసి ’ఇందులో మిమ్మల్ని ఇరికించాలనే కుట్ర జరిగిందండీ, పెద్ద గూడు పుఠాణీ జరుగుతోంది, మన పెద్దాఫీసర్ గారూ, మీ కొలీగ్ కుట్రదారులు’ అన్నాడు, నెమ్మదిగా. ఇంకా ఇంకా చెప్పుకుపోయాడు. ఒక్క సారిగా విస్తుపోయాను, తేరుకుని ఒక చిరునవ్వు అతనికి సమాధానంగా నవ్వి వెళిపోయాను. అతని మాటలు నాపై కొద్దిగా ప్రభావం చూపాయి కూడా. నాపై కుట్ర చేయాల్సిన పని వీరికి ఎందుకుంది?, సూత్రధారులెవరు, అందుకే వారానికి ఛార్జి రిపోర్ట్ లు రాయించారా? ప్రభుత్వ సొమ్ముపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తారు అది మామూలే, కాకపోయినా నన్ను ఇందులో ఇరికించేదేమి? పరిపరి విధాల ఆలోచనపోయి, చివరికి ఇదంతా అతను కావాలని నాపై చేసిన అగావుగా గుర్తించి ఊరుకున్నా.

మర్నాడు ఉదయమే ఒక ఉద్యోగి ఫోన్ చేసి ’సార్! మన ఆఫీసు గుమ్మానికి అడ్డంగా మొన్న మన ఆఫీసులో దొంగిలింపబడిన పైపులున్నాయండీ’ అన్నాడు. ఆశ్చర్యపోయాను, బయలుదేరి వెళ్ళాను, నిజంగానే అక్కడ మూడు పైపులూ ఉన్నాయి, ఈలోగా అందరూ వచ్చేశారు, మా గుమాస్తా వాటిని చూసి ’ఇవి మన పైపులేనండి, ఇవిగో నేను వేసిన నెంబర్లు’ అని చూపించాడు. కథ సుఖాంతం, ’ఎవరు చేసుంటారంటార’న్నాడు మా గుమాస్తా ఒంటరిగా నన్ను పట్టుకుని. అది మరచిపొండి, ఇప్పుడది అనవసరం అనేసి,ఆఫీసర్ గారి దగ్గర కెళ్ళి జరిగింది చెబితే, ఆయనొక్కసారిగా కుర్చీలో వెనక్కి జేరగిలబడిపోయి,అవాక్కయ్యారు, తేరుకుని ’మీ డబాయింపు బాగానే పనిచేసిందండీ’ అంటూ ఇంకా ఏమో ఏమో చెప్పడం మొదలెట్టేరుగాని నాకు వినబుద్ధి కాక ’వస్తా’నని చెప్పి వచ్చేశా. ఇకప్పటి నుంచి చిక్కేడు మిడతంభొట్లు అన్నట్టు చిక్కు సమస్యలొస్తే నాకప్పజెప్పేసేవారు, చిక్కు సమస్యలు విడతీయడం, అదో తుత్తి.

అత్తగారి కథలు

Click to down load book ofSmt.Bhanumati rmakrishna.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s