శర్మ కాలక్షేపంకబుర్లు-చిరంజీవి శ్రీవిద్యకి,

చిరంజీవి శ్రీవిద్యకి,
దీర్ఘాయుష్మాన్భవ, ఆశీస్సులతో తాత వ్రాసేది.

ఏదో చెప్పాలి,ఎంతో చెప్పాలని ఆశ. ఇప్పుడు చెప్పినా అర్ధం చేసుకునే వయసు, తీరికా నీకులేవు. మనిద్దరి మధ్య ఆరున్నర దశాబ్దాల పైబడిన వయసు తేడా దీనికి కారణం. ఇంక నీకు తీరిక గురించి కదా! ఐదో ఏడు రాకనే నిన్ను నర్సరీలో వేయడంతో నీతో ఆడుకునే,పాడుకునే సంగతే మరచిపోయాను. ఉదయం నాలుక్కి లేస్తావు నాతో, ఐదుదాకా చదువు. అక్కడినుంచి ఏడు వరకు కరాటే, ఆపైన ఎనిమిది దాకా హిందీ! తొమ్మిదిలోపు నాలుగు మెతుకులు ఆదరాబాదరాగా తిని స్కూల్ కిపోతే, సాయంత్రం నాలుగున్నరకి నిన్ను తీసుకురావడానికి కాలేజి కొస్తే మోటారు సైకిలెక్కి “తాతా వెళదామా” అన్న నీ మాట కోసం ఎంత కాలం ఎదురు చూస్తానో తెలుసా! రోజుకి ఇరవైనాలుగు గంటలు. ఇంటికొచ్చేలోగా ఏదో చెబుతావు చిట్టితల్లీ! ఊ కొడతూ ఉంటా, వినపడకపోయినా. ఐదుకి ప్రైవేటు ఆరుదాకా! ఇంటికొచ్చి నాలుగు మెతుకులు తిని ఏడుకి భగవద్గీత శ్లోకాలు. ఎనిమిదికి కళ్ళ మీదకికొచ్చిన నిద్రతో ఇంటికి జోగుతూ వచ్చి, పక్క మీద పడి నిద్రపోతున్న నిన్ను చూసి మనసు గిలగిలా కొట్టుకుంటుంది. ఏం చెయ్యను? జీవితం పరుగులో వెనకపడతావేమో అన్నది, నీ తల్లితండ్రుల భయం.

నీకో చిన్నదో పెద్దదో నగ ఇచ్చాను, అదో ఆస్తి, నీవు పెట్టుకుని, మా తాత నాకు చేయించినదని ఆనందంతో నీ కూతురుకో కొడుక్కో ఇచ్చుకుంటావు, కాని తరతరాల తరగని గని నీకు చేర్చాలంటే ఎలా? నువ్వు అర్ధం చేసుకునే వయసొచ్చేటప్పటికి నాకు మరుపేవస్తుందో! కాలమే చెల్లుతుందో చెప్పలేను కదా! అందుకే ఈ ప్రక్రియ, నీకు చేరాలని. దగ్గరగా ఐదేళ్ళనుంచి నీకోసం చేస్తున్న ప్రయత్నం, జీవితం పూలపాన్పూ కాదు, నిప్పుల గుండమూ కాదు. కష్టమూ, సుఖమూ అనే రెండు ఎప్పుడూ వస్తూ,పోతూనే ఉంటాయి, ఏదీ స్థిరంగా కాపురమూ ఉండదు. కష్టానికి వెరవద్దు, సుఖానికి పొంగద్దు, ఇది తాతమ్మ నాకు చెప్పిన మాట, జీవితంలో అమలు చేశాను, నీకు చెబుతున్నా.

నువ్వు ఇతరులనర్ధం చేసుకున్నట్టు, ఇతరులు నిన్ను అర్ధం చేసుకోలేకపోవచ్చు, ఇది గుర్తించు. నీవు ప్రేమించే చోట కంటే, నిన్ను ప్రేమించే చోట ఆనందంగా ఉంటావు, ఇది అర్ధంకావడానికి సమయం పడుతుంది సుమా! అక్షరం అంటే నశింపులేనిదని అర్ధం, నా శరీరానికి నశింపు ఉంటుందిగాని నా అక్షరానికి కాదు! అక్షర రూపంలో ఎల్ల వేళలా నీతోనే ఉంటాను. దేనికీ భయపడకు, ఒక్క మూర్ఖులకు తప్పించి, వారికి దూరంగా ఉండు.

ఈ బ్లాగులపై నాకుగల మేధోపరమైన హక్కులను నీకు దఖలుపరుస్తూ రాసిన విల్ ఈ బ్లాగులోనే ఉంచబడింది.

శతంజీవం శరదో వర్ధమానా ఇత్యపినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనా వర్ధయన్తి శతమేనమేన శతాత్మానం భవతి శతమనంతం భవ తి శతమైశ్వరయం భవతి శతమితి శతం దీర్ఘమాయుః//

Potana Bhagavatam Vol 1

Potana Bhagavatam Vol 2

Potana Bhagavatam Vol 3

Potana Bhagavatam Vol 4

Potana Bhagavatam Vol 5

 

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చిరంజీవి శ్రీవిద్యకి,

  1. శర్మగారూ ! ముందుగా మీ ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటూ ..
    మీరు సమాజానికి మేలు జరగాలనే సదుద్దేశం తో మీ మనమరాలికి అప్పగించిన బాధ్యతను ఆమె తప్పక నెరవేరుస్తుందని ప్రగాడ విశ్వాసం నాకు ..
    ఆమె ద్వారా అతి త్వరలో ఒక బ్లాగు రావాలని కోరుకుంటూ

      • Lalitha TSగారు,
        ఎనిమిదో పదికి కూతవేటు దూరంకదా! అన్నీ తప్పనివే!!

        అనాయాసేన మరణం వినా దుఃఖేన జీవితం వీటికోసమే తపన, రెండోది సాధ్యంకాదు, మొదటిదానినైనా అనుగ్రహించమని ప్రార్ధన.

        నిన్నటిదాకా ఎర్రటి ఎండలు, నేడు వాన, ఎండ కాసినపుడు భీకరమైన వేడి, ఈ మార్పులతో ఇబ్బంది.
        ధన్యవాదాలు.

  2. మీ బ్లాగ్ వారసులెవరో నిశ్చయించి మంచి పని చేశారు శర్మ గారూ. మీ మనవరాలికి ఆశీస్సులు.

Leave a reply to YVR's అం'తరంగం' స్పందనను రద్దుచేయి