శర్మ కాలక్షేపంకబుర్లు-దేవాంతకుడు-నరాంతకుడు.

nature-1

Courtesy:Owner

దేవాంతకుడు-నరాంతకుడు.

వీడెవడండిబాబూ దేవాంతకుడిలా ఉన్నాడే అనిగాని, దేవాంతక,నరాంతకుళ్ళా ఉన్నాడే అనిగాని అనడం వింటుంటాం. ఇంతకీ ఈ దేవాంతకుడెవరు? నరాంతకుడెవరో తెలియాలంటే రామాయణం దగ్గరకే పోవాలి. ఎంతకాదనుకున్నా రామాయణమే దిక్కు… 🙂

కుంభకర్ణుడు చనిపోయిన తరవాత రావణుడు పరితపించాడు, పశ్చాత్తాపం పోందాడు. కాని అదెంతో కాలం నిలవలేదు కారణం….విధి వ్రాత, దీనినెవరూ తప్పించలేరుగదా!

రావణుని కొడుకైన త్రిశిరుడు పశ్చాత్తాపపడుతున్న తండ్రిని చేరి ఇలా అన్నాడు. “మహరాజా! నా పినతండ్రి మరణం విదిలిఖితం, దానికి బాధపడడమెందుకు? మీరు మిమ్మల్ని ఇలా కించపరచుకోవడం, తక్కువగా భావించడం తగదు. మీదగ్గర బ్రహ్మదేవుడిచ్చిన శక్తి ఉంది,కవచం, ధనుర్బాణాలున్నాయి, అద్భుతమైన రథం ఉంది. అసలు వీటిని ఉపయోగించకనే దేవతలని చాలా సార్లు ఆపదలపాలు చేశారు. ఇన్ని ఉన్న మీరు తప్పక రాముని జయింపగలరు, ఆజ్ఞ ఇస్తే నేనొక్కడనే రాముణ్ణి మట్టి కరిపిస్తా”నన్నాడు. ఈ మాటలు రావణునికి ఊరట కల్పించాయి, పునర్జన్మ ఎత్తినట్టే అయింది, అనిపించింది.

ఈ మాటలతో దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు అనే రావణ కుమారులు యుద్ధానికి సిద్ధమయ్యారు, త్రిశిరునితోబాటు, నేను ముందు అంటే నేను ముందని. వీళ్ళేం తక్కువవాళ్ళు కాదు, అస్త్ర శస్త్రాలలో నిపుణులు, మహా బలశాలులు. వీరికి రక్షణగా మహాపార్శ్వుడు, మహోదరుడు అనే సోదరులనూ యుద్ధానికి పంపేడు, రావణుడు. వీరంతా తమతమ వాహనాలెక్కి యుద్ధానికి బయలుదేరారు. ఘోరమైన యుద్ధమే జరిగింది. ఆ రోజు దేవాంతకుడు, నరాంతకుడు చేసిన యుద్ధం లో వానర సేన చాలానే నష్టపోయింది. ఘోర యుద్ధంలో నరాంతకుడు అంగదుని చేతిలో నిహతుడయ్యాడు. నరాంతకుడు పడిపోతే మిగిలినవారు హాహాకారాలు చేశారు.ఇప్పుడు దేవాంతకుడు విజృంభించాడు. దేవాంతకునికి తోడుగా త్రిశిరుడు, మహోదరుడు తోడయ్యారు, అంగదుని పైకి. వీరు ముగ్గురూ ఒక్కసారిగా అంగదుని మీద దాడి చేయటం చూసిన హనుమ, నీలుడు అంగదుని దగ్గరకి చేరారు. దేవాంతకుడు హనుమపైకి దాడి చేశాడు. హనుమ ఒక గుద్దుతో దేవాంతకుని అంతమొందించాడు.

దేవాంతకుడు మరణంతో త్రిశిరుడు నీలునిపైకి దాడి చేశాడు. మధ్యలో మహోదరుడు నీలునిపై దాడి చేశాడు, చేతితో ఒక్కపెట్టు పెట్టి మహోదరుని ఏనుగును, అతన్ని యమసదనం చేర్చాడు, నీలుడు. త్రిశిరుడీ సారి హనుమపైకి దాడిచేయగా ఘోరయుద్ధం జరిగింది, అందులో హనుమ త్రిశిరుని కత్తితోనే అతని తలలు మూడిటినీ తరిగేశాడు. యుద్ధానికి వచ్చినవాళ్ళలో నలుగురు ప్రాణాలు కోల్పోయే సరికి మిగిలిన మహాపార్శ్వుడు విజృంభించాడు. ఋషభుడు అనే వానరుడు మహాపార్శ్వుని ఎదుర్కొని యుద్ధంలో అంతం చేశాడు. ఇక మిగిలినవాడు అతికాయుడు. పేరుకు తగ్గట్టే ఇతను పెద్ద శరీరంతో కుంభకర్ణుడే బతికొచ్చాడేమో అన్నట్టున్నాడు. రావణునంతటి శక్తిశాలి. ఇతను రామునిపైకి వస్తే లక్ష్మణుడు అడ్డుకుని ఘోరయుద్ధంలో బ్రహ్మాస్త్రంతో అంతమొందించాడు.

కుంభకర్ణుడు చనిపోయిన తరవాత రావణుడు నిర్వేదంపొందాడు, కాని అది ఎక్కువ కాలం నిలవలేదు. రావణుని విధి త్రిశిరుని రూపంలోనూ, మిగిలిన కొడుకుల రూపంలోనూ అడ్డుపడింది. తండ్రి దగ్గర రాముని హతమారుస్తానన్న త్రిశిరుడు, మిగిలిన అన్నదమ్ములు, రావణుని ఇద్దరు సోదరులు ఒక రోజులో హతులైపోయారు… వానరుల చేతిలో. మెరుపు మెరిసి మాయమైనట్టుగా వీరెంత బలవంతులైనా ఒక్కరోజులో మాయమైపోయారు. రావణుని పశ్చాత్తాపాన్ని వ్యర్ధం చేశారు.ఒక్కరోజు మెరుపు మెరిసినట్టు ప్రకాశించేవారిని నరాంతకుడు, దేవాంతకునితో పోలుస్తారందుకే…….విధిని దాట వశమా?

metralabham metrabedam MOHANPUBLICATIONS

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దేవాంతకుడు-నరాంతకుడు.

 1. >>>ఒక్కరోజు మెరుపు మెరిసినట్టు ప్రకాశించేవారిని నరాంతకుడు, దేవాంతకునితో పోలుస్తారందుకే…

  ఒక్క రోజేనా? అంటే తాత్కాలికమేనా? వీటికి కాల పరిధి ఉందా ?
  చాలా చాలా కాలం వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. వివరించగలరు………దహా.

  • మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యంగారు,
   నేటి కలికాలంలో వీరిదే ప్రతిభకదండీ, వీరికి కాలపరిమితి లేదు 🙂
   ధన్యవాదాలు.

 2. శర్మగారూ నమస్తే ! జిలేబీగారు మీ బ్లాగు టపాలు తస్కరిస్తాను అంటున్నారు కదా ? మీరు ఇచ్చిన సభ్యుల లిస్టులో వారి ఐడిలు ఉన్నాయేమో సరిచూసుకోగలరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s