శర్మ కాలక్షేపంకబుర్లు-పిండివంట

పిండివంట

ఎప్పుడెప్పుడు పండగ
ఏడాది పండగ

పండగెందు కొచ్చిందోయ్
పప్పలు తిండానికొచ్చిందోయ్

అల్లుడెందుకొచ్చాడోయ్
అరిసెలు తిండానికొచ్చాడోయ్

కూతురెందుకొచ్చిందోయ్
కుడుములు తిండానికొచ్చిందోయ్

ఎప్పుడెప్పుడు పండగ
ఏడాది పండగ..

చిన్నప్పుడు ఈ పాట పాడుతూ బావల్ని ఆటపట్టిస్తూ భోగిరోజు ఇంటింటికీ తిరిగి కర్రలు బోగిమంటలోకి సంపాదించేవాళ్ళం. పండగంటే ఇప్పటికి పిండివంట చేసుకుతినడమే ప్రధానంగా మారిపోయింది. శ్రావణ శుక్రవారం, ఇల్లాలు అడుగులేస్తోంది నడుముకి వడ్డాణం, అదే బెల్ట్ పెట్టుకుని, మూడు నెలల తరవాత ముచ్చట. అడుగులేస్తోందిగనక, అరిసెలుగాని చేస్తుందేమో అనుకున్నా! అన్నట్టు నాలుగునెలలకితమో మనవరాలు అరిసెలు చేసి పిలుస్తా తాతా అంది, అరిసెలు చెయ్యడం పాకం పట్టడం చేతకాలేదూ అంది, ఆ తరవాత నాలుగురోజులు కనపడిందిలెండి, ఆ తరవాత…. 🙂 ఐదు పిండివంటలు చేసి, పూజ చేసుకుని నైవేద్యం పెట్టాలనుకున్నా కుదరలేదు, మొత్తం తొమ్మిదీ చేస్తున్నానంది, ఇల్లాలు. అక్కడే కూచుని అరటాకు మీద మైదాపిండి వత్తుతున్న కోడల్ని చూసి కళ్ళెగరేశా ఏంటి చేస్తోందని. బొబ్బట్లేం కాదు లెండి, ఇవి సొజ్జప్పాలూ అంది, హా హతవిధీ! బొబ్బట్లనుకున్నా కాదా అనుకున్నా! బొబ్బట్ల గురించి, సొజ్జప్పాల గురించి మరోసారి చెబుతాగాని, అసలు పిండివంట అంటే ఏంటీ అని చూస్తే అప్పచ్చి, అపూపము అని అర్ధాలిచ్చారు నిఘంటుకారులు.

పిండి వంట అంటే నిత్యమూ చేసుకునేవంట కాదు, ప్రత్యేకమైనది, అదీగాక ఇది పిండితో చేసేది. పిండితో చేసేదంటే వరిపిండి,గోధుమపిండి, మినప్పిండి, బొబ్బరపిండి, పెసరపిండి, శనగపిండి, ఇలా పప్పుధాన్యాల పిండితో చేసేదే! ముఖ్యంగా. నేటి కాలంలో అన్నిటిని పిండివంటలే అనేస్తున్నారనుకోండీ!

ఈ పిండివంట చేసేది రెండే రెండు రుచులతో, అవి కారం,తీపి. అసలు రుచులెన్నని చూస్తే షడ్రుచులు అన్నారు కదా! అవి ఉప్పు,పులుపు,కారం,వగరు, చేదు, తీపి. ఐతే ఈ రుచులలో రెండే పార్టీలు ఒకటి తీపి పార్టీ, రెండోది కారం పార్టీ. కారం పార్టీలో ఉప్పు మొదటిది. ఉప్పులేని వంటకం చప్పిడి అని ఈసడించాడు వేమనతాత. ఇది ఎక్కువైనా తగువే,తక్కువైనా తగువే, సమానంగా ఉండాలి. ఇది పులుపు, కారం, చేదు, వగరులతో ఇట్టే కలిసిపోతుంది, ఇది లేకపోతే మిగిలినవాటికి అస్థిత్వమే లేదు.

అసలు ఉప్పు తిన్నగా తినేజీవి మానవుడే! ఉప్పు తినకపోతే తెలివితేటలే లేవు, మానవులకి. ఉప్పు తినడం మూలంగానే ఈ తెలివి పుట్టుకొచ్చింది. ఉప్పంత గొప్పది. ఉప్పు తినకండోయ్ అంటున్నారు డాక్టర్లంటారు. వాళ్ళు చెప్పింది, ఉప్పు ఎక్కువ తినెయ్యకండి, అతి తెలివితో ఆరాటపడిపోతారు, గుండె జబ్బులతో అని వారి మాట. అర్ధం చేసుకోరూ (భానూప్రియ) మిగిలిన వగరు, చేదు,పులుపులు, ఉప్పూ,కారాలతో కలిసి ఉప్పూకారం పార్టీ, ఉపకారం పార్టీ అయ్యాయి. ఇవి తింటే మొహం మొత్తదు, కడుపునిండి వద్దనిపిస్తుందేమోగాని.

ఇక ఒంటికాయ్ సొంటికొమ్ము పార్టీ ఉందండి, అదే తీపి పార్టీ, దీని కి దేనితోనూ స్నేహం లేదు, ఎవరితోనూ పడదు. కొంచం ఎక్కువ తింటే మొహం మొత్తుతుంది. అధికారంలో ఉన్నంతకాలమూ నా అంత గొప్పవారు లేరు, ఏoజేస్తే అదె ఘనకార్యం! మనమేం జేస్తే అదె ఘనకార్యం అని డబ్బా కొట్టుకుంటుంది.

మరో మాట మనం తినే ఆహారాన్ని బట్టి మనసు, దానిని బట్టి మన నడవడిక ఉంటుందంటారు. మరి తీపి తినేవారిని గమనించండి, వీరు ఒంటికాయి సొంటికొమ్ములే ఎవరితోనూ కలవలేరు, ఉపకార శూన్యులు, మరొకరి పొడగిట్టదు, ఎందుకనీ మిగిలిన ఐదు రుచులలో ఏ ఒక్కదానితోనూ తీపికి పడదు. మరి కారమో! ఉప్పుతో విడదీయలేని బంధం, మిగిలినవాటితో స్నేహం, ఎప్పుడూ ఎవరో ఒకరు కూడా ఉండాల్సిందే ఉప్పువారితో, మరి వీరు పదిమందికి కావలసినవారు కదా! ఉపకారం చేసేవారూ!

రుచులకి గ్రహాలకీ పోలికటండి, సూర్యుడు కారం,చంద్రుడు ఉప్పు,కుజుడు చేదు,బుధుడు షడ్రసాల మిశ్రమం,గురుడు తీపి, శుక్రుడు పులుపు. ఇందులో ఏ రుచిని ఇష్టపడేవారి మనస్థితి దానిని బట్టి ఉంటుంది.

గ్రహాలలో రెండు పార్టీలటండి. ఒకటి గురుడు ఆధిపత్యంలో పార్టీ, రెండవది శని ఆధిపత్యంలో పార్టీ. గురుడు ఆధిపత్యంలో,గురుడు, రవి,చంద్రుడు,కుజుడు, కేతువు వీరు ఐదుగురు. శని ఆధిపత్య పార్టీలో శని,బుధుడు,శుక్రుడు,రాహువు వీరు నలుగురు. అమ్మో! సెబితే శానా ఉంది, వింటే ఎంతో ఉంది సెబుతా ఇనుకోరా ఎంకట సామి… తరవాతా 🙂

అందుచేత ఈ భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఉప్పు,కారం పార్టీకీ జై, ఉప్పూ కారం తినే మనుషులం కదండీ!

————-      ————       ————-      —————    —————-

స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు

నాకూ స్వాతంత్ర్యం వచ్చింది.

ఈ రోజు నేను=(నేను+47 మంది)=మనం, నాకు వెన్నుదన్నుగా అత్యవసర సమయంలో మానసికంగా నన్ను ఆదుకున్న మీ అందరికి ధన్యవాదాలు.ప్రవేట్ బ్లాగ్ చేసిన వారంలో ఇరవైమంది పైన నా ఆహ్వానం మన్నించారు.వరసగా పేర్లు చెప్పుకుంటూపోతే కొంతమందిని వదిలేయచ్చు, అందుకు పేర్లు చెప్పటం లేదు, మీరే నా బలం,బలగం..ప్రైవేట్ బ్లాగ్ అంటే తెలియని చోట నాది ఏటికి ఎదిరీత! బహుశః నేనే మొదటివాడినై ఉంటాననుకుంటా. అదంతా మీ ఆదరమే! నా పోరాటం లో నా ఆరోగ్యం సహకరించకపోవచ్చు, బలవంతులను డీకొంటున్నాను, న్యాయం నా పట్ల ఉన్నదని నమ్ముతున్నాను, ఈ పోరాటంలో…ఏమైనా జరగచ్చు, కాని పోరాటం కొనసాగుతుంది. 

కష్టే ఫలే పాత బ్లాగ్ ను ప్రైవేట్ బ్లాగ్ చేయడం మూలంగాను, గూగుల్ సెర్చ్ లో కూడా నా పాత టపాలు కనపడటం లేదు,కాదు కనపడవు. నా టపాలు చదవక ఉండలేనివారికోసం నా పాత బ్లాగ్ లో టపాలను కొత్త బ్లాగులో పునః ప్రచురిస్తున్నానని తెలియజేయడానికి సంతసిస్తున్నాను.ఇంతకు మించి ఇప్పుడు చెప్పలేను

కొత్త బ్లాగ్ లింక్

https://kastephali.wordpress.com

కష్టేఫలి ఈ కొత్త బ్లాగ్ ను ఏ ఆగ్రిగేటర్ లోనూ జతచేయలేదు. గూగుల్ సెర్చ్ లో దొరుకుతుంది.మీకు ఈ బ్లాగ్ తో పనిలేదు.కొత్త టపాలక్కడ కొత్త బ్లాగులోకనపడవు
ధన్యవాదాలు.

5 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పిండివంట

  1. సర్,
    పిండి వంటకాల గురించి విపులంగా వ్రాసారు. మీ బ్లాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎలాగైనా ఒకసారి మీతో కలవాలని మీతో మాటలడాలని వుంది. ఎప్పుడో ఒకప్పుడు అనపర్తి వస్తాను. ఉంటాను. నమస్తే.
    వెంకట రమణ ఆర్కాట్

  2. స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు తాత గారూ. నాకు కూడా బొబ్బట్లు అంటే ఎంతో ఇష్టం.

    • చి.స్వాతి,
      అవునురా చిట్టితల్లీ! బొబ్బట్లంటే నీకూ ఇష్టమేనా 🙂 అడిగితే బొబ్బట్లు అమ్మమ్మ చేస్తుందనుకో కాని వడ్డాణంతో ఇబ్బంది పెట్టడమెందుకని అడగలేదు.
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s