శర్మ కాలక్షేపంకబుర్లు-పంపకం

పంపకం

వరసగా శలవులు రావడంతో మా చుట్టు పక్కల పిల్లలంతా వచ్చేశారు, మా దొడ్డిలో ఆటలకి. అల్లరి పెరిగిపోయింది, వీళ్ళని ఎలా దారిలో పెట్టడం అని ఆలోచించి ఒక కథ చెబుతా అన్నా! చుట్టూ చేరిపోయారు. ఇలా మొదలెట్టా.

అనగనగా ఒక పల్లెలో ఒక తెలివైన తండ్రి, అంటే, ”తండ్రి తెలివైనవాడేగాని తల్లి కాదాండీ?” అన్నడొకడు చొప్పదంటు ప్రశ్నతో. ”తల్లి తెలివైనదైతేనే కొడుకు తెలివైనవాడవుతాడు, అందుకే ఆడపిల్లలు తెలివైనవారై ఉండాలి. పద్నాలుగేళ్ళ వయసున్న అమ్మాయికున్న తెలివి, పరిశీలనా జ్ఞానం అబ్బాయిలకుండదురా బాబులూ! అందుచేత అమ్మాయిల దగ్గర జాగ్రతా!” అన్నా. అమ్మయిలంతా గొల్లుమన్నారు, అబ్బాయిలుడీలా పడిపోయారు, ”ఒరే అబ్బులూ! మీ అమ్మ తెలివైనదైతే నువ్వూ తెలివైనవాడివే కదురా” అన్నా! ఈ సారి అబ్బాయిలు గొల్లుమన్నారు. ”పిల్లలూ అందరూ తెలివైనవాళ్ళే, వాటిని సమయానికూలంగా ఉపయోగించుకోడంలోనే ఉన్నది తేడా అంతా”, అంటే ఒక అమ్మాయి, ”తాతా కథ మానేసి మరేదో చెబుతున్నావూ” అని బుంగ మూతి పెట్టింది. ”కథ చెబుతా” అని అసలు కథలోకొచ్చా.

”ఒకతనికి ముగ్గురు కొడుకులు, ధనం బాగా సంపాదించాడు, ఒక వీలునామా రాసిపోయాడు. దాని ప్రకారంగా ఆస్థి పంపకాలు మొదలెట్టేరు. అన్నీ సవ్యంగా జరిగిపోయాయి, అంత స్పష్టంగా రాశాడనమాట. చివరగా పంచుకోవలసినవి 17 ఏనుగులు మిగిలాయి. విల్లులో తండ్రి ఉన్న ఏనుగుల్లో సగం పెద్దవానికి, మిగిలినవాటిలో రెండు వంతులు రెండవవానికి, చివరగా మిగిలినవి దీనినే పరిశేషన్యాయం అంటాం. మిగిలిన ఏనుగుల్ని మూడో వాడూ తీసుకోవాలని రాశాడు. బతికున్న ఏనుగుల్ని పంచుకోవాలని షరతు పెట్టేడు. అన్నదమ్ములు వాటాలు తెగక తెగ బాధపడిపోయారు. నాన్న చాలా తెలివైనవాడు, అన్నీ బాగానే రాశాడుగాని ఈ ఏనుగులదగ్గరకొచ్చేటప్పటికి ఇలా చేశాడేంటి చెప్మా అనుకుని తలలు పట్టుకున్నారు. పంపకం ప్రారంభం కాగానే పెద్దవాడు, నా సగం ఏనుగులు నాకిచ్చెయ్యండి, మరోడి సొమ్ము నాకొద్దు, నేను చిన్న ముక్క కూడా నా వాటాలోది మరోడికి పోనివ్వను అని మొండికేశాడు. ఇప్పుడు ఎనిమిదిన్నర ఏనుగులెలా పంచాలి తెలియక కొట్టేసుకున్నారు. అన్నదమ్ములిలా గుంపుచింపులు పడుతుంటే దారిన పోయే ఓ దానయ్య దీనికోసం ఎందుకు తగువులాడుకుంటారు, మన రాజ్య మంత్రిగారు చాలా తెలివైనవాడు, ఏ సమస్యనైనా చిటికెలో తేల్చేస్తాడు, ఈ సమస్యని ఆయన దగ్గరకి పట్టుకెళ్ళండి అని ఉచిత సలహా ఇచ్చిపోయాడు.

మంత్రిగారీ సమస్య ఎలా పరిష్కారం చేశాడో చెప్పండర్రా” అని ఆగా! ”ఒక ఏనుగునమ్మేస్తే, కుదరదు, ఏనుగుల్లాగే పంచుకోవాలిగా. అన్ని ఏనుగుల్నీ అమ్మేస్తే అసలు కుదరదు ఏనుగులనే పంచుకోమన్నాడు తండ్రి. ఏమో అర్ధం కాలేదు చెప్పుతాతా” అన్నారు, మరి మీరైనా చెబుతారా, ఆ మంత్రిగారు తగువెలా తీర్చాడో!

నన్నే చెప్పమన్నారా! కొంచం ప్రయత్నం చెయ్యరాదూ! మెదడుకి మేత కదా!

అన్నదమ్ములు పదిహేడు ఏనుగులని మంత్రిగారి దగ్గరికి తోలుకుపోయారు, కోట బయట నిలబెట్టేరు మంత్రిగారి రాకకై చూస్తూ! మంత్రిగారు ఏనుగునెక్కివచ్చాడు. నా ఏనుగుని కూడా మీ ఏనుగుల్లో కలిపేస్తా మీకేం అభ్యంతరమా అన్నాడు, అబ్బే అదేం లేదండీ! మా సొమ్ము మరొకరికి వదలం, మరొకరి సొమ్ము మాకొద్దూ అన్నారు అన్నదమ్ములు ముగ్గురూ సాగదీస్తూ! అలాగే అని మంత్రిగారు ఒక కుర్ర మావటిని పిలిచి అక్కడున్న ఏనుగులలో సగం ఏనుగుల్ని పెద్దవాని వాటాగా పక్కకి తీసెయ్యమన్నాడు. ఆ మావటీ కుర్రాడు తొమ్మిది ఏనుగుల్ని పక్కకి తప్పించాడు, మిగిలిన ఏనుగులు తొమ్మిది, వీటిలో రెండవ వంతు రెండవవాడికివ్వాలి కదా ఆరు ఏనుగుల్ని రెండవ వాడికిచ్చారు, మిగిలినవి ఎన్నీ? మూడు ఏనుగులు. ఈ మూడింటిలో మంత్రిగారి మావటీ వచ్చి వారి ఏనుగు తోలుకుపోయాడు, ఇప్పుడు మిగిలినవి రెండు. పరిశేషన్యాయంగా మూడవ వానికి మిగిలిన ఏనుగులొచ్చాయి. ఎవరి ఏనుగులు వారు తోలుకుపోయారు మారు మాటాడక, పంపకం న్యాయమేనా? తండ్రి చెప్పినట్టే పంచుకున్నారా?

మన దేశాన్ని రాష్ట్రాన్ని ఇలాగేనా పంచుకున్నామా?

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పంపకం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s