శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రయాణ అనుభవం-ఆకలి

ప్రయాణ అనుభవం-ఆకలి

అబ్బో! ఎప్పటిమాటా 1965 ప్రాంతం నాటిది కదూ! చేసేది టెలిపోన్ ఆపరేటర్, రాత్రి పగలూ ఉద్యోగం తూ.గో.జి మండపేటలో, ఊరు దాటిపోవాలంటే ఆఫీసులో చెప్పి అనుమతి తీసుకుని పోయే అవసరం. గానుగెద్దు జీవితం, పరిచయస్థులంతా లారీ ఓనర్లు, బాగా డబ్బున్నవారు, దేశం తిరిగినవారు. ఆఫీస్ ఎదురుగా రోడ్ పక్క ఒకపాకలో, అది లారీ బ్రోకర్ ఆఫీస్ లో పేకాడుకునేవారు. వాళ్ళకి లారీతో దేశం మీద తిరిగినా అది వ్యాపారం కోసం, జాలీగా తిరిగేందుకు కాదు, అందుకని ఒక సారి పేకాడుకుంటూ ”ఛస్! ముక్కెక్కటం లేదురా అల్లుడూ ఎటేనా పదిరోజులు తిరిగొద్దాం శలవెట్టెయ్య కూడదూ” అన్నాడొకతను. ”నిజమేరా ఎటేనా తిరిగొద్దాం” అని సై అన్నాడు మరొకతను, మరొకతను ”నేను రాలేనురా, మా ఆవిడ నీళ్ళాడే సమయం” అన్నాడు. మొత్తానికి నలుగురు సై అంటే సై అన్నారు.

నేను శలవెట్టి చెబుతానన్నా! అలా ప్రయాణం నికరమయింది, ఎలా? అందరికి కార్లున్నాయి, ఒకరు కార్ తెస్తానన్నారు, నలుగురూ హెవీ లైసెన్సులున్నవాళ్ళే! నాకే ఏమీ చేతకాదు, కాని నేను లేనిది కదిలేవారు కాదు, వాళ్ళకి నేనో మేధావిననీ, మూడు నాలుగు భాషలు మాటాడగలననీ, ఎక్కడికెళ్ళినా పని సానుకూలపరచుకు రాగలననీ నమ్మకం, అదీగాక నిద్రకి ఆగగలననీ, కార్ నడిపేవాని పక్కన కూచుని సోది కబుర్లు చెబుతూ వాడికి నిద్ర పట్టకుండా చేయగలననీ నమ్మకం. అనుకున్నట్టుగా ఓ సాయంత్రం బయలుదేరిపోయాం, ఐదుగురం, చిన్న కార్ అంబాసిడర్ లో. ఎక్కడికెళ్ళాలీ నికరం లేదు, కార్ పెట్రోల్ బంక్ దగ్గరకెళితే, అక్కడ టేంక్ నిండా పెట్రోల్ కొట్టించేశాం. ఏభయి రూపాయలలోపు మాట. అక్కడ మిగిలిన నలుగురూ వాళ్ళ దగ్గరున్న సొమ్ములు తీసి నా చేతిలో పెట్టి, ”అవసరానికి కర్చు పెట్టరా అల్లుడూ! లెక్కలేం చూడక్కరలేదులే” అని, దగ్గరగా, ఆ రోజుల్లో ముఫై వేల రూపాయలు నాచేతిలో పెట్టేరు. ఏం చెయ్యాలి, ఎక్కడ దాచాలి, తోచలేదు. ఈ లోగా ఒకతను ”అల్లుడూ! ఇదిగోరా నడుం పటకా! పేంట్ విప్పేసి లుంగీ కట్టు, నడుంపటకాలో డబ్బులు దాచు” అని ఇచ్చేడు. నడుంపటకా కట్టుకోడం తెలియదు కనక తనే డబ్బు ఎక్కడ దాచాలో, ఎలాదాచాలో చూపించి పటకా నడుంకి కట్టేసేడు. ఊరు దాటేం, చీలిక రోడ్ దగ్గరకొచ్చేం ఏటెళ్ళాలి?

అందులో ఒకతను కొంచం పెద్దవాడు, చదువుకున్నవాడు, ‘శ్రీ అప్పసాని రామస్వామి’ అనే ఆయన ‘లెఫ్ట్ ఈజ్ రైట్’ అన్నాడు, గోల్డ్ ఫ్లేక్ ఫిల్టర్ సిగరట్టు, రెండు వేళ్ళ మధ్య పెట్టి గుప్పిడమూసి, మూసిన గుప్పిటను నోటికానించి పొగ పీలుస్తూ, దీన్నే గంజాయి దమ్ము అంటారు, నేనూ అలాగే కాల్చేవాణి, ఓ నలభై ఏళ్ళు. అంటే విజయవాడ వైపు బయలుదేరామన మాట, కుడి వైపుకి వెళితే విశాఖ వైపు వెళ్ళే వాళ్ళం, అంటే దక్షణాది వైపు బయలుదేరాం, మొత్తానికి. విశాఖ వైపుకి తిరక్కపోడానికి కారణమూ ఉంది. వీళ్ళంతా వ్యాపార రీత్యా చింతపల్లి, లంబసింగి ఘాట్ రోడ్లలో తిరిగినవాళ్ళూ, పులుల్ని దగ్గరగా చూసినవాళ్ళూ. మా రామస్వామి మావకైతే గన్ లైసెన్సూ ఉంది, గన్నూ ఉంది. పులిని కాల్చేడో లేదో అడగలేదెప్పుడూ, మండపేట కి దగ్గర పాలతోడు అనే ఊరువాడతను. నేటికి వారి వయసు 90 పైమాట, కులాసాగా ఉండే ఉంటారు. ఆ అనుభవాలు కథలు కథలుగా చెప్పేవారు. అదీగాక వీళ్ళలో ముగ్గురికి తుంగభద్ర ప్రాజక్ట్ కింద ఉన్న ఒక గ్రామం భద్రావతి కేంప్ లో చుట్టాలున్నారు. అప్పటికి రావులపాలెం బ్రిడ్జ్ అయిన గుర్తు లేదు, గోదావరిని రోడ్ వంతెన మీద దాటి బెజవాడ చేరేం. అప్పటికి విజయవాడని బెజవాడ అనేవారం. సింగిల్ మార్జిన్ రోడ్డు, పేరు ట్రంక్ రోడ్డు, గతుకులు,గోతులు, వర్షం వస్తే రోడ్ అంతా చెరువులే.

బెజవాడలో అమ్మ దర్శనం చేసుకుని దేశం మీదకి బయలుదేరాం,గుంటూర్ రోడ్ పట్టి. అక్కడినుంచి ఎక్కడికి కుదిరితే అక్కడికి పోయి,గుళ్ళూ గోపురాలూ తిరిగి, పల్లెలలో కూడా ఆగి చివరికి వారం పైమాటగా తుంగభద్ర డేమ్ చేరాం. ఎక్కడెక్కడికి తిరిగినదీ వివరంగా డెయిరీలో రాశా, అప్పుడు డయిరీ రాసే అలవాటుకొద్దీ. ఈ డయరీలు గుట్టలుగా పెరిగేటప్పటికి ఇల్లాలికి చిరాకొచ్చి ”ఎందుకివీ! దాచలేక ఛస్తున్నానని” విసుక్కుంటే చాలా డయరీలు పరశురామ ప్రీతి చేసేశా. తుంగభద్ర డేం గెస్ట్ హౌస్ లో దిగేం. మా వాళ్ళు ముగ్గురు చుట్టాలని చూసొస్తామని వెళ్ళేరు. ఇద్దరం మిగిలాం, వాచ్ మన్ భోజనం పెడితే తినడం నిద్రపోవడంగా రెండు రోజులు గడిపాం. వెళ్ళిన వాళ్ళ జాడలేదు, కబురు తెలుసుకోడానికి నాటికి దారి లేదు, నాటికి సెల్ పోన్లు లేవు, మామూలు లేండ్ ఫోన్ లే లేవు. వాళ్ళే వస్తారనుకుని మూడో రోజు లేచి డేం పూర్తిగా చూసి భోంచేసిన తరవాత, నాలుగు గంటలికి మా వాళ్ళు చేరారు. వెళిపోదామంటే సరేనని బయలుదేరాం.

తిరుగు ప్రయాణం లో ఎక్కడా మెయిన్ రోడ్ పక్కలకి వెళ్ళక తిరిగొచ్చేయాలని నిర్ణయించుకు బయలుదేరాం. ఎవరూ భోజనం మాట మాటాడలేదు. వంద కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తే కార్ నడిపేవాడిని మార్చేసేవాడిని, అందరికి బండి తోలడం వచ్చుగనక. మిగిలిన సమయంలో వెనక సీట్ లో పడుకుని నిద్రపోయేవారు, నాకు మాత్రం బండితోలేవాడితో కబుర్లు తప్పేవికావు కనక మెలుకువగా ఉండక తప్పేది కాదు. బండి నడిపేవాడు భోజనం చేస్తే నిద్ర వచ్చి ప్రమాదం చేస్తాడని భోజనం చేసేవారు కాదు. సమయం రాత్రి ఒంటిగంట కావొస్తోంది, నంద్యాల చేరేం, ఎక్కడేనా హొటల్ ఉంటుందా అని చూస్తూ పోతుండగా ఒకతను కనపడ్డాడు, ”దగ్గరలో హోటల్ ఎక్కడా” అని అడిగితే, ”ఇప్పుడెక్కడా హొటల్ ఉండదు, ఎడమ పక్క రోడ్ లో పోతే సినిమా హాల్ దగ్గర చిన్న హోటల్ ఉండచ్చు,చూడండి” అన్నాడు.

సరే అటుగాపోతే సినిమా వదిలేశారు, చిన్న హోటలతను కట్టేస్తున్నాడు, అక్కడ దిగి ఏమున్నాయన్నాం. ఉన్నవేవో చెప్పేడు, అన్నీ తెచ్చెయ్యమన్నాం. తినడం మొదలేట్టేం, పుణుకులు, మిర్చి బజ్జీలు, మసాలాగారెలు, ఇలా అతను తెస్తున్నాడు మేము తింటున్నాము, ఐదుగురం, మంచినీళ్ళిచ్చాడు, చివరికి బిస్కట్లు,ఎండిపోయిన రొట్టెలుంటే వాటినీ తినేశాం..

ఇంకా ఏమున్నాయన్నాం. చిన్నబోయాడతను, ”ఇంక ఏమీలేవుబాబూ! ఇంటి దగ్గర కూడా ఏం లేవు” అన్నాడు. ”సరే! డబ్బులెంతివ్వమన్నా”వన్నా. ”డబ్బులేం వద్దన్నాడు”, నెమ్మదిగా. ”రూపాయి కోసం హత్యలు చేస్తున్నరోజులు, అర్ధరాత్రి ఎక్కడా ఏమీ దొరకని సమయంలో ఆకలి తీర్చావు, అదే పదివేలు, డబ్బులు తీసుకోననడం బాగో లేదు”, అన్నా! ”మీకు తోచినంతివ్వండీ” అన్నాడు. నాకు మతి పోయింది. ”అదేంటయ్యా” అంటే ”నేను లెక్కపెట్టుకోలేదండి,ఎంతని అడగను, మీరంత ఆకలితో ఆత్రంగా తింటుంటే, ఇంకా ఏం లేకపోయాయే అనుకున్నా కాని, లెక్కపెట్టుకోడం ఆలోచించలేదండి, మీ ఆకలి పూర్తిగా తీర్చలేకపోయా” అని బాధపడ్డాడు. అందరం నిర్ఘాంతపోయాం. ”ఎవరేం తిన్నారో చెప్పండయ్యా” అన్నా. ”ఎక్కడ గుర్తుపెట్టుకున్నాం, కడుపులో ఆకలి దంచేస్తుంటే” అన్నారు. ధర్మ సంకటం లో పడిపోయాను. ఆ రోజులనాటికి వాటి మొత్తం విలువ ఎక్కువలో ఎక్కువ పాతిక రూపాయలుండచ్చేమో! నేను ఏభై రూపాయలు అతని చేతులో పెట్టేను, అతను ”వద్దు బాబూ! ఇంత సొమ్మొద్దు, వాటి మొత్తం ఖరీదు ఇరవై దాటదేమో, మీ ఆకలి తీర్చి ఉంటే బాగుండేది, ఎటూ కాని సమయమైపోయింది, ఇరవై తీసుకుంటా, లేనివాణ్ణి, పొట్టకోసం, పెళ్ళాం పిల్లలకోసం తీసుకోక తప్పదు. అసలు తీసుకోకుండా ఉండాలనే నా నిర్ణయం, కాని మీరు బలవంతం చేస్తున్నారు గనక తీసుకుంటున్నా” అని మూడు పదినోట్లు తిరిగిచ్చేసేడు. అందరమూ అవాక్కయిపోయాం, ఇంకా మానవత ఇలా వెల్లివిరుస్తూనే ఉన్నదే అనుకుంటూ…

అప్పుడడిగేడు ఎక్కడినుంచి వస్తున్నారు,ఎక్కడికెడుతున్నారని. వివరంగా చెప్పి, ఇంటికి తూ.గో.జి వెళిపోతున్నామని చెప్పేను. బాబూ ఈ పూటకి వెళ్ళకండి, వర్షం వచ్చేలా ఉంది, ఇక్కడ కొట్లో పడుకోండి, పొద్దుటే వెళిపోండి అన్నాడు. ఘాట్ గురించా? దీనికంటే పెద్ద పెద్ద ఘాట్ లలో తిరిగిన అనుభవం ఉన్నవాళ్ళం, భయమేం లేదు అని బయలుదేరాం…. ఆ తరవాత, మళ్ళీ కలిసినపుడు…

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రయాణ అనుభవం-ఆకలి

 1. సర్,
  మీ నంద్యాల ట్రిప్ లో మీరు పడ్డ పాట్లు చదువుతుంటే……………………….. ముళ్ళపూడి వారి కోతి కొమ్మచిచి లో నెల్లూరు — చెన్నై మధ్య ………………పడ్డ పాట్లు ……………..అదే …………..ఆకలి …………..గుర్తుకొస్తుంది. ఏమంటారు. మండపేట లో ౧౯౬౯–౭౦ మధ్య స్వామి దాస్ పనిచేసేవాడు. మీకు తెలుసా…….. అక్కడినుంచి వచ్చి గుంతకల్ లో టెలిఫోన్ ఆపరేటర్ గ జాయిన్ అయ్యాడు. నా కు ఫ్రెండ్ అయ్యాడు..

  నమస్తే.
  ఆర్కాట్ వెంకట రమణ

  • రమణాజీ,

   నాకు, కోతికొమ్మచ్చి దొరకలేదండి చదవడానికి

   1960-70 మధ్యలో నాతో పని చేసినవారు, బ్రహ్మానందం,లక్ష్మణ మూర్తి, ముద్దు శ్రీనివాసరావు, నరసరాజు, దుర్గారావు,భీమారావు.అందరూ కాలం చేశారు. స్వామిదాసుని ఎరగను, నేను 1970 లో మండపేట నుంచి వెళ్ళిపోయాను, ఆ తరవాత కాని అతనొచ్చాడేమో
   ధన్యవాదాలు.

  • swathikl
   అమ్మలూ! ఈ వేళ ఆ టపా ప్రచురించాలి, ఎంకన్నబాబుతో అనుభవం టపా ముందుకొచ్చేసింది.ఇదివరకైతే వెంట వెంటనే రాసేవాణ్ణి, ఇదిగో ఈ గొడవలు గోలలతో లయ తప్పింది, మళ్ళీ లయందుకుంటే టపా ఎంత సేపూ పావు గంట, ఇరవై నిమిషాల మాట కదూ! తరవాయి టపా ఎల్లుండి…. 🙂
   ధన్యవాదాలు.

 2. ఆ చిన్న హోటల్ యజమాని లాంటి సంస్కారవంతులు అరుదుగా కనిపిస్తారు. మీరు చేసినటువంటి అడ్వెన్‌చర్లు తర్వాత రోజుల్లో జ్ఞాపకం చేసుకుంటే బాగుంటాయి. మీరు చెప్పినట్లే అప్పటికింకా రావులపాలెం బ్రిడ్జ్ పూర్తవలేదు.

  • విన్నకోట నరసింహారావుగారు,
   సంస్కారవంతులు హడావుడి చెయ్యరుకదండీ!వారి పని వారు చేసుకుపోతుంటారు, మెప్పు,మెహర్బానీ కోసం ఆగరు, ఎదురు చూడరు. అటువంటి వారు ఎప్పుడూ అరుదే.రావులపాలెం బ్రిడ్జి కట్టేటపుడో దుస్సంఘటన, మీరంటే గుర్తుకొచ్చింది, దానిలో నా పాత్ర అదో చేదు అనుభవం…
   ధన్యవాదాలు.

  • YVR’s అం’తరంగం
   ఈ రోజు ఎంకన్న బాబు టపా ముందుకొచ్చేసింది, కొంచం తరవాయి టపాకి కొంచం కొరవుంది. 🙂
   ధన్యవాదాలు.

  • nrmutnuri గారు,

   ఆ రోజు అతను చూపిన దయ, మా ఆకలి తీర్చలేకపోయినందుకు అతను పడిన తపన, చాలా గొప్పది.ఒకచిన్న హోటల్ యజమాని, ముక్కూ మొహం తెలియనివాడు…అతని గురించి ఎంత చెప్పినా తక్కువే కదా!
   ధన్యవాదాలు.

 3. సామాన్య మానవుల దాతృత్వం , మానవీయతా , వెల కట్ట లేనివి !
  చక్కగా వివరించారు , మీరు మర్చి పోకుండా !

  • సుధాకర్ జీ,
   సామాన్యులదే దాతృత్వమూ, దయా. నిజానికి ఆరోజునతను చేసిన సేవకి వెల కట్టలేనిదే!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s