శర్మ కాలక్షేపంకబుర్లు-ఎంకన్నబాబుతో అబద్ధాలూ పరాచకాలూనా??

ఎంకన్నబాబుతో అబద్ధాలూ పరాచకాలూనా??

1965 ప్రాంతం,మండపేటలో టెలిఫోన్ ఆపరేటర్ గా పని చేస్తున్నకాలం. ఆఫీస్ ఎదురుగా ఉన్న లారీ బ్రోకరాఫీస్ లో లారీ యజమానులు పేకాడుకునేవారు. ఖాళీ సమయాల్లో అక్కడ కూచోడం అలవాటూ, లారీ యజమనులంతా మిత్రులైఉన్న రోజులు. ఒకరోజు ఆ బ్రోకరాఫీస్ లో అడుగుపెట్టేటప్పటికి చతుర్ముఖపారాయణం జరుగుతోంది. అందరు పంచిన ముక్కలెత్తుకున్నారు. ఫస్ట్ హేండ్ లో కూచున్నాయన పెద్ద కేకతో ‘డీల్’ అని అరిచి ముక్కలు కిందపెట్టేశాడు. తలెత్తి నన్ను చూసి ”రారా! అల్లుడూ ఫస్ట్ హేండ్ డీల్ కొట్టేను, మన కార్ తగువు తేలిపోయింది, ఒరే అందరం ఒకసారి ఎంకన్నబాబుని చూసొద్దాం” అన్నాడు. ”ఒరే ముందు డీల్ కరక్ట్ గా ఉందో లేదో చూడరా” అన్నాడొకడు. ”ఛ ముక్కే ఎక్కటం లేదు, ఫస్ట్ హేండ్ డీల్ పడుతోంటే ఎం చేస్తా”మని, అందరూ ముక్కలు చూసుకుని ”బతికి చావలేద”నుకుంటూ ఫుల్ కౌంట్ లిచ్చేశారు. డీల్ కొట్టినతను ”ఒరే అల్లుడూ శలవెట్టరా తిరపతెల్లి వచ్చేద్దా”మన్నాడు. ”మావా అస్తమానం శలవులంటే కుదరదురా! నాలుగురోజులైతే సద్దుకుంటా” అన్నా! “సరేలే అలాగే చెయ్యి, ఎప్పుడు బయలుదేరటం,  చెప్పు తొందరగా” అన్నాడు. మిగతావారు కూడా డీల్ కి ఫుల్ కౌంట్ లిచ్చుకున్నా, “తొందరగా చెప్పరా అల్లుడూ” అన్నారు. “ఒరే చెప్పడం మరిచిపోయా, ఈ సారి కర్చులన్నీ నావే” అన్నాడు, బోనస్ ప్రకటిస్తున్నట్టు. ఫోన్ తీసుకుని ఆఫీస్ కి మాటాడి రేపు ఉదయమే బయలుదేరదామని ప్రకటించేను, సరే అంటే సరే అనుకున్నాం. మర్నాడు ఉదయం బయలుదేరాం, మొలకి నడుం పటకా కట్టేశాను, ఇరవై వేల సొమ్ము నా చేతికిచ్చి ”కర్చుపెట్టరా అల్లుడూ! దేనికీ లోటు చెయ్యకు, కర్చు నా మీద పడిపోతందని ఎనకతియ్యకు” అని భరోసా ఇచ్చేశాడు. ఫుల్ టేంక్ చేయించుకు బయలుదేరాం, తిరుపతి చేరాం.

పైకెళ్ళడానికి ఘాట్ దగ్గరకెళ్ళేం. పైకి వెళ్ళడం కుదరదని ఆపేశాడు, అదిగో అక్కడ మొదలైంది మా కత. ”ఏం ఎందుకు వదలరూ?” మా ప్రశ్న. ”టాక్సీలు పైకి పంపం” ఇది టోల్ గేట్ వారి మాట. నిజానికి టాక్సీలు వదలరని మాకు తెలీదు. ఇది టాక్సీ కాదు మా సొంతకార్ అని చెప్పినా వినలేదు, ”పైన తెల్లరంగుంటే అది టేక్సీ కదా” అన్నారు వాళ్ళు. ఏం చేయాలీ అనుకుని పై అధికారుల్తో మాటాడి చెప్పండి అని సి, బుక్ వగైరా చూపించాం. ”ఇది తగువులో గెల్చుకున్న బండి, స్వంత కార్ గా టేక్స్ కట్టేం” అని చూపించినా వినలేదు, ”పైవాళ్ళు తిడతారండీ” అని నాన్చేశాడు టోల్ గేట్ అధికారి. మాకు పంతం పెరిగింది. అదేదో పైవాళ్ళతోనే తేల్చుకుందామని వెనక్కి తిరిగి ఊళ్ళో కొచ్చాం, భీమాస్ కేఫ్ అనుకుంటా, అక్కడికెళ్ళి విషయం చెబితే యజమాని ‘ఈ ఫోన్ నెంబరికి మాటాడండి’, అని సలహా ఇచ్చేడు. అక్కడి నుంచే మాటాడి వివరం చెబితే ఆ అధికారి, చెప్పినదంతా విని ’కుదరదని’ మారు మాట చెప్పక ఫోన్ పెట్టేశాడు, పంతం మరికొంత పెరిగింది. ఆ పై అధికారికి ఫోన్ చేసి వివరంగా చెప్పేను, ”తూ.గో.జి నుంచి దేవుని దర్శనానికొచ్చాం. కార్ తగువులో గెల్చుకున్నాం, ఇప్పటిదాకా అది టేక్సీలా తిరిగిన మాట వాస్తవం. యాజమాన్య కార్ కింద టేక్స్ కట్టేం, మాకు టేక్సీలను పైకి వదలరని తెలియదు, గెల్చుకున్న సందర్భంగా వెంకన్నబాబు దర్శనం ఆ కార్ మీదొచ్చి చేసుకోవాలనొచ్చాం” అని వివరంగా చెబితే ఆయన, ”మీరు టోల్ గేట్ దగ్గరకెళ్ళి వాళ్ళతో చెప్పండి, నాతో మాటాడమని” అన్నారు. అలాగే అని టోల్ గేట్ చేరి జరిగింది చెబుతే ”మేం మాటాడితే తిడతారండి, వారేం చెప్పలేదు మాకు” అన్నారు. అరే ఇదేం తంటసం అనుకుంటూ, మళ్ళీ వెనక్కి వెళ్ళి అధికారితో మాటాడేను. కొంచం విసుగ్గానే చెప్పేను. ”మమ్మల్ని వదలలేదు, మీతో మాటాడమని చెప్పేరన్నా వారు వినలేదు. మేము తూ.గో.జి నుంచి వచ్చాం. ఇక్కడినుంచే మీ/మా మినిస్టర్ తో మాటాడగలం. మీకు అధికారికంగానే చెప్పించగలం, కాని మాకా దారి వద్దనుకున్నాం, గెల్చుకున్న సంబరంలో దర్శనానికొచ్చాం, మీరు పైకి వదులుతామంటే సరి, లేదంటే ఇక్కడినుంచే అమ్మని చూసేసి, ఆవిడకి ఈ మాట చెప్పేసి వెనక్కి వెళిపోతాం. అయ్యవారిని మళ్ళీ వారు కబురెట్టేదాకా చూడమన్నా చూడం…మీరేం చేయదలచుకున్నదీ వివరంగా చెప్పేయండి, మీరు వదిలితే కార్ తో పైకొస్తాం లేదంటే చెప్పేనుగా! చివరిగా ఒక్కమాటండి, మేము వ్యాపారస్థులం తెల్లవారితే మా నోటి వెంట అబద్ధాలే వస్తాయి. మేము ఇక్కడికొచ్చింది దేవుని దర్శనానికి, దానికోసం అబద్ధం చెప్పే సాహసం చెయ్యం. వెనక్కి పోతాం, మా వాళ్ళందరికి జరిగింది చెబుతాం, మాకు జరిగిన సన్మానం గురించి మా/ మీ మినిస్టర్ కీ చెబుతాం” అన్నా. ఆ అధికారి ”అరెరె! ఎందుకండీ అంత తొందరపడతారు, మీరు టోల్ గేట్ దగ్గరకెళ్ళండి, వాళ్ళు బయటనిలబడి,మిమ్మల్ని ఆహ్వానించి పైకి పంపుతారు సరేనా” అన్నాడు. ”మళ్ళీ అంటున్నానని అనుకోకండి, మీవాళ్ళు టైమ్ అయిపోయిందని తిప్పి పంపితే మాత్రం ఇక మీదగ్గరకి రాం, ఇక్కడనుంచి అక్కడకి, అక్కడనుంచి ఇక్కడకి తిప్పకండి, ఏమాటా నికరంగా చెప్పండి.ముందే చెబుతున్నా” అని బయలుదేరి టోల్ గేట్ చేరాం. ఆయన చెప్పినట్టు సిబ్బంది సమయం అయిపోయినా గేట్ తీసుంచి మమ్మల్ని ఆహ్వానించి రుసుము తీసుకుని పైకొదిలేరు. దర్శనం చేసుకుని తిరిగొచ్చాం. ఎంకన్నబాబుతో అబద్ధా లూ? పరాచకాలూనా?ఈ మాట బాగా పనిచేసినట్టుంది.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎంకన్నబాబుతో అబద్ధాలూ పరాచకాలూనా??

 1. < " ఎంకన్నబాబుతో అబద్ధాలూ పరాచికాలూనా? ఈ మాట బాగా పనిచేసినట్టుంది. "
  —————–
  హ హ్హ హ్హ. అయినా ఆకాలంలో కాబట్టి (1960 వ దశకం) మీ బాధ టోల్‌గేట్ పై అధికారికి చెప్పుకోవడానికి వీలయింది, ఆయన పట్టించుకున్నాడు, మీరన్న మాటకి జంకాడు కూడా. ఈ రోజుల్లో అటువంటి భీతీ లేదు, ఫిర్యాదులకి దిక్కూ దివాణమూ ఉండదు. టోల్‌గేట్లు ఏ ప్రైవేట్ సంస్ధకో అప్పగించున్నట్లయితే (అవుట్‌సోర్సింగ్) – ఇప్పుడు అదేగా ఫాషన్ – ఇహ చెప్పక్కర్లేదు, పైఅధికారి ఎవరో వారి పేరేమిటో, ఫోన్ నెంబరేమిటో తెలుసుకోలేం కూడా, చెప్పరు. ఏమన్నాంటే ఏ పనికిమాలిన హెల్ప్ లైన్ నెంబరుకో, కస్టమర్ కేర్ (హ్హ హ్హ హ) నెంబరుకో ఫోన్ చేసుకోండంటారు. కంప్లయింట్లకి ఆ నెంబర్ల నుండి వచ్చేవి చాలా వరకు అర్ధరహిత / ఉపయోగపడని సమాధానాలే. కస్టమర్లని తప్పించుకు తిరగడమే ఆ సంస్ధల్లోని పైవారి లక్ష్యమా అనిపిస్తుంది. నిర్లక్ష్యపూరిత కార్పొరేట్ పద్ధతులు, వ్యాపార సంస్కృతి తీసుకొచ్చి పెట్టారుగా దేశంలో.
  మీ ఈ టపా సశేషమా?

  • విన్నకోట నరసింహారావుగారు,

   ఔట్ సొర్సింగ్ ఇవ్వడం అప్పటికి అలవాటు కాలేదండి. నేటి కాలానికి అంతా మాయ… 🙂

   ప్రయాణం- ఆకలి టపా సశేషం త్వరలో రాబోతోంది, 🙂 ఇది పూర్తయినట్టే…ప్రయాణం కొసలో మరికొన్ని కొనసాగచ్చు , జ్ఞాపాకాల తేనెతుట్టను వనజగారు కదిపారు 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s