శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రయాణం-ప్రమాదం.

ప్రయాణం-ప్రమాదం.

మొన్నటి టపాలో ప్రయాణంలో ఇంటికొస్తూ అర్ధరాత్రికి నంద్యాల చేరడం అక్కడో చిన్న కాఫీహోటల్ యజమాని చూపిన ఆదరం గురించి చెప్పేను కదూ! https://kastephale.wordpress.com/2016/08/21/శర్మ-కాలక్షేపంకబుర్లు-ప-25/ ‎ఆ తరవాత….

వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. కార్ డ్రైవర్ గా ఒక మిత్రుడు సిద్ధమయాడు, సాధారణంగా ఎవరు డ్రయివర్ గా రావాలో నేనే చెప్పేవాడిని, ఇతను చెప్పకుండా వచ్చేశాడు, నువ్వు ఈ సమయంలో డ్రైవర్ గా వద్దని చెప్పలేను. ఇదొక దుశ్శకునం అనిపించింది,ఎందుకంటే రాబోయేది నల్లమల ఘాట్ రోడ్డు, ఇతనా అహంభావి, తెలియదు,చెబితే వినడు. కాని వెనకనుంచి ఒక శుభశకునమూ వినపడింది, హొటల్ యజమాని నుంచి, ’జాగ్రత్తగా వెళ్ళిరండి బాబూ’ అన్న మాట. ఆ మిత్రుడు డ్రయివర్ గా రావడం ఎందుకు అశుభం అనిపించిందంటే నేను చెప్పక అతను ఆ సీట్ కి రావడం, అదీగాక ఇతనొక అహంభావి, ఎవరు చెప్పినా వినడు, దానికి తోడు దుర్గుణం అతనికి తోచదు, దుడుకు స్వభావం, ఇవీ అశుభ లక్షణాలు. మొత్తానికి ఫలితం శుభాశుభ మిశ్రమంగా ఉండచ్చనే అంచనాకి వచ్చేను.

బయలుదేరాం, కొంత దూరమొచ్చేసరికి చినుకులు ప్రారంభమయ్యాయి, మరికొంత దూరం కదిలేసరికి ఒక జడి కొట్టింది. ఘాట్ దగ్గరకి చేరాం, మా రామస్వామి మామ ’వర్షం రాకుండా మనం ఘాట్ దాటిపోతే అదృష్ట వంతులం’ అన్నాడు. ఆయనెప్పుడూ అలా అనేవాడు కాదు, జరిగేదాన్ని ఆపలేమని ఊరుకున్నా! ఆగుదామంటే వినేలా లేదు పరిస్థితి. బండి ఘాట్ ఎక్కడం మొదలయింది, చినుకులు ప్రారంభమయ్యాయి. ఘాట్ లో ఇబ్బందేమంటే హెడ్ లైట్లు పైకి పోతాయి, డిం లైట్ వెలుగు చాలదు. రోడ్ కనపడదు, వర్షం పెరిగింది, ఆగుదామన్నారెవరో, మా రామస్వామి మావ, ’ఎక్కుడులో ఉన్నాం, ఏమైనా సరే ముందుకు సాగాల్సిందేగాని మధ్యలో ఆగకూడదు ఘాట్ లో’ అన్నాడు. చినుకులుకి అసలేడిమ్ లైట్లు దానికి తోడు, చినుకులు లైట్ల ఎత్తుకు చిందుతున్నాయి,రోడ్ మీద పడినవి. రోడ్ కనపట్టం లేదు, మరో దరిద్రం తోడయింది, వైపర్లు ఏడుస్తూ పని చేస్తున్నాయి. కొంత సేపటికి డ్రయివర్ వైపు తప్పించి రెండవ వైపర్, నా వైపుది పని చేయడం మానేసింది. అలాగే బండి నడుస్తోంది. నాకు రోడ్ కనపట్టం లేదు, ముందుకూచున్నా, ఎడమవైపు చెట్లు లోయ, ఎంతలోతో తెలీదు, చిమ్మ చీకటి, ఏమీ కనపట్టం లేదు. కుడి వైపు కొండ. గంట బండి నడిచినా పైకి చేరలేదు, ఎదరా,వాలూ ఎవరూ రాలేదు, వర్షం శబ్దం తప్ప మరో శబ్దం లేదు, వాతావరణం గంభీరంగా, భయంకరంగా ఉంది. మరికొంత సేపటికి పైకి చేరాం, ఇప్పుడు రోడ్ కొద్దిగా కనపడుతోంది, ముందుకు సాగుతున్నాం, సాఫీ ప్రదేశం పూర్తయింది, అమ్మయ్య బతికేం అనుకున్నా! కాని అసలు కత ముందుందని తెలియక.

దిగడం ప్రారంభించాం, ఘాట్. కొంత దూరం వచ్చేటప్పటికి ఇంజను ఆగిపోయిందో ఏమో తెలీదు, బండి నడుస్తోంది. కొంత మంది డ్రయివర్లకి వాలులో దిగేటపుడు ఇంజను కట్టేసే దుర్గుణం, అదో సరదా! అది చాలా ప్రమాదమట, మా మావ చెప్పేడు, అది గుర్తొచ్చి ’ఇంజనాగిందా’ అన్నా! ’కాదు దిగుడుకదా కట్టేశా’నన్నాడు, సంకటం లో పడ్డా! ’ఇంజను ఆన్ చెయ్యి’ అని నేను చెబితే వినడని నాకు తెలుసు, ఏం చెయ్యాలి? అనుకుంటుండగా, నా సంభాషణ విన్న రామస్వామి మావ ’ఇంజను కట్టేయకు’ అని చెప్పేడు. అమ్మయ్య బతికాను నేను చెప్పాల్సి రానక్కరలేకుండా అనుకున్నా! ఆ అహంభావి తప్పక ఇంజను ఆన్ చేశాడు, చినుకులు పడుతూనే ఉన్నాయి, రోడ్ మామూలుగానే కనపట్టం లేదు, ఎడమ వైపర్ పని చెయ్యక, నేను రోడ్ చూడాలంటే చాలా కష్టపడుతూ గమనిస్తున్నా! అప్పుడప్పుడు గుడ్డతో అద్దం ముందు తుడుస్తూ వచ్చాను, నెమ్మదిగా వాలు దిగుతున్నాం, వాలయిపోవచ్చిందేమో అనిపిస్తున్న సమయం, బండి నడుస్తూ ఉంది, నెమ్మదిగా.

ఇలా జరుగుతుండగా ఎదురుగా కొంత దూరంలో బండరాళ్ళు రోడ్ కి అడ్డంగా పెట్టబడి ఉన్నాయి. నా గుండె ఝల్లు మంది, డ్రైవర్ ని కంగారు పెడితే తప్పక ప్రమాదం చేస్తాడు, డ్రైవర్ బండరాళ్ళు గమనించినట్టు లేదు, ఇరకాటం, చెప్పక ఊరుకుంటే తిన్నగాపోయి గోతిలో పడిపోతే…. ధర్మ సంకటం తో నెమ్మదిగా ’రోడ్ చూడు’ అన్నా! చూస్తూనే ఉన్నా అన్నాడు ముందుకు బండి నడుస్తోంది, ’డైవర్షన్ ఉన్నట్టుంది ఎదురుగా రోడ్ కి అడ్డంగా రాళ్ళు చూశావా’ అన్నా! అప్పుడు రాళ్ళు చూశాడు కంగారు పడిపోయాడు, బ్రేక్ తొక్కేడు,మళ్ళీ తొక్కేడు, ఎన్ని సార్లు తొక్కినా బ్రేక్ పడటం లేదు. దూరప్రయాణాలలో బ్రేక్ లు పడటం కష్టం, అది తెలిసే వెళ్ళేటప్పుడే బ్రేక్ బేండ్ లు కాల్పించి వేయించా కూడా గుంటూరులో.

బండి కంట్రోల్ కాలేదు, ప్రమాదం జరుగుతోందని తెలిసిపోయింది, ఎలా జరుగుతుంది, ఏం జరిగుతుంది, అదీ ఆతృత, ఏమైనా జరగచ్చు. తిన్నగా వెళ్ళి గోతిలో పడతామా?, మరేం మాటాడినా ప్రమాదం పెరుగుతుందని ఊరుకున్నా!, ప్రమాదం జరుగుతోంది,తెలిసిపోయింది, కానున్నది కాకమానదనే నిర్ణయానికొచ్చేశా. డ్రైవర్ కి ఎడమవైపు ఏమున్నదీ కనపడే సావకాశమే లేదు, ఇక కుడి వైపుకు చూస్తే చేలో గట్టున ఒక మామిడి మొక్క పదేళ్ళ పైబడ్డ వయసుది కనపడింది. దానికి గురిచూసి బండి కుడికి తిప్పేసేడు, తనకి వీలున్నంతా! అయిపోయిందనుకున్నా! బండి కిందకి దిగిపోయింది, స్పీడుగా, ఇక మామిడి మొక్కకి గుద్దుకోడం అదీ నేనున్నవైపు ఖాయం, తెలిసిపోయింది, అప్పడంలా నలిగిపోవడం ఖాయమని తెలిసిపోయింది,జీవితం అయిపోయిందనే అనుకున్నా!చేయగలది లేనపుడు చేయవలసినది భగవన్నామ స్మరణ, అదే చేశాను, కళ్ళు మూసుకుని.. ఇంతజరుగుతున్నా వెనకాల వాళ్ళు నిద్రలో ఉన్నారు, లేపలేదు. బండి కొంత దూరం అలా దిగి దేనికో గుద్దుకుని, బ్రేక్ వేసినట్టుగా ఎడమవైపు గాలిలో తేలి ఆగిపోయింది.

అప్పుడు కళ్ళు తెరచి చూచా, నేను బాగానే ఉన్నా! మామిడి చెట్టుకి కొద్ది దూరంలో బండి ఆగి ఉంది. భగవంతుడున్నాడా? ఉన్నాడు, ఎలా? ఆ పొలం రైతు రూపంలో. తలుపు తీసుకు దిగా రెండు కాళ్ళూ మోకాళ్ళ దాకా బురదలో కూరుకుపోయాయి. ఏం జరిగిందని చూశా. ఆ పొలం రైతు,పెద్ద బండరాళ్ళు ఆ మొక్కకి నాలుగడుగుల దూరంలో చుట్టూ పేర్చాడు, కారు రోడ్ వాలులోకి దిగిపోయి, బండరాయిని ఎడమవైపు బంపర్ గుద్దుకుని ముందు చక్రం రాయి ఎక్కి,చక్రం గాలిలో తేలుతూ బండి బాడీ రాతి మీద ఆనుకుని ఆగింది, ఇంజనూ ఆగింది. చింతాకంత అదృష్టం కొండంత ఆపదనుంచి రక్షిస్తుందనిపించింది, అందరూ భద్రంగా ఉన్నందుకూ, నేను భద్రంగా ఉన్నందుకు భగవంతుడికో నమస్కారం పెట్టేను, మళ్ళీ. ’ఏమయిందిరా’ అంటూ లేచారంతా.

చిన్న ప్రమాదమంటూ చెప్పేను, కాళ్ళు మోకాళ్ళ దాకా బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయని చెప్పి చెబితే వెనకవాళ్ళు దిగేరు. డ్రైవర్ సీట్ లో అతను లైట్లేసి చూసి, ఇంజను ఆన్ చేస్తే పని చేసింది. హెడ్ లైట్ల వెలుగులో చూస్తే ఎడమవైపు బంపర్ లోపలికి పోయింది. చక్రం తిరుగుతుందో లేదో అనుమానమొచ్చి స్టీరింగ్ తిప్పమన్నా! తిప్పితే అంగుళం ఖాళీతో చక్రం తిరుగుతోంది, కుడి ఎడమలకి.
నలుగురూ బలమయినవాళ్ళు, ఇటువంటివి లారీలతో చూసి ఉన్నవాళ్ళూ. బండి పైకి రోడ్ మీదకి తోసేద్దాం అనుకుని తోసేరు, బండి రోడ్ మీదకి ఎక్కింది. బండిని పరిశీలించారు, బంపర్ వేలాడుతోంది తప్పించి మరేం బాధ లేదు,ముందుకి పోవచ్చనిపించింది, అందరికి. బంపర్ ని విరగ్గొడితే మంచిదనుకున్నాం, కాని సుత్తి లాటిది లేకపోయింది, అందరం మట్టి కొట్టుకుపోయి ఉన్నాం, చినుకులు పడుతూనే ఉన్నాయి. ఈలోగా వెనకనుంచి ఒక లారీ వచ్చింది, వాళ్ళని ఆపితే ఆగకుండా పోయాడు, ’మనమంతా మట్టితో ఉన్నాం కదా! ఇక్కడ ప్రమాదమేదో జరిగిందనుకుని, ఏమైనదీ తెలియక, మనకెందుకొచ్చిన తంటా అని లారీ ఆపకుండా పోయాడు, ఇది మామూలే’ అన్నాడు మా మావ. నేను లుంగీ విప్పేసి డ్రాయర్తో ఉండి, లుంగీతో మట్టి తుడుచుకున్నా, మిగతావాళ్ళూ అదే లుంగీతో మట్టి తుడుచుకున్నారు. ఒకరెవరో ఒక బండరాయి తెచ్చి వేలాడుతున్న బంపర్ విరక్కొట్టేశాడు. ఇక అడ్డం సమస్యలేదు.

ఈ సారి మా మావ డ్రైవర్ గా వచ్చాడు, అప్పుడనిపించింది, జరగవలసిందెవరున్నా జరిగేదే అని. అదీగాక నాకు కనపడిన దుశ్శకునం ,శుభ శకునంలలో ఆ అవ్యాజమైన ప్రేమ కురించి మా క్షేమాన్ని కోరి, క్షేమంగా వెళ్ళి రమ్మని ఆశీర్వదించిన ఆ హోటల్ యజమాని కళ్ళలో మెదిలాడు, అతని ఆశీర్వచనం వలనే బతికాను, అది నిజం.

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రయాణం-ప్రమాదం.

  1. కళ్ళకి కట్టినట్టు రాసారు తాత గారూ… మీరు ఇన్ని బ్లాగ్ లు రాయాలి మాలాంటి వాళ్ళం చదవాలి అని వుంది. మీరు అందరూ క్షేమం గా వచ్చారు.

    • చి.స్వాతి,

      ఇలా రాసిపెట్టి ఉంటే మరోలా ఎలాజరుగుతుందమ్మా! 🙂 అదీగాక, వెనక ఆ హోటల్ యజమాని సహృదయంతో ఇచ్చిన ఆశీర్వచనం, వజ్రాయుధం లా అడ్డు పడితేనూ!
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s