శర్మ కాలక్షేపంకబుర్లు-అందెవేసిన చెయ్యి.

అందెవేసిన చెయ్యి.

అబ్బో! ఆయన హస్తవాసి మంచిదండి, వైద్యంలో ఆయనది ”అందెవేసిన చెయ్యి” అంటుంటారు. ఈ అందె వేసిన చెయ్యి ప్రయోగం ఏంటీ? అందెవేసిన చెయ్యి అంటే నిపుణుడు అని అర్ధం చెప్పుకోవచ్చు.

అందె అనేది నాలుగు పలకలతో కాలి ఆకారంలో వెండితో తయారు చేసిన ఆభరణం. కడియం వెండితో బోలుగా గుండ్రంగా తయారు చేసిన వస్తువు, దీనిని కాలికి అలంకారంగా వేసుకోవడం రివాజుగా ఉండేది. అందెలే కాకుండా కడియాలని కూడా పూర్వం పల్లెలలో ధరించేవారు. పేద ప్రజలు బంగారపు ఆభరణాలు ధరించకపోయినా ఈ వెండి ఆభరణాలు ధరించేవారు, స్త్రీలు. ఈ ఆభరణాలు బోలుగా ఉండేవి, వాటిలో లక్క కూరేవారు. ఇవి పెద్ద ఖరీదూ ఉండేవికావు, ఆరోగ్యం కూడా చేకూరుస్తాయంటారు. అందెలు, కడియాలన్నవి కాళ్ళకి వేసుకునే ఆభరణాలు.

ఇక చేతులకి వేసుకునే ఆభరణాలు, గాజులు, మురుగులు,తోడాలు. నేటికాలం వారు వీటి పేర్లు కూడా విని ఉండకపోవచ్చు. నిన్న మొన్నటిదాకా స్త్రీలు గాజులు ధరించేవారు. వీటన్నిటిని బంగారంతోనే చేస్తారు.

ఇక ప్రస్థుతానికొస్తే ,  అందె వేసిన చెయ్యి ప్రయోగమేమీ అని అనుమానం రావడం సహజం. అందె అనేది కాలికి వేసుకునే నగ కదా! పూర్వకాలంలో ఒక పనిలో నిపుణత కలిగినవానిని ఆ దేశపు రాజు సన్మానించేవారు. ఈ సన్మానాలకి కొన్ని చిహ్నాలూ ఉండేవి. అవి గండపెండేరము, సింహతలాటము, మరీ బాగా సన్మానించాలంటే సింహతలాటాల జోడు. చెప్పాలంటే నేటి కాలపు శ్రీ లు, భూషణాలూ, రత్నలూ ననమాట.వీటిని బంగారంతో తయారు చేయించేవారు. గండపెండేరం కాలికి తొడిగేవారు, సింహతలాటం చేతికి వేసేవారు. గండపెండేరాలు నేనూ చూడలేదుగాని సింహతలాటాలు చూశాను. మహరాజు చేత సత్కారాలు పొంది ఇలా గండపెండేరమూ, సింహతలాటమూ వేయించుకున్న నిపుణులను ఇంతంత మాటలతో పలకలేక సామాన్యులు కాలి అందెను చేతికి తొడిగేసి అందెవేసిన చెయ్యి అనేశారు.

వయసుతో నిపుణత పెరుగుతుందిగాని, నిపుణతకి వయసు లెక్కలేదు. ఒక చిన్న సంఘటన స్వానుభవం. సంవత్సరం కితం, పళ్ళు అన్ని తీయించుకుని హనుమంతుని మూతిలా ఉన్న సందర్భం లో మా డాక్టర్ మురళిగారి దగ్గర కెళ్ళా. అంతకు ముందూ వెళ్ళా, కాని మధ్యలో అశ్రద్ధ చేసి మరో చోటికి పోవడంతో నా మూతి ఆంజనేయుడి మూతయింది. అప్పుడు నన్ను చూసి మందులేవో రాసిచ్చి కొంతకాలం తరవాత రమ్మన్నారు, ఆయన చెప్పిన ప్రకారం చేస్తూ వస్తే సరిగా సంవత్సరం కితం నాకు పళ్ళిచ్చారు, కొన్ని జాగ్రతలూ చెప్పారు. అది మొదలు జంతికలు,పాలకాయలు, చేగోడీలు, వడియాలు, బటానీలు తినేస్తూ వచ్చా! నిజం మళ్ళీ చిన్నతనమొచ్చేసినట్టే అనిపించిది, తిండిలోనే లెండి 🙂 అన్నీ బాగుంటే డాక్టర్ దగ్గరకెవరెళతారు? మరి నేనూ అంతే! సంవత్సరం తిరిగిపోయిందిలా,మొన్న చిన్న ఇబ్బందొచ్చింది, డాక్టర్ గుర్తొచ్చారు, ఇల్లాలు పళ్ళు ఫిల్లింగ్ చేయించుకోవాలంది, మరేం, ఇద్దరం బయలు దేరాం,చేయీ చేయీ పట్టుకుని, మెట్లెక్కి, పైకి చేరుకున్నాం,ఇల్లాలికి వడ్డాణం ఉంది కదూ . డాక్టర్ చూసి ఎలావున్నారన్నారు? నిజం చెప్పేశా. నవ్వేసి, ”సంవత్సరం హాయిగా గడిచిందన్నారు, ఇప్పుడు మీరు పడుతున్న ఇబ్బంది చాలా చిన్న ఇబ్బందని” పళ్ళు కొద్దిగా సరిచేసిచ్చారు. బాగుంది, ఇబ్బంది తొలగిపోయింది.

సాధారణంగా పళ్ళు కట్టించుకున్నవారు ఇబ్బందులు పడుతుంటారు, వదులయ్యాయని, నొప్పులు పెడుతున్నాయని, రకరకాలుగా మరి సరిగా కొలతల ప్రకారం పళ్ళు అమర్చడం అంత తేలికా? అపర సృష్టి కదా! అలా ఏ ఇబ్బందీ లేకుండాచేసి నాకు సంవత్సరం ఆ స్మరంతే అవసరం లేకుండా, చిన్న వయసు వాడైనా నిపుణతతో పళ్ళు అమర్చిన మా డాక్టర్ గారు అందెవేసిన చెయ్యి కదూ!

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అందెవేసిన చెయ్యి.

  1. మంచి బ్లాగుపోస్టులు వ్రాయడంలో కష్టేఫలే శర్మ గారు అందె వేసిన చెయ్యి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s