శర్మ కాలక్షేపంకబుర్లు-ఫోటో

ఫోటో

పోస్టాఫీస్ వారు పెన్షన్ ఇవ్వడానికిగాను బతికున్నట్టు డిజిటల్ ధృవపత్రం కోసం కొన్ని కాగితాలు తెమ్మన్నారు,స్వయంగానే రావాలన్నారు. తెమ్మన్న కాయితాలలో జాయింట్ ఫోటో ఉందా లేదా? అనుమానమొచ్చింది, తెమ్మని చెప్పిన కాగితాలన్నీ లిస్ట్ రాసుకున్నా. ఎందుకేనా అవసరమే అని ఫోటో కోసం చూస్తే ఒక్కటీ సరిగా ఉన్నట్టు తోచలేదు, చాలానే ఉన్నాయిగాని. ఫోటో తీయించేసుకుందామనిసరదా పుట్టేసింది, ఇల్లాలితో కలిసి. ఇల్లాలికి చెప్పేను, సై అంది, అలా ఫోటో తీయించుకోడానికి ప్రాతిపదిక ఏర్పడింది.స్టుడియోకెళ్ళి ఫోటో తీయించుకుంటే, బయలుదేరిపోయి ఫోటో తీయించుకున్నాం, అక్కడ మొదలైంది, అదో కత….ఇప్పుడు అదెందుకుగాని, ఒకప్పుడు ఫోటో సంగతులు గుర్తొచ్చాయి…..

మా చిన్నపుడు పల్లెలలో ఫోటో తీయిస్తున్నారంటే ఎవరో వెళిపోయినట్టే లెక్క. ఫోటో తీయాలంటే అదో పెద్ద కార్యక్రమం, అసలు ఫోటో బతికున్నవారు తీయించుకోకూడదనీ, తీయించుకుంటే ఆయుక్షీణమనీ తలచే రోజులవి. కలిగినవారు చిత్రపటాలేయించుకునేవారుట. ఫోటోగ్రాఫర్ అంటే శవాలకి ఫోటో తీసేవాడనేదే ఆ నాటి మాట. కలిగినవారు మాత్రమే ఇలా పోయినవాళ్ళ ఫోటో లు తీయించుకునేవారు. ఈ ఫోటోగ్రాఫర్ ఎక్కడో పట్నంలో ఉండేవాడు, ఆ రోజుల్లో పల్లెటూరు రావాలంటే ప్రయాణసాధనం, లాంచీ,గుఱ్ఱపు బండి వగైరా మాత్రమే దిక్కు, బస్సులు లేవు, అసలు రోడ్లే లేవు, అన్నీ పుంతలే. ఒకరు పట్నం వెళ్ళి ఫోటోగ్రాఫర్ కి ఫలానా ఊరు రమ్మని చెప్పిరావడం తో కత ప్రారంభమయ్యేది. ఆ ఫోటోగ్రాఫరు ఒక పెట్టి, దానితోపాటొక ముడవడానికి వీలు లేని స్టాండూ పట్టుకు వచ్చేవాడు, తరవాత కాలంలో ముడిచే స్టాండు లొచ్చాయి. మొదటికాలంలో వీటిని మోసుకురావడానికో మనిషి ఉండేవాడతని కూడా! వచ్చిన తరవాత ఎండపోతోంది తయారవాలి, లైటింగ్ పోతే ఫోటో కుదరదు, ఇదీ గొడవ, శవాలకా ఇబ్బంది లేదనుకోండీ 🙂 సాధారణంగా ఫోటో అంటే సాయంత్రం వేళ తీయించుకునేదనే అభిప్రాయం బలపడిపోయింది, ఆ రోజుల్లో. పెట్టిలోంచి ఒక డబ్బా లాటిదాన్ని తీసిదానిని స్టాండు కు బిగించి నల్లగుడ్డొకటి కప్పి ఉంచేవాడు. ఒక పెద్ద ప్లేట్ లాటిది పెట్టి, కెమేరా ముందుకొచ్చి, నల్లగుడ్డ వెనక్కి వేసి చేత్తో ఒక మీట నొక్కి అయిందనిపించేవాడు, ఇదొక వింతగా చూసేవాళ్ళం 🙂

తరవాతి కాలంలో గ్రూప్ ఫోటోలు, పెళ్ళిపోటోలు మొదలయ్యాయి, అవీ కలిగినవారికే ఈ ముచ్చటా, వ్యవహారమంతా కలిగినవారి సంబరాలే. దీనితో పాటుగా కొద్దికాలం మైక్ సెట్టు వేయించుకోడం, పాటలు పెట్టించుకోడమొక సంబరం, చావైనా, పెళ్ళైనా సరే. కరంట్ లేని నాటి రోజుల్లో బేటరీ మీద ఈ మైక్ సెట్ పనిచెయ్యడమొక వింత,గ్రాంఫోన్ మీద రికార్డు లేస్తే, స్పీకర్లో పెద్ద శబ్దంతో వినపడ్డం. అది వేయించుకోడమో గొప్ప. ఆ తరవాత కాలంలో ఫోటో తీయించుకోడం ఓ గొప్పయి పోయింది. నేనైతే స్కూల్ లో కూడా గ్రూప్ ఫోటో కూడా తీయించుకోలేదు, ఆ రోజుల్లో గ్రూప్ ఫోటోకి కూడా ఐదు రూపాయల ఖర్చయ్యేది ఒక్కొకరికి. ఫోటో కాపీ కి నాలుగు రూపాయలు, ఒక రూపాయి గ్రూ ఫోటో కి, నలభై మందున్న క్లాసులో. గ్రూప్ ఫోటో లో సందడి. గ్రూ ఫోటో, అదీ ఆడాళ్ళతో ఐతే అబ్బో ఇంక చెప్పేదేలేదు, అలంకరణలకే సమయం సరిపోయేది. ఫోటోగ్రాఫరేమో ఎండపోతోందో అని గోల, ముస్తాబులు తెమిలేవికాదు. మీరు కింద నిలబడండి, మీరీపక్కరండి, ఇలా సద్దుబాటుకే సమయం సరిపోయేది, ”అరే! ఇప్పటిదాకా ఇక్కడే వున్నాడు మన సుబ్బయ్య ఎటుపోయేడో! ”అమ్మాయ్ సత్యవేణి అలంకారం చాలు రామ్మా!” ”అమ్మా! రావే ఫోటో తీయించుకుందాం, నువు మధ్యన కూచో” అంటే ఆ ముసలమ్మ ”ఇవాళో రేపో పోయేదాన్ని నాకు ఫోటో ఎందుకురా? నువ్వూ నీపెళ్ళాం తీయించుకోండి,” అంటే ”కాదమ్మా మనమంతా తీయించుకోవాలనీ” ఇలా అలకలు తీర్చడానికే సరిపోయేది సమయం. ఇలా జనాల్ని పోగుచేసుకునేటప్పటికే కాలం పట్టేది. ఇక పిల్లలైతే కుర్చీల్లో కూచున్నవాళ్ళ కాళ్ళ దగ్గర కూచోడం, మొత్తాని కి ”ఇస్మైల్”(అదే స్మైల్ కొచ్చిన తిప్పలు, చాలా కాలం నాకీ ఇస్మైల్ ఏంటో అర్ధం కాలేదు, ఎవరైనైనా అడగడానికి నామోషీగా ఉండేది.) అనేటప్పటికి చాయంగల విన్నపాలయ్యేవి,

తరవాత కాలంలో ఫ్లాష్ కెమేరాలొచ్చాయి, ఏ సమయంలోనైనా ఫోటో తీసేవారు, సాధారణంగా పెళ్ళిళ్ళకి ఫోటోలు తీయించడం అలవాటు చేసుకున్నారు. అసలు పెళ్ళి తంతు కంటే ఫోటోల హడావిడి పెరిగింది, నేటి వీడియోలు దాని పొడిగింపు మాత్రమే. ఇక తీసిన ప్రతి పోటోలోనూ ఏదో ఒక మూల కనపడాలనే కుతి కొంతమందికుండిపోయేది.

కాలం గడచింది, మరో అవాంతరం వచ్చింది, ఫోటో తీయించుకోవలసినది, అదే పెళ్ళి. ఎందుకో నాకూ ఇల్లాలికి కూడా ఫోటో తీయించుకోవాలనే సరదా తక్కువే, మొదటినుంచీ. అందరూ అంటున్నారు కదా ఫోటోలు తీయించుకుందాం, పెళ్ళికి అనుకుని అడిగాం, పెళ్ళిలో కొన్ని సమయాలలో ఫోటో లు తీయడానికి రెండు కాపీలివ్వడానికి ఆరోజుల్లో నా నెల జీతం అంటే వంద రూపాయలడిగిన గుర్తు.ఒరే పెళ్ళి ఫోటో లు తీయించుకుని మాకో కాపీ ఇవ్వడం మరచిపోకండి, కావలసినవారందరి ఫర్మానా? ఎవరికివ్వకపోతే వారితోనే ఇబ్బంది, ఇంత గోలెందుకు మానేస్తే పోలా 🙂 ఇదీ నిర్ణయం. మరెందుకని మానేశాం, ఇదెప్పటిమాటా అర్ధ శతాబ్దం దాటింది కదూ!

అప్పుడే డబ్బా రీల్ కెమెరాలొస్తున్నాయి. ఒక మిత్రుడు డబ్బా కెమెరా తెచ్చాడు, అందులో ఫిల్మ్ లో రెండు ఖాళీ ఉన్నాయని ఫోటోలు తీశాడు, పెళ్ళికి,కొన్నాళ్ళకితందాకా ఆఫోటో లుండేవి, ఈ కొత్త ఫోటోల వరదలో అవెటో కొట్టుకుపోయాయి.

ఆ తరవాత కాలంలో ఎలక్ట్రానిక్ కెమెరాలొచ్చాయి, ఫిల్మ్ ఎక్కించడం, కడగడం,బాగా రాలేదనుకోడం పోయింది. అప్పటికప్పుడు ఫోటో ఎలా వచ్చిందీ చూసుకునే సావకాశం, ఆపై నేటి కాలానికి చేతిలో సెల్ఫోన్ లో కెమెరా ఫోన్, వీడియో కూడా ఇక చెప్పేదేంటీ! అప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలే జరిగిపోతున్నాయి, ఫేస్ బుక్కులో. ఇప్పటికి సెల్ఫీ లొచ్చాయి, నిన్నటి దాకా మనఫోటో మరొకరు తీసేవారు, ఇప్పుడు మనఫోటో మనమే తీసుకునే రోజులొచ్చాయి బాబూ!

చాలామందికి ఈ ఫోటోల పిచ్చి ఎక్కువే 🙂 ”అబ్బే నా ఫోటోయే లేదూ” అన్నమ్మాయి ఫేస్ బుక్కులో ఎన్ని ఫోటోలో, వివిధ భంగిమలలో, ఇదో చిత్రం. రకరకాల ఫోటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసుకోడం ఆ తరవాత ”నా ఫోటో ఎవరో మార్ఫింగ్ చేశారో” అని గోల చెయ్యడం మామూలైపోయింది. ఇలాగైనా పది మంది నోళ్ళలో దృష్టిలో పడాలని కోరిక. ”ఎవడికి కావాలి మన ఫోటో చెప్పండి, మనమేం ఐశ్వర్యారాయా? జగదేక సుందరా? శతకోటి జంగాల్లో మా బోడి లింగాన్ని చూశావా? అన్నట్టు, ఎవరెలాపోతే ఎవరికి కావాలి చెప్పండి?”అనుకునే రోజులుగావు. ఆడపిల్లలు ఫేసు బుక్కులో ఫోటో లు పెట్టుకునేటపుడు జాగ్రతలు తీసుకోవలసిందే!

ఇలా నిమిషాల్లో తయారయిపోతున్న ఫోటో కి మా ఊళ్ళో స్టుడియో అతను 24 గంటల తరవాత రమ్మన్నాడు, నా అదృష్టం లెండి,ఓనర్ లేడుట. సరిలే అనుకున్నా. సరిగా 24 గంటల తరవాతెళితే ఇంకా టైమ్ పడుతుందన్నాడు, నాకు చిర్రెత్తుకొచ్చింది, నువ్వు ‘అన్ ఫిట్’ నిమిషాల్లో ఫోటో ఇస్తున్న నేటి రోజుల్లో 24 గంటల తరవాత మళ్ళీ రమ్మంటున్నావంటే అని ఆశీర్వదించి, నేనే ఫోటోషాప్ చేయగలను, స్టుడియోలో నువ్వు బాగా తీస్తావని వచ్చేం అని దీవించి, మరి కాసేపు పోయాక తెచ్చుకున్నానండి ఇదిగో అదే ఇది….

001

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఫోటో

 1. “ఫోటోగ్రాఫర్ అంటే శవాలకి ఫోటో తీసేవాడనేదే ఆ నాటి మాట.”
  ఈ మాట మా ఊళ్ళో కూడా అనేవారు. పెద్ద వంశీ గారి లేడీస్ టైలర్ సినిమాలో కూడా ఫోటొ తీసేవాడు నాకు శవాలకి తీయడమే వచ్చంటాడు.
  ఫోటో అనగానే ఎన్నో పాత సంగతులు గుర్తు వస్తాయి. అవన్నీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  • మాధవ్ జీ
   అభావే విరక్తి కదా! ఫోటో తీయించుకునేంత ఆర్ధికస్థితి ఉండేది కాదనుకుంటా. అందుకోసం చనిపోయిన వారిని తిరిగి చూడలేం కదా అని ఫోటో తీయించడం మొదలు పెట్టి ఉంటారు. అది అలవాటయి పోయింది. అందుకే ఫోటో గ్రాఫర్ వచ్చాడంటే పల్లెలో ఎవరో బాల్చీ తన్నేసినట్టే అనుకోడం అలవాటయిపోయింది.
   అలా అనుకున్నవాళ్ళే చిత్రంగా చాలా మారిపోయారు.
   ధన్యవాదాలు.

  • అనంత్ జీ,
   నేనూ కొంతమందికి అభిమానినే! నాకూ వారిని చూడాలనిపించడం సహజంకదా! అందుకే ఫోటో బ్లాగులో పెట్టేను.బ్లాగ్ లో కి రాగానే కనపడి మీకు స్వాగతం చెప్పినట్టయిందా? ఆనందం
   ధన్యవాదాలు

 2. ఒకప్పుడు నేనడిగిన సంగతి గుర్తు పెట్టుకున్నందుకు సంతోషం శర్మ గారు 🙂. మీ దంపతుల ఫొటో బాగుంది. ఈ రోజుల్లో 24 గంటల పైన టైము తీసుకున్నా కూడా ఫొటో బాగా తీశాడు.
  చిన్నప్పడు స్కూల్లో క్లాసుఫొటో తీయించుకోవడం ప్రహసనం బాగా గుర్తు చేసారు. అలాగే మీరన్నట్లు పెద్దవాళ్ళు కొంతమంది ఫొటో తీయించుకోవడం అంటే భయపడేవారు (కానీ తమ పెళ్ళి ఫొటో మాత్రం తీయించుకునేవారు అదేవిటో మరి 🤔). మా బంధువొకాయన వయసులో ఉన్నప్పుడు సరదాగా తన దగ్గర కెమెరా కూడా మెయింటెయిన్ చేసాడు గానీ వృద్ధుడయిపోయిన తర్వాత తన ఫొటో తియ్యనిచ్చేవాడు కాదు; మొహం పక్కకి తిప్పేసుకునేవాడు, మొహానికి చేతులడ్డం పెట్టుకునేవాడు; ఫొటో వద్దురా అనేవాడు.
  అవునండి BSNL వారి పెన్షన్లు బ్యాంకుల ద్వారా ఇవ్వరా, పోస్టాఫీసులోనే తీసుకోవాలా? ఎవరయినా లైఫ్ సర్టిఫికేట్ మామూలుగా నవంబర్‌లోనే గదా ఇచ్చేది, మరి పోస్టాఫీస్ వారు నవంబర్ కంటే ముందే తీసుకుంటారా? 🤔

  • విన్నకోట నరసింహారావుగారు,
   సాధారణంగా ఏదీ మరచిపోను, అదో దురలవాటు 🙂
   ఫోటో బాగానే తీశాడు, నా బాధంతా ఆలస్యం గురించే!
   ఫోటో తీయించుకోడం కొంచం ఖరీదైన వ్యవహారం గనక నాటి రోజుల్లో, ఆయుక్షీణం వగైరా అనేవారేమో అనిపిస్తుంది. నిజానికి ఎక్కువ మంది ఫోటో తీయించుకోకపోడానికి కారణం ఆర్ధిక ఇబ్బందనే నానమ్మకం.
   కొందరు కెమెరాని ఒక అలంకారంగా స్టేటస్ సింబల్ గా ఉంచుకునేవారు.
   మాకూ బేంక్ లు పెన్షన్ ఇస్తాయి. మొదటిలో పోస్టాఫీస్ కి పెట్టుకున్నా, కొంత కాలంలో ఒక మిత్రుడు బేంక్ నుంచి తీసుకునేవాడో సమస్య తెచ్చాడు నాదగ్గరకి. పెద్ద మొత్తం అక్కౌంట్ నుంచి తీసుకుంది బేంక్, ఎందుకలా చేసిందో చెప్పదు. ఆ కేస్ దగ్గరగా మూడేళ్ళు పోరాడేను, చివరికి కన్సూమర్ ఫోరం కి పోతానని నోటీస్ ఇస్తే కదిలేరు. దానితో భయమేసి పోస్టాఫీస్ లో ఉండిపోయా.
   మేమూ నవంబర్లోనే ఇస్తాం. మొదటిసారి డిజిటల్ సర్టిఫికట్ కోసం నమోదు ఇప్పుడు చేసారు. ఈ సంవ్త్సరం మరి ఇవ్వక్కరలేదన్నారు, మళ్ళీ ఏడే 🙂
   ధన్యవాదాలు.

  • చంద్రిక గారు,
   పేదవాణ్ణి,ఆశీర్వచనం తప్పించి మరేమీ పెట్టలేనివాణ్ణి.
   దీర్ఘాయుష్మాన్భవ
   దీర్ఘసుమంగళీ భవ

   ధన్యవాదాలు.

  • చిరంజీవి స్వాతి,
   అభిమానులు చూడాలనుకోవడం గురించి నాకు చాలా అనుభవమే ఉంది. మనవరాలు కోరిక తీర్చడం కంటే ఆనందం మరొకటి లేదు కదా!
   మిత్రులు శ్రీ విన్నకోట నరసింహారావుగారు,’మీరొక్క ఫోటోలోనూ కనపడరు’ అన్నారు. దానికిగాను 🙂

   ధన్యవాదాలు.

 3. మీ ఫోటో టపా హాస్య భరితం గా ఉంది ! మీ దంపతుల ఫోటో , చక్కగా ఉంది !
  మీరు, మీ ఫోటోలో లానే , ఆనందం గా మీ ‘ టపా యజ్ఞాన్ని ‘ కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నా !
  అభినందనలు !
  Dr . సుధాకర్

  • సుధాకర్ జీ!
   ఆత్మీయులు అందంగా కనపడతారనుకుంటా! ఇది మనసు చేసే చిత్రం కదూ 🙂

   బ్లాగుకు ఐదేళ్ళు వయసు పూర్తికావస్తోంది, కొద్ది రోజులలో.టపాలు సహస్రానికి చేరువలో ఉన్నాయి. నాకా ఓపిక నిండు కుంటున్నట్టే ఉంది! ఒక్క సారిగా వదిలేయ లేక నెమ్మదిగా తప్పుకునే ప్రయత్నంలో ఈ ఫోటో పెట్టడం ఒక భాగం.
   ప్రణాళిక ప్రకారం ఆచరిస్తున్నాను.
   1.ప్రైవేట్ బ్లాగ్ చేశాను.
   2.పాత టపాలు ప్రచురించడానికి కొత్త బ్లాగ్ మొదలు పెట్టేను, పాత టపాలు ధారావాహికగా ప్రచురిస్తున్నాను.ఆ బ్లాగును ఆగ్రిగేటర్లలో కలిపేను.
   3. మరీ రాయాలనుకుంటే ఈ బ్లాగ్ ఎలాగా ఉంది.
   4.మరో బ్లాగులో ఫోటోలు పెట్టేందుకు నిర్ణయించి,ఆగ్రిగేటర్లలో కలిపాను.

   మీ అభిమానానికి ఎప్పటికి కృతజ్ఞుడను.

   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s