శర్మ కాలక్షేపంకబుర్లు-ముల్లుతీసి కొఱ్ఱడచుకున్న చందం…

ముల్లుతీసి కొఱ్ఱడచుకున్న చందం…

ముల్లు చిన్నపాటిది, గుచ్చుకుంటే బాధపెడుతుంది, కొఱ్ఱు అంటే పెద్దది పెద్ద గాయం చేస్తుంది, ముల్లు తీసినచోట కొఱ్ఱు కొట్టుకోడం అంటే చిన్న కష్టం వదలుకుని పెద్ద కష్టాన్ని ఆహ్వానించడమే! చిన్న దయ్యాన్ని వదిలించుకుని పెద్ద భూతాన్ని ఆహ్వానించడం. మరో మాట చెప్పుకోవాలంటే పెనం మీంచి పొయ్యిలోకి దూకడం. ప్రభుత్వం వారు చేసే పనులిలాగే ఉంటూ ఉంటాయంటారు. దీనికో చిన్న కత చెప్పుకుందాం.

పింఛన్ తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరానికోసారి నవంబర్ నెలలో ”ఈయన బతికే ఉన్నాడు” అని ఇద్దరు గజిటెడ్ ఉద్యోగుల చేత ధృవీకరింప జేసుకుని పత్రం అందజేయాల్సి వచ్చేది. దీనినే జీవిత ధృవ పత్రం అంటారు. బతికున్నాం బాబోయ్ అని ఎదురుగా కనపడితే, కాదు కాగితం మీద కనపడాలని ధృవ పత్రం ఇవ్వమన్నారు. పల్లెలలో ఉండేవారికి ఇద్దరు గజిటెడ్ ఉద్యోగులు దొరకడం తేలికా? దొరికినా నువ్వు నువ్వే అని ఎవరికి తెలుసు, దాఖలా ఏంటీ? సంతకం పెట్టి, నువ్వు బతికున్నావని, నేను మెడకి ఉరి తగిలించుకోనా? అమ్మో వీళ్ళొస్తున్నారంటేనే గజిటెడ్ ఉద్యోగులు పారిపోయేవారు.

ఆ తరవాత మేం బతికున్నామని మొత్తుకుంటుంటే మరోడు చెప్పడమేటయ్యా అని గోల చేస్తే ఎప్పటిదో బ్రిటిష్ కాలం నాటి రూలు మేం మారుస్తున్నామని మీ మటుకు మీరు బతికున్నట్టు ధృవీకరణ పత్రం ఇవ్వండి,చాలు మరొకరు ధృవీకరించక్కరలేదన్నారు. ఇదేదో బాగానే ఉందనుకున్నాం, కొంతకాలం నడిచింది, బాగానే ఉంది కూడా.

ఇదివరలో పెన్షన్ అంటే పోస్టాఫీసే. ఆ తరవాత బేంక్ లు కూడా పింఛన్ ఇస్తాయన్నారు, బాగానే ఉందనుకున్నాం. ఎక్కడేనా జీవిత పత్రం ఒకలాగే ఉండాలి, అదేమో ప్రభుత్వాలు నిర్ణయించాయి కూడా. మరి వివిధ బేంకులు ఈ పత్రాలను సంవత్సరం కి ఒక సారి మార్పు చేయడమేంటో అర్ధం కాని చిదంబర రహస్యం. పింఛనుదారులు ముష్టివాళ్ళలాగా పత్రం ఇవ్వడానికి లైన్ లో నిలబడి, బేంక్ ఉద్యోగుల ఛీత్కారాలతో, అవస్థలు పడటమేంటో విచిత్రమే.పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే బిచ్చం అనుకుంటున్నారు, సొమ్ములిచ్చేవారు. నిజానికి చాలామంది పెన్షన్ తీసుకునేవారికీ తెలియదు, ఈ రోజు ఇలా పెన్షన్ తీసుకోడానికి పని చేసిన రోజుల్లొ మనకు తెలియకుండానే మన దగ్గర వసూలు చేసిన సొమ్ములనుంచి ఈ పెన్షన్ ఇస్తున్నారుగాని, ఇది దయా ధర్మ బిచ్చం కాదని.

మేమైతే పోస్టాఫీస్ లో పింఛన్ తీసుకోడానికి పత్రం నింపి ఇచ్చేసేవారం, ఇంటి దగ్గర కూచుని. ఇప్పుడు మాకూ తిప్పలొచ్చాయి. ఆధార్ కార్డ్, పింఛన్ పాస్ బుక్కు, పింఛను అర్డర్ పట్టుకురండి, మీ సెల్ ఫోన్ కూడా తెండి. మీరే తప్పక హాజరుకావాలి వివరాలు పంపి ఉపయోగం లేదని పోస్టాఫీస్ వారు కబురు పంపేరు. దేన్నయినా వాయిదా వెయ్యచ్చు గాని దీన్ని వాయిదా వేయడానికి లేదుగా! ఫోటో పట్టుకెళ్ళాలో వద్దో తెలియలేదు, పట్టుకెళదామని ఫోటో తీయించుకున్నాం, అదో ప్రహసనం. మా వూళ్ళో సబ్ పోస్టాఫీసే ఉంది. ఇది హెడ్ ఆఫీస్ వారి హుకుం, ఆ ఆఫీసేమో పదేను కిలో మీటర్ల దూరంలో రామచంద్రాపురంలో ఉంది. వెళ్ళాలి, వెళ్ళకతప్పదు. నాకు 75 వచ్చేయంటే కుదరదు. ఎందుకంటే నా వేలిముద్ర నేనేగాని మరొకరు వేయలేరుగదా!

ఎలా ఆలోచిస్తుంటే, ఒక మిత్రుడు నేను నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొస్తాగా అని హామీ ఇచ్చి బండి మీద తీసుకుపోయాడు. అక్కడ ఆఫీస్ వారు వేలి ముద్ర వేయించుకుని డిజిటల్ లైఫ్ సర్టిఫికట్ కి నమోదు చేశారు.

అమ్మయ్యా అయిపోయిందనుకున్నా! కాని కత అక్కడే మొదలయిందని తెలియదు. మరి మళ్ళీ సంవత్సరం ఇవ్వాలంటే ఎలా అని అనుమానమొచ్చి ఇంటికొచ్చాకా వెబ్ చూశా. మళ్ళీ సంవత్సరం ఇవ్వాలంటే ఆధార్ తో కలిసిన కేంద్రాలలో ఐ.డి నెంబర్ పట్టుకెళితే వేలిముద్ర వేసి వస్తే చాలు, బానే ఉంది. మనకి దగ్గరున్న సెంటరెక్కడా అని చూశా ఊళ్ళో ఒక్కటీలేదు, బేంక్ లకి, పోస్టాఫీస్ కి లేదు, ప్రైవేట్ వారికిచ్చారు, అందులో ఒక్కటీ లేదు. జిల్లాలో పల్లెలలలో చాలా చోట్ల ఇచ్చారు, ప్రైవేట్ వారికి. నాకు దగ్గరలో ఉన్న సెంటర్ అంటే పదికిలో మీటర్లు మాట, అదీ ప్రైవేట్ ది. వాడి దగ్గరకెళితే డబ్బులుచ్చుకోనిదే పని చెయ్యడుకదా! అంటే ఏమయింది, ఇంట్లో కూచుని సంతకం పెట్టి ఇస్తే సరిపోయేది కాస్తా పదేను కిలో మీటర్లు ప్రయాణం తప్పని పనేర్పడింది.

 మా దగ్గర పెన్షన్ తీసుకునేవారు తక్కువనుకుంటా, అనుకోడమేంటీ? నిజమే, మా సబ్ పోస్టాఫీస్ లో ఇద్దరం మాత్రమే పెన్షన్ తీసుకుంటాం. అందుకే సెంటర్ ఇచ్చి ఉండరు, మళ్ళీ సంవత్సరంలోగా మాకూ సెంటర్ ఇస్తే సరి లేకపోతే నా పని ముల్లుతీసి కొఱ్ఱు కొట్టుకున్నట్టు అయిపోయినట్టే 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s