సీతాన్వేషణ-మేనేజిమెంట్ -1
కిష్కింధకి వచ్చిన లక్ష్మణునితో ప్రసవణ గిరి గుహ దగ్గర పల్లకీ దిగిన సుగ్రీవుడు రామునికి నమస్కారం చేసి, అక్కడ చేరుకున్న వానరసేనను చూపుతూ, ”రామా! ఈ వానరసేనంతా నీ అధీనం, ఆజ్ఞాపించు” అన్నాడు. దానికి రాముడు ”సుగ్రీవా! సీతను వెతకడం నావల్ల లక్ష్మణునివల్లా మాత్రమే అయే పనికాదు, సమయోచితమైనది చేయ్యమ”న్నాడు. సుగ్రీవుడు రామునితో ‘మీ ఆజ్ఞతో’ అని చెప్పి, ముఖ్యులైన వానర వీరులను దగ్గరకు పిలిచాడు. నలుగుర్ని ఎన్నికచేసి వారికి పరివారాన్నీ నిర్ణయంచేసి, వివరంగా ఎవరేపక్క వెతకాలో ఎంతదాకా వెళ్ళాలో, మధ్యలో ఏమేమి ప్రదేశాలున్నాయో, వాటిలో ఎక్కడెక్కడ వెతకాలో, తీసుకోవలసిన జాగ్రతలేమో వివరంగా చెప్పి, నెలరోజుల గడువులో ఈ పని పూర్తిచేసి సీతజాడను కనుక్కుని వచ్చి చెప్పాలన్నాడు. ఇలా నెలలో పని పూర్తి చేయనివారికి మరణ దండనే తప్పదనీ చెప్పాడు. దక్షణ దిక్కుగా వెళ్ళేందుకు అంగదుని నాయకుణ్ణి చేసి, హనుమ,జాంబవదాదులను తోడిచ్చాడు. అందరూ బయలుదేరుతుండగా హనుమను పిలిచి ”నీవు భూమిమీద,నీటిలో, ఆకాశంలో స్వేఛ్ఛగా చరించగలవు, ఈ కార్యం నీవలన కావలసినది సుమా” అని హెచ్చరించాడు. ఇది చూసిన రాముడు హనుమకు తన అంగుళీయాన్ని ఇస్తూ ”దీనిని సీతకు నా ఆనవాలుగా ఇమ్మని” చెప్పాడు, దానిని హనుమ తలపై ధరించి జాగ్రత చేశాడు. అందరూ ఎవరికి నిర్దేశించిన వైపుకువారు కదిలారు.
ఇది చాలా పెద్ద ఘట్టం అందుకు చిన్నచిన్న ముక్కలుగా చెబుతున్నా! ఇందులో పెద్ద విశేషమేముందీ? తరచి చూదాం ఏముందో!
సుగ్రీవుడు ఎంపిక చేసిన ముఖ్యులకు ఆదేశాలిస్తూ చాలా వివరంగా చెప్పాడు, ఎక్కడిదాకా వెతకాలో చెప్పాడు,కాలమూ చెప్పాడు, సాధన సంపత్తీ ఏర్పాటు చేశాడు, ఎదుర్కోవలసిన కష్టాలగురించీ చెప్పాడు. అంటే ఒక ఆజ్ఞ ఇచ్చేటపుడు నిర్దుష్టం, నిర్దిష్టంగా ఉండాలి, అనుమానానికి తావే ఉండకూడదు, ఒకరొకలాగా, మరొకరింకోలాగా ఆలోచన చేసే సావకాశమే ఉండరాదు, దానికితోడు ఆజ్ఞను ఎంతకాలంలో పూర్తిచేయాలో చెప్పాడు, దానితో పాటు అమలుచేయకపోతే శిక్ష కూడా చెప్పేడు. సంపూర్ణమైన, పరిపూర్ణమైన ఆజ్ఞ అంటే సుగ్రీవాజ్ఞలాగా ఉండాలి. అందుకే నేటికీ సుగ్రీవాజ్ఞ అనే అంటారు, అనుమానంరాని,లేని ఆజ్ఞను.
లంకలోనే సీత ఉన్నదనుకున్నపుడు మిగిలిన దిక్కులలో వెతకడం అనవసరంకదా అనిపించచ్చు. ఏమో ఎత్తుకుపోయిన రావణుడాతరవాత స్థావరం మార్చాడేమో! దక్షణం వైపు చూసొచ్చి సీతలేకపోతే అప్పుడు మరో దిక్కున వెతకడం కాలహరణకదా! రావణుడు సీతను లంకవైపుకు తీసుకెళ్ళేడన్న సూచనలు బలంగా ఉన్నాయిగనక అటు పంపేవారిని ఎన్నిక చేయడంలో సుగ్రీవుని యాజమాన్య నిపుణత కనపడుతుంది. పని చేయించడం కష్టం, చేయడం కంటే. పని చేయగలవారిని గుర్తించి ప్రోత్సహించి పని చేయించుకోవడమే గొప్ప యాజమాన్యం.
అంగదుని దక్షణ దిక్కుకునాయకునిగా చేయడం లో చతురత ప్రదర్శించాడు. అంగదుడు యువరాజు, కుర్రవాడు, అనుభవం లేనివాడు. ఇప్పటికీ పినతండ్రి అంటే భయమున్నవాడు. అతనిని అనుభవజ్ఞులతో కలిపి నాయకుణ్ణి చేసి, ముఖ్యమైన పనులలో అంగదుని వెనకబెట్టడం లేదన్న భావన అంగదునికి తద్వారా తారకు తెలియజేశాడు. అంగదుని నాయకునిగా చేయడం మూలంగా ఆదిక్కున సీతను కనుగొని వచ్చే గొప్పదనాన్ని అంగదునికి కట్టబెట్టి, తార మెప్పుపొందాలన్నదే సుగ్రీవుని ఉద్దేశం..
ఒక్క అంగదునివలనే కార్యం పూర్తికాదు. ఇందులో ముఖ్యుడు, నమ్మకస్థుడు తన మంత్రి, ఇప్పటివరకు తన మేలుకోరి చేసిన ప్రతి పనిలోనూ విజయం చేకూర్చినవాడయిన హనుమను పిలిచి ప్రత్యేకంగా చెప్పేడు, దానితో హనుమలో ఏమూలైనా కించిత్తయిన చిన్నతనమూ ఉండి ఉంటే అదీ పోయింది, ఇదీ చతురత.
ఇక హనుమ ఈ కార్యం పూర్తి చేయగలవాడన్న భావం రామునికి కలిగించాడు, సుగ్రీవుడు, దానితోనూ హనుమతో ఇదివరలో ఉన్న అనుభంతోనూ రాముడు అంగుళీయాన్నిచ్చాడు, గుర్తుగా. హనుమ దానినెక్కడ భద్రపరచాడు, ఇదీముఖ్యమే కదా! వేలుకు పెట్టుకోకూడదు, అది ప్రభువు మిత్రుడైన ప్రభువు రాజముద్రిక, మొలలో పెట్టుకోకూడదు అది అగౌరవం, ఏం చేయాలి? తలమీది వెంట్రుకలను మూడు పాయలుగా తీసి ఒక పాయలో ఉంగరం దోపి, జడేసి, జడను ముడేసి కట్టేశాడు. ఇప్పుడు ప్రభు ముద్రిక శిరోరత్నంలా భాసించింది, హనుమ గౌరవం పెరిగింది, రాముని గౌరవంతో,ఇలా చేయడంతో సుగ్రీవుని యాజమాన్య నైపుణ్యం రామునికి తెలిసింది
ఇదంతా యాజమాన్యంలో నేర్చుకోవలసిన పాఠాలేగా!
చాలా బాగా చెప్పారు తాత గారూ. ఇంకా ఇంకా చదవాలనుంది…
చిరంజీవి స్వాతి,
చదివి అభిప్రాయం చెబుతూంటే ఇలా చెప్పడానికేం, ఓపికున్నంతా చెబుతా. ఇంకా ఇదే సంఘటన మీద నిన్న ఒక టపా వేశాను, మరో రెండు టపాలూ వేయాలి, ఒకటి రాశాను, రేపు ప్రచురిస్తాను, మరొకటి రాయవలసి ఉంది
ధన్యవాదాలు.
చాల బాగా విశ్లేషించారు, ఇందుకే రామాయణ, భారతాలను బళ్ళో నుంచి కాలేజీ దాకా నేర్పించాలి.
ప్రసాద్ జీ,
నచ్చినందుకు ధన్యవాదాలు.
స్కూళ్ళు కాలేజీల్లోనా? భలేవారే!! మన సిక్కులర్ ప్రభుత్వాలంత మంచి పని చెయ్యవు. ఒకప్పుడు రామాయణాదుల నుండి పాఠాలుండేవి తెలుసా? ప్రజలూ పట్టించుకోటం లేదు మరి ప్రభుత్వాలకేం కావాలి?
పడమటి దేశాలవారు రేపో నేడో చెబుతారు రామాయణాదులని పాఠాలుగా పెట్టాలి అని అప్పుడు మన ప్రభుత్వాలు రామాయణాదులు మావే అని చంకలెగరేస్తాయి, ఆ కాలం దూరంలో లేదు.
ధన్యవాదాలు
చేదు నిజాన్ని చెప్పారు. తెల్లవాడు ఏది చెపితే అదే మనకు వేదం!
శివరామ ప్రసాద్ గారు,
రామాయణ,భారత,భాగవతాలు మత గ్రంధాలు కాదని, మానవతను చెప్పే గ్రంధాలని తెలుసుకునే రోజూ వస్తుందండి.దీనికి అడ్డు పడుతున్నవారూ మనవారే 🙂 అదీ చిత్రం.
ధన్యవాదాలు.
రామాయణ,భారత,భాగవతాలు మత గ్రంధాలు కాదని, మానవతను చెప్పే గ్రంధాలని తెలుసుకునే రోజూ వస్తుందండి.దీనికి అడ్డు పడుతున్నవారూ మనవారే 🙂 అదీ చిత్రం.
ధన్యవాదాలు.