శర్మ కాలక్షేపంకబుర్లు-కంకణం కట్టుకోవడం..

కంకణం కట్టుకోవడం..

సాదారణంగా తెనుగునాట ”పిల్లపెళ్ళికోసం కంకణం కట్టుకు తిరిగేడే మీ పెదనాన్న” అనిగాని, ఇల్లు కట్టుకోడానికి లోన్ కోసం తోరం కట్టుకు తిరిగాడమ్మా బేంక్ చుట్టూనూ” అనిగాని అంటుంటారు.ముఖ్యమంత్రిగారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ”కంకణం కట్టుకుని” ఢిల్లీ చుట్టూ తిరిగారని పత్రికలు రాస్తుంటాయి. మరి, ఈ కంకణం లేదా తోరంగట్టుకోడమేంటీ? అనుమానంకదా 🙂

పాతకాలంలో, ఏం ఇప్పుడుకాదా అనకండి, ఇప్పుడా నెట్లో పెళ్ళిచూపులు, రాత్రి ప్రయాణం, మధ్యాహ్నం పెళ్ళి,మిడసరి లగ్గంలో, రాత్రికి శోభనం, మర్నాడు ఉదయం ప్రయాణం, ఎక్కడికీ? కోర్ట్ కి 🙂 ఎందుకూ? విడాకులికి, మరి పెళ్ళి చేసుకోడానికి కంకణం కట్టుకునే సమయమేదండి బాబు. శుభకార్యానికి ముందుగా కంకణాలు కట్టించేవారు, అంకురార్పణ చేసి. అంటే వినాయకుణ్ణి,పెద్దలను ఆహ్వానించి వారి ముందు ప్రతిజ్ఞ చేసి దీక్ష తీసుకునేవారనమాట, ”ఈ పెళ్ళి త్రికరణ శుద్ధిగా చేసుకుంటాను, అప్పటివరకు, అనగా ఈ పెళ్ళి చేసుకోవడమనే వ్రత దీక్ష పూర్తి అయేవరకు చేతికి కట్టిన ఈ కంకణం విప్పను, మరొక పని చేయను” అని చెప్పి, కుడి చేతికి తోరం కట్టుకోడమే, కంకణం కట్టుకోవడం 🙂 ఇలా కట్టుకునే కంకణం ఒక పసుపుతాడుకి ముడేసిన మామిడాకు మాత్రమే, అదే కట్టుకునేవారు, దీనినే కంకణం లేదా తోరం అంటారు.

స్త్రీలు నోములు వ్రతాలు చేసుకునే ముందు ఈ కంకణం లేదా తోరం కట్టుకుని గాని ఆ వ్రతం, నోము మొదలు పెట్టరు. కంకణం కట్టుకోకపోతే ఏమవుతుందని కదా అనుమానం, మనిషి అనుమానాల పుట్ట 🙂 కంకణం కట్టుకోక పని మొదలెడితే ఏమవుతుందో దేవతలకే అనుభవం లోకొచ్చింది, అదేమంటారా?

అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకండోయ్ అన్నారు, ఇంకేముంది దేవతలు రాక్షసులు బయలుదేరి మంధరగిరిని పెకలించి తెద్దామని వెళ్ళేరు. అబ్బే అది కదిలితేనా! వెర్రిమొహాలేసుకుని శ్రీమహావిష్ణువు దగ్గరకెళ్ళేరు, మంధరగిరి కదలలేదని చెప్పడానికి, చెప్పేరు. నడవండి నేను పట్టుకొస్తానని మంధరగిరిని విష్ణుమూర్తి తెచ్చేరు, వాసుకుని తాడుగాను, మంధరగిరిని కవ్వంగానూ చేసుకుని చిలకడం మొదలెట్టేరు, పాలకడలిని. పర్వతం జారిపోతోంది, ఏం చెయ్యాలీ? మళ్ళీ ఏడుపు మొహాల్తో వెళ్ళి చెప్పేరు, పిచ్చివాళ్ళలారా! నేను చెప్పేనని పని మొదలెట్టేస్తారా? ప్రోటోకోల్ చూసుకోవద్దూ! మినిస్టర్ మనవాడైనంతలో ఆఫీస్ వాళ్ళని చూసుకోకపోతే పనడ్డిపోతుందోయ్! ప్యూన్ కూడా కాగితం కదపడు, అద్దెలుసుగదా! అంచేత, అలాగే గణాధి పతిని కొలిచి కంకణం కట్టుకోమని సలహా ఇచ్చారు. అమ్మయ్య దారి దొరికిందని గణపతిని పూజించి,విష్ణువు మంధరగిరి జారిపోకుండా తాబేలుగామారి మంధరగిరిని వీపుపై మోస్తే, వాసుకుని తాడుగా చేసి, పాలకడలిని మధిస్తే అమృతం పుట్టింది కదా! అంచేత తెలియొచ్చిందేమిటీ? ఏ పని చేయడానికైనా గజాననుని పూజించి కంకణం కట్టుకోవడం, అనగా దీక్ష తీసుకోవడం చెయ్యాలి. అదే కంకణం కట్టుకోవడం 🙂

నేటి కాలానికి అలాచేయకపోతే ఏమవుతుంది, చాప చిరిగితే చదరంతని సామెత. ప్రత్యేక హోదా కాక పోతే మిగిలేది?…. పేకేజి…అదే…ప్రత్యేక హోదా ఐనా పేకేజి ఐనా ఒకటేబాబూ! రావలసింది రూపాయలుగాని…
అబ్బెబ్బే అదేం కుదరదు, ప్రత్యేక హోదా ప్రత్యేకహోదానే….పేకేజి పేకేజీనే. మమ్మల్ని మోసం చేద్దామనుకుంటే కుదరదు. ప్రత్యేక హోదాలో ఐదక్షరాలున్నాయి, పేకేజిలో మూడే ఉన్నాయి, ఇక్కడే మోసం చేస్తున్నారు. కుదరదు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే! సరే ఐతే… కంకణాలు కట్టుకోండి…ప్రత్యేకహోదా సాధనకోసం… మీదే ఆలస్యమిక…లేవండి..

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s