శర్మ కాలక్షేపంకబుర్లు-వాముచారు.

photo0001

వాముచారు.

చారు తెనుగువారికి మాత్రమే పరిమితమైనది. అరవలు కాచుకునేది చారు కాదు, అది రసం, దాని తయారీయే వేరు. అన్నిటిలో మార్పొచ్చినట్టుగానే మన చారులో కూడా మార్పొచ్చి, రసానికి ఎగబడుతున్నాం. చారు అంటే ఈసడింపు ఎక్కువైపోయింది. చారు అమృతం కదూ! ఆ రోగ్యప్రదాయిని, నమ్మకం లేదా ఐతే చదవండి, ఇష్టమైతే ఇలా చారు పెట్టుకు తాగండి లేదూ రోజూ అంగుళం మాత్రలు మింగండి.గంజి నీళ్ళు తాగేవాళ్ళం, చారు మెతుకులూ తినేవాళ్ళం అంటుంటారు, వాళ్ళే అసలైన తెలివైనవాళ్ళు సుమా!

పాతరోజుల్లో చారు పెట్టుకోడానికి ’సత్తెప్పలా’లు, ’రాచ్చిప్పలు’ వాడేవారు. సత్తెప్పాలా అంటే ’సత్తు తప్పేలా’ అంటే జింక్ తో తయారు చేసిన పాత్ర, ఇక ’రాచ్చిప్ప’ అంటే రాతితో చేయబడినది. ఏంటీ? రాయిని వంట పాత్రగా వాడేవారా! ఛీ! మీరంతా పాతరాతి యుగం మనుషులని ఈసడించకండీ! నేటి కాలానికొస్తే స్టీల్ గిన్నిలో పెట్టుకుంటున్నారు, అసలు చారంటూ కాస్తే సుమా! ఈ చారెలా కాచుకోవాలి? ఇది కూడా చెప్పాలా అనకండి, వినండి.

గిన్నెలో నాలుగు చింతపండు కాడలు ఉట్టిలతో సహా పడేస్తారు, సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఒక బెల్లం ముక్క పడేసి నిండా నీళ్ళు పోస్తారు. ఈ గిన్నెను కుంపటి నిండా నిప్పులపై పెట్టడం తో చారు కాచుకోడం ప్రారంభమవుతుంది. ఇది వంట మొదలు పెడుతూనే చేస్తారు, చారు కాగాలంటే చాలా సమయం పడుతుంది, అందుకు వంట ప్రారంభం లో ఇలా చేస్తే వంట పూర్తయేటప్పటికి చారు కాగుతుందనమాట. చారు కాగుతూ ఉంటుంది,ఇదొక దశ.

ఇప్పుడు రెండో దశలో,దానిలో దొడ్లో ఉన్న కరివేపాకు రెబ్బలు దూసుకొచ్చి పడేస్తారు, ఆ తరవాత ఇంట్లో ఉన్న టమేటా ఒకదాన్ని చిదిమి పడేస్తారు. కొంత సమయంకి ఒక కొత్తిమీరి మొక్క పీక్కొచ్చి, మొదలు తుంచేసి శుభ్రంగా కడిగి చారులో పడేస్తారు, ఉంటే ఒక ములక్కాడ ముక్కలు చేసి పడేస్తారు. చారు కాగుతూ ఉంటుంది. ఇప్పుడు చారు పొడి అని ముందు తయారు చేసి ఉంచుకున్నదానినుంచి ( చారు పొడిలో కందిపప్పు,శనగపప్పు,ధనియాలు,మిరియాలు, కొద్ది లవంగం, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పొడిచేస్తారు, కొంతమంది ఎండు మిర్చి కూడా చేరుస్తారు, పొడి చేస్తారు)ఒక చంచా పొడి వేస్తారు, చారు కాగుతూ ఉంటుంది, ఇప్పుడు ఇందులో ఒక చిన్న చంచాడు వాము వేస్తారు, నిప్పులు సరి చూస్తారు, మిగిలిన వంట జరుగుతూ ఉంటుంది.

ఇక మూడో దశలో బాగా మరిగిన,తెళ్ళిన చారులో పోపు వేస్తారు. పోపుకి ఇనప గరిట వాడతారు, ఇనప గరిటలుండేవి, వీటిని రోజూ చింతపండేసి తోమేవారు. తెల్లగా తళతళా మెరిసిపోతూ ఉండేవి. ఈ ఇనపగరిటెను నిప్పుల మీద కాలేస్తారు, బాగా కాలిన ఇనపగరిటలో చిన్న చంచా నూని వేసి ఒక్క ఎండు మిరపకాయను తుంచి, ఆవాలూ,మెంతులూ, జీలకర్రా, చిన్న ఇంగువ ముక్కా తీసుకుని నూనిలో వేసి,ఆవాలు చిటపటలాడుతుంటే బయటికి తీసి అప్పుడు మిరపకాయ ముక్కలేస్తే పోపు బహు పసందుగా కమ్మని వాసనేస్తుంది. ఇప్పుడు ఈ పోపు గరిటను అలా పట్టుకెళ్ళి చారులో ముంచుతారు,పోపుతో సహా. చుయ్ మని శబ్దం రావడంతో చారు పెట్టే ప్రక్రియ పూర్తవుతుందిగాని ఇంకా ఇది మరగుతుంది,భోజనాల వేళదాకా. భోజానలకి ముందు దింపుకుని వేడి చారు అన్నంలో పోసుకుతింటే చెప్పేదా!

”వంటయిపోవచ్చింది, దేవాతర్చనకి మడిగట్టుకోవచ్చు, చిటికెలో చారు పోపెడుతున్నా లేవండి మరి” ఇది ఇల్లాలి మాట.ఇంతోటి చారుకి ఒకటపానా? దానికో పెద్ద వర్ణనా? ఈ బోడి చారుకి అమృతమని సర్టిఫికటా? అనకండి. మొదటినుంచి చారులో వేసిన సరుకులు చూదాం. వాటి గొప్పదనమేంటో మీరే చెబుదురుగానీ!

ఉప్పు,పులుపు,కారం రుచులు. పసుపు ఎంతో మేలుచేస్తుందట రిసెర్చ్ చేసి చెప్పేరట.అసలు చారు సత్తెప్పేలాలో కాచుకుంటే కావలసిన జింక్ చేరుతుందిట.కరివేపాకు లో ఇనుము ధాతువుంది. ఇక కొత్తిమీరి గుండెకి సంబంధించిన ఔషధమన్నారు.టమేటా కూడా గుండెకు సంబంధించినదేట. ఇక ములక్కాడ గురించి నేను చెప్పడమేంటీ, మీకే తెలుసు. చారుపొడిలో ఉన్న పప్పులు మాంసకృత్తులనిస్తాయట, ధనియాలు రక్తం పట్టడానికి ఉపయోగపడతాయట,మిరియాలూ ఔషధమే, దాల్చిన చెక్క ఒంటిని పట్టిన నీటిని మూత్రం ద్వారా బయటికి పంపే మందు. వాము గురించి రాయాలంటే ఒక టపా పడుతుంది, ముఖ్యంగా కీళ్ళ నెప్పులకి మంచిమందు, కడుపు ఉబ్బరానికి, ఆకలి లేకపోడానికి మందు. జీర్ణకోశంలో ఏ వ్యాధికైనా మంచి మందు, వాము. మేమైతే నెలకి పావుకేజి వాము వాడతాము. ఇక ఆవాలు,మెంతులు గురించి ఏం చెప్పనూ? ఇంగువ ముక్క అరుచి పోగొడుతుంది, ఆకలి పుట్టిస్తుంది. రోజూ ఈ చారు పెట్టుకుని తాగితే ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టేనా? రోజూ ఇంత సేపు చారు కాచుకోవాలా? మా వల్ల కాదుబాబూ అంటారా? మీ చిత్తం…..

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వాముచారు.

 1. కూర, పప్పు, పచ్చడి, చారు, పెరుగు/మజ్జిగ ఇదే వరుసలో తింటేనే తృప్తిగా ఉంటుంది. బాగా వివరిం’చారు ‘ శర్మగారు.

  • gkkగారు,
   భోజనం వరస మార్చారు,
   ముందు పప్పు దానికితోడు (నంజుడు)ధప్పళం (పులుసు) కాని పచ్చడికాని. ఆ తరవాత కూర, తరవాత పచ్చడి, ధప్పళంగాని చారుగాని,చివరగా మజ్జిగ (చల్ల) లేదా పెరుగు. ఇది సామాన్య భోజన క్రమం.

   విశేషభోజనక్రమం (విందు) ఐతే వేరు మళ్ళీ
   ధన్యవాదాలు.

 2. చారు రుచి ఎరుగని వాళ్ళు ఆంధ్రులే కాదు, చారు కాయడం రాకపొతే ఎన్ని రకాల వంటలొచ్చినా వంట రానట్టే.

  చారు గురించి గరికిపాటి వారి మాటల్లో

  • Arun జీ
   బలే అనేసేరు 🙂
   చారు పెట్టడమే కదా, అనుకుంటారు 🙂
   మంచి లింక్ ఇచ్చారు, ఇప్పుడే విన్నా,బాగుంది
   ధన్యవాదాలు.

 3. ఈ రోజే చారు పెడతాను తాత గారూ. రాచిప్ప అంటే రాగి చిప్ప అనుకునే దాన్ని. ఇన్నితెలియని విషయాలు చెపుతున్న మీకు ధన్యవాదాలు తాత గారూ.

  • చి.స్వాతి.
   ఈ రాతి చిప్ప ప్రత్యేకమైన రాతితో తయారు చేస్తారు, ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలీదు, నాకెక్కడా తారసపడలేదు. ఈ రాతి ద్వారా కొన్ని ఖనిజలవణాలు చేరతాయి శరీరంలో. చారు బలే రుచిగా ఉంటుంది.
   ఈ చారు కుంపటి తులసమ్మ దగ్గర పెడతాం. పంచభూతాలు ఇందులో ప్రతిఫలిస్తాయి, అందుకు రుచిగా ఉంటుంది, మందుగానూ పని చేస్తుంది. పంచభూతాలెలాగో చెబుతా!
   కుంపటి ఆరుబయట ఆకాశం కిందే ఉంటుంది, పైనుంచి సూర్య కిరణాలు,కిందనుంచి అగ్ని, వాయువు సరే కదా! నీరు గిన్నెలోనే ఉంటుంది. పృధివీ తత్త్వం గిన్నెలో వేసే అన్ని సరుకులలోనూ ఉంది, అదనమాట సంగతి 🙂

   ధన్యవాదాలు.

 4. చారు వారం లో 3,4 సార్లు వుంటుంది.మిగిలినవన్నీ యధాతధం కానీ,వాము, లవంగం, దాల్చిన చెక్కా మాత్రం కొత్త.
  పోపు మాత్రం తప్పనిసరిగా నేతితోనే. పోపు ఘుమఘుమలకే ఇంటిల్లపాదికీ ఆకలి పుట్టుకొచ్చేస్తుంది.ఈసారి మీరు చెప్పిన దినుసులుకూడా వాడి చారు పెడతాను.

  • శ్రీదేవి గారు,
   నేతిపోపు భేషుగ్గా ఉంటుంది.
   చారు రోజూ పెట్టుకోవాలి. మా ఇంట్లో చారుకి రేషనుంటుంది 🙂
   మిరియం,లవంగం,దాల్చిన చెక్క నిలవ చేసుకునే పొడి లో వేస్తాం. అవసరాన్ని బట్టి మిరియం పైగా కూడా వేసుకోవచ్చు,జ్వరం,రొంప వగైరాలున్న సమయాల్లో! వాము నిత్యమూ వేసుకోడమే మంచిది.
   ఇలా చారు రెండు పూటలా తాగుతుంటే సాధారణ ఇబ్బందులు చాలా తొలగిపోతాయి.

   ధన్యవాదాలు.

 5. సర్,
  చారు మీద మీ టపా అదరహో.. మేము మీరు చెప్పిన అన్ని దిన్సులు వాడతాం కానీ వాము వాడలేదు. ఈసారికి ట్రై చేస్తం. ధన్యవాదాలు.
  నమస్తే.
  అ.వ. రమణ.

  • రమణాజీ,
   ఒక లీటర్ గిన్నెచారుకి ఒక చిన్న చంచా వాము వేసుకుంటే చాలు. కడుపు ఉబ్బరం వగైరా ఇబ్బందులుంటే మరికొద్ది వేసుకోవచ్చు. కొద్దివామును నేతిలో వేయించుకుని ఉప్పు కలిపి ఒక్క ముద్దలో నేతితో తింటే అజీర్తి,కడుపు బిగబట్టడం వగైరా అన్నీ తగ్గుతాయి.
   మాత్రలు మింగి తగ్గకపోయినా మళ్ళీమళ్ళీ మాత్రలు మింగుతాం తప్పించి,వాము ఒక్క సారి తిని తగ్గలేదే, అని మానేస్తాం, అదీ మన అలవాటు.
   ధన్యవాదాలు.

 6. చారు రుచి చూసాకే జయదేవుడు ‘ప్రియే చారుశీలే..’ అన్నాడని ఒక థియరీ, చారులత, చారుప్రియ మొదలైన పేర్లకి ఆరిజిన్ తెలుగువారి చారుప్రియత్వంలోనే వుందని మరో థియరీ. 🙂
  చారు బావుందండి.

  • YVR’s అం’తరంగం’
   జయదేవుడు మనపక్కవాడేగా! మనచారు తాగే ఉంటాడు అందుకే చారుశీల, ప్రియే! చారుశీలే అనీ పరవసించిపోయాడు, మనమే మనచారొదిలేసి రసం వెనకపడుతున్నాం 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s