శర్మ కాలక్షేపంకబుర్లు-పెట్టని నాతల్లి

పెట్టని నాతల్లి

”పెట్టని నాతల్లి ఎప్పుడూ పెట్టదు, పెట్టేముండకేమొచ్చింది పెద్దరోగం” అనే సామెత గుర్తుచేస్తూ ’పెట్టని తల్లి’ అని బారలు చాచుకుంటూ,తిట్టుకుంటూ వెళ్ళిందొకావిడ, మొన్న నవమినాటి సాయంత్రం. ఏమయిందని ఇల్లాలిని అడిగే లోగా ఒకరు ఆకుకోసం వచ్చి ”ఎందుకండీ ఆవిడలా తిట్టుకుంటూ వెళ్ళిందీ?” అని అడిగారు. దానికి ఇల్లాలు ”ఆవిడ, రేపు భోజనాలెట్టుకుంటుందిట, ముఫై మందికి. ముఫై అగ్రం ఉన్న ఆకులు కావాలంది. మొత్తం అన్నీ పదాకులుండవు, ముక్క కోస్తే ఇరవై అవుతాయి. కాకపోయినా అన్ని ఆకులూ నీకే ఇచ్చేస్తే రేపు పండగా! అమ్మవారికి నైవేద్యానికి ఆకు, అని చాలామంది వస్తారు, కొన్ని ఆకులిస్తాను పట్టుకెళ్ళు” అంటే ”మళ్ళీ కొన్నిటికి బజారుకెళతానా? సాల్లేవమ్మా! ఆకు ముక్కివ్వడానికి మొకం జూసుకుంటన్నావని, బారలు చాచుకుంటూ వెళుతోంది, పెట్టని తల్లి” అంటూ అంది. దానికి వచ్చినవారు ”నాకో ఆకివ్వండి” అంటూ ”ఓపిగ్గా ఇస్తున్నారు కదూ! అందుకు లోకువైపోయింది. ఆవిడ బజారుకెళ్ళి ఆకులు కొంటే ముఫై ఆకులికి నూటేభై రూపాయలవుతాయని బాధలెండి. ఇటువంటివాళ్ళంతా ’పెడితే పెళ్ళి లేకపోతే శ్రార్ధం అనే మనుషులు’ ” అంటూ ఆకు పుచ్చుకు వెళిపోయారు. ”ఛీ! వెధవ సంత!!రేపు పొద్దుటే కత్తుచ్చుకుని అరటి మొక్కలు నరికి పారేస్తా”నంది,కోపంగా ఇల్లాలు. రేపుకదా అని తమాయించాను, కోపం వచ్చినపుడు మాటాడక ఊరుకుంటే తగ్గిపోతుందని నా ఊహ. 🙂

కొంతమంది ఇంట్లో కోసివున్న ఉన్న ఆకిస్తే కుదరదు కోసివ్వాలంటారు. మరికొందరు ’అల్ల ఆపైనున్న ఆకు బాగుందమ్మా!’ ఎంపిక. బాగోని ఆకు ఇవ్వంకదా!! ఇంకా కొందరు ’నేను కోసుకుంటాలేమ్మా’ అంటారు. వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఆకు కావలసిన వరకు కోసుకుని వెళ్తారు,చెప్పి,గేట్ వేసి. ఎవరోగాని ఆకు పట్టుకెళుతూ బజారులో ఆకు ఐదు రూపాయలకి అమ్ముతున్నారని డబ్బులివ్వబోయారు. మేము అలా అమ్మకం చేయం అని వారికి నచ్చచెప్పేటప్పటికి తలప్రాణం తోకకొచ్చింది. రకరకాల మనుషులు. కాని ఇలా విసిగించేవాళ్ళతో వేగడం ఎలా?

నిరుడు బూడిద గుమ్మడి పాదెట్టేం,సూరే గుమ్మడి పాదూ ప్రతి సంవత్సరం పెడ్తాం, కాని నిరుడు పెట్టిన విత్తనమేమోగాని బూడిద గుమ్మడికాయలు చాలా పెద్దవి కాసేయి. ఒకావిడకి తన మేడమీంచి ఇవి చక్కగా కనపడ్డాయి, ఒకరోజొచ్చి బూడిదగుమ్మడికాయలు దొరకటం లేదని మొదలెట్టింది. ఆవిడకి కాయ కావాలన్నది అసలు సంగతి. ”పాదుని కాయలున్నాయి, తొమ్మిదో, పదో, మీకో కాయిస్తాం” అని వాగ్దానం చేసింది ఇల్లాలు, ఐనా ఆవిడ ”వడియాలు బాగుంటాయండీ! ఎండలు రాగానే పెట్టేసుకోవాలి” అంటూ మాటాడుతుంటే ఆవిడకి మరోకాయ కావాలన్న మాట చెప్పక ఇలా తిప్పితిప్పి మాటాడుతోందని గ్రహించి, ”మరోకాయ ఇవ్వలేను, ఇప్పటికే అన్ని కాయలూ పంపకాలయిపోయాయని” చెప్పేసింది. ఆవిడ పట్టువదలని విక్రమార్కునిలా ”బజార్లో కాయెంత ఖరీదులో ఉందో! ఖరీదిచ్చేస్తాను రెండు కాయలకీ” అంది, చివరికి. దానికి ఇల్లాలు, ”కాయలు అమ్మేందుకు కాదండి, మీరు కావాలన్నారు గనక ఒకటి తప్పక ఇస్తానని” చెప్పింది, ఆవిడ వినక ఖరీదిస్తానంటూ మొదలెట్టింది, ”మీకు ఇదివరలో కూడా కాయలిచ్చాము, సూరే గుమ్మడికాయలూ ఇచ్చాం కోసినప్పుడల్లా! ఎప్పుడేనా డబ్బులు తీసుకున్నామా!” అడిగేసింది ఇల్లాలు,చికాకొచ్చి. ”ఊరికే పుచ్చుకోకూడదూ” అనుకుంటూ వెళ్ళిందావిడ. పాదెండి పోయింది, వారికోకాయ పంపేం వాగ్దానం చేసినట్టే. కొన్ని రోజులుపోయాకా ఆవిడ ఒక అరకేజి సర్ఫ్ పేకట్ పట్టుకొచ్చింది, వద్దంటే వినిపించుకోక అక్కడపెట్టేసి వెళిపోయింది, ఇదేంటో అర్ధం కాక తలపట్టుకున్నాం. ఇక్కడితో అదయిపోతే అనుకోడమెందుకూ? కొన్నాళ్ళ తరవాత ఆవిడ పనిగట్టుకొచ్చింది, ”మీరిచ్చిన కాయంతా నీళ్ళే, ముక్కలే అవలేదూ, పది వడియాలయ్యేయే”మో అంటూ నస పెట్టింది, ”నాకు మాత్రం ఏం తెలుసమ్మా! కాయ పెద్దదిగా ఉంటే బాగుందనుకున్నా” అంటే ”మళ్ళీ కాయ తెప్పించుకుపెట్టుకున్నా”నంటూ ఉంటే నీకిచ్చిన సర్ఫ్ పేకేట్ ఖరీదు కాయ ఖరీదు సరిపోలేదన్నట్టు అనిపించింది, ఇల్లాలికి. నాలుగు రోజులు పోయాకా అర కేజి సర్ఫ్ పేకెట్ డబ్బులు పంపించేసింది.

మా చుట్టుపక్కలెవరూ అరటాకు కాని మామిడిరొబ్బగాని,గుమ్మడికాయగాని ఇవ్వరు, ఎవరికీ, దొడ్డినిండా ఉన్నా. ఎపుడూ చెయ్యి విదల్చని ఆమెను తల్లిగానూ, ఎప్పుడూ పెట్టే ఆమె ఒక సారి వీలుకుదరక పెట్టనందుకు ముండగానూ భావించే లోకాన్నేమనాలి? ఇల్లాలు మరిచిపోయిందో ఏమో అనుకుని నిన్న పెద్ద కత్తి తీశాను. ”ఎందుకూ?” అడిగింది, ”అరటి మొక్కలు కొట్టేస్తానన్నావుగా, పదును పెట్టించుకొద్దామనీ” అన్నా! నవ్వేసి లోపలికెళిపోయింది. కత్తి ఎదురుగా పెట్టుకు కూచున్నా పదును పెట్టించాలి… 🙂

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పెట్టని నాతల్లి

 1. గురువు గారు, మంచికెళితే ఏదో ఎదురైందని…చక్కగా అడిగినప్పుడల్లా ఊరికే ఇస్తుంటే కలికాలం అపాత్రులకి విలువ తెలుస్తున్నట్టు లేదు. అలా సునాయాసంగా పుల్లవిరుపు మాటలనేసి వెళ్ళిపోతారు. గురుపత్నిగారు యెంత నొచ్చుకున్నారో..

  • raamudu గారు,

   ఎప్పుడూ ఎంగిలి చేత్తో కూడా కాకిని అదిలించనివాళ్ళని తల్లులనే అంటుంది లోకం. అది దాని సహజ స్వభావం.

   కత్తి దగ్గర పెట్టుకు కూచున్నా, పదును పెట్టించడానికి 🙂 ఈరోజునాటికి మళ్ళీ ఆ ప్రసక్తి తేలేదు 🙂 అప్పుడాక్షణం చాలా బాధపడింది. లేనివి కావాలంటే ఎక్కడినుంచి వస్తాయి, ఉన్నవన్నీ పండగ పూటా ఒకరే పట్టుకెళ్ళిపోతే ఎలా? మిగిలినవారికో ఇదీ ఆవిడ బాధ.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s